మదర్ థెరీసా చారిటీకి విదేశీ నిధులను భారత ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంది?

ఫొటో సోర్స్, REUTERS
మదర్ థెరీసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ విదేశీ నిధుల లైసెన్స్‌ను పునరుద్ధరించేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది. అనాథ పిల్లలకు ఆశ్రమాలు, పాఠశాలలు, క్లినిక్‌లు, ధర్మశాలలు నడుపుతుందీ స్వచ్ఛంద సంస్థ. ఈ ప్రాజెక్టులన్నింటిని వేలాదిమంది నన్‌లు పర్యవేక్షిస్తుంటారు.
"ప్రతికూల స్పందనల" కారణంగా ఈ సంస్థ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించలేదని భారత హోం మంత్రిత్వ శాఖ క్రిస్మస్ రోజు ప్రకటించింది.
ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ఈ స్వచ్ఛంద సంస్థ తన కార్యక్రమాలను ఉపయోగిస్తోందని అతివాద హిందూ గ్రూపులు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను ఆ సంస్థ తోసిపుచ్చింది.
తమ రెన్యువల్ అప్లికేషన్‌ను తిరస్కరించారని, "వివాదం పరిష్కారం అయ్యేవరకు" తమ విదేశీ నిధుల బ్యాంకు ఖాతాలను ఆపరేట్ చేయబోమని ఆ సంస్థ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
అంతకు ముందు, మదర్ థెరిసా చారిటీ సంస్థ బ్యాంకు ఖాతాలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేయడంతో, ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.
మమతా బెనర్జీ ట్వీట్‌ను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఖాతాలను ఫ్రీజ్ చేయలేదని చెప్పింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మాసిడోనియా నుంచి భారతదేశానికి తరలి వచ్చిన రోమన్ కాథలిక్ నన్ మదర్ థెరీసా 1950లో ఈ స్వచ్ఛంద సంస్థను కోల్‌కతాలో స్థాపించారు. ఇది, ప్రపంచంలోని అత్యుత్తమ క్యాథలిక్ స్వచ్ఛంద సంస్థల్లో ఒకటిగా పేరు పొందింది. మానవతావాదిగా ప్రఖ్యాతి గాంచిన మదర్ థెరీసాకు 1979లో నోబుల్ శాంతి బహుమతి లభించింది.
ఆమె మరణించిన 19 సంవత్సరాల తర్వాత 2016లో పోప్ ఫ్రాన్సిస్ ఆమెను సెయింట్‌గా ప్రకటించారు.
భారతదేశంలోని స్వచ్ఛంద సంస్థలు, ఇతర ఎన్జీవోల విదేశీ నిధులను నియంత్రించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలున్నాయి. గత ఏడాది, గ్రీన్‌పీస్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాలను నిలిపివేసే విధంగా ఆంక్షలు విధించింది.
భారతదేశంలో మైనారిటీ మతాల వారిపై అనేక దాడులు జరుగుతున్నాయని మైనారిటీ మత సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, కర్ణాటక రాష్ట్రంలో మైనారిటీలపై దాడులు అధికంగా ఉన్నాయి. సుమారు 40 బెదిరింపులు లేదా హింసకు సంబంధించిన రిపోర్టులు ఉన్నాయి.
దేశంలో పలుచోట్ల ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలకు హిందూ అతివాద గ్రూపులు అంతరాయం కలిగించాయి. ఉత్తర భారతదేశంలో ఒక చర్చిని ధ్వంసం చేశాయి. మతపరమైన సమావేశాలు జరుగుతున్న చోట్ల నిరసనలు తెలిపాయి.
భారతదేశంలో మెజారిటీ జనాభా హిందువులు కాగా, మొత్తం జనాభాలో 2 శాతం అంటే సుమారు 2.4 కోట్ల క్రైస్తవులు ఉన్నారు. ఆసియాలో ఫిలిప్పీన్స్ తరువాత అత్యధిక సంఖ్యలో కాథలిక్స్ ఉన్న దేశం ఇండియానే.
హిందువులను క్రిస్టియానిటీ, ఇస్లాం మతాల్లోకి మార్చేందుకు జరుగుతున్న ప్రచారాలను అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మతాంతర వివాహాలలో మతమార్పిడిని నిషేధించే చట్టాలను పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పటికే ఆమోదించాయి.
ఇవి కూడా చదవండి:
- భారతీయుల దృష్టిలో ప్రేమ, పెళ్లి అంటే ఏమిటి
- SC వర్గీకరణ: ఇపుడెక్కడుంది, ఎందుకని ఆలస్యమవుతోంది
- బీబీసీ 100 మంది మహిళలు 2021 - మంజులా ప్రదీప్: దళిత మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారిణి
- ఆంధ్రప్రదేశ్‌కు దత్తతగా వచ్చిన బిడ్డను తిరిగి కేరళ ఎందుకు తీసుకెళ్లారు... అసలేంటీ వివాదం?
- Brahmin Corporation: ఒక కులం గొప్పదని ప్రభుత్వ వెబ్సైట్లో ప్రకటించవచ్చా, బ్రాహ్మణ కార్పొరేషన్ పై విమర్శలు ఎందుకు?
- ‘మంట చుట్టూ ఉన్న గిరిజనులను మావోయిస్టులు అనుకుని తుపాకీలతో కాల్చేశారు’
- కులం, మతం: వదులుకోవటం ఎందుకంత కష్టం?
- కులాలవారీ జనగణను ప్రతిపక్షాలు ఎందుకు కోరుతున్నాయి, బీజేపీ ఎందుకు వద్దంటోంది
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- 'స్కూల్లో వంట చేసే ఉద్యోగం నాకు తిరిగి ఇవ్వాలి...' అదే ఈ సమస్యకు పరిష్కారమని చెప్పిన దళిత భోజనమాత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












