ముంబయి: కాటన్ మిల్లుల నుంచి అండర్ వరల్డ్ డాన్‌లు ఎలా పుట్టుకొచ్చారు?

ముంబయి మిల్లులు

ఫొటో సోర్స్, Getty Image / Hindustan Times

    • రచయిత, మయాక్ భగవత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇది 40 సంవత్సరాల కిందటి మాట. సుదీర్ఘ సమ్మె కారణంగా ముంబయిలోని కాటన్ మిల్లులు ఒక్కసారిగా ఆగిపోయాయి. రోజూ వినిపించే ఫ్యాక్టరీ సైరన్‌లు వినిపించడం మానేశాయి. పొగలు కక్కే మిల్లుల చిమ్నీలు విశ్రాంతి తీసుకున్నాయి.

లక్షలమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వేల కుటుంబాలు చితికిపోయాయి. మాంఛెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరున్న ముంబయి కుదేలైంది.

నిరుద్యోగం, పేదరికం సమస్యలు మిల్లు కార్మికుల కుటుంబాలలోని కొంతమంది యువకులను ఈజీ మనీ సంపాదన వైపు మరలేలా ప్రోత్సహించాయి.

“మిల్లులు మూతపడటంతో, కార్మికుల పిల్లలు చదువులు కొనసాగించలేకపోయారు. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇల్లు గడవడానికి డబ్బు లేదు. మిల్లు కార్మిక కుటుంబాలకు చెందిన కొంతమంది యువకులు నేర ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ఇది కారణమైంది’’ అని సీనియర్ జర్నలిస్ట్ ప్రభాకర్ పవార్ అన్నారు.

ఇలా మిల్లు కార్మిక కుటుంబం నుంచి వచ్చి నేర ప్రపంచంలో అడుగుపెట్టిన వారిలో చెప్పుకోదగ్గ వాళ్లు ఇద్దరున్నారు. ఒకరు అరుణ్ గవలీ. ఈయన బైకుల్లా ప్రాంతంలో దగడీ చాల్‌కు చెందినవారు. రెండో వ్యక్తి దాదర్‌కు చెందిన అమర్ నాయక్.

‘‘అమర్ నాయక్, అరుణ్ గవలీలిద్దరూ ఒక సామాన్య మిల్లు కార్మిక కుటుంబం నుంచి వచ్చిన వారే. అండర్ వరల్డ్‌లో వేగంగా ఎదిగారు’’ అని ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా తన పుస్తకం ‘లెట్ మీ సే ఇట్ నౌ’లో రాశారు.

అమర్ నాయక్

ఫొటో సోర్స్, Prabhakar Pawar-Book

ఫొటో క్యాప్షన్, అమర్ నాయక్

గ్యాంగ్‌స్టర్ కాకముందు అరుణ్ గవలి మహాలక్ష్మి మిల్లులో పనిచేసేవారు. ముంబయిలోని మిల్లు కార్మికులలో ఎక్కువమంది సెంట్రల్ ముంబయి ప్రాంతాలైన ప్రభాదేవి, చించ్‌పోకలి, సత్‌రస్తా, మజ్‌గావ్, దాదర్, బైకుల్లా, అగ్రిపడ వంటి ప్రాంతాలలో నివసించేవారు. ఈ ప్రాంతాన్ని గిరాంగావ్ (మిల్లుల పరిసర ప్రాంతం) అని పిలిచేవారు.

కాటన్ మిల్లుల్లో ట్రేడ్ యూనియన్లు ఉండేవి. తరువాత, స్థానికంగా ఉండే గూండాలు ఈ యూనియన్లలోకి ప్రవేశించారు. అగ్రిపడాకు చెందిన బాబు రేషిమ్ 1980లలో యూనియన్లను నియంత్రించిన ప్రముఖ ముఠా నాయకుడు.

35 ఏళ్లుగా పోలీసు శాఖలో పనిచేసి రిటైరైన ఏసీపీ ఐజాక్ బగ్వాన్, మిల్లు ప్రాంతాల్లో గూండాయిజం ఎలా విజృంభించిందో, మిల్లు కార్మిక కుటుంబాలకు చెందిన కొందరు యువకులు అండర్‌ వరల్డ్‌లోకి ఎలా ప్రవేశించారో గమనించారు.

‘‘నేషనల్ మిల్ వర్కర్స్ యూనియన్‌లో బాబు రేషిమ్ క్రియాశీలకంగా వ్యవహరించేవారు. ఆయన కార్మికులను బెదిరించి స్ట్రైక్‌లకు దిగకుండా కంట్రోల్ చేసేవారు. బైకుల్లాకు చెందిన రామానాయక్ నుంచి ఆయనకు సహకారం అందేది’’ అని ఐజాక్ బగ్వాన్ వెల్లడించారు.

అగ్రిపడలో బాబు రేషిమ్, బైకుల్లాలో రామా నాయక్, బాంబే సెంట్రల్ ఏరియాలో వాలాజీ-పాలజీ, రాక్సీ థియేటర్ ప్రాంతంలో నరేంద్ర నార్వేకర్‌లు తమ తమ గ్యాంగ్స్‌తో యాక్టివ్‌గా ఉండేవారు.

బాబు రేషిమ్

ఫొటో సోర్స్, iSaque Bagwan

ఫొటో క్యాప్షన్, బాబు రేషిమ్

అయితే, ఈ రౌడీయిజం కేవలం మిల్లులకే పరిమితం కాలేదు. డాక్ ఏరియాలలో హాజీ మస్తాన్, యూసఫ్ పటేల్, కరీంలాలా లాంటి అండర్ వరల్డ్ డాన్‌లు పని చేస్తుండేవారు.

హాజీ మస్తాన్‌కు కుడి భుజంలా పని చేసిన దావూద్ ఇబ్రహీం ఆ తర్వాత డాన్ అవతారమెత్తాడు.

‘‘దావూద్ కొంకణ్ ప్రాంతానికి చెందిన ముస్లిం. అతను ఎప్పుడూ మరాఠీ పిల్లల మధ్య ఉండేవాడు. అందువల్ల, మిల్లు కార్మికుల పిల్లలు చాలామంది దావూద్ ముఠాలో చేరారు. డాన్‌గా ఉండటంలో ఉన్న మజా, గ్లామర్‌ వారిని ఆకర్షించాయి. 1997 తర్వాత కొన్ని మిల్లులు మూతపడటంతో వీరంతా నేరాలవైపు దృష్టిసారించారు’’ అని సీనియర్ జర్నలిస్ట్ ప్రభాకర్ పవార్ అన్నారు.

1987 మార్చి 5న జరిగిన గ్యాంగ్ వార్‌లో బాబు రేషిమ్ హత్యకు గురయ్యాడు. అనంతరం ముఠా పగ్గాలను రామా నాయక్‌ చేపట్టారు. బైకుల్లా, అగ్రిపడ, లోయర్ పరేల్ ప్రాంతాల్లో ఆయన ఆధిపత్యం పెరిగింది. ఆ ప్రాంతంలో టెక్స్‌టైల్ మిల్లులు ఎక్కువగా ఉండేవి. దాంతో మిల్లు కార్మికుల పిల్లలు రామా నాయక్ గ్యాంగ్‌లో చేరారు.

రామా నాయక్ అగ్రిపడలోని హౌసింగ్ బోర్డు భవనంలో ఉండేవాడు. ఎదురుగా మిల్లు వర్కర్స్ నివాస ప్రాంతమైన దగాడీ చాల్ ఉండేది. అక్కడే నివసించేవాడు అరుణ్ గవలి. గవలీ తండ్రి ఒక మిల్లు కార్మికుడు.

‘‘అరుణ్ గవలీ అప్పట్లో అంత చురుగ్గా ఉండేవాడు కాదు. అప్పుడప్పుడే నేర ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు’’ అని రిటైర్డ్ పోలీసు అధికారి ఐజాక్ బగ్వాన్ అన్నారు. రామా నాయక్‌తో పరిచయం ఏర్పడిన తర్వాత అరుణ్ గవలీ నేరాల వైపు మొగ్గు చూపాడని ఆయన వెల్లడించారు.

రామా నాయక్‌

ఫొటో సోర్స్, iSaque bagwan

ఫొటో క్యాప్షన్, రామా నాయక్‌

అప్పట్లో ముంబయిలో గ్యాంగ్ వార్‌లు సాగేవి. ఆధిపత్య పోరాటాలలో పట్టపగలే వీధుల్లో రక్తపాతం జరిగేది. దావూద్, గవలీ ముఠాలకు చెందిన మిల్లు కార్మికుల పిల్లలు ఈ ఘర్షణల్లో పాల్గొనేవారు. కొన్ని ఘటనల్లో కొందరు మైనర్లు కూడా మరణించారు.

పోలీస్ ఎన్‌కౌంటర్‌లో రామా నాయక్ మరణించిన తర్వాత, నాయక్ గ్యాంగ్ అరుణ్ గవలీ చేతికి వచ్చింది.

‘‘రామా నాయక్ తరువాత, మిల్లు కార్మికుల పిల్లలు అరుణ్ గవలీతో కలిసి పనిచేయడం ప్రారంభించారు’’ అని ప్రభాకర్ పవార్ అన్నారు.

‘‘బైకుల్లా, అగ్రిపడ, సతారా ప్రాంతంలో అరుణ్ గవలీ ఆధిపత్యం పెరుగుతూ వచ్చింది. మరోవైపు దాదర్‌లో అమర్‌ నాయక్‌ అండర్‌ వరల్డ్‌ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండేవాడు. అమర్ నాయక్ ముఠాలో కూడా మిల్లు కార్మికుల పిల్లలు చాలామంది ఉండేవారు.

ఈ ముఠాలో యువకుల పాత్ర ఏంటి?

‘‘కోర్టు వ్యవహారాల మీద ఓ కన్నేసి ఉంచడం కొందరి బాధ్యత. మరికొందరు రెక్కీలు నిర్వహించేవారు. అరుణ్ గవలీ, అమర్ నాయక్‌ లిద్దరూ ఈ మిల్లు కార్మికుల పిల్లలను చాలా సంవత్సరాలు పోషించారు’’ అని ప్రభాకర్ పవార్ చెప్పారు. అమర్‌ నాయక్, అరుణ్ గవలీల మధ్య శత్రుత్వం చాలాకాలం కొనసాగింది.

అమర్ నాయక్ సోదరుడు అశ్విన్ నాయక్‌ను 1994 ఏప్రిల్ 18న ముంబయిలోని టాడా కోర్టు ముందు హాజరు పరిచారు. అశ్విన్ నాయక్ కోర్టు నుంచి బయటకు వస్తుండగా, లాయర్ వేషంలో ఉన్న ఓ యువకుడు అశ్విన్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

‘‘అశ్విన్ నాయక్‌ను కోర్టు వెలుపల కాల్చి చంపిన రవీంద్ర సావంత్, ఒక మిల్లు కార్మికుడి కొడుకు’’ అని రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐజాక్ బగ్వాన్ అన్నారు. జోగేశ్వరి ప్రాంతానికి చెందిన సావంత్, గవలీ గ్యాంగ్‌లో కీలకంగా ఉండేవాడు.

ముంబాయి మిల్

ఫొటో సోర్స్, Getty Images /Hindustan Times

ముంబయిలోని ప్రసిద్ధ ఖటావ్ మిల్లు బైకుల్లా ప్రాంతంలో ఉండేది. ఖటావ్ మిల్స్ యజమాని సునీల్ ఖటావ్‌కు అరుణ్ గవలీతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. రామా నాయక్ హత్య తర్వాత అరుణ్ గవలీకి ఆర్థిక బలం లేదు.

‘‘సునీల్ ఖటావ్ తన మిల్లులో అరుణ్ గావ్లీ ముఠాలోని వందల మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చాడు. ఖటావ్ అరుణ్ గవలీకి ఫైనాన్షియర్‌లాంటి వాడు’’ అని ప్రభాకర్ పవార్ తెలిపారు.

1994, మే 7న సునీల్ ఖటావ్ పట్టపగలే దారుణ హత్యకు గురయ్యారు.

‘‘గవలీ కి ఖటావ్ ఆర్ధికంగా సాయం చేస్తున్నట్లు అమర్ నాయక్ అనుమానం వ్యక్తం చేశాడు. అందుకే ఆయన్ను చంపేశాడు’’ అని ప్రభాకర్ పవార్ అన్నారు.

‘‘సునీల్ ఖటావ్ హత్య తర్వాత, గిరాంగావ్‌లోని యువకులు చెల్లచెదురైపోవడం నాకు తెలుసు’’ అని ముంబయి మాజీ పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా తన పుస్తకంలో రాశారు

‘‘ఖటావ్ హత్య తర్వాత ఈ గిరంగావ్‌ యూత్ తాము వంచనకు గురైనట్లు భావించారు. ముంబయిలో ఇలాంటి ఎంతో మంది పిల్లలు ఈజీ మనీ కోసం నేరాలకు పాల్పడుతున్నారు’’ రాకేశ్ మారియా తన పుస్తకంలో పేర్కొన్నారు.

ఇక గ్యాంగ్‌వార్‌ మితిమీరడంతో పోలీసులు రంగంలోకి దిగి అమర్ నాయక్, అరుణ్ గవలీ గ్యాంగులకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు.

1994 నాటికి అమర్ నాయక్ గ్యాంగ్‌కు చెందిన 14మంది సభ్యులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లలో కాల్చి చంపారు. అరుణ్ గవలీ గ్యాంగ్‌లోని షూటర్లను కూడా పోలీసులు కాల్చి చంపి, అతని గ్యాంగ్‌ను దెబ్బతీశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)