‘భారత రత్న’లు సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్, ఇతర సెలబ్రిటీల ట్వీట్ల వెనుక కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఉందా?: మహారాష్ట్ర దర్యాప్తు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, facebook/SachinTendulkar
మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను సమర్ధిస్తూ భారత రత్నలు సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్ సహా పలువురు సెలిబ్రిటీలు చేసిన ట్వీట్లపై దర్యాప్తు చేపట్టనున్నట్లు రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. వ్యవసాయ చట్టాలకు మద్దతుగా పలువురు సెలిబ్రిటీలు ట్వీట్లు చేయడం వెనుక కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తామని దేశ్‌ముఖ్ తెలిపారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ నేతృత్వంలోని బృందం ఈవిషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిందని ఆయన చెప్పారు.
మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా అమెరికన్ పాప్ స్టార్ రిహానా, పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ ఇటీవల ట్వీట్లు చేశారు. వాటిని వ్యతిరేకిస్తూ.. కేంద్ర ప్రభుత్వ చట్టాలను సంఘీభావం పలుకుతూ వివిధ రంగాలకు చెందిన పలువురు భారతీయ సెలిబ్రిటీలు ట్వీట్లు చేశారు. వీరిలో క్రికెటర్ సచిన్, గాయని లతా మంగేష్కర్, బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్, ఏక్తా కపూర్, సునీల్ శెట్టి, కరణ్ జోహర్, క్రికెటర్లు సురేశ్ రైనా, అనిల్ కుంబ్లే, ఆర్.పి.సింగ్, ప్రజ్ఞాన్ ఓఝా, విరాట్ కోహ్లీ తదితరులు ఉన్నారు.
‘‘ఈ ట్వీట్ల వెనుక బీజేపీ హస్తం ఉందా? చాలామంది సెలిబ్రిటీలు చేసిన ట్వీట్లలో ‘అమికబుల్’ తరహా ఒకే రకమైన ఆంగ్ల పదాలను ఎందుకు వాడారు?’’ అనేది దర్యాప్తులో తేలుతుందని సావంత్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా చేసిన ట్వీట్లన్నీ ఇంచుమించు ఒకే సమయంలో విడుదలయ్యాయని ఆయన గుర్తుచేశారు. దేశం గర్వించదగిన ఇలాంటి గొప్ప వ్యక్తులను ఒకవేళ బీజేపీ బెదిరించి ఉంటే.. వెంటనే వారికి రక్షణ కల్పించాలన్నారు.
అయితే.. ‘భారత రత్న’లపై దర్యాప్తు అనే పదాన్ని ప్రయోగించినందుకు రాష్ట్ర సర్కారు సిగ్గుపడాలని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ మండిపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
మున్ముందు రోజు వారీగా గ్యాస్ ధరల మార్పులు.. కేంద్ర ప్రభుత్వ యోచన
వంట గ్యాస్ ధరలు మరింత మండనున్నాయని.. అంతర్జాతీయ మార్కెట్ ధరల ఆధారంగా దేశంలో కూడా గ్యాస్ ధరలో మార్పులు, చేర్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ‘ఈనాడు’ ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. ప్రస్తుతం అంతర్జాతీయ ధరల ఆధారంగా పెట్రోలు, డీజిల్ ధరలను రోజువారీ మార్చుతున్నారు. దాదాపు నాలుగున్నరేళ్ల నుంచి ఈ విధానం అమల్లో ఉంది. గ్యాస్ ధరలు కూడా ఇలాగే అంతర్జాతీయంగా రోజువారీ మారుతుంటాయి అందుకే ఇక్కడా అదే విధానం అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. తొలిదశలో ప్రతి 15 రోజులకు ఒకసారి మార్చటమా? లేక వారానికి ఒకసారి మార్చాలా? అనే అంశాన్ని పరిశీలిస్తోంది.
గత ఏడాది డిసెంబరులో రెండు దఫాలుగా వంట గ్యాస్ ధరలను పెంచింది. గృహావసరాలకు వినియోగించే సిలిండరు ధర రూ. 100 వరకు పెరిగింది. వాణిజ్య సిలిండర్ల ధరలు కూడా పెరిగాయి. అయినా ప్రజల నుంచి పెద్దగా నిరసనలు రాకపోవటంతో గ్యాస్ విషయంలో కూడా సాధ్యమైనంత త్వరితంగా రోజువారీ విధానం అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి జులైలోగా ఇది కార్యరూపంలోకి వచ్చే అవకాశముందని సమాచారం.
కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ప్రతి నెలా మొదటివారంలో అంతర్జాతీయ ధరల ఆధారంగా వంట గ్యాస్ ధరలను పెంచుతోంది. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి, ఆ తర్వాత వారానికి ఒకసారి మార్చటం ద్వారా గ్యాస్‌పై నష్టాన్ని పూడ్చుకోవాలన్నది ప్రభుత్వ యోచన అని పెట్రోలియం మంత్రిత్వ శాఖవర్గాల ద్వారా తెలిసింది.
పెట్రోలు, డీజిల్ ధరల విషయంలో ప్రభుత్వం ఇదే విధానాన్ని అమలు చేసిందని ఆ వర్గాలు చెప్పాయి. మొదట 15 రోజులకు ఒకసారి పెంచింది. తర్వాత దాన్ని వారానికి కుదించింది. ఆపై రోజువారీగా ధరలు మారుతున్నాయి.
రోజుకో ధర అయితే ఎలా?: ‘‘గ్యాస్ ధరల విషయంలో రోజువారీ మార్పులు గందరగోళాన్ని సృష్టిస్తాయి. తరచుగా ధర మారిస్తే ఇటు వినియోగదారులకు, అటు డీలర్ల మధ్య అయోమయం నెలకొంటుంది. చమురు ఎప్పటికప్పుడే డెలివరీ అవుతుంది. వంట గ్యాస్ విషయంలో బుక్ చేసే రోజు ఒక ధర, డెలివరీ రోజు మరో ధర. ఒకవేళ ఏదైనా కారణంగా ఆ రోజు సిలిండరు పంపిణీ మర్నాటికి వాయిదా పడితే మరో ధర అమల్లోకి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విషయాన్ని పునరాలోచించాలంటూ మంత్రిత్వ శాఖకు లేఖ రాశాం’’ అని ఎల్పీజీ డీలర్ల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్ వివరించారు.

ఫొటో సోర్స్, facebook/TelanganakuHarithaHaram
హైదరాబాద్‌లో వృక్షాన్ని నరికినందుకు రూ. 62,00 జరిమానా.. శిక్ష వేయించిన ఓ విద్యార్థి
హైదరాబాద్ నగరంలో ఇంటి నిర్మాణానికి అడ్డొస్తున్నదని నాలుగు దశాబ్దాలుగా నీడనిస్తున్న మహావృక్షాన్ని అడ్డంగా నరికేసిన వ్యక్తిని.. ఒక బాలుడు అటవీశాఖకు పట్టించాడని.. భారీ జరిమానా విధించడానికి కారకుడయ్యాడని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. హైదరాబాద్ సైదాబాద్ వైశాలినగర్‌కు చెందిన జి.సంతోష్‌రెడ్డి అనే వ్యక్తి ఇటీవల కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఆ స్థలంలో 40 ఏండ్లనాటి వేపచెట్టు ఉన్నది. నిర్మాణానికి అడ్డొస్తుందని గుట్టుచప్పుడు కాకుండా నరికాడు. ఆనవాళ్లు తెలియకుండా కలపను తరలించాడు. చెట్టు మొదలును కాల్చాడు.
ఈ ఘటనను గమనించిన అదే కాలనీకి చెందిన ఓ ఎమినిదో తరగతి విద్యార్థి.. సామాజిక బాధ్యతతో వెంటనే అటవీశాఖ టోల్‌ఫ్రీ నంబర్ 1800 4255364కు ఫోన్‌చేశాడు. ‘నేను గ్రీన్ బ్రిగేడియర్‌ను’ అని పరిచయం చేసుకొని, తమ కాలనీలో పెద్ద చెట్టును కొట్టేసిన వ్యక్తిపై చర్య తీసుకోవాలని ఫిర్యాదుచేశాడు.
స్పందించిన అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. వైశాలినగర్‌ను సందర్శించి విచారించారు. అనుమతి లేకుండా చెట్టును కొట్టివేసినట్టు నిర్ధారించారు. బాధ్యుడైన ఇంటి యజమానికి రూ.62,075 జరిమానా విధించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి ఫిర్యాదుచేసిన బాలుడిని అటవీశాఖ ఉన్నతాధికారులు అభినందించారు.
హరిత దళపతులు: హరితహారంలో భాగంగా మొక్కలను రక్షించడానికి, వృక్షాలను కాపాడటానికి ఎన్జీవోలు, స్వచ్ఛంద సేవకులు, పర్యావరణ ప్రేమికులను భాగస్వామ్యం చేస్తూ గ్రీన్ బ్రిగేడియర్లను (హరిత దళాలు)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో విద్యార్థులే కీలకపాత్ర పోషిస్తున్నారు. సభ్యులకు హరితహారం ప్రాముఖ్యతను వివరించడమేగాకుండా, చెట్లను నరికితే ఎలా ఫిర్యాదు చేయాలో అవగాహన కల్పిస్తున్నది.
దీంతో చైతన్యం పొందిన విద్యార్థులు హరితస్ఫూర్తిని చాటుతున్నారు. జీహెచ్‌ఎంసీలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2,183, సంగారెడ్డి 880, హైదరాబాద్ 611, వికారాబాద్ 769, రంగారెడ్డి 684 గ్రీన్ బ్రిగేడియర్ బృందాలున్నాయి. ఒక్కో బృందంలో 10 మంది సభ్యులు ఉన్నారు.

ఫొటో సోర్స్, oqba/Getty Images
ఇలస, పులసల రాకపోకలకు పోలవరం ప్రాజెక్ట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు...
పులస చేపల స్వేచ్ఛా విహారం కోసం పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని.. పులస చేపలు ఎగువకు, దిగువకు రాకపోకలు సాగించడానికి వీలుగా స్పిల్ వే రెండో పియర్‌లో ఫిష్ ల్యాడర్ గేట్లను అమర్చుతోందని ‘సాక్షి’ ఒక కథనంలో చెప్పింది. ప్రపంచంలో ఈ ఏర్పాట్లు ఉన్న అతి పెద్ద జలాశయం పోలవరం ప్రాజెక్టేనని పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. పుస్తెలమ్మైనా సరే పులస తినాలన్నది ఉభయ గోదావరి జిల్లాల్లో నానుడి. గోదావరి వరద ప్రవాహం సముద్రంలో కలిసే సమయంలో అంటే.. జూన్ నాలుగో వారం నుంచి జూలై, ఆగస్టు మధ్యన సముద్రంలో జీవించే ఇలస రకం చేపలు సంతానోత్పత్తి కోసం నదిలోకి ఎదురీదుతాయి.
ఇలా గోదావరిలోకి చేరాక పులసలుగా రూపాంతరం చెందుతాయి. ప్రపంచంలో ఎక్కడా, మరే ఇతర సముద్రపు చేపలు నదుల్లోకి ఎదురీదే ఉదంతాలు లేవు. వరదల సమయంలో ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను ఎత్తి ఉంచడం వల్ల గోదావరి సముద్రంలో కలిసే అంతర్వేది నుంచి దాదాపుగా భద్రాచలం వరకు ఈ చేప నదిలో ఎదురీదుతుంది. సంతానోత్పత్తి చేశాక తిరిగి సముద్రంలోకి చేరి మళ్లీ ఇలసగా మారుతుంది.
పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తే అత్యంత అరుదైన పులస చేపల రాకపోకలకు విఘాతం కల్పించినట్లు అవుతుందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే తగిన ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది.
ఇలస రాక, పులస పోక ఎలాంటి ఆటంకం లేకుండా జరిగేందుకు వీలుగా పోలవరం ప్రాజెక్టుకు గేట్ల ఏర్పాటుపై అధ్యయనం బాధ్యతను కొల్‌కతాలోని ప్రఖ్యాత సీఐఎఫ్‌ఆర్‌ఐ (సెంట్రల్ ఇన్‌ల్యాండ్ ఫిషరీష్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్)కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.
ఈ చేప రాకపోకల సమయంలో చేప ప్రవర్తించే తీరుపై సుమారు ఐదేళ్ల అధ్యయనానంతరం సీఐఎఫ్‌ఆర్‌ఐ.. ఫిష్ ల్యాడర్ గేట్లను డిజైన్ చేసింది. కేంద్ర జల సంఘం ఆమోదించిన మేరకు ఈ గేట్లను తయారు చేయించిన ప్రభుత్వం స్పిల్ వే రెండో పియర్‌కు అమర్చుతోంది. గోదావరిలో నీటి మట్టం గరిష్టంగా ఉన్నా, సాధారణంగా ఉన్నా, కనిష్టంగా ఉన్నా ఈ చేప ఎగువకు, దిగువకు రాకపోకలు సాగించేందుకు ఈ గేట్లు అనుకూలంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి:
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









