కలమల్ల శాసనం: కడప జిల్లా యర్రగుంట్లలో ఉన్నదే తొలి తెలుగు శాసనమా?

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
శిలాశాసనాలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఆనాటి చరిత్రను కళ్లకు కడుతాయి.
ఇటీవల కడపజిల్లాలో వెలుగుచూసిన ఒక శిలాశాసనాన్ని ఇంతవరకూ లభ్యమైన తొలి తెలుగు శాసనంగా కొందరు భాషానిపుణులు చెబుతున్నారు.
కడపజిల్లా యర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో తొలి తెలుగు శాసనాన్నిగుర్తించినట్లు కొందరు పురావస్తు అధికారులు, చరిత్రకారులు చెబుతున్నారు.
తెలుగు భాష ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు వాడుకలోకి వచ్చింది అనడానికి పక్కా చారిత్రక ఆధారాలు లేకపోయినా చోళరాజుల్లో ఒకరైన ఎరికల్ ముత్తురాజు ధనంజయుడి కాలంలో ఇప్పటి కడప జిల్లాలోని కలమల్లలో తొలి తెలుగు రాతి శాసనం వేశారని వీరు చెబుతున్నారు.
క్రీస్తుశకం 575లో రేనాటి సామ్రాజ్యాన్ని పాలించిన చోళరాజులు వేసినట్లుగా చెబుతున్న మొత్తం ఆరు శాసనాలను కలమల్ల ఆలయంలో గుర్తించారు.
వీటిలో రెండు రాతి బండలపైన రెండు వైపులా అక్షరాలు ఉంటే, మరో రెండు బండలపై ఒకవైపు మాత్రమే తెలుగు అక్షరాలు చెక్కి ఉన్నాయి.

తొలి తెలుగు శాసనం ఇదేనా?
తెలుగులో మొదట శాసనం వేసిన ఘనత రేనాటి చోళులకే దక్కుతుందని ఏపీ పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శివకుమార్ చెబుతున్నారు.
కడప జిల్లాలో చాలా భాగం, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కొన్ని భాగాలను కలుపుకుని రేనాడుగా వ్యవహరించారని, తెలుగును అధికారభాషగా స్వీకరించిన రేనాటి చోళులు తెలుగులోనే శాసనాలు వేశారని ఆయన తెలిపారు.
ఇదే తొలి తెలుగు శాసనమని ఎలా చెప్పగలుగుతున్నారని శివకుమార్‌ను అడిగినప్పుడు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు.
"ఆంధ్రప్రదేశ్‌లో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తుశకం 4వ శతాబ్దం వరకు శాసనాలను ప్రాకృతంలో, 5వ శతాబ్దంలో సంస్కృతంలో రాశారు. కానీ, తెలుగులో మొదట శాసనం వేసిన ఘనత రేనాటి చోళులకే దక్కుతుంది. వీరి శాసనాల ప్రకారం మొదటి వాడైన నందివర్మ తర్వాత ఆయన ముగ్గురు కొడుకుల్లో మొదటివాడు ధనుంజయ వర్మ అధికారంలోకి వచ్చాడు. ఈయన 575 నుంచి 600 వరకు పాలించాడు. ఆయనకు ఎరికల్ ముత్తురాజు అనే బిరుదు ఉంది.
ఆయన వేయించిన తెలుగు శాసనాల్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన కలమల్ల శాసనం ఒకటి. చాలా వరకూ శిథిలమైన ఈ శాసనంలో బ్రాహ్మీ లిపి నుంచి తెలుగు అక్షర లిపికి పరిణామక్రమం ఎలా మారిందో మనం చూడవచ్చు. కొన్నిపూర్తిగా తెలుగు పదాలున్నాయి. అందుకే, తొలి తెలుగు శాసనంగా ఈ కలమల్ల శాసనాన్ని మనం పరిగణనలోకి తీసుకోవచ్చు'' అని వివరించారు.
5వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో కూడా కలమల్ల శాసనం గురించి ఒక పాఠం చేర్చారు.

స్థానికులు ఏమంటున్నారు?
1905లో మొదటిసారి ఈ శాసనాల వివరాలు సేకరించారని, తర్వాత వాటి గురించి ఎలాంటి వివరాలూ తెలియలేదని స్థానికుడు సాంబశివారెడ్డి బీబీసీకి తెలిపారు. ఇటీవల ఈ కల్లమల్ల శిలా శాసనాన్ని పరిశీలించిన కొందరు ప్రొఫెసర్లు ఇదే తొలి తెలుగు శాసనమని నిర్ధరించారని ఆయన బీబీసీతో చెప్పారు.
"మేం 50 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాం. 1902లో ఒకసారి దీని లిపి తీసుకెళ్లారని చెప్పారు. తర్వాత 1965లో ఒకపేపర్ ఇక్కడే ఉండేది. రెండింటికి రెండువైపులా, మరో రెండింటికి ఒక్కో వైపు చెక్కి ఉండడంతో వాటిని మొత్తం ఆరు శాసనాలుగా చెప్పేవాళ్లు. రచయిత వేంపల్లి గంగాధర్ ఇదే తొలి తెలుగు శాసనమని చెబుతూ పుస్తకం రాశారు. శాసనంలో రెండు మూడు పంక్తులు మసక బారడం వల్ల ఏం రాశారో సరిగా అర్థం కావడంలేదు. ఇటీవల ముగ్గురు నలుగురు ప్రొఫెసర్లు వచ్చి అక్కడ ఏంరాశారో గుర్తించి ఇదే తొలి తెలుగు శాసనమని నిర్ధారించారు'' అని ఆయన వివరించారు.

తెలుగు భాషాభిమాని ఒంటేరు శ్రీనివాసులురెడ్డి చొరవతో కొందరు రిటైర్డ్ ప్రొఫెసర్లు ఇక్కడి తెలుగు శాసనాలపై పరిశోధనలు చేశారు.
గజ్జెల వేమనారాయణరెడ్డితో కలిసి అవధానం ఉమామహేశ్వర శాస్త్రి, ఆచార్య సాంబ శివారెడ్డి కలమల్ల చెన్నకేశవస్వామి ఆలయంలోని శాసనాలను పరిశీలించారు.
వాటిలో ఒకదాని నకలు తీసి, 1905లో తీసిన నకలుతో పోల్చి ఇది అదేనని నిర్ధరించారు. వీటిపై అనుభవం ఉన్న ఉమామహేశ్వర శాస్త్రి ఈ శాసనం గురించి బీబీసీతో మాట్లాడారు.
"మేం 1984లో ఇక్కడకు వచ్చి వీటిని చూశాం. మళ్లీ 2011లో ఏపీ ఆర్కియాలజీ శాఖ ఆహ్వానంతో వారి దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మరికొందరు నిపుణులతో కలిసి ఇక్కడకు వచ్చాం. వాటిని బాగా శుభ్రం చేయించి చూశాం. మాకు అక్షరాలు కనిపించాయి. వాటిని మేం తెలుగు లిపితో పోల్చగలిగాం.
ఈ విషయాన్ని ఇటీవల ఐదో తరగతి పాఠ్యాంశంగా చేర్చడంతో గ్రామస్థుల్లో కూడా కొంత అవగాహన వచ్చింది. ఈ శాసనం కోసం ఒక మందిరం నిర్మించాలని అనుకుంటున్నట్లు వారు మాకు చెప్పారు. వారికి మేం శాసనం ఉన్న చోటును గుర్తించి చూపించాం. అప్పటి నుంచి దీనికి మీడియాలో ప్రచారం వచ్చింది'' అని చెప్పారు.

ఆ ప్రాంతంలో ఇదే మెదటి శాసనమా?
ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆ ప్రాంతంలో ఉన్న ప్రాచీన శాసనాల్లో కలమల్ల శాసనమే మొదటి తెలుగు శాసనంగా తేలినట్లు ఉమామహేశ్వర శాస్త్రి వివరించారు.
"ప్రభుత్వ రికార్డుల్లో ఎపిగ్రఫీ శాఖ సర్వే చేసినట్లు ఉంది. ఈ ప్రాంతంలో ప్రాచీన చోళ రాజులకు చెందిన శాసనాలు ప్రాచీన లిపిలో ఉన్నాయి. వీటన్నింటిలో మొట్టమొదటిది కలమల్ల శాసనం తర్వాతది ఎర్రగుడిపాడు అని తేలింది. రెండింటికీ పదేళ్ల తేడా ఉందని చెప్పారు. కలమల్ల శాసనం వేయించిన ఎరికల్ ముత్తురాజు ధనుంజయుడు ఎర్రగుడిపాడు శాసనంలో ఉన్న ఎరికల్ ముత్తురాజు ఒక్కరే అని మనం చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా ధనుంజయుడు అని రాసుంది. అక్కడ దాంట్లో ఈ పేరులేదు కాబట్టి ఆయన తర్వాత వంశం వేసిన శాసనం అని తెలుస్తోంది'' అన్నారు.

దీనిపై ఉన్న విమర్శలేంటి?
చరిత్రకారులు, ప్రొఫెసర్లు కలమల్ల శాసనాన్ని తొలి తెలుగు శాసనంగా చెబుతుంటే కొందరు దీనిని వక్రీకరిస్తున్నారని యోగి వేమన విశ్వవిద్యాలయం చరిత్ర, పురావస్తుశాఖ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్ అయిన సాంబశివరెడ్డి అంటున్నారు.
"దీనిపై పరిశోధనలు చేసిన డాక్టర్ శ్రీనివాసులు, అవధానం ఉమామహేశ్వర శాస్త్రి ఇక్కడకు వచ్చి లిపిని చదివి చెప్పారు. కానీ, వీటి గురించి అవగాహన లేనివాళ్లు ఈ తెలుగు శాసనం గురించి వక్రీకరించి చెబుతున్నారు. స్థానికుల్లో కూడా అనుమానాలు కలిగేలా చేశారు. ఈ నేపథ్యంలోనే అందరం కలిసి ఆ శాసనాన్ని చూసి, పరిశోధనలు చేసి వాటి అర్థం చదివి చెప్పిన తర్వాత ఇది మొట్టమొదటి తొలి తెలుగు శాసనం, రేనాటి చోళరాజు ధనుంజయుడు వేయించిన శాసనంగా నిర్ధరించాం" అని చెప్పారు.
కడప జిల్లాలో వెలుగు చూసిన తెలుగు శాసనాలను పరిరక్షించాలని, కలమల్లను పర్యటక ప్రాంతంగా చేయాలని తాము భావిస్తున్నట్లు సాంబశివారెడ్డి బీబీసీకి చెప్పారు.
"తొలి తెలుగు శాసనం కలమల్లలో వెలుగు చూసిందనే విషయం నాకు ఎప్పటి నుంచో తెలుసు. కాకపోతే క్రీస్తుశకం 11వ శతాబ్దంలో తెలుగు సంపూర్ణ భాషగా ఏర్పాటైందని మన చరిత్రకారులు చెబుతున్నారు. కానీ, క్రీస్తుశకం 575లో రేనాటి చోళులకాలంలో మొట్టమొదట కలమల్లలో తెలుగు శాసనం వెలువడిందనే విషయం యథార్థం.
కాబట్టి ఇక్కడున్న దాదాపు ఆరు శాసనాలను ఒకచోటచేర్చి ఒక మండపంలా కట్టి దీన్ని పర్యాటక ప్రాంతంగా చేయాలనే ఆలోచన ఉంది. కడపజిల్లా శాసనాల పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్న అన్ని శాసనాల గురించీ ప్రపంచంలో ఉన్న తెలుగువారందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాం'' అన్నారు సాంబశివారెడ్డి.

ఈ శాసనాలను ఎలా కనుగొన్నారు?
జయంత రామయ్యపంతులు అనే సాహిత్యవేత్త 1904లో దొమ్మలమడుగులో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు కలమల్ల ప్రాంతాన్నిసర్వే చేశారని ఉమామహేశ్వర శాస్త్రి చెప్పారు.
"కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, యర్రగుంట్ల, పులివెందులలో చాలా ప్రాచీన శాసనాలను వారు గుర్తించారు. వాటిని పరిశోధించిన తర్వాత కేఏ నీలకంఠశాస్త్రి, ఎం.వెంకటరామయ్య ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పత్రిక 27వ సంపుటిలో వాటి గురించి రాశారు. 'తెలుగు చోళా రికార్డ్ ఫ్రం కడప, అనంతపూర్ డిస్ట్రిక్ట్స్' అనే పెద్ద వ్యాసం రాశారు.
ఒక లిపిని మనం తెలుసుకోవాలంటే అంతకుముందు కాలం లిపితో పోల్చి చూడాలి. అప్పుడు అది ఏ కాలానిదో చెప్పవచ్చు. అలా కర్ణాటకలోని శీలగుండ అనే ప్రాంతంలో కదంబరాజు వేసిన ఒక శాసనంతో దీన్ని పోల్చి చూశాం. ఆ కాలానికి సమానంగా ఇది 575 నాటిది" అని ఆయన వివరించారు.

ఈ శాసనం ఇప్పుడు ఏ స్థితిలో ఉంది
ఈ శాసనంపై ఉన్న అక్షరాలు కాలక్రమేణా కనిపించకుండా పోయాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అందులోని కొన్ని పంక్తులు మాత్రమే చదవగలిగేలా ఉన్నాయన్నారు.
"ఇప్పుడు దాదాపు ఐదు పంక్తులు అరిగిపోయి ఆరో పంక్తి ప్రారంభం నుంచి కొన్ని అక్షరాలు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. అది ఇప్పుడు శాసనమని గుర్తించలేని స్థితిలో ఉంది. నేను 1984లో కడపజిల్లా శాసనాల మీద పరిశోధన చేస్తున్నప్పుడు.. మా సీనియర్‌తో కలిసి ఈ ప్రాంతమంతా తిరిగి అన్నిశాసనాలూ గుర్తించాం. ఇక్కడ శాసన ప్రతిబింబం కూడా తీసుకున్నాం. అప్పటికే అది కొంత భాగం అరిగిపోయి ఉండేది. పైభాగం చాలాకాలం క్రితమే విరిగినట్లు అనిపిస్తోంది. 1967లో కూడా మరోసారి వీటి ప్రతిబింబాలు తీసుకున్నారు. వాటిలో నాలుగో పంక్తి నుంచే శాసనం కనిపించింది'' అని అవధానం ఉమామహేశ్వర శాస్త్రి చెప్పారు.

ఇవి కూడా చదవండి:
- లాలూ ప్రసాద్ యాదవ్‌కు దాణా కేసులో అయిదేళ్ల జైలు శిక్ష, రూ.60 లక్షల జరిమానా
- మిల్లెట్లతో బిస్కెట్లు తయారు చేయాలనుకుంటున్నారా, చిరుధాన్యాల ఉత్పత్తిలో ఆసక్తి ఉందా...
- మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం
- మాయావతి, ములాయం సింగ్‌ల మధ్య వైరం పెంచిన గెస్ట్‌హౌస్ ఘటన, ఆ రోజు ఏం జరిగిందంటే..
- కరోనా నుంచి కోలుకున్నాక గుండె పోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి
- ‘చారిత్రక కట్టడాల దగ్గర సెల్ఫీలు తీసుకోవడం కాదు.. అవి చెప్పే కథలు వినాలి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












