తెలంగాణ: గచ్చుబాయి తండాను గురుగోబింద్ సింగ్ నగర్‌ అని ఎందుకు అంటున్నారు... ఆ ఊళ్లోని వారంతా సిక్కు మతం ఎందుకు స్వీకరిస్తున్నారు?

గచ్చుబాయి తండా
    • రచయిత, సురేఖ అబ్బూరి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్-బెంగళూరు హైవే మీద ఉండే శంషాబాద్ నుంచి కాస్త లోపలికి వెళ్తే గచ్చుబాయి తండా అనే ఓ చిన్న గ్రామం వస్తుంది.

నిజానికి, ఆ ఊరును గచ్చుబాయి తండా అని కాకుండా 'గురుగోబింద్ సింగ్ నగర్‌' అని పిల్చుకోవడానికే స్థానికులు ఇష్టపడుతున్నారు. ఎందుకు వాళ్లు అలా పిలవాలనుకుంటున్నారు?

సిక్కు గ్రామంలా తెలంగాణ తండా

కొన్నేళ్ల కిందటి వరకు ఈ తండావాసులు లంబాడీ సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించే వారు. నిజానికి వారు మాట్లాడే భాష కూడా లంబాడీ భాషే. కానీ, ఇప్పుడు స్థానికుల్లో చాలామంది వేషం మారిపోయింది.

కొంతమంది మహిళలు ఇప్పటికీ లంబాడీ దుస్తుల్లో కనిపిస్తుంటే చాలామంది మహిళలు చీరలు, సల్వార్ కమీజ్‌ల లోకి మారిపోయారు. పురుషులు పగిడి(తలపాగా), కృపాణ్ (చిన్నకత్తి) తో సిక్కు సంప్రదాయంలోకి మారిపోయారు.

అయితే, సిక్కు సంప్రదాయాలు కనిపించినా వారిలో చాలామందికి పంజాబీ రాదు. హిందీ, తెలుగు భాషలు మాట్లాడంలో వీరికి ఎలాంటి సమస్య ఉండదు.

నిన్న మొన్నటి వరకు గుళ్లు, గోపురాలకు వెళ్లడం వీరికి పెద్దగా అలవాటు లేదు.

కానీ, ఇప్పుడు మెజార్టీ తండావాసులు ఉదయాన్నే స్నానం చేసి తమ తండాలో నిర్మించుకున్న గురుద్వారాకి వెళ్లి ప్రార్ధనలు చేస్తున్నారు. ఆ తర్వాతనే మిగతా పనులు మొదలుపెడుతున్నారు.

ఈ విషయాన్ని స్థానికులు సంతోషంగా చెబుతున్నారు.

గచ్చుబాయి తండా

లంబాడీలు సిక్కులు ఎలా అయ్యారు?

నిజానికి సిక్కు మతంపై తమ విశ్వాసం ఈనాటిది కాదంటారు 73 ఏళ్ల లఖ్విందర్ సింగ్. తమ పూర్వీకులు కూడా ఈ మతంపట్ల, మతాచారాల పట్ల ఆసక్తి చూపించేవారని ఆయన బీబీసీతో అన్నారు.

"మా తాతల కాలం నుంచి నాందేడ్ లోని గురుద్వారాకు తరచూ వెళ్లడం, ఇంట్లో ఫొటోలు పెట్టి పూజ చేయడం చూశాను. అప్పటి నుంచే ఈ మతాన్ని నమ్ముతున్నా. ఈ మతానికి మారిపోవాలని 2002లో నిర్ణయించుకున్నాం. మొదట్లో 70మంది, ఇప్పుడు 500 మంది సిక్కు మతానికి మారారు’’ అని లఖ్వీందర్ సింగ్ అన్నారు.

ఈ మతంలోకి మారిన తర్వాత తమకు గౌరవ మర్యాదలు పెరిగాయని ఆయన అన్నారు.

‘‘ఒకప్పుడు నాకు ఇలా గడ్డం, తలపాగా ఉండేవి కాదు. ఈ మతానికి మారిన తరువాతనే నేను ఒక సర్దార్జీ లాగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఇంతకు ముందు మేం వెళుతుంటే లంబాడోళ్లు వెళుతున్నారు అనేవారు. కానీ, ఇప్పుడు సర్దార్జీ వెళుతున్నాడు అంటున్నారు’’ అని ఆయన సిక్కు మతంలోకి మారిన నేపథ్యాన్ని లఖ్వీందర్ సింగ్ వివరించారు.

గచ్చుబాయి తండాలోని గురుద్వారా
ఫొటో క్యాప్షన్, గచ్చుబాయి తండాలోని గురుద్వారా

గురుద్వారా నిర్మాణానికి ముందు నుంచే పూజలు

ఈ తండాలో లఖ్విందర్ సింగ్‌తో సిక్కు మతంలోకి మారడం మొదలైనప్పటికీ, గురుద్వారా కట్టక ముందే కొన్నేళ్ల క్రితం ఒక చిన్నగుడిలా కట్టుకొని ఇక్కడే గురునానక్‌కు పూజలు చేసే వారని స్థానికులు చెప్పారు.

ఇక్కడ గురుద్వారా నిర్మించాలని నిర్ణయించుకుని 2002లో అమీర్‌పేటలోని సిక్కుమత పెద్దలని సంప్రదించారు.

అయితే, గురుద్వారా కట్టాలంటే సిక్కు మతంలోకి మారాలన్న నిబంధన ఉందని, లేదంటే ఇప్పుడు జరుపుతున్నట్లు గురునానక్‌కి పూజలు చేసుకోవచ్చని చెప్పారట. దీంతో ఈ తండావాసులు మతం మారాలని నిర్ణయించుకున్నారు.

గచ్చుబాయి తండా

ఆచారాలు మారాయి

కేవలం మత మార్పిడితో ఊరుకోలేదు. మతాచారాలను తరువాత తరాల వారికి అలవాటు చేసేందుకు, సంప్రదాయాలను పాటించేందుకు సాధారణ విద్యతోపాటు సిక్కు మత గ్రంథాలను చదవడం ప్రారంభించారు.

ఇందుకోసం పిల్లలకు ఓ పాఠశాలను ఏర్పాటు చేసి అందులో అన్ని విషయాలతో పాటు గుర్బాణి (సిక్కు మత కీర్తనలు) కూడా నేర్పుతున్నారు.

అలాగే కొంతమంది ఆసక్తి ఉన్న పిల్లలు గురుద్వారాలో కీర్తనలు, గత్కా అనే సిక్కు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నారు.

గచ్చుబాయి తండాలో విద్యార్థులు
ఫొటో క్యాప్షన్, గచ్చుబాయి తండా బడిలో విద్యార్థులు

అంతేకాదు, గ్రామం మొత్తం మీద చాలా మార్పుల్ని గమనించామని తండావాసి మంజు కౌర్ అన్నారు. ఆమె అదే తండాలో స్కూల్ టీచర్‌గా కూడా పని చేస్తున్నారు.

‘‘ఇక్కడి పిల్లలు చక్కగా చదువుకుంటారు. దురలవాట్లకు దూరంగా ఉంటారు. ఈ తండాలో సిగరెట్, గుట్కాలు కూడా దొరకవు. ఒకప్పుడు అవి లేకపోతే ఇక్కడ చాలామందికి రోజు గడిచేది కాదు. కానీ, ఈ మతంలో ఇవి తప్పు అని తెలుసుకొని వాటిని దూరం పెట్టారు. మాంసాహారం విషయంలో కూడా నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నారు” అంటూ మంజుకౌర్ తన అనుభవాలను బీబీసీకి వివరించారు.

ఈ తండావాసులు పెద్దగా చదువుకోకపోయిన, చాలామంది పెద్దలు ఇప్పుడు పంజాబీలో రాసి ఉన్న గుర్బాణిని చదవడం నేర్చుకున్నారు.

ఇక్కడ మహిళలు కూడా సిక్కు మతానికి సంబంధించిన కట్టుబొట్టు, సంప్రదాయాలు, వంటలు నేర్చుకున్నారు. గురుద్వారా లో పంచే ఖడా పర్షాద్ అనే హల్వాను కూడా వీరు అత్యంత నిష్టతో తయారు చేస్తుంటారు.

గచ్చుబాయి తండా

అబ్బాయిల పెళ్లి సులభం

ఇక ఈ తండా వాసులకు పిల్లనివ్వాలంటే మిగిలిన గ్రామాలు, తండాల వాళ్లు ఇంతకు ముందు ఆలోచించేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

మిర్యాలగూడకు చెందిన ఇందు ఈ తండాలో కోడలిగా అడుగుపెట్టారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి ఆచార సంప్రదాయలు చూసి చాలా సంతోషించానని, తాను వాటిని నిష్టగా పాటిస్తున్నానని ఆమె చెప్పారు.

తన భర్తకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, పెద్దలకు మర్యాద ఇవ్వడం, ఒకే కుటుంబంలా కలిసి ఉండటం చాలా బాగా నచ్చిందని ఇందు బీబీసీతో అన్నారు.

వీరిలో కొందరు రైతులుగా పూలు, పండ్లు, ఇతర కూరగాయలు పండిస్తున్నారు. మరి కొందరు ఆటో డ్రైవర్లుగా పని చేస్తుండగా, ఇంకొందరు వివిధ వృత్తుల్లో ఉన్నారు.

ఇప్పటికే ఈ తండాలో 90 శాతం మంది లంబాడా తెగ ప్రజలు సిక్కు మతంలోకి మారారు. కొందరు లంబాడీలుగానే కొనసాగుతున్నారు. అయినప్పటికీ అంతా హాయిగా కలిసి మెలసి ఉంటున్నారు.

వీడియో క్యాప్షన్, ప్రాణాలు నిలుపుకోడానికి మతం మారాల్సిందే!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)