స్కూల్స్ రీఓపెనింగ్: 600 రోజులుగా జూమ్‌లోనే పాఠాలు, 4 కోట్ల మంది చిన్నారుల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడనుంది

పాఠశాలల మూసివేత కారణంగా భారతదేశ వ్యాప్తంగా 29.8కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారని యూఎన్ నివేదిక తెలిపింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాఠశాలల మూసివేత కారణంగా భారతదేశ వ్యాప్తంగా 29.8కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారని యూఎన్ నివేదిక తెలిపింది

మరికొన్ని నెలల్లో స్కూలుకు వెళ్లాలని చెప్పడంతో సీను జెబరాజ్‌ మూడేళ్ల కూతురు చాలా ఉత్సాహంగా కనిపించింది. ఇది , 2019 డిసెంబర్ నాటి మాట.

కానీ ఆమె తరగతులు ప్రారంభమయ్యే సమయానికి, కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా భారత్‌లో కట్టుదిట్టమైన లాక్‌డౌన్‌ను విధించారు.

కొన్ని నెలల తర్వాత లాక్‌డౌన్‌ను ఎత్తేసినప్పటికీ దేశవ్యాప్తంగా పాఠశాలలు మాత్రం తెరచుకోలేదు. కొన్ని రాష్ట్రాలు గత రెండేళ్లుగా విద్యాసంస్థలను తెరిచేందుకు ముందుకొస్తున్నప్పటికీ, సరిగ్గా అదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభణతో వారి ప్రయత్నాలు నీరుగారిపోతున్నాయి.

సీను జెబరాజ్ కూతురుకు ఇప్పుడు ఐదేళ్లు. గత 600 రోజులుగా జూమ్‌లో పాఠాలు వింటోన్న ఆమె ఇప్పుడు దాన్నే పాఠశాలగా భావిస్తున్నారు. కరోనా వల్ల పాఠశాలలు మూత పడటంతో ప్రీ-ప్రైమరీ స్థాయిలో ప్రభావితమైన 4 కోట్ల 20 లక్షల మంది భారతీయ చిన్నారుల్లో ఆమె కూడా ఒకరు.

''స్కూలులో తోటి విద్యార్థులతో కలిసిమెలిసి తిరుగుతూ నా కూతురు ఎప్పుడు చదువుకుంటుందా అని నేను ఎదురుచూస్తున్నా. పాఠశాల మిత్రులంటే, జూమ్‌ యాప్‌లో చిన్న చిన్న బాక్సుల్లో కనిపించేవారని నా కూతురు అనుకుంటుంది'' అని జెబరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

వీడియో క్యాప్షన్, అర్చకత్వం చేస్తూనే 9 పీజీలు పూర్తి చేసిన పూజారి

ఎట్టకేలకు జెబరాజ్ కూతురికి పాఠశాలలో తన తోటి విద్యార్థులను కలిసే అవకాశం దక్కనుంది. జెబరాజ్ కుటుంబం దేశ రాజధాని దిల్లీలో నివసిస్తారు. ఈ నెల నుంచి దిల్లీలో పాఠశాలలు, కాలేజీలు తెరచుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి.

పాఠశాలకు ఇన్నాళ్లు పిల్లలు దూరం కావడం వల్ల వారి అభ్యాసన ఫలితాలు గణనీయంగా ప్రభావితమయ్యామని నిపుణులు అంటున్నారు.

''ఒకటో తరగతిలో విద్యార్థి సరిగ్గా నేర్చుకోలేకపోతే, దాని ప్రభావం తర్వాతి తరగతులపై కూడా పడుతుంది'' అని ఎపిడెమాలజిస్ట్, డాక్టర్ చంద్రకాంత్ లహరియా పేర్కొన్నారు. పాఠశాలలను తిరిగి తెరవాలనే వాదనకు ఆయన మద్దతునిస్తున్నారు.

చిన్న తరగతుల్లోని విద్యార్థులకు, వారిస్థాయిలో తగిన విద్యను అందించకపోతే... దీర్ఘకాలంలో వారి అభ్యసనంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు.

పాఠశాలలు మూసివేయడంతో లక్షలాది మంది పిల్లలు విద్యకు దూరమయ్యారు
ఫొటో క్యాప్షన్, పాఠశాలలు మూసివేయడంతో లక్షలాది మంది పిల్లలు విద్యకు దూరమయ్యారు

ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, సరైన ఇంటర్నెట్ సౌకర్యం లేని లక్షలాది మంది పిల్లలపై ఆన్‌లైన్ తరగతులు తీవ్ర ప్రభావం చూపించాయి.

భారత్‌లో దీర్ఘకాలంగా పాఠశాలలను మూసివేయడం వల్ల... పేద విద్యార్థులు విపత్కర పర్యావసనాలను ఎదుర్కొనేందుకు దారితీసిందని గతేడాది ఆగస్టులో ఆర్థికవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.

1400 మంది చిన్నారులపై చేసిన ఈ సర్వేలో దాదాపు సగం మంది విద్యార్థులు కొన్ని పదాలకు మించి చదువలేకపోతున్నారని తెలిసింది.

విద్యావ్యవస్థలో తలెత్తిన ఈ సమస్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం గుర్తించినట్లే అనిపించింది. కానీ తాజాగా పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్ సందర్భంగా ఈ సమస్యకు మోదీ సర్కారు చూపించిన పరిష్కారం, నిపుణులకు అసంతృప్తికి గురి చేసింది.

పాఠశాలలు మూసివేయడం వల్ల మారుమూల గ్రామాల్లోని పిల్లలు, పేద వర్గాలకు చెందిన విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని పేర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్... విద్యా టీవీ చానెళ్ల సంఖ్యను 200కు పెంచడం ద్వారా స్థానిక భాషల్లో అనుబంధ విద్యను ప్రభుత్వం అందజేస్తుందని ప్రకటించారు.

విద్యుత్ సౌకర్యం పరిమితంగా ఉండే ప్రాంతాల్లోని పిల్లలు ఈ టీవీ చానెళ్లను ఎలా చూడగలుగుతారు? వాటి ద్వారా ఎలా లబ్ధి పొందుతారనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలింది.

నేర్చుకోవడాన్ని మర్చిపోయారు...

కాస్త మెరుగైన సౌకర్యాలున్న విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడం చాలా సులభమైన పని. కానీ జూమ్ తరగతుల్లో విద్యార్థులు శ్రద్ధగా చదువలేకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు.

''ఆన్‌లైన్ తరగతుల సందర్భంగా చాలామంది విద్యార్థులు కెమెరాలు ఆన్ చేయడం ఆపేశారు. ఆన్‌లైన్ విద్యా విధానంపై వారికి ఆసక్తి లేదనడానికి, ఈ విధానంలో విద్యార్థులు శ్రద్ధ చూపలేకపోతున్నారని చెప్పడానికి ఇదో నిదర్శనం'' అని తమిళనాడులోని కొడైకెనాల్ ఇంటర్నేషనల్ స్కూల్, చైల్డ్ కౌన్సిలర్ రుత్ మేరీ చెప్పారు.

ఆన్‌లైన్ బోధన, ఉపాధ్యాయులకు కూడా కష్టాలు తెచ్చిపెట్టిందని ఆమె అన్నారు. చిన్నారుల కదలికలు, వారి చూపులను బట్టి వారు ఆసక్తిగా పాఠం వినడం లేదని ఉపాధ్యాయులకు తెలిసిపోతోంది. 'స్క్రీన్ వైపు చూడండి' అంటూ వారిని తరచుగా హెచ్చరించాల్సి వస్తోంది.

మాలతీ ఖవాస్‌, ఐదేళ్ల కుమారుడు 2020 నుంచి ఆన్‌లైన్ తరగతులకు హాజరు అవుతున్నారు. 30 నిమిషాల ఆన్‌లైన్ తరగతికి ఆ పిల్లవాడిని అలవాటు చేసేందుకు ఉపాధ్యాయులు చాలా ప్రయత్నించారు.

''అర్ధగంట పాటు విద్యార్థి దృష్టిని పాఠం వైపు ఆకర్షించేందుకు ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడ్డారు'' అని రుత్ మేరీ చెప్పారు.

ఐదేళ్లు, ఆపై వయస్సున్న విద్యార్థులు వారి చుట్టూ ఇతర పిల్లలు ఉన్నప్పుడే బాగా నేర్చుకుంటారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఐదేళ్లు, ఆపై వయస్సున్న విద్యార్థులు వారి చుట్టూ ఇతర పిల్లలు ఉన్నప్పుడే బాగా నేర్చుకుంటారు

ఐదేళ్లు, ఆపై వయస్సున్న విద్యార్థులు వారి చుట్టూ ఇతర పిల్లలు ఉన్నప్పుడే బాగా నేర్చుకుంటారని చైల్డ్ కౌన్సిలర్ మరిజా సితార్ చెప్పారు.

''ఆటలు ఆడుకునే సమయంలో పిల్లలు సామాజిక నైపుణ్యాలను, సమస్యలను ఎదుర్కొనే పరిష్కార మార్గాలను నేర్చుకుంటారు. తోటివారికి దూరంగా, కేవలం ఇంటి వాతావరణంలో పిల్లలు ఈ సామర్థ్యాలను నేర్చుకోలేరు'' అని ఆమె చెప్పారు.

''మా పిల్లలు పాఠాలు నేర్చుకునేలా చేయడానికి ఉపాధ్యాయులు శక్తిమేర ప్రయత్నిస్తారని'' ఖవాస్ చెప్పారు.

''కానీ మా పిల్లలు తరగతి గదిలో పాఠాలు వినడంతో పాటు సామాజిక నైపుణ్యాలను, స్నేహ బంధాలను ఏర్పరచుకోవాలని మేం ఆశిస్తున్నాం. ఆన్‌లైన్ తరగతుల వల్ల వారు వీటిని పొందడం లేదు'' అని ఆమె పేర్కొన్నారు.

ఆన్‌లైన్ తరగతులపై పిల్లలు శ్రద్ధ వహించేలా చేయడం, వారిని చదివించడం వంటి అంశాలతో ఏర్పడిన ఒత్తిడితో తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

''తల్లిదండ్రులు ఒత్తిడి ఎదుర్కొన్నప్పుడు దాని ప్రభావం పిల్లలపై పడటం ఖాయం'' అని ఖవాస్ చెప్పారు.

''నా ఐదేళ్ల పిల్లవాడు ఏడుస్తూ కూర్చున్నాడు. రాయడంలో అతనికి నేను సహాయ చేయలేకపోయాను ఎందుకంటే నేను శిక్షణ పొందిన ఉపాధ్యాయురాల్ని కాదు'' అని ఆమె తన పరిస్థితిని వివరించారు.

చివరకు తన పిల్లవాడికి సహాయం చేయాల్సిందిగా కోరుతూ టీచర్ ట్రైనింగ్ పొందిన తన సోదరిని ఆశ్రయించానని ఆమె చెప్పారు. కానీ అందరికీ ఇలాంటి సౌకర్యం అందుబాటులో ఉండదని ఖవాస్ పేర్కొన్నారు.

ఎట్టకేలకు పాఠశాలలు పున: ప్రారంభం కానుండటంతో జెబరాజ్, ఖవాస్ వంటి ఎందరో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

''నా కూతురుకు స్కూల్ వాతావరణం వింతగా, కష్టంగా అనిపిస్తుందేమో.. ఆ వాతావరణానికి అలవాటుపడే వరకు ఆమెకు కొంత బెరుకుగానే ఉంటుంది'' అని జెబరాజ్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రా యూనివర్సీటిలో 2,663 తాళపత్ర గ్రంథాలు.. వీటిలో ఏముంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)