ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు, హీరో కృష్ణకు మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఏం జరిగింది? - అభిప్రాయం

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

ఫొటో సోర్స్, facebook/SPB

    • రచయిత, బి.కె.ఈశ్వర్
    • హోదా, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

"దివి నుంచి భువికి దిగిరా".. మా బాలు చేత ఆ పాట మళ్లీ పాడించు.. అని లక్షలాది సంగీతాభిమానులు ప్రార్థనలు చేశారు. కానీ ఫలించలేదు. బాలు భువి నుంచి దివికేగాడు. 2020 సెప్టెంబర్ 25న .. ఇది సంగీతాభిమానులందరికీ మింగుడు పడని విషాదగీతం.

శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రమణ్యం 1966లో డిసెంబర్ 16న శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి ద్వారా గాయకునిగా చిత్ర రంగానికి పరిచయం అయిన సంగతి అందరికీ తెలిసిందే. అందరూ ఆయన ఇంటిపేరు ఈయన ఇంటి పేరు ఒకటే కావడం వల్ల, బంధుత్వం ఉందేమో అనుకుంటారు. అది సంగీత బంధుత్వమే తప్ప... మరొకటి కాదు.

అయితే, గాయకునిగా రసజ్ఞులైన సినీ ప్రియులను 54 ఏళ్లుగా ఒకే తీరున రంజింపజేయడం అన్నది సినీ చరిత్రలో ఎక్కడా జరగని అద్భుతం. అది బాలు ఒక్కడి వల్లే సాధ్యమయ్యిందన్నది నిర్వివాదాంశం.

ఏ నేపథ్య గాయకుడైనా ఒకే రోజున 15 చిత్ర గీతాలు రికార్డింగ్ చేయడం అన్నది కూడా అనితర సాధ్యం. అంత మాత్రం చేత ఆ పాటల నాణ్యత కొరవడిందని చెప్పడానికి లేదు. అది బాలు గ్రాహ్య శక్తికి నిదర్శనం. బాణీ వినగానే ఆకళింపు చేసుకోవడం, ఆ పాట మూడ్ కి తగినట్టు తన గళాన్ని మలచుకోవడం, పాట శ్రావ్యతను మెరుగుపరచడానికి ప్రయత్నించడం, ఇవన్నీ వెంట వెంటనే ఆచరణలో పెట్టడం, ఆయన ప్రతిభకు నిదర్శనం.

అలాగే సంప్రదాయ బద్ధంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకోకుండా, శంకరాభరణంలోని సెమీ క్లాసికల్ పాటలు పాడి ఉత్తమ గాయకునిగా జాతీయ బహుమతి గెల్చుకోవడం చెప్పుకోదగ్గ మరో విశేషం.

తొలినాళ్లలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

ఫొటో సోర్స్, facebook/SPB

ఇక గాత్రంలో ఆయన చూపే వైవిధ్యం గురించి చెప్పాలంటే ఆయన.. ముత్యాలు వస్తావా(మనుషులంతా ఒక్కటే) అంటే అల్లు రామలింగయ్య పాడినట్టే ఉంటుంది. "చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు"(చిల్లర కొట్టు చిట్టెమ్మ) అంటే "మాడా" పాడుతున్నట్టు ఉంటుంది. అలాగే రాజబాబుకైనా మరెవరికైనా.. అదెలా సాధ్యమంటే అదే బాలు ప్రత్యేకత.

పాటల్లోనే కాదు మాటల్లో (డబ్బింగ్ చిత్రాలకు) కూడా అలాంటి చమక్కులన్నీ ఆయన అవలీలగా ప్రదర్శించేవారు. (ఉదాహరణకు కమల్ హాసన్ చిత్రాలు అన్నీ)

బాలులో సినిమా భేషజాలనేవి ఎంత మాత్రమూ కనిపించేవి కావు. నేను విజయచిత్ర(ప్రముఖ సినిమా మాస పత్రిక)లో ఉప సంపాదకునిగా పని చేశాను. బాలు తొలిపాట పాడిన తరువాత ఆయన పరిచయాన్ని మొట్ట మొదట విజయ చిత్ర మాస పత్రికే ప్రచురించింది. ఆయన ఎంత బోళా శంకరుడంటే ఇది జరిగి ఎన్నో ఏళ్లయినా నేను కానీ, మా రావి కొండలరావు (ఆయన ఇటీవలే కీర్తి శేషులయ్యారు) కానీ ఏ ఫంక్షన్లోనైనా కనిపిస్తే బాలు తన చుట్టూ ఉన్న వాళ్లను పిలిచి ‘ఇదుగో విజయ చిత్ర పత్రికలోనే మొదటిసారిగా నా పరిచయం ప్రచురితమయ్యింది’ అని మా గురించి ఘనంగా చెప్పే వాళ్లు.

ఘంటసాల వెంకటేశ్వరరావుతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

ఫొటో సోర్స్, facebook/SPB

అదే స్పిరిట్ తో తన తొలిపాట పాడేందుకు సమయానికి కారు రాకపోతే, తాను, తన మిత్రుడు కలిసి సైకిళ్లపై రికార్డింగ్ జరిగే విజయాగార్డెన్స్ కి వెళితే అక్కడ ఉన్న గూర్ఖా తమ మాటలు నమ్మకుండా గేటు వద్ద నిలిపివేసిన సంగతి కూడా సరదాగా గుర్తు చేసుకుంటూ చెప్పి నవ్వించేవారు.

బాలు తండ్రి ఎస్పీ సాంబమూర్తి సంగీతజ్ఞులు. హరికథలు చెప్పేవారు. ఎవరైనా ఆ సంగతి ప్రస్తావిస్తే, "మా నాన్న గారు హరికథలు చెప్పేవారని చెప్పేందుకు నేను ఎంత మాత్రం ఫీలవను. అలా వచ్చే స్వల్ప ఆదాయంతోనే ఆయన మా అందరికీ మంచి చదువు, చక్కని సంస్కారం నేర్పించారు. నన్ను మనిషిగా తీర్చి దిద్దారు" అని తన తండ్రి గారి ఔన్నత్యాన్ని గుర్తు చేసుకునేవారు.

బాలు అజాత శత్రువు. ఆయన ఎవరి గురించి పరుషంగా మాట్లాడటం నేను వినలేదు. అయినా ఒక సందర్భంలో మరో వ్యక్తి కారణంగా, బాలుకి, హీరో కృష్ణకి అభిప్రాయ భేదాలు వచ్చాయి. దాంతో కొంత కాలం పాటు బాలు, కృష్ణకి పాటలు పాడలేదు. అప్పుడు రాజ్-సీతారాం అనే మరో గాయకుడు కృష్ణకి పాడారు. ఆ పరిణామానికి చిత్ర పరిశ్రమలో చాలా మంది విచారించారు. అయితే సంగీత దర్శకుడు రాజ్-కోటీ, గీత రచయిత వేటూరి సుందరరామమూర్తి చొరవ తీసుకొని, వాళ్లద్దరి మధ్య సయోధ్య ఏర్పరిచేందుకు ముందుకొచ్చారు.

బాలుకి, కృష్ణకి ఓ సమావేశం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. అప్పుడు బాలు చొరవ తీసుకొని, తనే కృష్ణని కలుసుకుంటానని, పద్మాలయా స్టూడియోకి వెళ్లి ఆయనతో మాట్లాడారు. అప్పుడు కృష్ణ గతాన్ని తవ్వకుండా మర్నాటి నుంచి ఆయన్నే తన పాటలు పాడమన్నారు. అలా వాళ్లు మళ్లీ స్నేహితులయ్యారు.

ఇళయరాజాతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

ఫొటో సోర్స్, ILAYARAJA FB

ఇటీవల మరో ప్రియ స్నేహితుడు ఇళయరాజా(ఆయన అభివృద్ధికి తొలి రోజుల్లో ఎంతో పాటు పడ్డారు బాలు)వద్ద నుంచి ఒక లీగల్ నోటీస్ వచ్చింది. ఆ రోజు బాలు ఎంతో బాధ పడ్డారు. తను స్వర పరిచిన పాటలు తన అనుమతి లేనిదే ఎవరూ స్టేజిపై పాడకూడదని చెప్పడమే ఆ లీగల్ నోటీస్ సారాంశం. ఆ తర్వాత బాలు ఇళయరాజాను కలిసినప్పుడు ఎప్పటిలాగే స్నేహ పూర్వకంగా పలకరించుకున్నా, బాలు ఆ తర్వాత ఎప్పుడూ ఇళయరాజా పాటలు పాడకపోవడం గమనించదగ్గ అంశం.

బాలు చిత్రరంగంలోకి ప్రవేశించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మా ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆయనను చెన్నైలో ఘనంగా సత్కరించింది. అప్పటి ప్రశంసా పత్రంలో నేను రాసినట్టుగా "ఏ తరహా పాటలకైనా ఆయన అవలీలా సుబ్రమణ్యం. నటుడిగా ఇంద్రజాల సుబ్రమణ్యం. స్నేహానికి చెరశాల సుబ్రమణ్యం. సభల్లో సరసాల సుబ్రమణ్యం. సంగీత ప్రియులకు జోల సుబ్రమణ్యం. మన అందరి హృదయాల్లో చిరకాల సుబ్రమణ్యం" ఈ ధోరణిలో సాగుతుంది ఆ ప్రశంసా పత్రం. నిజమే బాల సుబ్రమణ్యం మన అందరి హృదయాల్లో చిరకాల సుబ్రమణ్యం.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

ఫొటో సోర్స్, facebook/SPB

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)