గావ్‌కావ్: ‘ప్రపంచంలో అత్యంత కష్టమైన పరీక్ష’కు చైనా విద్యార్థులు ఎలా సిద్ధమవుతారో తెలుసా?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, కార్ల్స్ సెరానో
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
చైనాలో ఏటా రెండు రోజులు ఉత్కంఠ రాజ్యమేలుతుంది. ఈ రెండు రోజులే కోటి మంది టీనేజీ యువత భవిష్యత్‌ను శాశిస్తాయి.
ఈ ఏడాది జులై ఏడు, ఎనిమిది తేదీల్లో కోటి ఏడు లక్షల మంది చైనా హైస్కూల్ విద్యార్థులు గావ్‌కావ్ పరీక్ష రాస్తారు. చైనా యూనివర్సిటీల్లో ఎవరికి చోటు దక్కుతుంది? ఎవరికి దక్కదు? అని నిర్ణయించేది ఈ పరీక్షే.
ఈ పరీక్ష కోసం చైనా విద్యార్థులు రోజుకు 12 గంటల తరబడి ఏడాది పొడవునా చదువుతారు. ఈ పరీక్షలో ఎలాగైనా నెగ్గాలని వారిపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది.
చాలావరకు స్కూళ్లలో విద్యా బోధన కూడా ఈ పరీక్ష చుట్టూనే తిరుగుతుంది. చాలా మంది విద్యార్థులు సమాజాంలో మంచి గుర్తింపు రావాలంటే ఈ పరీక్షలో మంచి మార్కులు రావడం తప్పనిసరని భావిస్తారు.
"యుద్ధానికి వెళ్లే సైనికుల్లా మనసులో ఒకేఒక విషయం గుర్తు పెట్టుకుంటారు"అని హార్వర్డ్ యూనివర్సిటీలోని గ్లోబల్ ఇనీషియేటివ్ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్ పరిశోధకులు ష్వెక్కిన్ జియాంగ్ వివరించారు.
"ఈ పరీక్ష చావు, బతుకుల పోరాటం లాంటిదని టీచర్లు చెబుతారు. పుట్టినప్పటి నుంచే ఈ పరీక్షలో మంచి మార్కులు రావాలంటే ఏం చేయాలనే కోణంలో తల్లిదండ్రులు ఆలోచిస్తారు."
"పరీక్ష ముందురోజు.. ధైర్యం కోసం పిల్లలందరూ గుమిగూడి యుద్ధ గీతాలు పాడతారు."
"మనం తప్పక విజయం సాధిస్తాం. తప్పకుండా గావ్‌కావ్‌పై విజయం సాధిస్తాం."
పరీక్ష రోజు పిల్లలకు ఆల్ ది బెస్ట్ చెప్పేందుకు తల్లిదండ్రులు వెంటే వస్తారు. మరోవైపు పరీక్ష సమయంలో చిన్నారుల ఏకాగ్రత దెబ్బతినకుండా చూసేందుకు పాఠశాల యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ పరీక్ష కోసం భద్రతా సదుపాయాలు భారీగానే చేస్తారు. నిఘా కెమెరాలు, జీపీఎస్ ఆధారిత సాంకేతికతలతోపాటు విహంగ వీక్షణం కోసం డ్రోన్లు కూడా సిద్ధం చేస్తారు.
2016లో అయితే గావ్‌కావ్ పరీక్షల్లో కాపీ కొడితే జైలుకు పంపిస్తామని చైనా ప్రభుత్వం ప్రకటించింది.
పిల్లల భవిష్యత్తుకే పరీక్షలా మారిన గావ్‌కావ్‌ను నిర్వహించే సమయంలో సూది కిందపడినా వినపడుతుంది. పిల్లల ఏకాగ్రత దెబ్బతినేలా ఎలాంటి పనులు చేయకూడదని నిర్ణయించారు.
అంటే పాఠశాలకు సమీపంలో రోడ్లను మూసివేస్తారు. నిర్మాణపు పనులు ఆపేస్తారు. పిల్లల ప్రత్యేక రవాణా సదుపాయాలు, వైద్య బృందాలను సిద్ధంచేస్తారు.
ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తి నడుమ.. పిల్లలకు వైరస్ సోకకుండా చూసేందుకు ప్రత్యేక చర్యలు గావ్‌కావ్ ప్రొటోకాల్లో భాగమయ్యాయి.
అసలు గావ్‌కావ్ అంటే ఏంటి? ప‌్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా దీన్ని ఎందుకు చెబుతున్నారు? దీనిపై విమర్శలు ఎందుకు వస్తున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
పోటీ చాలా ఎక్కువ
గావ్‌కావ్ అంటే ఉన్నత విద్యకు ప్రవేశ పరీక్ష అని అర్థం. దీన్ని 1952లో మొదలుపెట్టారు. అయితే, మావో జెడాంగ్ సాంస్కృతిక విప్లవ సమయం (1966-1976)లో దీన్ని నిలిపివేశారు.
1977 నుంచి గ్రామీణ నేపథ్యంతోపాటు వనరులు తక్కువగా ఉండే పిల్లలకు మెరుగైన భవిష్యత్తుకు బాటలు పరిచే ఒక అవకాశంగా గావ్‌కావ్‌ను చూస్తూ వస్తున్నారు.
చైనాలోని ప్రతి ప్రాంతమూ గావ్‌కావ్‌ను భిన్నంగా నిర్వహిస్తుంది. అయితే అన్నిచోట్లా చైనా భాష, గణితం, ఒక విదేశీ భాష లాంటివి సాధారణంగా పరీక్షలో కనిపిస్తాయి.
వీటితోపాటు చరిత్ర, రాజనీతి శాస్త్రం, భూగోళ శాస్త్రం, జీవ శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం లాంటి సబ్జెక్టులను పిల్లలు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షను రెండు నుంచి నాలుగు రోజులు నిర్వహిస్తారు. ఈ నిడివి నిర్వహించే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది.
"హు ఈస్ ఎఫ్రైడ్ ఆఫ్ ద బిగ్ బ్యాడ్ డ్రాగన్: వై చైనా హ్యాస్ ద బెస్ట్ (అండ్ వరస్ట్) ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్"పుస్తకాన్ని రాసిన, కేన్సస్ యూనివర్సిటీలోని స్కూల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ యాంగ్ ఝావో.. ఈ పరీక్ష గురించి మాట్లాడారు.
"ఈ పరీక్ష అంత కష్టమేమీ కాదు.. అయితే పోటీ ఎక్కువ."
యాంగ్ అభిప్రాయంతో జియాంగ్ కూడా ఏకీభవించారు. "ప్రశ్నల ప్రకారం చూస్తే.. ఈ పరీక్ష అంత కష్టమేమీ కాదు" అని జియాంగ్ వివరించారు.
"పిల్లలపై చాలా ఒత్తిడి ఉంటుంది. వారు పరీక్ష ఎలా రాస్తున్నారు అనే దానికంటే.. తోటి విద్యార్థులతో పోల్చడం వల్లే ఒత్తిడి ఎక్కువవుతుంది"అని జియాంగ్ అన్నారు.
"పిల్లలు గుర్తుపెట్టుకున్న, నేర్చుకున్న సమాచారంతో సమస్యలను ఎలా పరిష్కరిస్తారనేదే గావ్‌కావ్ పరీక్ష "

ఫొటో సోర్స్, Reuters
ఇది ప్రపంచంలోనే కష్టమైన పరీక్షా?
"గావ్‌కావ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులపై చాలా ఒత్తిడి ఉంటుంది. కేవలం తరగతిలో పది శాతం మంది విద్యార్థులు మాత్రమే అగ్ర వర్సిటీల్లో చోటు సంపాదిస్తారు. పరీక్షలో ఫెయిల్ అయితే... అందరూ హేళనగా చూస్తారు. దీంతో మరింత ఒత్తిడి పెరుగుతుంది" అని జియాంగ్ వివరించారు.
ఇలాంటి పోటీ వల్లే ఈ పరీక్షను ప్రపంచంలో అత్యంత కఠినమైన పరీక్షగా చెబుతారని "అదర్ వేస్ టు లెర్న్" పుస్తక రచయిత, విద్యావేత్త అయిన జియాంగ్ చెప్పారు.
"ఏటా కోటి మంది ఈ పరీక్ష కోసం సిద్ధం అవుతున్నారని అనుకోండి. పోటీ ప్రకారం చూస్తే.. ఉదాహరణకు గణితంలోని ప్రతిభను తీసుకుంటే షాంఘైలోని 15ఏళ్ల బాలుడు.. ఐరోపాలోని విద్యార్థుల కంటే మూడేళ్లు ముందుంటాడు. సామాన్య శాస్త్ర అంశాల్లో అయితే ఒకటిన్నర ఏడాది ముందుంటాడు."
విద్యార్థుల పరిజ్ఞానాన్ని కొలవడానికి ఇది సరైన పరీక్ష అని విద్యావేత్త అలెక్స్ బియర్డ్ అభిప్రాయపడ్డారు. అయితే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పారు.
"విమర్శనాత్మక, సృజనాత్మక కోణంలో ఇది అంశాలను నేర్చుకోవడానికి సరైన విధానం కాదు. పరీక్షలో సమాధానాలను రాసేందుకు మాత్రమే వారు సిద్ధం అవుతున్నారు" అని అలెక్స్ అన్నారు.
"పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానాలు రాయడమే లక్ష్యంగా చైనా విద్యా వ్యవస్థను రూపొందించారు. ఏదైనా అంశాల్లో లోతైన అవగాహన కలిగిన వ్యక్తిగా మారేందుకు ఇక్కడి పిల్లలకు అవకాశం లభించట్లేదు"
"ప్రతి విద్యార్థి ఈ పరీక్ష కోసం సన్నద్ధం అవుతాడు. దీంతో మిగతా అంశాలపై దృష్టి కేంద్రీకరించే అవకాశం లభించడంలేదు. జీవితంలో ఉపయోగపడే సృజనాత్మకత, విశ్లేషణ పరిజ్ఞానం లాంటి ముఖ్యమైన అంశాలు చాలా ఉంటాయి"

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధానికి సన్నద్ధం కావడమే
"చైనాలో విద్యార్థులు ప్రీస్కూల్‌లో ఉన్నప్పుడే ఒత్తిడి మొదలవుతుంది. తరగతి గతిలో పక్కన కూర్చొనేవారిని మిత్రుల్లా కాకుండా తమకు పోటీగా పిల్లలు చూస్తుంటారు" అని జియాంగ్ అన్నారు.
గావ్‌కావ్ కోసం పిల్లలు రోజుకు 12 నుంచి 13 గంటలు చదవడం మనకు కనిపిస్తుంది. మొదట స్కూల్‌లో తర్వాత ప్రైవేట్ కోచింగ్ క్లాస్‌లలో పిల్లలు చదువుతుంటారు.
"అందరూ ఇలానే చేస్తారు. కొందరిని చదవమని చాలా బలవంతపెడతారు. నువ్వు చదవకపోతే వెనకబడిపోయినట్లేనని హెచ్చరిస్తారు. చైనాలో ప్రైవేట్ కోచింగ్ అనేది ఒక పెద్ద వ్యాపారమే. దీని విలువ వంద బిలియన్ డాలర్లకుపైనే ఉంటుంది" అని అలెక్స్ వివరించారు.
అంటే స్కూల్, ప్రైవేట్ కోచింగ్ అంటూ విద్యార్థులు నిరంతరం చదువుతూనే ఉండాలి.
"15ఏళ్ల బాలుడికి ఈ పరీక్ష అంటే.. కేవలం తనకు ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయడం.. అంతే.." అని జియాంగ్ వివరించారు.
"ఈ పరీక్షలో పిల్లలతోపాటు కుటుంబం మొత్తం పాలుపంచుకుంటున్నట్లే. అంటే పిల్లల ఏకాగ్రత దెబ్బతినకుండా చూసేందుకు తల్లిదండ్రులు నిరంతం కష్టపడుతూనే ఉంటారు" అని యాంగ్ చెప్పారు.
"అంతా ఈ పరీక్ష చుట్టూనే తిరుగుతుంది. ఏ విద్యా వ్యవస్థలోనైనా ఇలా పరీక్షల చుట్టూ అన్ని తిరగడమే అతి పెద్ద సమస్య."
"గావ్‌కావ్‌కు సన్నద్ధం కావడమంటే జీవితంలో మధురానుభూతులను, సృజనాత్మక అవకాశాలను వదులుకోవడమే" అని యాంగ్, జియాంగ్.. ఇద్దరూ అంగీకరించారు.
"భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లకు ఈ పరీక్ష సిద్ధం చేస్తుందని నేను భావించను. ఇది పిల్లల ప్రతిభను నిర్వీర్యం చేస్తుంది" అని యాంగ్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ పరీక్ష ఎంత ఒత్తిడికి గురిచేసినా.. దీన్ని మంచి పరీక్షగానే చైనావాసులు చూస్తారు.
"చాలా అంశాల్లో అవినీతి జరుగుతుందని చైనా ప్రజలు భావిస్తారు. కానీ గావ్‌కావ్ మాత్రం సరైన రీతిలో నిర్వహిస్తారని వారు భావిస్తారు" అని ప్రొఫెసర్ యాంగ్ చెప్పారు.
అయితే ప్రభుత్వం మాత్రం ఈ పరీక్షను తమ చేతిలో ఉండే ఒక యంత్రంగా భావిస్తుందని జియాంగ్ అభిప్రాయపడ్డారు.
"ఈ పరీక్ష మంచిదని ప్రజలు భావించే వరకూ... అందరూ దీన్ని గౌరవిస్తూనే ఉంటారు. దీన్ని పోటీకి ఉదాహరణగా చెబుతుంటారు."
ఈ పరీక్షా విధానాన్ని మెరుగు పరచాలని చాలా మంది ఇప్పటికే గళమెత్తుతున్నారని జియాంగ్ చెప్పారు. కొన్ని ధనిక కుటుంబాలైతే తమ పిల్లలను విదేశాలకు పంపించి చదివిస్తున్నాయని వివరించారు.
"ఈ దేశంలో రెండు రకాల ప్రజలుంటారు. గావ్‌కావ్ కొనసాగకూడదని ఒక వర్గం కోరుకుంటారు. రెండో వర్గం మాత్రం దేశంలో అత్యంత నిజాయితీగా ఉండేది గావ్‌కావ్ పరీక్షేనని నమ్మేవారు. వారు దీన్ని కొనసాగించాలని నమ్ముతారు" అని ప్రొఫెసర్ యాంగ్ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్‌సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- ‘ముస్లింలపై అకృత్యాలకు పాల్పడిన చైనా అధికారుల’పై అమెరికా ఆంక్షలు
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?
- ఇంటర్నెట్ ప్రాథమిక హక్కుతో సమానమా? అది లేకుండా సమాన అవకాశాలు సాధించలేమా?
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్‌స్టర్' ఎలా అయ్యాడు?
(బీబీసీతెలుగునుఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లోఫాలోఅవ్వండి. యూట్యూబ్‌లోసబ్‌స్క్రైబ్చేయండి.)








