లతా మంగేష్కర్: ప్రధాని నెహ్రూతో కన్నీళ్లు పెట్టించినప్పుడు..

లతా మంగేష్కర్

ఫొటో సోర్స్, facebook/latha mangeshkar

    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జవహర్ లాల్ నెహ్రూ గురించి ఒక గొప్ప విషయం చెప్పుకునేవారు. ఆయన ఎప్పుడూ బహిరంగంగా కన్నీళ్లు పెట్టరని, అలా ఏడ్చేవారిని కూడా ఇష్టపడరని చెప్పేవారు.

కానీ 1963 జనవరి 27న లతా మంగేష్కర్ కవి ప్రదీప్ రాసిన "యే మేరే వతన్‌ కే లోగోం" పాట పాడినపుడు నెహ్రూ తన కన్నీళ్లు ఆపుకోలేకపోయారట.

పాట పూర్తైన తర్వాత స్టేజి వెనక లత కాఫీ తాగుతున్నారు. అక్కడకు వచ్చిన డైరెక్టర్ మహబూబ్ ఖాన్ లతతో "మిమ్మల్ని పండిట్ జీ పిలుస్తున్నారు" అన్నారు.

లతను తీసుకొచ్చిన మహబూబ్, "మా లత పాడిన పాట మీకు ఎలా ఉంది" అని ఆయన్ను అడిగారు. నెహ్రూ "చాలా బాగుంది. ఈ అమ్మాయి నా కళ్లలో నీళ్లు తెప్పించింది" అని లతను హత్తుకున్నారు.

వెంటనే ఆ పాట మాస్టర్ టేపును వివిధ భారతి స్టేషన్ చేర్చారు. రికార్డు సమయంలో హెచ్ఎంవీ దానిని రికార్డుగా మార్చి మార్కెట్లోకి తెచ్చింది. చూస్తూచూస్తూనే ఆ పాట ఒక విధంగా 'నేషనల్ రేజ్' అయ్యింది.

1964లో నెహ్రూ ముంబయి వచ్చినపుడు, లత ఆయన ముందు బ్రెబోర్న్ స్టేడియంలో ఆర్జూ సినిమాలోని ఒక పాట పాడారు. అప్పుడు నెహ్రూ ఆమె దగ్గరకు ఒక చీటీ పంపించి "యే మేరె వతన్ కే లోగోం" పాటను మరోసారి వినాలని కోరారు. దాంతో లత ఆ పాటను పూర్తిగా పాడారు.

లతా మంగేష్కర్

ఫొటో సోర్స్, facebook/LataMangeshkar

బరసాత్ సినిమాతో కెరీర్‌కు రెక్కలు

1949లో అందాజ్ రిలీజైన తర్వాత నుంచి మ్యూజిక్ చార్ట్‌లోని మొదటి ఐదు పాటల్లో ఎప్పుడూ లతా మంగేష్కర్ పేరే ఉండేది. అయితే లత 80వ ఏట అడుగుపెట్టినపుడు "రాజ్ కపూర్-నర్గిస్ సినిమా బరసాత్ వచ్చిన తర్వాతే తన కెరీర్‌కు రెక్కలు వచ్చాయని" స్వయంగా చెప్పుకున్నారు.

"1956లో నేను మెట్రో-మర్ఫీ తరఫున సంగీతకళాకారుల టాలెంట్ గుర్తించడం కోసం మేం మొత్తం భారతదేశం అంతా ట్రిప్ వేశాం. ప్రతిభలో లతా మంగేష్కర్ దరిదాపుల్లో ఉన్న వారిని ఒక్కరిని కూడా గుర్తించలేకపోయాం, లత మా కాలంలో పుట్టడం మా అదృష్టం" అని మదన్ మోహన్ గొప్ప నిజం చెప్పారు.

లతా మంగేష్కర్

ఫొటో సోర్స్, facebook/latha mangeshkar

ఫొటో క్యాప్షన్, బడే గులాం అలీ ఖాన్‌తో లతా మంగేష్కర్

బడే గులాం అలీ ఖాన్ అసూయ

నిజానికి 1948లో మహల్ రిలీజైన సమయానికి గీతా రాయ్ మినహా లత ప్రత్యర్థులు సంషాద్ బేగం, జోహ్రాబాయీ అంబాలావాలీ, పారుల్ ఘోష్, అమీర్ బాయీ కర్నాటకీ ఒక్కొక్కరుగా ఆమె దారి నుంచి పక్కు వెళ్లిపోయారు.

1950లో ఆమె పాటలు పాడుతున్న సమయంలో ఆల్ ఇండియా రేడియోలో సినిమా పాటలు వినిపించేవారు కాదు. అప్పట్లో రేడియో సిలోన్ కూడా లేదు. భారతీయులు మొదటిసారి రేడియో గోవాలో లత గొంతు విన్నారు.

గోవా అప్పట్లో పోర్చుగీసు వారి అదీనంలో ఉండేది. భారత సైన్యం 1961లో దానిని విముక్తి కల్పించింది. ప్రముఖ శాస్త్రీయ గాయకుడు పండిట్ జస్‌రాజ్ ఒక ఆసక్తికర విషయం కూడా చెప్పారు.

"ఒకసారి నేను బడే గులాం అలీ ఖాన్‌ను కలవడానికి అమృత్‌సర్ వెళ్లాను. మేం మాట్లాడుతుంటే, ట్రాన్సిస్టర్‌లో లత పాడిన ఒక పాట మొదలైంది. నాతో మాట్లాడుతున్న ఖాన్ గారు హఠాత్తుగా మాట ఆపేశారు. పాట పూర్తయిన తర్వాత "ఖర్మ, ఒక్కసారి కూడా, అపస్వరం ఉండదేంటి" అన్నారు. ఆ వ్యాఖ్యలో తండ్రి ప్రేమ ఉంది, ఒక కళాకారుడి అసూయ కూడా ఉంది" అన్నారు.

लता मंगेशकर, Lata Mangeshkar

ఫొటో సోర్స్, NIYOGI BOOKS

ఫొటో క్యాప్షన్, కుటుంబ సభ్యులతో లతా మంగేష్కర్ (చిన్ననాటి ఫొటో)

ఐదేళ్ల వయసులో ప్రతిభ గుర్తించిన తండ్రి

లత పాటలు పాడడం ఐదేళ్ల వయసులో మొదలైంది. నస్రీన్ మున్నీ కబీర్ రాసిన "లతా ఇన్ హెర్ అలోన్ వాయిస్‌"లో ఆమె స్వయంగా తన తండ్రి దీనానాథ్ మంగేష్కర్ పాడడం వినేదాన్నని, కానీ ఆయన ముందు పాడేందుకు ధైర్యం చాలేది కాదని చెప్పుకున్నారు.

"ఒకసారి ఆయన తన శిష్యుడికి పురియా ధనశ్రీ రాగం నేర్పిస్తున్నారు. ఎందుకో, ఆయన కాసేపు ఆ గది నుంచి బయటకు వెళ్లారు. నేను నాన్న వాళ్ల శిష్యుడి పాట విన్నాను. ఆ అబ్బాయి సరిగా పాడ్డం లేదని నాకు అనిపించింది. నేను తన దగ్గరకు వళ్లి అతడి ముందు ఆ రాగం పాడి, ఇలా పాడాలని చెప్పా. అప్పటికే అక్కడకు వచ్చిన మా నాన్న, నేను పాడేది తలుపు చాటు నుంచి నేను పాడేది విన్నారు. వెంటనే, మా అమ్మను పిలిచి, 'మన ఇంట్లోనే ఒక మంచి గాయని ఉందనే విషయం మనకే తెలీదే'. అన్నారు. తర్వాత రోజు ఉదయం ఆరు గంటలకు నాన్న నన్ను లేపి, తంబుర తీసుకో.. ఈరోజు నుంచి సంగీతం నేర్చుకుంటావ్ అన్నారు. ఆయన పురియా ధనశ్రీ రాగం నుంచి ప్రారంభించారు. ఆప్పుడు నా వయసు ఐదేళ్లు". అని లత అందులో చెప్పారు.

అనిత్ బిస్వాస్‌తో లతా మంగేష్కర్

ఫొటో సోర్స్, LATA CALENDER

ఫొటో క్యాప్షన్, అనిత్ బిస్వాస్‌తో లతా మంగేష్కర్

గులాం హైదర్, అనిల్ బిస్వాస్ నుంచి ఎంతో నేర్చుకున్నారు

లతా మంగేష్కర్ ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లతో పనిచేశారు. కానీ గులాం హైదర్ అంటే ఆమె మనసులో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆయన ఆమెకు ఒక బీట్‌పై వచ్చే సాహిత్యానికి కాస్త ఎక్కువ బరువు ఇవ్వాలని, దానివల్ల పాట లేస్తుందని కిటుకు చెప్పారు.

అనిల్ బిశ్వాస్ లతకు శ్వాసపై నియంత్రణను నేర్పించారు. హరీశ్ భిమానీ తన "లతా దీదీ అజీబ్ దాస్తా హై" అనే పుస్తకంలో అనిల్ జీ పాట పాడే సమయంలో శ్వాస ఎక్కడ పీల్చుకోవాలో లతకు చాలా వివరంగా చెప్పేవారు. దానివల్ల వినే వారికి ఇబ్బందిగా ఉండదు. "రెండు మాటల మధ్య శ్వాస తీసుకునే సమయంలో నోటిని మైక్రోఫోన్‌కు దూరంగా తీసుకెళ్లు, శ్వాస తీసుకోగానే వెంటనే అదే స్థానంలోకి వచ్చి, పాట కొనసాగించు" అని అనిల్ బిశ్వాస్ చెప్పారు.

లతా మంగేష్కర్

ఫొటో సోర్స్, facebook/latha mangeshkar

ఫొటో క్యాప్షన్, దిలీప్ కుమార్‌తో లతా మంగేష్కర్

దిలీప్ కుమార్ సూచనతో ఉచ్ఛారణకు మెరుగులు

లత గొంతులో తీయదనంతోపాటూ ఉర్దూలో ఆమెకు ఉన్న పాండిత్యం కూడా అందరి దృష్టీ ఆమెపై పడేలా చేసింది. ఆ ఘనత నటుడు దిలీప్ కుమార్ కే వెళ్తుంది.

హరీశ్ భిమానీ తన పుస్తకంలో ఈ విషయం కూడా చెప్పారు. ఒక రోజు అనిల్ బిశ్వాస్, లతా ముంబై లోకల్ ట్రైన్లో గోరెగావ్ వెళ్తున్నారు. అనుకోకుండా అదే ట్రైన్లో బాంద్రా స్టేషన్ నుంచి దిలీ కుమార్ ఎక్కారు. అనిల్ బిశ్వాస్ కొత్త గాయనిని ఆయనకు పరిచయం చేయగానే, దిలీప్ కుమార్ "మరాఠీ వాళ్ల నోటి నుంచి పప్పు, అన్నం వాసన వస్తుంది, వాళ్ల ఉర్దూ పాటలేం వినగలం" అన్నారు.

దాన్ని లత ఒక సవాలుగా తీసుకున్నారు. ఆ తర్వాత షఫీ ఆమెకు ఒక మౌల్వీని నియమించారు. ఆయన పేరు మహబూబ్. లత ఆయన దగ్గర ఉర్దూ నేర్చుకున్నారు.

కొంతకాలం తర్వాత లాహోర్‌ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ప్రముఖ సంగీత దర్శకురాలు జధన్ బాయీ ఆమె కూతురు నర్గిస్ కూడా ఉన్నారు.

లత అక్కడ ఒక స్టూడియోలో ఒక పాట పాడారు. రికార్డింగ్ తర్వాత లత ఉర్దూ ఉచ్ఛారణకు ముగ్ధులైన జధన్ బాయీ ఆమెను పిలిపించి "మాషా అల్లా, ఏం పాడావమ్మా.. ఇలాంటి ఉచ్ఛారణ ఎవరికీ లేదు తెలుసా" అన్నారట.

లతా మంగేష్కర్, Lata Mangeshkar

ఫొటో సోర్స్, NIYOGI BOOKS

మహబూబ్ ఖాన్ ఫోన్లో రసిక్ బలామా పాడి వినిపించారు

లత గొంతులో ఉన్న మరో ప్రత్యేకత ఆది ఎప్పుడూ యవ్వనంగానే అనిపిస్తుంది. 1961లో వచ్చిన జంగ్లీ సినిమాలో సైరా బాను కోసం 'కాశ్మీర్ కీ కలీ హు' పాట పాడినప్పుడు ఆమె గొంతు ఎంత మత్తుగా అనిపించిందో, పన్నెండేళ్ల తర్వాత వచ్చిన అనామికాలో జయబాదురికి 'బాహోంమే చలే ఆవో' పాడినప్పుడు కూడా ఆమె గొంతు అంతే హస్కీగా అనిపించింది.

ఆమె గురించి ఒక ఘటన చాలా పాపులల్ అయ్యింది. 1958లో మహబూబ్ ఖాన్ ఆస్కార్ వేడుకల్లో పాల్గొనడానికి లాస్ ఏంజిల్స్ వెళ్లారు. అక్కడ కార్యక్రమం తర్వాత రెండు రోజులకు ఆయన గుండెపోటుకు గురయ్యారు.

అప్పుడు జరిగిన దాని గురించి లతా మంగేష్కర్ జీవిత చరిత్ర రాసిన రాజు భారతన్ "లత ఆయనకు బొంబాయి నుంచి ఫోన్ చేశారు. క్షేమసమాచారాలు అడిగిన తర్వాత మహబూబ్ ఆమెతో 'నాకు మీ పాట వినాలని చాలా కోరికగా ఉంది అన్నారు. కానీ, ఇక్కడ మీ పాట రికార్డ్ ఎక్కడనుంచి తీసుకురాను' అన్నారు. లత ఆయనతో 'మీకు ఏ పాట వినాలనుంది' అని అడిగారు. తర్వాత ఆయన కోరిన పాటను ఆమె టెలిఫోన్లోనే వినిపించారు. ఒక వారం తర్వాత లత మరోసారి అదే పాటను మహబూబ్‌ ఖాన్‌కు వినిపించారు. ఆయన ఆరోగ్యం కుదురుకోడానికి ఆ పాట ఎంత ఉపయోగడిందో, ఆ దేవుడికే తెలియాలి. అప్పటి నుంచి లతకు ఆ గీతం చాలా ప్రత్యేకం అయ్యింది" అని చెప్పారు.

లతా మంగేష్కర్

ఫొటో సోర్స్, facebook/latha mangeshkar

వాఘా సరిహద్దులో నూర్జహాన్, లతా భేటీ

మొదట భారత్‌లో ఉండి తర్వాత పాకిస్తాన్ వెళ్లిపోయిన నూర్జహాన్, లతా మంగేష్కర్ మంచి స్నేహితులు. ఒకసారి లత 1952లో అమృత్‌సర్ వెళ్లినపుడు, నూర్జహాన్‌ను కలిస్తే బాగుంటుందని అనుకున్నారు. అప్పుడు నూర్జహాన్ రెండు గంటల దూరంలో ఉన్న లాహోర్‌లో ఉండేవారు. ఇద్దరూ గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుకున్న తర్వాత భారత్, పాకిస్తాన్ సరిహద్దు దగ్గర కలవాలని నిర్ణయించుకున్నారు.

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రామచంద్రన్ తన ఆత్మకథలో "నేను నాకున్న పరిచయాలతో ఇద్దరూ కలిసే ఏర్పాట్లు చేశాను. వాఘా సరిహద్దు దగ్గర సైనిక భాషలో 'నో మ్యాన్స్ లాండ్' అనే దగ్గర ఇద్దరూ కలిశారు. నూర్జహాన్ లతను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎంతోకాలం విడిపోయిన స్నేహితుల్లా ఇద్దరూ లాగి హత్తుకున్నారు. ఇద్దరికీ కన్నీళ్లు ఆగడం లేదు. అది చూసి మా కళ్లు కూడా చెమర్చాయి. రెండు వైపులా ఉన్న సైనికులు కూడా ఏడవడం మొదలుపెట్టారు.

"నూర్జహాన్ లత కోసం లాహోర్ బిరియానీ, స్వీట్స్ తీసుకొచ్చారు. సంగీతానికి ఎలాంటి అడ్డంకులూ ఉండవని ఇది నిరూపిస్తుంది" అని ఆయన అందులో చెప్పారు.

లతా మంగేష్కర్

ఫొటో సోర్స్, facebook

మహమ్మద్ రఫీతో అభిప్రాయబేధాలు

లతా మంగేష్కర్ ఎంతోమంది గాయకులతో పాడారు. కానీ మహమ్మద్ రఫీ, ఆమె కలిసి పాడిన పాటలు చాలామందికి ఇష్టం దాని గురించి మాట్లాడుతూ లత ఒకసారి ఆసక్తికర విషయం చెప్పారు. "ఒకసారి నేను, రఫీ గారు స్టేజిమీద పాడుతున్నాం. ఒక పాట లైన్ ఆయన తప్పు పాడారు. దాంతో, జనం గట్టిగా నవ్వారు. రఫీ గారు కూడా నవ్వడంతో నాక్కూడా నవ్వొచ్చింది. దాంతో మేం ఆ పాట పూర్తి చేయలేకపోయాం" అన్నారు.

60 దశకంలో పాటల రాయల్టీ విషయంలో లత, రఫీ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. ఆ గొడవలో ముకేష్, తలత్ మహమూద్, కిశోర్ కుమార్, మన్నాడే లత వైపు, ఆశా బోస్లే, మహమ్మద్ రఫీ ఒక వైపు ఉండేవారు. నాలుగేళ్ల వరకూ రెండు గ్రూపులో ఒకరినొకరు 'బాయ్ కాట్' చేశాయి. తర్వాత సచిన్ దేవ్ బర్మన్ ఇద్దరి మధ్యా సయోధ్య కుదిర్చారు.

లతా మంగేష్కర్

ఫొటో సోర్స్, facebook

సచిన్ దేవ్ బర్మన్ లతకు కిళ్లీ ఇచ్చారు

సచిన్ దేవ్ బర్మన్‌కు కూడా లత అంటే చాలా అభిమానం, ఆమె పాట తనకు సంతోషం కలిగిస్తే, ఆయన ఆమె భుజం తట్టి, కిళ్లీ ఇచ్చేవారు. ఆయనకు కిళ్లీ అంటే చాలా ఇష్టం. ఆయన తనతో ఎప్పుడూ ఒక పాన్ ఉంచుకునేవారు. కానీ, తన కిళ్లీలు వేరే ఎవరికీ ఇచ్చేవారు కాదు. బర్మన్ ఎవరికైనా కిళ్లీ ఇచ్చారు అంటే, వారు ఆయనను చాలా సంతోషపరిచారని అర్థం.

కానీ ఒకసారి సచిన్ దేవ్ బర్మన్, లతా మంగేష్కర్ మధ్య గొడవొచ్చింది. ఒక సినిమాలో లత పాడిన పాట సాఫ్ట్ మూడ్‌లో ఉంటే బాగుంటుందని సచిన్ దేవ్ అనుకున్నారు. లత ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను అని చెప్పి పంపారు. కానీ లత డేట్స్ కోసం వెళ్లిన వ్యక్తి ఆయనకు లత పాట పాడనని చెప్పారన్నారు.

దాంతో, సచిన్ దేవ్ బర్మన్‌కు కోపం వచ్చింది. ఇక 'లతతో ఎప్పటికీ పనిచేయనని' అన్నారు. లత కూడా ఆయనకు ఫోన్ చేసి 'మీరు అలా ప్రకటించాల్సిన అవసరం లేదు.. నేనే మీతో పనిచేయడం లేదు'. అన్నారు. చాలా ఏళ్ల తర్వాత ఇద్దరి మధ్యా అపోహలు తొలగిపోయాయి. మళ్లీ లత ఆయన కోసం పాటలు పాడారు.

లతా మంగేష్కర్

ఫొటో సోర్స్, facebook/latha

క్రికెట్ అంటే ఇష్టం

లతా మంగేష్కర్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆమె మొదటిసారి 1946లో ముంబయిలోని బ్రెబోర్న్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ చూశారు. ఆమె ఇంగ్లండ్‌లోని ఓవెల్ మైదానంలో ఇంగ్లండ్-పాకిస్తాన్ మధ్య కూడా ఒక టెస్ట్ మ్యాచ్ చూశారు.

గ్రేట్ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మాన్ ఆమెకు తన సంతకం ఉన్న ఒక ఫొటోను గిఫ్ట్ ఇచ్చాడు.

లతా మంగేష్కర్ దగ్గర మంచి కార్ల కలెక్షన్ కూడా ఉంది. ఆమె తన మొదట కొన్న కారు గ్రే కలర్ హిల్‌మెన్. దాని కోసం ఆమె అప్పట్లోనే 8 వేల రూపాయలు ఖర్చు చేశారు.

మొదట్లో ఆమెకు ఒక్కో పాటకు 200 నుంచి 500 రూపాయలు ఇచ్చేవారు. 1964లో సంగమ్ సినిమాలో ప్రతి పాటకు ఆమె 2 వేల రూపాయలు తీసుకున్నారు. తర్వాత హిల్‌మెన్ అమ్మేసి బ్లూ షెవర్లే కారు కొన్నారు.

యశ్ చోప్రా సినిమా వీర్ జారా కోసం పాట పాడినపుడు ఆయన పారితోషికం ఇవ్వబోతే "మీరు నా సోదరుడి లాంటి వారని చెప్పిన లత డబ్బు వద్దన్నారు.

ఆ సినిమా రిలీజయ్యాక యశ్ చోప్రా లతకు ఒక మెర్సిడెస్ కారును గిఫ్ట్‌గా పంపించారు. ఆమె తన జీవితాంతం ఆ కారులోనే ప్రయాణించారు.

వీడియో క్యాప్షన్, లతా మంగేష్కర్ సంగీత ప్రస్థానం ఇలా సాగింది

వజ్రాలు, డిటెక్టివ్ నవలలంటే ఇష్టం

లతా మంగేష్కర్‌కు వజ్రాలు, పచ్చలంటే చాలా ఇష్టం. ఆమె తన సంపాదనతో 1948లో 700 రూపాయలు పెట్టి ఒక వజ్రపుటుంగరం చేయించుకున్నారు. ఆమెకు బంగారం అన్నా కూడా ఇష్టమే. బంగారు కాలిపట్టీలు ధరించేవారు. లతకు డిటెక్టివ్ నవలలు ఎక్కువ చదివేవారు. ఆమె దగ్గర షెర్లాక్ హోమ్స్ కలెక్షన్ ఉంది.

లతా మంగేష్కర్‌కు ఇష్టమైన స్వీట్ జిలేబీ. ఒకప్పుడు ఆమెకు ఇండోర్ గులాబ్ జామూన్, దహీ వడాను బాగా తినేవారు. గోవా చేపల కూర, సముద్ర రొయ్యలు తినడం కూడా ఇష్టమే. లత చేతి మటన్ తిన్న వారు దాన్ని ఎప్పటికీ మర్చిపోలేకపోయారు. ఆమెకు పానీపూరీ కూడా ఇష్టమనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

2001లో భారత రత్న

ఇప్పుడు భారత్‌లో లతా మంగేష్కర్‌కు పూజలు చేసే అభిమానులు కూడా ఉన్నారు. చాలా మంది ఆమె గళాన్ని దేవుడు ఇచ్చిన అద్భుత వరంగా భావిస్తారు. 1989లో లత సినీ రంగంలో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కేను అందుకున్నారు. 2001లో ఆమెను భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నతో గౌరవించారు.

వీడియో క్యాప్షన్, ఇయర్ ఫోన్సుతో ఎక్కువ సేపు మ్యూజిక్ వినడం ప్రమాదకరం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)