పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ రివ్యూ : ‘గజినీ మొహమ్మద్ 17 సార్లు యుద్దం చేసి ఓడిపోయాడు. నెగ్గినోడి పేరు తెలుసా?’

ఫొటో సోర్స్, PDV Prasad
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
ఆస్తులు పెంచుకోవచ్చు. అహంకారాన్ని మాత్రం మొగ్గలోనే తుంచేయాలి. లేదంటే.. మన ఉనికికే ప్రశ్నార్థకంగా మారుతుంది. అహంకారంలానే ఆత్మాభిమానం కూడా ప్రమాదకరమైనది. ఇవి రెండూ ఒకదానికి ఇంకోటి ఎదురైతే, అక్కడో యుద్ధం మొదలవుతుంది. `అయ్యప్పయునుమ్ కోషియమ్` కథ అక్కడ్నుంచి పుట్టిందే.
అహంకారపూరితమైన ఓ వ్యక్తికి, ఆత్మాభిమానం మెండుగా ఉన్న ఓ పోలీస్‌కు మధ్య నడిచే సంఘర్షణ అది. `ఇలాంటి పాయింట్‌పై సినిమా తీయొచ్చా..` అంటూ ఆశ్చర్యపోయి, ఆ కథని అంత అందంగా మలచినందుకు మలయాళ ప్రేక్షకులు ఆనందపడిపోయిన సినిమా అది.
ఆ భాషకు అది కల్ట్ క్లాసిక్. ఓ రకంగా చెప్పాలంటే, మిగిలిన భాషల్లో కొత్త తరహా సినిమాలు రావడానికి మరో బీజం వేసిన కథ అది. అలాంటి సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారంటే, అందులోనూ పవన్ కల్యాణ్ - రానా కలిసి నటిస్తున్నారంటే... మరింత ఆసక్తి మొదలైపోతుంది.
త్రివిక్రమ్ లాంటి రైటర్ ఓ చేయి వేస్తే... ఆ కథకు కొత్త రెక్కలొచ్చినట్టే. అందుకే `భీమ్లా నాయక్` కోసం తెలుగు ప్రేక్షకులు ఇంతలా ఎదురు చూశారు. మరి భీమ్లా పరిస్థితేమిటి? మాతృకకు ఎంత వరకూ న్యాయం చేశారు? త్రివిక్రమ్ ఈ కథలో చేసిన మార్పులూ చేర్పులూ ఎలా ఉన్నాయి?

ఫొటో సోర్స్, SitharaEntertainments
కథ అలా..
కర్నూలు జిల్లాలోని హఠ్‌కేశ్వర్ మండల పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. భీమ్లా నాయక్ (పవన్ కల్యాణ్). తను చాలా స్ట్రిక్ట్. డానియల్ శేఖర్ (రానా) ఓ రోజు రాత్రి చెక్ పోస్ట్ దగ్గర మద్యం సీసాలతో దొరికిపోతాడు. అక్కడ జరిగిన గలాటాలో పోలీసులపై ఆయన చేయి చేసుకుంటే, భీమ్లా అరెస్ట్ చేస్తాడు.
ఆ క్రమంలో డానీ అహం దెబ్బతింటుంది. ఆ కేసులో అరెస్టయి జైలుకి వెళ్తాడు. తను బయటకు వచ్చేలోపుగా భీమ్లాని సస్పెండ్ చేయించి, ఒంటిమీద ఖాకీ దుస్తులు లేకుండా చేస్తాడు. దాంతో.. భీమ్లా ఆత్మాభిమానం దెబ్బతింటుంది. చేయని తప్పుకి సస్పెండ్ అవ్వడం భీమ్లాకి నచ్చదు. అప్పటి వరకూ తన కోపానికి అడ్డు తగులుతున్న యూనిఫామ్ ఎప్పుడైతే తొలగిపోయిందో, అప్పుడే భీమ్లాలోని అసలైన మనిషి బయటకు వస్తాడు. ఆ తరవాత.. భీమ్లా - డానీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలవుతుంది. ఆ పోరు చివరికి ఏ తీరానికి చేరిందన్నదే కథ.
లాక్‌డౌన్ వల్ల, ఓటీటీలు అందుబాటులోకి రావడం వల్ల, `అయ్యప్పయునుమ్ కోషియమ్` గురించి తెలుసుకోవడం వల్ల.. ఆ సినిమాని ఇప్పటికే చాలామంది చూసేశారు.

ఫొటో సోర్స్, Sithara Entertainments
పవన్ రీమేక్ చేస్తున్నారనగానే ఇంకాస్త ఎక్కువ మంది చూశారు. వాళ్లందరికీ ఈ కథ మళ్లీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కథ చెబితే - గొప్ప కథేం కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ. ఒకరిది అహం. ఇంకొకరిది ఆత్మాభిమానం. రెండూ తగ్గేవి కావు. కథంతా ఆ ఇద్దరి చుట్టే తిరుగుతుంది.
కొన్ని రీమేక్ కథల్ని మార్చలేం. కొత్తగా ఏం చూపించలేం. మాతృకలో సూపర్ హిట్లు అయిన సినిమాల విషయంలో ఈ రూల్ కచ్చితంగా పాటిస్తారు. కానీ ఈ కథను త్రివిక్రమ్ తనదైన దృష్టితో చూపించారని అనిపించింది. ముఖ్యంగా భీమ్లా పాత్రని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి, ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ఇష్టాలకు చాలా దగ్గరగా మలిచారు. ఆ పాత్రకు ఎలివేషన్లు ఇవ్వడం, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ జోడించడం, తన కోపాన్ని యాక్షన్ కోణంలో మలచడం ఇవన్నీ తెలుగు ప్రేక్షకుల కోసమే జోడించిన విషయాలు.
మలయాళంలో అయ్యప్ప - కోషియమ్ మధ్య యుద్ధం వెర్బల్‌గా సాగుతుంది. ఎమోషనల్ డ్రామానే అక్కడ కీలకం. అది తెలుగులోకి వచ్చేసరికి యాక్షన్ డ్రామా మారిపోయింది. ఈ కథని తెలుగులో ఇలానే తీయాలి. ఎందుకంటే పవన్ - రానాలాంటి యాక్షన్ ఇమేజ్ ఉన్న నటులు కెమెరా ముందు అటొకరు, ఇటొకరు కూర్చుని మాట్లాడుకుంటే, చూడ్డానికి బాగోదు. పైగా ఒకే రకమైన ఎమోషన్ అటు తిప్పి, ఇటు తిప్పి చెబుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టే యాక్షన్ మోతాదు పెంచారు.

ఫొటో సోర్స్, Sithara Entertainments
మలయాళంలో అయ్యప్ప - కోషియమ్
ఆ రెండు పాత్రలను ప్రతిబింబించేలా అయ్యప్పయునుమ్ కోషియమ్ అనే పేరు పెట్టారు. తెలుగులోకి వచ్చేసరికి `భీమ్లా నాయక్` అంటూ సోలో హీరో టైటిల్‌కి మొగ్గు చూపించారు. బీజూ మీనన్ కంటే తెలుగులో పవన్ ఇమేజ్ చాలా పెద్దది. కాబట్టి.. దానికీ ఒప్పుకోవాల్సిందే. అలాగని రానా పాత్రని ఏం తక్కువ చేయలేదు. మొదట్నుంచి, చివరికి వరకూ డానియల్ పాత్ర ఎక్కడా తగ్గదు. మధ్యలో కాస్త అటూ ఇటూ ఊగిసలాడినట్టు అనిపించినా, మళ్లీ తన పంతం కోసం ఏమైనా చేసే స్థాయికే వెళ్తాడు.
కాకపోతే... ఒకటే చిక్కు. మాలయాళంలో పృథ్వీరాజ్‌ని చూస్తున్నప్పుడు ఆ పాత్రపై ఎక్కడో ఓ చోట సింపథీ క్రియేట్ అవుతుంది. `అరె.. పాపం.. పోలీసులు మరీ ఇంతలా ఇబ్బంది పెడుతున్నారేంటి?` అనిపిస్తుంది. దాంతో ఆ పాత్రతోనూ ట్రావెల్ చేస్తారు. తెలుగులో అది జరగలేదు. రానాని చివరి వరకూ విలన్‌గానే చూస్తాం. త్రివిక్రమ్ ఈ మార్పు కావాలని చేశారా? లేదంటే పవన్ పాత్రని పెంచే క్రమంలో అలా జరిగిపోయిందా? అనేది అర్థం కాలేదు.

ఫొటో సోర్స్, facebook/sitharaentertainment
ఒకటో సీన్ నుంచే కథలోకి వెళ్లిపోడం పెద్ద రిలీఫ్. ప్రత్యేకంగా ఇంట్రడక్షన్‌లు లేకుండా కథ చెప్పడం మొదలెట్టారు. చెక్ పోస్ట్ సీన్‌కే ఓ హై వస్తుంది. ఆ తరవాత పోలీస్ స్టేషన్‌లో డానీ దర్పం చూపించడం, దాన్ని వెంటనే భీమ్లా అణచి వేయడం, మళ్లీ భీమ్లా కాస్త తగ్గడం.. ఇలా డానీ - భీమ్లా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించుకుంటూ వెళ్తారు.
`భీమ్లా నాయక్` టైటిల్ సాంగ్ సరిగా వాడుకోలేదేమో అనిపిస్తుంది. ఒక్కసారిగా... వేయి మంది జూనియర్ ఆర్టిస్టులు రంగంలోకి దిగి (అందులో సునీల్ కూడా కనిపిస్తాడు) భీమ్లాని వీరుడూ, శూరుడూ అంటూ ఆకాశానికి ఎత్తేయడం, ఫక్తు కమర్షియల్ ఎలిమెంట్.
అయితే ఆ ఎమోషన్‌ని తెచ్చి అతికించినట్టే ఉంటుంది తప్ప కథలో ఇమడలేదు. గబ్బర్ సింగ్‌లో టైటిల్ సాంగ్‌లా డిజైన్ చేయాల్సిన పాట అది. కానీ తెరపై కుదరలేదు.
రాజకీయాలకూ చోటు
భీమ్లా నాయక్ సస్పెండ్ అయిన దగ్గర్నుంచి కథ జోరందుకుంటుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ ముందు `లాలా... భీమ్లా..` పాటతో మంచి ఊపొచ్చింది. నిజానికి భీమ్లాలోని విశ్వరూపాన్ని అభిమానులకు చూసే ఛాన్స్ అక్కడే దొరికింది.
బస్ సీన్‌లో రానా, పవన్‌లు పోటా పోటీగా మాట్లాడుకోవడం, సవాళ్లు విసురుకోవడం బాగుంది. అక్కడ పవన్ చెప్పే ఉదాహరణలు.. తాజా రాజకీయ పరిస్థితులకు అద్దం పడతాయి. రాజకీయ పరంగా పవన్ అభిప్రాయాన్ని చెబుతాయి.
``గజినీ మొహమ్మద్ 17 సార్లు యుద్దం చేసి ఓడిపోయాడు. ఆడిమీద నెగ్గినోడి పేరు తెలుసా? పోనీ ఓడిపోయినా వీడే ఎందుకు గుర్తున్నాడో తెలుసా? ఎందుకంటే యుద్ధం అంటే వాడికి భయం లేదు. గెలవడం, ఓడటంతో సంబంధం లేదు. మే బీ సేమ్ టూ సేమ్`` అనే డైలాగ్ పవన్ చేత చెప్పించాడు దర్శకుడు. ఎన్నికల్లో తాను ఓడిపోయినా - పోరాటం సాగిస్తూనే ఉంటానని చెప్పడానికే ఈ డైలాగ్ అనిపిస్తుంది.
విశ్రాంతి తరవాత యాక్షన్ సీన్లతో హై వస్తుంది. భీమ్లా నాయక్, డానీ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇవ్వడం, అక్కడ జీప్‌ని పేల్చడం, నువ్వా, నేనా అంటూ బాహాబాహీకి దిగడం ఇవన్నీ మాస్‌కి నచ్చుతాయి.
పవన్ ఫ్లాష్ బ్యాక్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేదే. దాన్ని క్లైమాక్స్‌కి లీడ్‌గా తీసుకోవడం బాగుంది. కాకపోతే.. ఓ వైల్డ్ యానిమల్‌ని యూనిఫామ్ వేసి కంట్రోల్ చేశాం... అని చెప్పినప్పుడు.. భీమ్లా ఫ్లాష్ బ్యాక్‌లో అంత భయంకరుడా? అనిపిస్తుంది.
కానీ... అంత బిల్డప్ ఫ్లాష్ బ్యాక్‌లో ఉండదు. ఇంత ఫక్తు కమర్షియల్ సినిమాలో నిత్యా మేనన్ పాత్రకు సైతం ప్రాధాన్యం ఇవ్వడం హర్షించదగినదే. అయితే అప్పటికీ మాతృకతో పోలిస్తే.. ఆ పాత్రని తగ్గించినట్టే. క్లైమాక్స్‌లో డానీ భార్యని రంగంలోకి దించడం, తనని చూసి భీమ్లా చలించిపోవడం పూర్తిగా సినిమాటిక్‌గా ఉన్నాయి. బ్రహ్మానందం పాత్రని తీసుకొచ్చి, కాస్త నవ్వించి ప్రేక్షకుల్ని బయటకు పంపుదాం అన్న ఎమోషన్ బాగానే ఉంది కానీ, మరీ బ్రహ్మీ పాత్ర అనుకున్నంత స్థాయిలో పేలలేదు.
రెండు కొదమ సింహాలు తలపడితే ఎలా ఉంటుందో పవన్ - రానా పాత్రల్ని తెరపై చూసినప్పుడు కూడా అలానే ఉంటుంది. ఇద్దర్లో ఎవరూ తగ్గలేదు.
పవన్ ఎగ్రెసివ్‌గా నటించి చాలా రోజులైంది. ముఖ్యంగా యాక్షన్ దృశ్యాల్లో మునుపటి పవన్ కనిపించారు. `ఎవడైతే నాకేంటి` అంటూ శత్రువుకి ఎదురెళ్లడం పవన్ నైజం. అదే ఆ పాత్రలోనూ కనిపించేసరికి, ఆ పాత్రకు త్వరగా కనెక్ట్ అవుతారు జనాలు.
అయితే పోలీస్ పాత్ర పోషించాల్సివచ్చినప్పుడు ఆ పాత్ర కోసం కాస్త కసరత్తు చేసుంటే బాగుండేది. ముఖ్యంగా ఒత్తైన జుట్టు పోలీస్ పాత్రలకు నప్పదు. పవన్ గ్లామర్‌ని సైతం ఆ హెయిర్ స్టైల్ దెబ్బకొట్టింది. పొగరు, అహంకారం మిళితం చేస్తూ, మధ్యమధ్యలో కాస్త మంచితనం కూడా ఉందని చూపించే పాత్రలో రానా ఒదిగిపోయాడు. రానా తప్ప ఇంకెవ్వరూ ఆ పాత్రని అంత పర్‌ఫెక్ట్‌గా పోషించలేరేమో అనేలా ఉంది. ముఖ్యంగా తొలి సన్నివేశాల్లో రానా విశ్వరూపం చూపించేశాడు. మురశీ శర్మ పాజిటీవ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. సముద్రఖని పాత్రని కథకు మరింత దగ్గరగా తీసుకుని వస్తే బాగుండేది.
సాంకేతికంగా సినిమా రిచ్‌గా ఉంది. తక్కువ లొకేషన్లలో సాగినా ఆ ఫీలింగ్ కనిపించదు. తమన్ పాటలు ఇదివరకే హిట్ అయ్యాయి. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తోనూ తమన్ సన్నివేశాలను పరుగులు పెట్టించాడు. త్రివిక్రమ్ ఈ కథని ఓన్ చేసుకున్న విధానం బాగుంది. పవన్ బలాలు, బలహీనతలు తనకు తెలుసుకాబట్టి, దానికి తగ్గట్టుగానే కవర్ చేసుకుంటూ వెళ్లారు.
‘‘భయపడకూడదు.. పడినా బయటపడకూడదు.’’
‘‘నేను ఓడిపోయినా ఫర్లేదు నాన్నా... కానీ నా చేతిలో కత్తి నువ్వు తిప్పకు.’’
‘‘చరిత్ర ఎప్పుడూ గెలిచిన వాడే రాస్తాడు. మనం గెలిచాక తప్పులు సరిదిద్దుకుని మళ్లీ రాసుకోవొచ్చు’’.
ఇలా చాలా డైలాగుల్లో త్రివిక్రమ్ మార్క్ కనిపించింది. ఇలాంటి కథని డీల్ చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. మాతృకలోని ఫీల్ చెడకుండా, తెలుగు వాళ్ల అభిరుచులకు తగ్గట్టు కథని మార్చి - మాస్‌కి కావల్సిన విందు భోజనం అందించారంతా.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- తిరుపతి పుట్టిన రోజు: ఈ నగరానికి రామానుజాచార్యులు శిలాఫలకం వేశారా, దీనిపై ఇంత చర్చ ఎందుకు
- పుష్ప: తగ్గేదే లే.. అంటూ బాలీవుడ్‌కు పోటీ ఇస్తున్న దక్షిణాది సినిమా
- రష్యా-యుక్రెయిన్ సంక్షోభం: భారత వైఖరిపై ఇంత చర్చ ఎందుకు
- యుక్రెయిన్ సంక్షోభ సమయంలో ఇమ్రాన్‌ఖాన్ రష్యా ఎందుకు వెళ్లారు, భారత్‌పై చూపే ప్రభావమేమిటి?
- డీఫిబ్రిలేషన్ ఇచ్చి ఉంటే మంత్రి గౌతమ్ రెడ్డి ప్రాణాలు కాపాడగలిగేవారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















