హైదరాబాద్: మా అబ్బాయి సంగీతంతో ఆటిజాన్ని జయించాడు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్‌కు చెందిన 19 ఏళ్ల వరుణ్ ఆటిజంను జయించాడు. ‘వరుణ్‌కు ఆరేళ్ళు వచ్చే వరకు మాట్లాడనేలేదు. కానీ ఇవాళ తాను హిందుస్తానీ సంగీతంలో కచేరీలు చేస్తున్నాడు.’ అని వరుణ్ తల్లి మాధవి ఆదిమూలం చెప్పారు.
ఇతరులతో సంభాషించడంలో, సంబంధాలను నెలకొల్పుకోవడంలో సమస్యలు ఎదుర్కోవడాన్ని ఆటిజంగా పేర్కొంటారు.
వరుణ్‌లా ఆటిజం ఉన్న పిల్లలకు శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో అతని తల్లి మాధవి ‘అనన్య చైల్డ్ కేర్ సెంటర్’ను స్థాపించి ఆటిజంపై తల్లిదండ్రులకు ఉన్న భయాలను పోగొట్టడానికి కృషి చేస్తున్నారు.
కుమారుడికి ఉన్న ఆటిజం సమస్యను ఆమె ఎలా ఎదుర్కొన్నారు? వరుణ్‌లో సంగీతం పట్ల ఉన్న ఆసక్తిని ఆమె ఎలా కనిపెట్టారు?
వరుణ్ సంగీత ప్రయాణాన్ని తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని అనన్య సెంటర్‌కు వెళ్లినపుడు తల్లి మాధవి కుమారుడికి ఉన్న ఆటిజంను ఎదుర్కోవడంలో తనకు ఎదురైన సవాళ్లను బీబీసీతో పంచుకున్నారు.

ఫొటో సోర్స్, Madhavi Adimulam
''వరుణ్‌కు మూడేళ్లు వచ్చాక డాక్టర్లు అతనికి ఆటిజం ఉందని చెప్పారు. ఆటిజం గురించి వాళ్లు నన్ను చాలా భయపెట్టారు. కానీ నాకు మాత్రం ఎందుకో వరుణ్ ఏదో చేయగలడు అనిపించింది. వరుణ్‌ను ఇతర పిల్లల్లాగా పెంచాలని అనుకోలేదు. మన దేశంలో వరుణ్‌ను స్కూల్‌లో చేర్చుకునేందుకు ఒప్పుకోలేదు. దాంతో నేను బ్రిటన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాను'' అని మాధవి వివరించారు.
బ్రిటన్‌లో వరుణ్ కోసం ఒక ప్రత్యేక టీచర్‌ను నియమించారు. అలా తను మూడో తరగతికి వచ్చేవరకు తామక్కడే ఉన్నామని ఆమె తెలిపారు.
వరుణ్‌కు తొమ్మిదేళ్లు వచ్చాక మాధవికి అతణ్ని స్వదేశంలోనే పెంచితేనే బాగుంటుందని అనిపించింది. భారత్‌లో వరుణ్‌ను ఎవరూ స్కూల్‌లో చేర్చుకోకపోతే, తామే ఒక స్కూల్ పెడదామని నిర్ణయించుకుని ఆమె ఇక్కడకు వచ్చేశారు.

ఫొటో సోర్స్, Madhavi Adimulam
‘సంగీతం అతని జీవితాన్ని మార్చేసింది’
"అయితే సంగీతం వరుణ్ జీవితాన్ని మార్చేసింది. స్కూల్‌లో చేర్చాక వేరే క్లాస్‌లకు వెళ్లకుండా కేవలం మ్యూజిక్ క్లాస్‌లకు మాత్రమే వెళ్లడం చూసి వరుణ్‌కి సంగీతం అంటే ఆసక్తి ఉందని మాకు అర్థమైంది" అని చెప్పారు మాధవి.
"మామూలు పిల్లలకే క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవడం కష్టం. అలాంటిది వరుణ్ ఎలా నేర్చుకుంటాడో మాకు అర్థం కాలేదు. కానీ వరుణ్‌కు సంగీతం నేర్పడానికి హరిణి అనే టీచర్ ముందుకొచ్చారు. మొదట థెరపీలా మొదలయిన సంగీతం తర్వాత సాధనగా మారింది. నెమ్మదిగా వరుణ్ మిగిలిన పిల్లలతో కలిసి సాధన చేయడం ప్రారంభించాడు. వరుణ్ ప్రతిభను గుర్తించి అతని టీచర్ ఒకరోజు వరుణ్ పాటను పండిట్ జస్‌రాజ్ వార్షిక పోటీలకు పంపించారు. వరుణ్ పాటని విన్న పండిట్ జస్‌రాజ్ వెంటనే అతణ్ని స్కూల్ వార్షిక సంగీత పోటీలలో పాడేందుకు ఎంపిక చేయడం, వరుణ్ చౌమహల్లా ప్యాలస్‌లో ఆయన ముందే కచేరి చేయడం జరిగిపోయాయి.’’ అని మాధవి వివరించారు.

ఫొటో సోర్స్, Madhavi Adimulam
వారానికో భాష నేర్చుకుంటాడు..
తన చిన్న కుమారుడు పదో తరగతి అయ్యే లోపే వరుణ్ పండిట్ జస్‌రాజ్ అవార్డు అందుకోవడం తనకు చాలా ఆనందం కలిగించిందని మాధవి తెలిపారు.
"వరుణ్ ఇప్పుడు ఒక టీనేజర్‌లాగే ప్రవర్తిస్తాడు. అమ్మాయిలు మ్యూజిక్ క్లాస్‌కు వచ్చే రోజు ప్రత్యేకంగా కనిపించాలని ప్రయత్నిస్తాడు. తన లాప్‌టాప్ మమ్మల్ని చూడనివ్వడు'' అని ఆమె అతని స్వభావాన్ని వివరించారు.
"తల్లిదండ్రులు పిల్లలకు ఏం ఇష్టమో కనిపెట్టాలి. అపుడే వారికి తగిన శిక్షణ ఇవ్వగలం. ఆటిజం పిల్లలందరికీ సంగీతమంటే ఇష్టం ఉంటుందని చెప్పలేం. మా బాబు 24 గంటలు సంగీతం వినడం పాడటం చూసి మేము అర్ధం చేసుకున్నామంతే" అని మాధవి వివరించారు.
"భారతీయ భాషలన్నీ వరుణ్ చదవగలడు, రాయగలడు. అదీ ఏ గురువూ లేకుండానే నేర్చుకున్నాడు. కేవలం సెసమే స్ట్రీట్ అనే యాప్, వికీపీడియా చూసి వాటిని నేర్చుకున్నాడు. తను భాషను నేర్చుకునే విధానం వేరేమో.. వారానికి ఒక భాష నేర్చేసుకుంటాడు. ఇప్పటి వరకు వరుణ్ 30కిపైగా భాషలు నేర్చుకున్నాడు" అని మాధవి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆటిజం పిల్లలకు మ్యూజిక్, ఆర్ట్ చాలా ఉపయోగపడతాయి. గణితం, సైన్స్‌కంటే వాళ్లకు ఇష్టమైన వాటిని నేర్పించడమే మేలని మాధవి అభిప్రాయపడ్డారు. ఆటిజం పిల్లలున్న తల్లిదండ్రులు వాళ్ళు స్వతంత్రంగా బతకగలిగే విధానం నేర్పించాలని సూచించారు.
ఆటిజం ఉన్న పిల్లలు మాట్లాడలేకపోవటం, చెప్పాలనుకున్నది చెప్పలేకపోవడం పెద్ద సమస్య.
''నా కొడుకుకి ఎందుకు ఆటిజం వచ్చింది అని చాలా మంది తల్లిదండ్రులు మథన పడిపోతారు. కొందరు మా కర్మ అనుకుంటారు. కానీ కొంతమంది ఆటిజం పిల్లలు బీటెక్ కూడా పూర్తి చేశారు'' అని మాధవి తెలిపారు.
"మన దేశంలో పక్కవాళ్ళు ఏమనుకుంటారో అని తల్లిదండ్రులు ఆలోచిస్తారు. తమ పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదవాలనుకుంటారు కానీ పిల్లలకు ఏం కావాలి, వాళ్లేం చేయగలరు అని ఆలోచించరు'' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Madhavi Adimulam
సరైన టైంలో థెరపీ మొదలు పెడితే చాలావరకు ఆటిజంను జయించవచ్చని మాధవి అంటారు.
''వీళ్లంతా డిజైనర్ పిల్లలు. వీళ్ళని ప్రత్యేకంగా చూడాలి. వీళ్లను కూడా బయట తిప్పాలి. అపుడే వాళ్ళు సమాజం, పరిస్థితులను గురించి అర్ధం చేసుకోగలరు" అన్నారు మాధవి.
వరుణ్‌లాంటి మరెంతో మందికి సహాయపడాలనే ఉద్దేశంతో చైల్డ్ కేర్ సెంటర్‌తో పాటు లైఫ్ స్కిల్స్, గ్రూప్ హోమ్‌ను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారామె.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








