యుక్రెయిన్ సంక్షోభం: రష్యా తరహాలోనే చైనా తైవాన్‌పై దాడికి దిగుతుందా

చైనా

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, స్టీఫెన్ మెక్‌డోనల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రష్యా, చైనాలు కలిసి ప్రపంచంలో "తీవ్రమైన అప్రజాస్వామిక" వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని అమెరికా ఆరోపించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తూర్పు యుక్రెయిన్‌లో సైనిక చర్యను ప్రకటించడానికి కొన్ని గంటల ముందు అమెరికా ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇటీవల వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల రోజు రష్యా, చైనా "నో లిమిట్స్" ఒప్పందంపై సంతకం చేశాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఆపడానికి ప్రయత్నించవచ్చని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ కూడా అన్నారు.

"రష్యన్ ఫెడరేషన్‌పై తమ పరపతిని పూర్తి స్థాయిలో ఉపయోగించారా, లేదా అని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పీఆర్‌సీ)ని అడగాలి" అని ప్రైస్ ఒక మీడియ సమావేశంలో అన్నారు.

యుక్రెయిన్ సంక్షోభం, అనేక రకాలుగా చైనాకు పెను సవాలుగా మారింది.

చైనా, రష్యాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న సన్నిహిత దౌత్య సంబంధాలు బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ సందర్భంగా మరోసారి వ్యక్తమయ్యాయి. వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరైన అతికొద్ది మంది ప్రపంచ నేతలలో పుతిన్ ఒకరు.

ముఖ్యంగా పుతిన్, వింటర్ ఒలింపిక్స్ ముగిసేవరకు యుక్రెయిన్ విషయంలో కీలక చర్యలు తీసుకోలేదు. ఒలింపిక్ గేమ్స్ ముగిసిన తరువాతే తూర్పు యుక్రెయిన్‌లో రెండు వివాదాస్పద ప్రాంతాలను స్వతంత్ర భూభాగాలుగా గుర్తిస్తున్నట్లు, తమ సైనిక దళాలను అక్కడకు పంపిస్తున్నట్లు పుతిన్ ప్రకటించారు.

వీడియో క్యాప్షన్, నేపాల్ సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు

యుక్రెయిన్ సంక్షోభం విషయంలో అన్ని పక్షాలూ సంయమనంతో వ్యవహరించాలని, ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు చేయాలని చైనా తన బహిరంగ ప్రకటనల్లో పేర్కొంది.

ఇటీవల, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంథోనీ బ్లింకెన్‌తో యుక్రెయిన్ ఉద్రిక్తతల గురించి చర్చించారు. పరిస్థితులు "దిగజారుతున్నాయని", "అన్ని పక్షాలూ సంయమనం పాటించాలని" పదే పదే పిలుపునిచ్చారు.

అయితే, రష్యా సంయమనం వీడి సైనిక చర్యలకు పాల్పడిన నేపథ్యంలో చైనా వైఖరి ఏమిటి?

యూరప్‌లో యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కనిపించకూడదు కానీ, రష్యాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఆశిస్తోంది చైనా.

యుక్రెయిన్ వాణిజ్య భాగస్వాములలో చైనాకే మొదటి స్థానం. యుక్రెయిన్‌తో ఎప్పుడూ మంచి సంబంధాలు నెరపడానికే చైనా ప్రయత్నిస్తుంది. కానీ, ఆ దేశ సరిహద్దుల్లోకి సైన్యాన్ని పంపిస్తున్న ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు, చైనాకు ఇది సాధ్యం కాదు.

రష్యా చర్యలకు మద్దతు ఇస్తున్నట్లు తెలిస్తే, పశ్చిమ యూరోప్ దేశాలతో చైనా వాణిజ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది.

ఇది కాకుండా, చైనా నాయకులు ఎప్పుడూ పాడే పాట ఏంటంటే, ఇతరుల అంతర్గత వ్యవహారాల్లో తమ దేశం జోక్యం చేసుకోదు, తమ అంతర్గత వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోకూడదు.

కాగా, "దేశ సార్వభౌమాధికారినికే పెద్దపీట వేయాలన్నది చైనా విధానం. కానీ, యుక్రెయిన్ భూభాగలపై రష్యా దాడి లేదా ఆక్రమణ, కీవ్‌ను స్వాధీనం చేసుకోవడం ఈ విధానానికి వ్యతిరేకం" అంటూ అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ అధికారి జాన్ కల్వర్ ట్వీట్ చేశారు.

రష్యా

ఫొటో సోర్స్, Getty Images

రష్యా వాదన చైనాకు అన్వయిస్తే...

ఈ మొత్తం వ్యవహారాన్ని చైనా ప్రజలు ఎలా చూస్తారు, ప్రపంచం పట్ల వాళ్ల దృక్పథం ఎలా మారుతుందన్నదే చైనా కమ్యూనిస్ట్ పార్టీకి పెద్ద బెంగ.

అందుకే ప్రెస్, సోషల్ మీడియాల్లో యుక్రెయిన్ గురించి చర్చలను నియంత్రిస్తూ, ఆచితూచి వ్యవహరిస్తోంది.

వీటన్నింటి మధ్యలో తైవాన్ ప్రసక్తి కూడా వస్తోంది. తైవాన్ స్వతంత్ర ప్రతిపత్తిని అంగీకరించమని, తమ దేశంలో భాగం కావాల్సిందేనని చైనా పట్టుబడుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో చైనా సోషల్ మీడియా వీబోలో తైవాన్ గురించి కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రష్యా యుక్రెయిన్‌పై చేస్తున్న దాడిని ఉదహరిస్తూ, "తైవాన్‌ను వెనక్కు తీసుకునేందుకు ఇదే మంచి సమయం" అంటూ చైనా జాతీయవాదులు పిలుపునిస్తున్నారు.

ఇటీవల రష్యాపై ఆంక్షలు విధించడాన్ని చైనా ప్రభుత్వం తిరస్కరించింది. తైవాన్‌పై దాడిచేస్తే తమకు కూడా అలాంటి పరిస్థితే వస్తుందని, అది దేశానికి చాలా భారమవుతుందని చైనాకు బాగా తెలుసు.

సమస్యలను పరిష్కరించడానికి ఆంక్షలు విధించడం ఉత్తమ మార్గంగా చైనా భావించట్లేదని వారి విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ ఒక విలేఖరుల సమావేశంలో అన్నారు.

కానీ, యుక్రెయిన్‌పై దాడికి రష్యా ఇస్తున్న వివరణను, చైనా పౌరులు తమ దేశానికి అన్వయించుకుంటే, చైనా ప్రభుత్వం చిక్కుల్లో పడుతుంది. తమ దేశ ప్రస్తుత సరిహద్దుల గురించి చైనా ఇస్తున్న వివరణ తలకిందులవుతుంది.

యుక్రెయిన్‌లో రష్యన్ మాట్లాడే జనాభాకు విముక్తి కలిగిస్తున్నామని రష్యా చెబుతోంది. అలాంటప్పుడు, ప్రస్తుతం చైనాలో భాగమైన మంగోలియన్లు, కొరియన్లు, కిర్గిజ్ లాంటి వారి సంగతేంటి? అంతకన్నా ముఖ్యంగా, చైనాలో ఉన్న టిబెటన్లు, వీగర్ ముస్లింలు తమ స్వయంప్రతిపత్తి పెరగాలని లేదా స్వతంత్రం కావాలని పిలుపునిస్తే? చైనా నెత్తిమీద బాంబు పడినట్టే.

షీ జిన్‌పింగ్ ప్రభుత్వానికి ఇది జరగకుండా ఉండడమే అన్నింటికన్నా ముఖ్యం.

రష్యా దాడి పట్ల చైనా పౌరుల ఆలోచనలను వారి పభుత్వం ఎలా ప్రభావితం చేస్తోందో తెలుసుకోవడానికి ఆ దేశ సోషల్ మీడియా చూడడం తప్ప మరో మార్గం లేదు.

చైనా ప్రభుత్వ మీడియాకు వీబోలో ఒక అకౌంట్ ఉంది. రష్యా, యుక్రెయిన్‌లపై తమ పోస్టులకు వచ్చే స్పందనలను నియంత్రిస్తూ ఉంటుంది.

అక్కడ వచ్చిన కొన్ని కామెంట్లు చూద్దాం.

"పుతిన్ అద్భుతం!"

"నేను రష్యాకు మద్దతిస్తాను. అమెరికాను వ్యతిరేకిస్తా. అంతే నేను చెప్పాలనుకున్నది."

"ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక గందరగోళం సృష్టించాలనుకుంటుంది అమెరికా!"

వీడియో క్యాప్షన్, చైనా అమ్మాయి, గుంటూరు అబ్బాయి లవ్ స్టోరీ

శాంతిని కోరుకునేవారూ ఉన్నారు

శాంతిని కోరుతున్న వాళ్లు చాలామందే ఉన్నా, అమెరికాను లక్ష్యంగా చేసుకున్న పోస్టులకే భారీ ప్రచారం కల్పిస్తున్నారు.

పార్టీ మీడియా పోస్టులు కాకుండా, వ్యక్తిగత పోస్టులు చూస్తే రష్యా దాడిని ప్రశ్నిస్తున్న చైనా పౌరులు కనిపిస్తారు.

"ఎందుకు చాలామంది రష్యాను, పుతిన్‌ను సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. దాడులు ఎంతవరకు న్యాయం? యుద్ధం ఏ రూపంలో ఉన్నా మనం వ్యతిరేకించాలి" అంటూ ఒకరు పోస్ట్ చేశారు.

"యుక్రెయిన్ వేర్పాటువాదుల స్వతంత్ర కాంక్షను పుతిన్ గుర్తిస్తున్నారు. అందుకు మరొక దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్నది స్పష్టం" అంటూ మరొకరు రాశారు.

ఇలాంటి వ్యాఖ్యలే చైనా ప్రభుత్వం వినకూడదనుకునేది. ఇలాంటి బాంబుల గురించే దాని ఆందోళన.

యుక్రెయిన్‌లో చిక్కుకున్న చైనా పౌరులకు వారి దౌత్యకార్యాలయం ఒక సందేశం పంపింది.

వాళ్లంతా చైనీస్ జెండాను తమ కార్లపై ఎగరేయాలని, "ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలని", "చైనా బలాన్ని చూపించాలని" చెప్పింది.

నేడు యూరప్‌లో పెను దుమారం రేగుతోంది. చైనా దీన్ని ఎలా ఎదుర్కుంటుందన్నది షీ జిన్‌పింగ్ ముందున్న పెద్ద సవాలు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)