రష్యా Vs యుక్రెయిన్: ఏ దేశ సైనిక బలం ఎక్కువ

నాటో సైనికుడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాటో సైనికుడు

యుక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగింది రష్యా. యుక్రెయిన్‌లోని పలు నగరాలపై బాంబు దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

దీనికి కొన్ని రోజుల ముందే తిరుగుబాటుదారుల ఆధీనంలోని రెండు ప్రాంతాలను స్వతంత్ర భూభాగాలుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ గుర్తించారు. ఆ ప్రాంతాలకు రష్యా బలగాలను పంపిస్తున్నట్లు చెప్పారు.

ఆ ప్రాంతాల్లో శాంతిని కాపాడటానికే తమ సైన్యాన్ని అక్కడికి పంపిస్తున్నట్లు పుతిన్ చెప్పారు. కానీ అదొక అర్థం లేని మాట అని అమెరికా వ్యాఖ్యానించింది.

యుక్రెయిన్‌లోని ఈ ప్రాంతాల వైపు రష్యా సైన్యం కదులుతున్నట్లు చూపించే ఫొటోలు బయటకు వచ్చాయి. నిజానికి యుక్రెయిన్ సరిహద్దుకు సమీపంగా రష్యా, గత కొన్ని నెలల్లో దాదాపు రెండు లక్షల సైనిక బలగాలను మోహరించింది. వీటి నుంచి కొన్ని బలగాలు ఇప్పుడు యుక్రెయిన్ సరిహద్దులను దాటినట్లు యుక్రెయిన్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ ప్రాంతాల్లో యుద్ధ ట్యాంకులు, ఆయుధ సామగ్రిని రష్యా ఆర్మీ కలిగి ఉంది. వీటికి అదనంగా ఎయిర్‌ఫోర్స్, నేవీ మద్దతు కూడా లభించనుంది.

అదే సమయంలో ''తమ దేశం దేనికీ, ఎవరికీ భయపడదని'' యుక్రెయిన్ అధ్యక్షుడు అంటున్నారు.

యుక్రెయిన్ సరిహద్దులో ఉన్న యుద్ధట్యాంకు ఫొటోను జనవరి 14న రష్యన్ టీవీ ప్రసారం చేసింది

ఫొటో సోర్స్, RUSSIAN DEFENSE MINISTRY

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ సరిహద్దులో ఉన్న యుద్ధట్యాంకు ఫొటోను జనవరి 14న రష్యన్ టీవీ ప్రసారం చేసింది

రష్యా సైనికుల సంఖ్య ఎంత?

యుక్రెయిన్‌తోపాటు దాని చుట్టు పక్కలా ఇటీవలి వారాల్లో రష్యా సైనికుల సంఖ్య లక్ష నుంచి లక్షా 90 వేల మధ్య ఉండొచ్చని అంచనా.

యుక్రెయిన్ చుట్టుపక్కల 1,69,000-1,90,000 సైనికులను రష్యా మోహరించిందని గత శుక్రవారం అమెరికా పేర్కొంది.

''యుక్రెయిన్ సరిహద్దుకు చుట్టుపక్కలా, బెలారుస్‌లో, ఆక్రమిత క్రిమియాలో ఈ సైన్యాన్ని మోహరించారు. వీటికి అదనంగా రష్యన్ సెక్యురిటీ గార్డులు, ఇతర దేశీయ భద్రతా బలగాల సిబ్బంది కూడా పాల్గొంటారు. వీటితో పాటు తూర్పు యుక్రెయిన్‌లో రష్యా నాయకత్వంలోని దళాలు కూడా ఉంటాయి'' అని యూరోపియన్ ఆర్గనైనేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ (ఓఎస్‌సీఈ)లో అమెరికా అంబాసిడర్ మైఖేల్ కార్పెంటర్ అన్నారు.

అదే సమయంలో రష్యా సైన్యంలోని 60 శాతం బలగాలు రష్యా, బెలారుస్ సరిహద్దుల్లో ఉన్నాయని బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలస్ వ్యాఖ్యానించారు.

ఇటీవల రష్యా, బెలారస్ సైనికులు మిలిటరీ వ్యాయామాల్లో పాల్గొన్నారు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఇటీవల రష్యా, బెలారస్ సైనికులు మిలిటరీ వ్యాయామాల్లో పాల్గొన్నారు

మరోవైపు రష్యన్ బలగాల సంఖ్య 1,49,000 ఉంటుందని యుక్రెయిన్ రక్షణ మంత్రి అన్నారు.

కానీ వీటిపై రష్యా ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

''ఇవన్నీ పాశ్చాత్య దేశాల ఊహలు, ఆవిష్కరణలు'' అని ఐక్యరాజ్యసమితిలో రష్యన్ డిప్యూటీ అంబాసిడర్ దిమిత్రీ పోలన్‌స్కీ వ్యాఖ్యానించారు.

దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లోని తమ బలగాలు సైనిక కసరత్తులు ముగించుకొని శాశ్వత స్థావరాలకు తిరుగుముఖం పట్టినట్లు గతవారం రష్యా రక్షణ మంత్రిత్వశాఖ చెప్పింది.

రష్యా చెప్పినట్లుగా బలగాలు వెనక్కి వస్తున్నట్లు నిర్ధరించే ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదని 'నాటో' వ్యాఖ్యానించింది.

''చెప్పినదానికి విరుద్ధంగా, మిలిటరీ ఏర్పాట్లను రష్యా పెంచుతున్నట్లుగా అనిపిస్తోంది'' అని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ అన్నారు.

ఆయుధ సంపత్తి

యుక్రెయిన్‌పై దాడికి అనుకూలంగా ఉండే రేంజ్‌లోకి రష్యన్ సైనికులు చేరుకున్నట్లు నిఘా సంస్థల ద్వారా తెలిసిందని పేరు చెప్పడానికి ఇష్టపడని పాశ్చాత్య అధికారులు చెప్పారు.

మూడింట రెండొంతుల రష్యా సైన్యం, యుక్రెయిన్ సరిహద్దుకు కేవలం 50 కి.మీ దూరంలోనే ఉన్నట్లు వారు తెలిపారు.

యుక్రెయిన్ సరిహద్దు వద్ద రష్యన్ బలగాలు చిన్న చిన్న సమూహాలుగా విడిపోయినట్లు శాటిలైట్ చిత్రాలు సూచిస్తున్నాయి.

యుక్రెయిన్‌ను పూర్తి స్థాయిలో ఆక్రమించుకోవడానికి రష్యా ఇంకా భారీ స్థాయిలో బలగాలను జోడించాల్సి ఉంటుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌పై రష్యా దాడి: యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో వరుస పేలుళ్లు సంభవించాయి

యుక్రెయిన్ మిలిటరీ సామర్థ్యం, నాటో మద్దతు

రష్యా కన్నా యుక్రెయిన్ ఆర్మీ సామర్థ్యం చాలా తక్కువ. కానీ నాటో కూటమి నుంచి యుక్రెయిన్‌కు సహాయం అందుతోంది.

అమెరికా ఇప్పటివరకు యుక్రెయిన్‌కు సైన్యాన్ని పంపలేదు. కానీ నాటో దళాలను పటిష్టం చేసేందుకు పోలాండ్, రొమేనియాలకు అదనంగా 3000 మంది సైనికులను పంపింది. మరో 8,500 మందిని అప్రమత్తం చేసింది.

20 కోట్ల డాలర్ల విలువ చేసే ఆయుధాలను కూడా అమెరికా పంపించింది. ఇందులో జావెలిన్ యాంటీ ట్యాంక్ మిసైల్స్, స్టింగర్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్స్ ఉన్నాయి. అమెరికా తయారుచేసిన ఆయుధాలను యుక్రెయిన్‌కు ఇవ్వడానికి నాటో దేశాలను అనుమతించింది.

యుక్రెయిన్ సైనికులతో అధ్యక్షుడు జెలెన్‌స్కీ

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ సైనికులతో అధ్యక్షుడు జెలెన్‌స్కీ

బ్రిటన్, 2000 షార్ట్ రేంజ్ యాంటీ ట్యాంక్ మిసైల్స్‌ను యుక్రెయిన్‌కు పంపింది. పోలాండ్‌కు 350 మంది సైనికులను, ఎస్టోనియాకు అదనంగా 900 బలగాలను పంపి సైనిక సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది.

మధ్యదరా సముద్రాన్ని పర్యవేక్షించడానికి గానూ బ్రిటన్, దక్షిణ ఐరోపాకు మరిన్ని ఫైటర్ జెట్‌లను, నాటో ఫైటర్లతో పాటు నౌకదళాన్ని కూడా పంపించింది.

మరో వెయ్యి మంది సైనికులను అప్రమత్తం చేసింది. తద్వారా యుక్రెయిన్‌లో మానవ సంక్షోభం తలెత్తితే వీరు సహాయం చేస్తారని బ్రిటన్ భావిస్తోంది.

డెన్మార్క్, స్పెయిన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ దేశాలు కూడా ఫైటర్లను, ఓడలను తూర్పు ఐరోపా, తూర్పు మధ్యదరా ప్రాంతానికి పంపాయి.

రొమేనియాలో నాటో ఆర్మీకి నాయకత్వం వహించడానికి ఫ్రాన్స్ ప్రణాళికలు రచిస్తోంది. అక్కడికి బలగాలను కూడా పంపుతోంది. పూర్తి ప్రణాళికను ఖరారు చేయడానికి కొన్నివారాల సమయం పడుతుందని నాటో చెప్పింది.

నాటో సైనికులు

ఫొటో సోర్స్, AFP VIA GETTY

ఫొటో క్యాప్షన్, నాటో సైనికులు

యుక్రెయిన్ కోసం గతంలో నాటో ఏం చేసింది?

2014లో యుక్రెయిన్ ప్రజలు, అక్కడి రష్యా అనుకూల అధ్యక్షుడిని తొలిగించారు. దీని తర్వాత యుక్రెయిన్‌లోని దక్షిణ ప్రావిన్సుకు చెందిన క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకుంది.

తూర్పు ఐరోపాలోని పెద్ద భూభాగాలను ఆక్రమించుకునేందుకు రష్యా అండ ఉన్న వేర్పాటువాదులకు ఆయన సహకరించారు.

ఆ సమయంలో నాటో జోక్యం చేసుకోలేదు. కానీ తొలిసారిగా తూర్పు ఐరోపాలోని పలు దేశాల్లో నాటో దళాలను మోహరించింది.

ఈస్టోనియా, లాత్వియా, లిథువేనియా, పొలాండ్‌లలో నాలుగు బెటాలియన్ స్థాయి బహుళజాతి యూనిట్లను ఏర్పాటు చేసింది. రొమేనియాలో మల్టీనేషనల్ బ్రిగేడ్‌ను మోహరించింది.

తూర్పు యూరప్, బాల్టిక్ దేశాల గగనతలాన్ని కూడా నాటో పర్యవేక్షిస్తోంది. తద్వారా నాటో సభ్యదేశాల గగనతలాన్ని దాటి వచ్చే రష్యా విమానాలపై నిఘా పెరుగుతుంది.

నాటో తీసుకుంటోన్న ఈ చర్యలపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ISWOTY

ఫొటో సోర్స్, Reuters

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)