మధుబాల: కిశోర్ కుమార్‌తో పెళ్లి ఆమెకు తీరని వేదనను మిగిల్చిందా? దిలీప్-మధుబాల ఎందుకు విడిపోయారు?

ఫొటో సోర్స్, MADHUR BHUSHAN
- రచయిత, ప్రదీప్ కుమార్
- హోదా, బీబీసీ కరెస్పాండెంట్
బాలీవుడ్‌లో అందం గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ మధుబాల పేరు తప్పక వినిపిస్తుంది.
మధుబాల పేరు తలచుకున్న వెంటనే ఆమె పోషించిన పాత్రలన్నీ మదిలో మెదులుతాయి. మహల్ సినిమాలో సస్పెన్స్ రేకెత్తించిన మధుబాల, మిస్టర్ అండ్ మిసెస్ 55 సినిమాలో నాగరిక యువతిగా అలరించిన మధుబాల, హౌరాబ్రిడ్జి సినిమాలో డ్యాన్సర్‌గా మత్తెక్కించే మధుబాల, మొఘల్-ఎ-ఆజమ్ సినిమాలో అనార్కలిగా కనిపించిన మధుబాల... ఇలా ప్రతి సినిమాలో ఆమె తళుక్కుమంది.
అందంగా, తాజాగా, కాంతిమంతంగా ఉంటూ మంత్రముగ్థం చేసే ముఖారవిందాల గురించి చెప్పుకోవాలంటే మొదటివరుసలో మధుబాల పేరే ఉంటుంది.

ఫొటో సోర్స్, MUGAL E AZAM TWITTER @FILM
1933 ఫిబ్రవరి 14న జన్మించిన మధుబాలకు ఈరోజుకు కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు.
మధుబాల అందం గురించి ఒక అంచనాకు రావాలంటే, 1990లో ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ నాయికల పాపులారిటీ గురించి ఒక ఫిల్మ్ మ్యాగజీన్ నిర్వహించిన సర్వేను పరిశీలిద్దాం. ఈ సర్వేలో 58 శాతం ఓట్లతో మధుబాల నంబర్‌వన్ స్థానంలో నిలిచారు. ఆమె దరిదాపుల్లో మరో హీరోయిన్ నిలవలేకపోయారు. రెండో స్థానంలో ఉన్న నర్గీస్‌కు కేవలం 13 శాతం ఓట్లే వచ్చాయి.
సొగసు, అందం, లావణ్యానికి పెట్టింది పేరైన మధుబాల మరణించి ఐదు దశాబ్ధాలు గడుస్తున్నప్పటికీ, అభిమానులు ఇప్పటికీ ఆమెను ఎంతగానో తలుచుకుంటారు.
అందానికే అందం మధుబాల
మధుబాలతో పాటు సినిమాల్లో అరంగేట్రం చేసిన రాజ్‌కపూర్ ఒక సందర్భంలో మధుబాల గురించి మాట్లాడుతూ... 'దేవుడు స్వయంగా తన చేతులతో పాలరాతి శిల్పాన్ని చెక్కినట్లు మధుబాలను సృష్టించారని'' అన్నారు.
రాజ్‌కపూర్ చేసిన ఈ వ్యాఖ్య ''బాలీవుడ్ టాప్ 20- సూపర్‌స్టార్స్ ఆఫ్ ఇండియా' పుస్తకంలో ప్రచురితమైంది. దీన్ని పెంగ్విన్ ఇండియా ప్రచురించగా, భాయ్‌చంద్ పటేల్ ఎడిటింగ్ చేశారు.
ఈ పుస్తకంలో పేర్కొన్న దాని ప్రకారం... ''ఒకసారి షూటింగ్ సమయంలో మధుబాలను చూడగానే, ఆ రోజుకు సార్థకత లభించినట్లుగా అనిపించిందని'' సినిమా రంగంలో తాను పనిచేసినప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే చెప్పారు.
షమ్మీ కపూర్, తన ఆత్మకథ 'షమ్మీ కపూర్: ద గేమ్ చేంజర్'లో ఒక అధ్యాయాన్ని మధుబాలకే అంకితం చేశారు. దానికి 'ఫెల్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ మధుబాల' అని పేరుపెట్టారు. ''మధు, ఇంకొకరితో ప్రేమలో ఉందని నాకు తెలుసు. అయినప్పటికీ నేను ఆమెను పిచ్చిగా ప్రేమించడం ప్రారంభించానని మీతో చెప్పాలనుకుంటున్నా. దీనికి ఎవరినీ నిందించలేం. ఎందుకంటే నేను ఆమె కన్నా అందమైన స్త్రీని ఇంతవరకు చూడలేదు'' అని ఆయన ఆ అధ్యాయంలో రాసుకొచ్చారు.

ఫొటో సోర్స్, MADHUR BHUSHAN
షమ్మీకపూర్ ఆత్మకథ 2011లో ప్రచురితమైంది. ''ఆరు దశాబ్దాల తర్వాత, ఈరోజుకు కూడా మధుబాల పేరు తలుచుకోగానే నా గుండె కొట్టుకోవడం ఆపేస్తుంది. ఆమె అందం ఎలాంటిదంటే... నా తొలి సినిమా 'రైల్ కా డబ్బా' సందర్భంగా ఆమెను చూస్తూ డైలాగ్స్ చెప్పడం కూడా మర్చిపోయేవాడిని'' అని ఆయన చెప్పుకొచ్చారు.
కేవలం 36 ఏళ్ల పాటే జీవించిన మధుబాల జీవితంలో చివరి తొమ్మిదేళ్లు కూడా ఇంటికే పరిమితమయ్యారు. నటించిన 66 చిత్రాలతోనే ఆమె అందరి మనస్సుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారు.
పుట్టుకతోనే ఆమె గుండెలో రంధ్రం ఉంది. వైద్యుల ప్రకారం... ఆ వ్యాధితో పోరాడటానికి ఆమెకు చాలా విశ్రాంతి అవసరం. కానీ ఆమె తండ్రి మాత్రం నిరంతరం పనిచేయాల్సిన విశ్రాంతి దొరకని రంగంలోకి ఆమెను తీసుకొచ్చారు.
నిజానికి తల్లిదండ్రులతో పాటు 11 మంది తోబుట్టువులున్న ఆమె కుటుంబంలో మధుబాల ఒక్కరే సంపాదించేవారు. ఆమె తండ్రి లాహోర్‌లోని ఇంపీరియల్ టొబాకో కంపెనీలో పని చేసేవారు. అక్కడ ఉద్యోగం మానేసి ఢిల్లీకి వచ్చారు. మధుబాలకు సినిమాల్లో పని దొరుకుతుందనే ఉద్దేశంతో వారు ముంబైకి మకాం మార్చారు.

ఫొటో సోర్స్, MADHUR BHUSHAN
ఆరేళ్ల వయస్సులోనే మధుబాల ఈ రంగంలో తన అడుగు మోపారు.
1957 ఫిల్మ్‌ఫేర్ సందర్భంగా ఒక మ్యాగజీన్... తమ గురించి ఏదైనా రాయాలని అప్పటి తరం సూపర్‌స్టార్లను కోరింది. మ్యాగజీన్ కోరిక మేరకు నర్గీస్, మీనా కుమారి, నూతన్, రాజ్ కపూర్, దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్, కిశోర్ కుమార్, అశోక్ కుమార్... ఇలా అందరూ ఒక సిరీస్‌లో తమ గురించి రాశారు.
మీ గురించి మధుబాల...
ఈ సిరీస్‌లో తన గురించి రాసేందుకు మధుబాల తిరస్కరించారు. దానికి క్షమాపణ కూడా చెప్పారు. ''నన్ను నేను కోల్పోయాను. ఇలాంటి పరిస్థితుల్లో నా గురించి నేను ఏం రాయాలి. నాకు తెలియని ఒక వ్యక్తి గురించి రాయాలని మీరు అడిగినట్లుగా నాకు అనిపిస్తోంది. ఈ కాలం... నన్ను నేను కలుసుకునే సమయాన్నే ఇవ్వలేదు. ఐదేళ్ల వయస్సున్నప్పుడు నా గురించి ఎవరూ అడగలేదు. నేను వచ్చి ఈ రంగుల లోకంలో పడ్డాను. 'మీ గురించి మీరు పూర్తిగా మర్చిపోవాలన్నదే' నేను సినిమా పరిశ్రమ నుంచి నేర్చుకున్న మొదటి పాఠం. మిమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోతేనే నటించగలరు. అలాంటప్పుడు, ఇంకా నా గురించి ఏం చెప్పగలను, ఏం రాయగలను'' అని ఆమె క్షమాపణ పత్రంలో రాసుకొచ్చారు.
మధుబాల సినీ జీవితంపై ఖతీజా అక్బర్ 'ఐ వాంట్ టు లివ్ - ద స్టోరీ ఆఫ్ మధుబాల' అనే పుస్తకాన్ని రాశారు. నటనలో క్రమశిక్షణ, నేర్చుకోవాలనే అభిరుచి పట్ల ఆమెకున్న తపనపై... ఆమె అందం ఎప్పుడూ ఆధిపత్యం ప్రదర్శించలేదనే విషయం ఈ పుస్తకాన్ని చదివినవారికి బాగా అర్థమవుతుంది.
ఆ కాలం నాటి సినిమా ప్రపంచంలో సమయానికి కంటే ముందే సెట్‌కు వచ్చే ఏకైక కళాకారిణి మధుబాల మాత్రమే. ఆరోగ్య కారణాల రీత్యా ఆమె రాత్రివేళల్లో షూటింగ్‌కు దూరంగా ఉండేవారు. అంతేకాకుండా కెరీర్ మొత్తంలో ఎప్పుడూ అవుట్‌డోర్ షూటింగ్‌లో ఆమె పాల్గొనలేదు. అయినప్పటికీ తన కాలంలోని అగ్రనాయికల్లో ఒకరిగా మధుబాల కొనసాగుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పని పట్ల ఆమె నిబద్ధత, పరిపూర్ణతను చూడాలనుకుంటే... మొగల్ ఎ ఆజమ్ సినిమాలోని ప్రేమ సన్నివేశాలను చూడండి. ఆ సినిమాలో ప్రిన్స్ సలీమ్, అనార్కలీని నెమలి ఫించంతో ఆటపట్టించే సన్నివేశం భారత సినిమా ప్రపంచంలోని అత్యంత రొమాంటిక్ సీన్లలో ఒకటిగా పరిగణిస్తారు.
దిలీప్ కుమార్-మధుబాల ప్రేమ కథ
భారతీయ సినిమా చరిత్రలో దిలీప్ కుమార్, మధుబాల జోడీని ఒకానొక సమయంలో 'మోస్ట్ రొమాంటిక్ కపుల్'గా పరిగణించేవారు. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. 1955లో 'ఇన్సానియత్' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా మధుబాల తొలిసారిగా దిలీప్ కుమార్‌తో కలిసి బయట కనిపించారు. ఈ ఒక్క సందర్భంలో మాత్రమే వీరిద్దరూ కలిసి బయట కనిపించారు.

ఫొటో సోర్స్, MUGHAL-E-AZAM
ఈ కార్యక్రమాన్ని జర్నలిస్ట్ కె. రజ్దాన్ కవర్ చేశారు. ''గతంలో ఎప్పుడూ లేనంత సంతోషంగా మధుబాల కనిపించారు. రాక్సీ సినిమా హాల్‌లో ప్రదర్శితమైన ఈ ప్రీమియర్ షో ఆసాంతం మధుబాల, దిలీప్ కుమార్ చేతిని పట్టుకొని కనిపించారు'' అని రజ్దాన్ రాశారు.
వీరిద్దరి గురించి షమ్మీ కపూర్ కూడా ప్రస్తావించారు. ''కేవలం మధుబాలను చూడటం కోసమే ముంబై నుంచి కారులో దిలీప్ కుమార్ పుణే వెళ్లేవారు. దూరంగా నిలబడి మధుబాలను చూసేవారు'' అని ఆయన అన్నారు.
మధుబాల, దిలీప్ కుమార్‌ల పెళ్లిని ఆమె తండ్రి వ్యతిరేకించారని అందరూ చెప్పుకుంటారు. చాలా సినిమా మ్యాగజైన్లు ఈ అంశానికి సంబంధించి చాలా కథనాలు రాశాయి. కానీ దిలీప్ కుమార్ తన ఆత్మకథ 'దిలీప్ కుమార్: ద సబ్‌స్టాన్స్ అండ్ ద షాడో'లో ఈ కథనాలకు భిన్నంగా చెప్పారు.
మధుబాల- దిలీప్ ఎలా విడిపోయారు?
''అందరూ చెప్పుకుంటున్న దానికి భిన్నంగా జరిగింది. మధుతో నా పెళ్లిని ఆమె తండ్రి వ్యతిరేకించలేదు. వారికి సొంత నిర్మాణ సంస్థ ఉంది. కాబట్టి ఒకే ఇంట్లో నుంచి ఇద్దరు స్టార్ల సినిమాలను నిర్మించవచ్చు అని ఆయన చాలా సంతోషపడ్డారు. దిలీప్ కుమార్, మధుబాల ఇద్దరూ తమ కెరీర్ ఆసాంతం తన సినిమాల్లో పనిచేయాలని ఆయన కోరుకున్నారు'' అని దిలీప్ కుమార్ పేర్కొన్నారు.
మరి ఈ ప్రేమ కథ, పెళ్లిపీటల వరకు ఎందుకు చేరలేకపోయింది? దీని గురించి కూడా దిలీప్ కుమార్ రాసుకొచ్చారు. ''మధు ద్వారా ఆమె తండ్రి ఆలోచనలు నాకు తెలిశాయి. తర్వాత దీని గురించి చాలా సార్లు ఆయనతో మాట్లాడాను. ''నా పనులను నా ఇష్టప్రకారమే చేసుకుంటాను. నా ఇష్టప్రకారమే ప్రాజెక్టులను ఎంచుకుంటాను. నా సొంత నిర్మాణ సంస్థ ఉన్నప్పటికీ నేను నా ప్రకారమే నడుచుకుంటాను' అని వారిద్దరికీ స్పష్టంగా చెప్పాను'' అని దిలీప్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, MUGAL E AZAM TWITTER @FILM HISTORY PICS
''అయితే నా ఆలోచనలు మధుబాల తండ్రి అయాతుల్లా ఖాన్‌కు నచ్చలేదు. నన్ను మొండివాడిగా, పంతం ఉన్నవాడిగా ఆయన అనుకోవడం ప్రారంభించారు'' అని దిలీప్ చెప్పారు.
దిలీప్ పేర్కొన్నదాని ప్రకారం, మధుబాల ఎప్పుడూ తన తండ్రి వైపే మొగ్గేవారు. పెళ్లి తర్వాత అన్నీ సర్దుకుంటాయని ఆమె ఎప్పుడూ దిలీప్‌తో చెబుతుండేవారు.
దిలీప్ కుమార్ కూడా మధుబాలతో పెళ్లికి సిద్ధంగానే ఉన్నారు. 1956లో 'ఢాకే కీ మల్‌మల్' సినిమా షూటింగ్ సమయంలో మధుబాల దగ్గరికి వచ్చిన దిలీప్.... ''ఖాజీ కూడా ఎదురుచూస్తున్నారు. ఈరోజు మా ఇంట్లో పెళ్లి చేసుకుందాం'' అని అన్నారు. కానీ ఆయన మాటలకు మధుబాల ఏడ్వటం ప్రారంభించారు. ''ఈరోజు నువ్వు రాకుంటే... మళ్లీ నేనెప్పుడూ తిరిగి రాను. ఎప్పటికీ ఇది జరగదు'' అని దిలీప్ చెప్పి వెళ్లిపోయారు.
ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ మధుబాల దగ్గరికి దిలీప్ రాలేదు. ఆ తర్వాత 1957లో వీరిద్దరి మధ్య జరిగిన ఒక గొడవ వీరి ప్రేమను కూడా చంపేసింది.
1957లో 'నయా దౌర్' చిత్రం కోసం మధుబాల, దిలీప్ కుమార్‌లతో దర్శకుడు బీఆర్ చోప్రా ఒప్పందం చేసుకున్నారు. ఈ సినిమా అవుట్‌డోర్ షూటింగ్ భోపాల్, పుణేల్లో జరగాల్సి ఉంది. కానీ మధుబాలను భోపాల్ పంపించడానికి ఆమె తండ్రి నిరాకరించారు. అప్పటికీ బీఆర్ చోప్రా చాలావరకు సినిమాను పూర్తి చేశారు.

ఫొటో సోర్స్, MADHUR BHUSHAN
వృత్తిరీత్యా న్యాయవాది కూడా అయిన బీఆర్ చోప్రా, ఈ అంశాన్ని కోర్టు వరకు తీసుకెళ్లారు. అదే సమయంలో మధుబాల స్థానంలో వైజయంతిమాలను హీరోయిన్‌గా భర్తీ చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా, తాను మధుబాలను ప్రేమిస్తున్నానని, జీవితాంతం ఆమెనే ప్రేమిస్తుంటానని పేర్కొన్న దిలీప్ కుమార్... సినిమా విషయానికొచ్చేసరికి బీఆర్ చోప్రాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పారు.
''ఈ వివాదంలో సయోధ్య కుదర్చడానికి నా వంతుగా చాలా ప్రయత్నాలు చేశాను. కానీ ఎలాంటి ఫలితం లేదు. మొత్తంగా చూస్తే బీఆర్ చోప్రా వైపే న్యాయముందని అనిపించింది'' అని దిలీప్ తన ఆత్మకథలో పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత దిలీప్ కుమార్ ఇక ఎప్పటికీ తన వద్దకు రాలేడని మధుబాల గుర్తించారు.
కిశోర్ కుమార్‌తో పెళ్లి
ఈ గొడవ తర్వాతే పెళ్లి చేసుకోవాలని మధుబాల నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఆమె ఏదో ఒకరోజు కిశోర్ కుమార్‌ను వివాహం చేసుకుంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. మధుబాల, దిలీప్ కుమార్‌ల మధ్య దూరం పెరుగుతోన్న సమయంలోనే... కిశోర్ కుమార్ తన మొదటి భార్య రోమా దేవీతో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో కలిసి నటించారు.
ఈ కారణంగానే వీరిద్దరి మధ్య ఆకర్షణ ఏర్పడింది. దీంతో 1960లో కిశోర్ కుమార్, మధుబాల వివాహం చేసుకున్నారు. కానీ దిలీప్ కుమార్‌తో విడిపోవడం కంటే కూడా కిశోర్ కుమార్‌ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయమే మధుబాలను తీవ్రంగా బాధించింది.
మధుబాల అనారోగ్యం గురించి కిశోర్ కుమార్‌కు తెలుసు. కానీ దాని తీవ్రత గురించి ఆయనకు తెలియదు. చికిత్స కోసం ఆయన మధుబాలను లండన్ తీసుకెళ్లారు. గరిష్టంగా ఒకటి లేదా రెండు సంవత్సరాలకు మించి ఆమె బతకదని అక్కడి వైద్యులు స్పష్టం చేశారు.
లండన్ నుంచి తిరిగొచ్చాక మధుబాలను కిశోర్ కుమార్ ఆమె తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టారు. రోజూ బిజీగా ఉండటం వల్ల మధుబాలను సరిగ్గా చూసుకోలేనని ఆయన చెప్పారు. ఆ తర్వాత కూడా ఆయన మధుబాలను కలవడానికి మూడు, నాలుగు నెలలకు ఒకసారి వస్తూనే ఉండేవారు. కానీ ఆమెకు, కిశోర్ కుమార్ అవసరం అత్యంత ఎక్కువగా ఉన్న సమయంలో మాత్రం ఆమెను కలిసేందుకు కిశోర్ కుమార్‌కు సమయం దొరకలేదు.

ఫొటో సోర్స్, MADHUR BHUSHAN
ఇలాంటి పరిస్థితుల్లో ఆమె గుండె ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తూనే ఉంది. కానీ ఆమెలో మాత్రం జీవించాలనే కోరిక బలంగా ఉండేది. ఈ సంకల్పం కారణంగానే ఆమె చికిత్సకు సహకరిస్తూ 9 ఏళ్లు జీవించారు. కానీ ఆ తొమ్మిదేళ్లను ఆమె ఒంటరితనంతో గడిపారు. ఈ కష్టకాలంలో ఆమె బాగోగుల గురించి తెలుసుకోవడానికి కేవలం కొంతమంది మాత్రమే వారి ఇంటికి వచ్చేవారు. అందులో దిలీప్ కుమార్ కుటుంబీకులు కూడా ఉండేవారు.
'మొగల్ ఎ ఆజమ్' విడుదలైన వెంటనే మధుబాల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాని తర్వాత నాలుగేళ్ల పాటు కూడా ఆమె నటించిన సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే చివరి రోజుల్లో మధుబాల ఎలా ఉన్నారో అనే విషయంలో చాలా ఊహాగానాలు వచ్చాయి.
బాలీవుడ్ టాప్ 20- సూపర్‌స్టార్స్ ఆఫ్ ఇండియాలో మధుబాల చివరి రోజుల గురించి ప్రస్తావించారు. మధుబాల మరణించడానికి ఒకరోజు ముందు దిలీప్ కుమార్ సోదరి సయీదా ఖాన్ ఆమెను కలిశారు. అప్పటికి కూడా ఆమె అందంలో ఇసుమంతైనా లోటు లేదని సయీదా ఖాన్ పేర్కొన్నారు.
''సుదీర్ఘ కాలంగా వ్యాధితో పోరాడి ఆమె ఓడిపోయారు. కానీ ఆమె ముఖంలోని కాంతి మాత్రం తగ్గలేదు'' అని సయీదా ఖాన్ చెప్పారు.

ఫొటో సోర్స్, MADHUR BHUSHAN
బహుశా వ్యాధి కారణంగా మధుబాల ఆత్మ విశ్వాసం బలహీనపడొచ్చు. అందుకే ఆమె చివరి రోజుల్లో మేకప్ వేసుకోవడం ప్రారంభించారు. మధుబాల మరణానికి ఒకరోజు ముందు తనను కలిశానని సినీ దర్శకుడు శక్తి సామంతా చెప్పారు. ''తన సినీ కెరీర్ మొత్తంలో అతి తక్కువ మేకప్ వాడిన వ్యక్తిగా ఆమెకు పేరుంది. కానీ మరణానికి ముందు నేను చూసినప్పుడు మాత్రం ఆమె చాలా ఎక్కువ మేకప్‌లో కనిపించారు'' అని ఆయన చెప్పారు.
ఒకప్పుడు బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన ఆమెను ఇప్పటికీ సినీ ప్రేమికులు ఆరాధిస్తూనే ఉంటారు.

మధుబాల జ్ఞాపకార్థం భారతీయ తపాలా శాఖ, 2008 మార్చి 18న ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఈ సందర్భంగా సినీ నటుడు మనోజ్ కుమార్ మాట్లాడుతూ... ''మధుబాల మన దేశానికి తురుపు ముక్క. శతాబ్ధానికి ఒక మధుబాల మాత్రమే ఉంటుంది. ఆమెను ఎప్పుడు చూసిన నా గుండెలో గజల్స్ వినిపించేవి'' అని అన్నారు.

ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య
- ఏబీజీ షిప్‌యార్డ్ కేసు: ఇప్పటివరకు దేశంలో అతిపెద్ద బ్యాంక్ మోసం ఇదేనా, అసలేం జరిగింది?
- పదో తరగతి పాసైన వారికి ఉచిత శిక్షణ, రైల్వేలో ఉద్యోగ అవకాశం
- యుక్రెయిన్ యుద్ధ సమయంలో జరిగిన ఆత్మహత్యలు ఎందుకు రహస్యంగా మిగిలిపోయాయి
- వైజాగ్‌లోనూ ఓ ‘తాజ్‌మహల్’ ఉంది.. దాని వెనకున్న ప్రేమకథ ఇది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











