హిజాబ్‌పై ప్రపంచమంతటా ఉన్న వివాదాలేంటి... ఏయే దేశాలు నిషేధించాయి?

హిజాబ్ వివాదం

ఫొటో సోర్స్, Getty Images

కర్ణాటకలోని ఓ కాలేజీలో మొదలైన హిజాబ్ వివాదం హైకోర్టు వరకూ వెళ్లింది. కోర్టులో విచారణ కొనసాగుతోంది.

ఈ సమస్య పరిష్కారం కానంతవరకు కాలేజీల్లో మతపరమైన దుస్తుల (హిజాబ్ లేదా కాషాయ కండువా)పై నిషేధం ఉంటుందని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కానీ, తక్షణ విచారణకు సుప్రీం కోర్టు తిరస్కరించింది.

కాగా, ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని కొందరు భావిస్తుండగా, విద్యాలయాల్లో మతపరమైన చిహ్నాలను ధరించడం సరికాదని మరికొందరు వాదిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా హిజాబ్ లేదా నిఖాబ్‌లపై పలు రకాల నిబంధనలు, నిషేధాలు ఉన్నాయి.

కొన్ని దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో ముఖం కప్పుకోవడం లేదా నిఖాబ్ ధరించడంపై నిషేధం ఉంది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తారు కూడా.

ఏ దేశాల్లో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో చూద్దాం.

ఫ్రాన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫ్రాన్స్

బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని పూర్తిగా కప్పే పరదాలు (నిఖాబ్‌లు) ధరించరాదని 2011 ఏప్రిల్ 11న ఫ్రాన్స్ చట్టాన్ని తీసుకొచ్చింది. నిఖాబ్‌లపై నిషేధం విధించిన తొలి యూరోపియన్ దేశం ఇదే.

ఫ్రాన్స్ మహిళలయినా, విదేశీయులయినా ఇల్లు దాటి బయటికొచ్చిన తరువాత నిఖాబ్ ధరించడం నిషేధం. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే జరిమానా తప్పదు.

ఆ సమయంలో నికోలాస్ సర్కోజీ ఫ్రాన్స్ అధ్యక్షులుగా ఉన్నారు. ముఖానికి పరదా కప్పుకోవడం అత్యాచారంతో సమానమని సర్కోజీ ప్రభుత్వం వెల్లడించింది. దాన్ని తమ దేశంలో స్వాగతించమని స్పష్టం చేసింది.

తరువాత అయిదేళ్లకు, 2016లో ఫ్రాన్స్‌లో మరో వివాదాస్పద చట్టాన్ని తీసుకొచ్చారు. 'బుర్కిని' అని పిలిచే స్విమ్ సూట్లను నిషేధించారు. శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే స్విమ్ సూట్లివి.

అయితే, ఈ చట్టం వ్యక్తుల ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని అంటూ ఫ్రాన్స్‌ ఉన్నత న్యాయస్థానం దీన్ని రద్దు చేసింది.

బెల్జియం

బెల్జియంలో కూడా ముఖాన్ని కప్పి ఉంచే పరదాలను 2011 జూలైలో నిషేధించారు. ఈ చట్టం ప్రకారం, బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తుల గుర్తింపును దాచిపెట్టే ఎలాంటి దుస్తులైనా ధరించరాదు.

అయితే, ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటీషన్లను బెల్జియం ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదని స్పష్టం చేసింది.

2017లో యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కూడా బెల్జియం చట్టాన్ని సమర్థించింది.

నెదర్లాండ్స్

పాఠశాలలు, ఆస్పత్రుల వంటి బహిరంగ ప్రదేశాల్లోనూ, ప్రజారవాణా సౌకర్యాలను వినియోగిస్తున్నప్పుడు ముఖాన్ని కప్పి ఉంచే పరదాలను ధరించరాదని 2016 నవంబర్‌లో నెదర్లాండ్స్ ప్రభుత్వం తీర్మానించింది.

అయితే, ఈ తీర్మానం చట్టంగా మారాలంటే ఆ దేశ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందాలి. సుమారు రెండేళ్ల తరువాత పార్లెమెంటు ఆమోదించడంతో 2018 జూన్‌లో పరదాలపై నిషేధం చట్టంగా మారింది.

ఇటలీలోని కొన్ని నగారాల్లో నిఖాబ్‌పై నిషేధం ఉంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇటలీలోని కొన్ని నగారాల్లో నిఖాబ్‌పై నిషేధం ఉంది

ఇటలీ

ఇటలీలో నోవారా లాంటి కొన్ని నగరాల్లో నిఖాబ్‌పై నిషేధం ఉంది. అలాగే, లోంబార్డీ ప్రాంతంలో 2016 జనవరి నుంచి బురఖాలపై నిషేధం అమలులోకి వచ్చింది. అయితే, ఈ చట్టం దేశం మొత్తానికీ వర్తించదన్నది గమనార్హం.

బెల్జియం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బెల్జియంలో హిజాబ్ మీద వివాదాలు కొనసాగుతున్నాయి

జర్మనీ

"చట్టబద్ధంగా ఎక్కడెక్కడ సాధ్యమవుతుందో" అక్కడంతా ముఖాన్ని కప్పి ఉంచే పరదాలను నిషేధించాలని 2016 డిసెంబర్ 6న జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ పేర్కొన్నారు.

అయితే, ఈ అంశంలో ఇప్పటివరకూ జాతీయ స్థాయి చట్టం చేయలేదు. కానీ, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ముఖానికి పరదా ధరించకూడదు.

జర్మనీలోని కొన్ని రాష్ట్రాల్లో టీచర్లు నిఖాబ్ ధరించకూడదనే నియమం ఉంది. మరి కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖాన్ని కప్పి ఉంచే పరదాలపై నిషేధం ఉంది.

అలాగే, న్యాయమూర్తులు, సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులు నిఖాబ్ ధరించడంపై పాక్షిక నిషేధాన్ని జర్మనీ దిగువ సభ ఆమోదించింది. కాగా, నిఖాబ్ ధరించే మహిళలు అవసరమైనప్పుడు తమ ముఖాన్ని తప్పనిసరిగా చూపించాలని స్పష్టం చేసింది.

వీడియో క్యాప్షన్, హిజాబ్ వివాదంపై కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్ బీబీసీతో ఏమన్నారంటే...

ఆస్ట్రియా

పాఠశాలలు, న్యాయస్థానాల వంటి బహిరంగ ప్రదేశాల్లో నిఖాబ్ ధరించకూడదని 2017 అక్టోబర్‌లో ఆస్ట్రియా చట్టాన్ని తీసుకొచ్చింది.

నార్వే

నార్వేలో 2018 జూన్‌లో విద్యాసంస్థల్లో నిఖాబ్ ధరించడాన్ని నిషేధించారు.

స్పెయిన్

స్పెయిన్‌లో నిఖాబ్ ధరించడంపై జాతీయస్థాయి చట్టాలు లేవు. కానీ, బార్సిలోనా నగరంలో మునిసిపల్ కార్యాలయాలు, మార్కెట్‌లు, లైబ్రరీల వంటి బహిరంగ ప్రదేశాల్లో నిఖాబ్ ధరించకూడదనే చట్టం 2010 నుంచి అమలులో ఉంది.

లిడా నగరంలో కూడా ఇలాంటి చట్టాన్నే తీసుకొచ్చారు. కానీ, ఇది మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని పేర్కొంటూ స్పెయిన్ సుప్రీం కోర్టు 2013 ఫిబ్రవరిలో ఈ చట్టాన్ని తిరస్కరించింది.

బ్రిటన్

ఫొటో సోర్స్, Getty Images

బ్రిటన్

బ్రిటన్‌లో ఇస్లామిక్ దుస్తులపై ఎలాంటి నిషేధాలూ లేవు. కానీ, విద్యార్థులకు డ్రెస్ కోడ్ నిర్ణయించే అధికారం పాఠశాలలకు ఉంటుంది.

కాగా, 2016 ఆగస్టులో నిర్వహించిన ఒక పోల్‌లో బురఖా నిషేధానికి అనుకూలంగా 57 శాతం బ్రిటన్ వాసులు ఓట్లు వేశారు.

ఆఫ్రికా

ఆఫ్రికాలో 2015 సంవత్సరంలో బురఖా ధరించిన కొందరు మహిళలు ఆత్మాహుతి దాడులకు పాల్పడడంతో చాడ్, కామెరూన్ ఉత్తర ప్రాంతం, నైజర్‌లోని కొన్ని ప్రాంతాలు, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలలో ముఖాన్ని కప్పి ఉంచే పరదాలపై నిషేధం విధించారు.

టర్కీ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, హిజాబ్ ధరించిన టర్కీ అధ్యక్షుడి భార్య

టర్కీ

సుమారు 85 ఏళ్లకు పైగా టర్కీ లౌకిక దేశంగా ఉంది. రిపబ్లిక్ ఆఫ్ టర్కీ వ్యవస్థాపకుడు ముస్తఫా కెమాల్ అటాతుర్క్ హిజాబ్‌ను తిరస్కరించారు. హిజాబ్ ధరించడాన్ని వెనుకబాటుతనంగా పేర్కొన్నారు.

టర్కీలో అధికార భవనాలు, కొన్ని బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్‌పై నిషేధం ఉంది. అయితే, దేశంలోని ముస్లిం మెజారిటీ జానాభాకు హిజాబ్ నిషేధంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ప్రధాన మంత్రి, రాష్ట్రపతి భార్యలు, కుమార్తెలతో సహా టర్కీ మహిళల్లో మూడింట రెండొంతుల మంది తమ తలలను కప్పుకుంటారు.

2008లో టర్కిష్ రాజ్యాంగాన్ని సవరిస్తూ యూనివర్సిటీల్లో కఠిన నిబంధనలకు కొంత సడలింపు ఇచ్చారు. దాంతో, హిజాబ్‌ను వదులుగా కట్టుకోవడానికి అనుమతి లభించింది. కానీ, మెడ, మొత్తం మొఖాన్ని కప్పే నిఖాబ్‌లపై నిషేధం కొనసాగింది.

2013లో జాతీయ సంస్థలలో మహిళలు హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని ఎత్తివేశారు. కానీ, న్యాయస్థానాలు, సైనికులు, పోలీస్ లాంటి విధుల్లో హిజాబ్ ధరించడంపై నిషేధం కొనసాగింది.

2016లో పోలీసు విభాగంలోని మహిళలు కూడా హిజాబ్ ధరించేందుకు టర్కీ అనుమతించింది.

డెన్మార్క్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, డెన్మార్క్ 2018లో నిఖాబ్, బుర్ఖాలను నిషేధించింది

డెన్మార్క్

2018లో ముఖాన్ని పూర్తిగా కప్పే నిఖాబ్‌లపై నిషేధం విధించింది డెన్మార్క్ ప్రభుత్వం. ఈ నియమాన్ని ఉల్లంఘించినవారికి జరిమానా విధిస్తారు. రెండవసారి కూడా ఉల్లంఘిస్తే మొదటిసారి కంటే 10 రెట్లు ఎక్కువ జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

బురఖా ధరించమని బలవంతం చేసేవారికి కూడా జరిమానా లేదా రెండేళ్ల జైలు శిక్ష పడుతుంది.

ఇది కాకుండా, కోర్టుల్లో న్యాయమూర్తులు తలను కప్పే హెడ్‌స్కార్ఫ్ లేదా ఇతర మతపరమైన, రాజకీయ చిహ్నాలను (శిలువ, టోపీ, పగిడీ మొదలైనవి) ధరించకూడదనే చట్టం కూడా ఉంది.

రష్యా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా

రష్యా

రష్యాలోని స్వాట్రోపోల్ ప్రాంతంలో హిజాబ్ ధరించడంపై నిషేధం ఉంది. రష్యాల్లో ఇలాంటి నిషేధం ఇదే తొలిసారి. 2013 జూలైలో రష్యా సుప్రీం కోర్ట్ ఈ నిర్ణయాన్ని సమర్థించింది.

స్విట్జర్లాండ్

ఎక్కువమంది మహిళలు హిజాబ్ ధరిస్తున్నట్లయితే, దీనిపై నిషేధం గురించి ఆలోచించవలసి ఉందని 2009లో స్విస్ న్యాయ శాఖ మంత్రి ఎవలీన్ విడ్మర్ అన్నారు.

2013 సెప్టెంబర్‌లో స్విట్జర్లాండ్‌లోని టిసినోలో బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని కప్పి ఉంచే దుస్తులపై నిషేధానికి అనుకూలంగా 65 శాతం ప్రజలు ఓటు వేశారు. ఈ ప్రాంతంలో ఇటలీ జనాభా ఎక్కువ.

స్విట్జర్లాండ్‌లోని 26 ప్రావిన్సుల్లో ఇలాంటి నిషేధం విధించడం ఇదే తొలిసారి. ఆ దేశంలో ఉన్న 80 లక్షల జనాభాలో దాదాపు 3 లక్షల 50 వేల మంది ముస్లింలు.

బల్గేరియా

2016 అక్టోబర్‌లో బల్గేరియా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం, బహిరంగ ప్రదేశాల్లో ముఖాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించే మహిళలకు జరిమానా విధిస్తారు లేదా వారికి లభించే సౌకర్యాల్లో కోత ఉంటుంది.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)