ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య 5 గ్రామాల వివాదం ఏంటి... కొత్త జిల్లాల ఏర్పాటుతో చిక్కులు తప్పవా?

- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
"మా ఐదు గ్రామాలు మళ్లీ తెలంగాణలో కలిపేయండి" అంటున్నారు అక్కడి ప్రజలు. విభజన చట్టం అమలులోకి వచ్చే ముందుగా తెలంగాణ ప్రాంతం నుంచి ఈగ్రామాలు ఏపీలో విలీనం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డులేకుండా ముంపునకు గురవుతాయని భావించిన ప్రాంతాన్ని ఏపీకి బదలాయించారు.
2014 జూన్ 2కు ముందు ప్రధానిగా నరేంద్రమోదీ తొలి క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ మార్పులు జరిగాయి. అందులో రెండు మండలాలు పశ్చిమ గోదావరి జిల్లాలో భాగం కాగా, భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న నాలుగు మండలాలు తూర్పు గోదావరి జిల్లాలో కలిపారు.
ఇప్పుడు జిల్లాల విభజన మూలంగా ఈ విలీన మండలాల ప్రజలకు సమస్యలు పెరుగుతున్నందున మళ్లీ తెలంగాణలో కలిపేయండి అంటూ ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. నిరసనలు చేపడుతున్నారు. ఇంతకీ వారి సమస్య ఏమిటి? జిల్లాల విభజనతో వారికొచ్చే కష్టం ఏమిటి?

జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల మార్పు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా జిల్లాల విభజనకు పూనుకుంది. అందులో భాగంగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లను పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేయబోయే అల్లూరి జిల్లాలో భాగంగా ప్రతిపాదించారు.
అంతేకాకుండా రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న చింతూరును తొలగించారు. చింతూరు పరిధిలో ఉన్న మండలాలను రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో కలిపేందుకు సిద్ధమయ్యారు. చింతూరు, ఎటపాక, వీఆర్ పురం, కూనవరం మండలాలు రంపచోడవరం కేంద్రంగా ఉన్న డివిజన్లో చేరుతాయి.
గిరిజన షెడ్యుల్ ప్రాంతంలో ఉన్న ఈ మండలాలు భౌగోళికంగా విస్తారంగా ఉంటాయి. ఇప్పుడు చింతూరు కేంద్రంగా ఉన్న రెవెన్యూ డివిజన్ రద్దు చేయడం మూలంగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లేందుకు 270 కిలోమీటర్లు, ఆర్డీవో ఆఫీసుకి వెళ్లాలంటే 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దాంతో గతంలో తమకు అందుబాటులో ఉన్న కార్యాలయాలు ఇప్పుడు సుదూరంగా మారుతుండడంతో తమకు చిక్కులు తప్పవని ఎటపాక సహా నాలుగు మండలాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఒకప్పుడు భద్రాచలం పరిధిలో...
రాష్ట్ర విభజనకు ముందు ఈ మండలాలన్నీ భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండేవి. అసెంబ్లీ నియోజకవర్గం కూడా భద్రాచలంలో ఉండేది. దాదాపుగా విద్య, వైద్యం సహా అన్ని వ్యవహారాలకు భద్రాచలం మీద ఆధారపడి ఉండేవారు. కానీ విభజన తర్వాత తొలుత ఎటపాక కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
దాంతో కాకినాడ కలెక్టర్ కార్యాలయం చాలాదూరంలో ఉన్నప్పటికీ ఆర్డీవో ఆఫీసు అందుబాటులో ఉందని ఆ ప్రాంత ప్రజలు సరిపెట్టుకున్నారు. అయితే కొన్నాళ్లకు ఎటపాక స్థానంలో చింతూరు కేంద్రంగా ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం చింతూరు కూడా రద్దు చేసి ఈ డివిజన్ మొత్తాన్ని రంపచోడవరంలో విలీనం చేయడం మూలంగా పాడేరు కేంద్రంగా ప్రతిపాదించిన జిల్లా కలెక్టర్ కార్యాలయం మాత్రమే కాకుండా రెవెన్యూ డివిజనల్ ఆఫీసు కూడా అందుబాటులో లేకుండా పోతోందనే ఆందోళన ప్రజల్లో మొదలయ్యింది.
"మాకు మొదట ఎటపాక , ఆతర్వాత చింతూరు అన్నారు. ఇప్పుడు కూడా పేరుకి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నప్పటికీ అన్నీ మాకు భద్రాచలంతోనే సంబంధాలు. ఎటపాక నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో భద్రాచలం ఉంది. విలీనం చేసిన తర్వాత ముంపు మండలాల పేరుతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. చివరకు జూనియర్ కాలేజీ కూడా లేకుండా పోయింది. ఆస్పత్రికి వెళ్లాలంటే రాజమండ్రి, కాకినాడ వెళ్లాల్సి వస్తుంది. భద్రాచలం వెళితే మీది ఆంధ్రా కాబట్టి వైద్యం అందించమని కూడా చెబుతున్నారు. ఇప్పుడు పాడేరు వెళ్లాలంటే మాకు సాధ్యమా? వికలాంగులకు సదరం సర్టిఫికెట్ కావాలన్నా మేము జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే మాకు ఎంత కష్టం ఉంటుంది" అంటూ తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారుటూరి సత్యన్నారాయణ అనే ఉపాధ్యాయుడు.

మా పరిస్థితిని ప్రత్యేకంగా చూడాలి..
రాష్ట్రాల విభజన మూలంగా సమీప తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా కేంద్రం 50 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఇప్పుడు ప్రతిపాదించిన పాడేరు జిల్లా కేంద్రం సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉండడం వారిని కలవరపెడుతోంది.
తమను మళ్లీ తెలంగాణలో కలిపేయాలంటూ ఆందోళనకు పూనుకున్నారు. రిలే దీక్షలు, ర్యాలీలు, రాస్తారోకో వంటివి చేపట్టారు.
"మాది ప్రత్యేక సమస్య. ఎవరికీ ఇలాంటి ఇబ్బంది రాదు. జిల్లా కేంద్రానికి, ఆర్డీవో ఆఫీసుకి వెళ్ళాలంటే రెండు మూడొందల కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే గిరిజనులకు సాధ్యమా? జిల్లాల విభజన సమస్యలు తగ్గించాలి కానీ, ఇప్పుడు మరింత తీవ్రమవుతుంది. ఏపీలో కలపకముందు మాతో కలిసి ఉన్నవాళ్లకు 50కిలోమీటర్ల దూరంలో జిల్లా కలెక్టర్ ఆఫీసు ఉంటే, మాకు మాత్రం అంతదూరం వెళ్లడం ఎలా వీలవుతుంది? రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసినా కొంత ఉపశమనంగానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అన్యాయం జరుగుతుంది" అంటున్నారు స్థానికుడు డేగల రామకృష్ణ.
జిల్లాల విభజన సందర్భంగా రంపచోడవరం కేంద్రంగా పోలవరం విలీన మండలాలతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాల్లోని మన్యం ప్రాంతాన్ని ప్రత్యేకంగా జిల్లా చేయాలనే డిమాండ్ కొందరు ముందుకు తీసుకొచ్చారు. నోటిఫికేషన్ పై ప్రభుత్వానికి తమ అభ్యంతరాలను కూడా తెలియజేశారు.

తెలంగాణలో కలిపేయాలి
"ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా ఎటువంటి నిర్మాణాలు లేవు. విద్య, వైద్యం కూడా అందడం లేదు. కనీసం ఫైర్ ఇంజిన్ రావాలంటే 200 కిలోమీటర్ల దూరం అవుతుంది. రోడ్లు, వంతెనలు సహా ఎటువంటి పనులు ముందుకు సాగలేదు. పోలవరం విలీనం కారణంగా నిర్వాసితులవుతున్న వారికి పరిహారం అందించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి. అందుకు అనుగుణంగా పాలన ఉండాలి. కానీ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ తీరు దానికి భిన్నంగా ఉంది. దానివల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతోంది. అన్ని రకాలుగా వెనుకబడిపోతున్నారు" అంటున్నారు సీపీఐ నాయకుడు రావులపల్లి రామ్ ప్రసాద్.
వీలయితే నాలుగు మండలాలు లేదా కనీసం భద్రాచలానికి ఆనుకుని ఉన్న గ్రామాలనయినా తెలంగాణకు అప్పగించాలని ఆయన కోరుతున్నారు.

రియల్ ఎస్టేట్ కోసమే..
ఓవైపు ఐదు గ్రామాలను తెలంగాణలో కలిపేయాలంటూ ఆందోళనలు సాగుతుండగా, మరోవైపు గిరిజనులకు ప్రత్యేక జిల్లా అవసరమంటూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ నేతలు కోరుతున్నారు. రంపచోడవరం కేంద్రంగా జిల్లా చేయాలని డిమాండ్ చేస్తోంది.
"పోలవరం పునరావాసం అందరికీ అందాలి. గిరిజనుల హక్కులు పరిరక్షించాలి. భద్రాచలంలో కలిపితే గిరిజనుల హక్కులు దక్కవు. కాబట్టి ప్రత్యేకంగా రంపచోడవరం జిల్లా చేయడం అవసరం. రియల్ ఎస్టేట్ కోసమే కొందరు ఐదు గ్రామాలను భద్రాచలంలో కలపాలని అడుగుతున్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి" అంటున్నారు గిరిజన నేత సొండు వీరయ్య.
"తమను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలంటూ ఎటపాక మండలంలో ఉన్న ఐదు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్న దానిపై తమకు అలాంటి ఆలోచన లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ నుంచి కూడా అలాంటి ప్రతిపాదనలు ఏమీ లేవని భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం అధికారులు తెలిపారు. విభజన చట్టం అమలులోకి రాకముందే క్యాబినెట్ తీర్మానం ద్వారా చట్ట సవరణ చేసి విలీన మండలాలను ఏపీకి బదలాయించారు. ఏపీ నుంచి తిరిగి తెలంగాణకు వాటిని అప్పగించాలంటే దానికి చాలా పెద్ద ప్రక్రియ ఉంటుందని, అందుకు ఉభయ రాష్ట్రాలతో పాటుగా కేంద్రం కూడా నిర్ణయం తీసుకోవాలని" న్యాయ నిపుణుడు బంగారు రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
విభజన జరిగిన సమయంలో కేంద్రం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం పట్టువిడుపులతో సాగింది. పలితంగా ప్రస్తుతం ఏపీలో కలిసిన మండలాల ప్రజలకు సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని గమనంలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటే దానికి మరోసారి పార్లమెంట్ ఆమోదం అవసరం అవుతుంది అంటూ ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- తిరుపతి పుట్టిన రోజు: ఈ నగరానికి రామానుజాచార్యులు శిలాఫలకం వేశారా, దీనిపై ఇంత చర్చ ఎందుకు
- పుష్ప: తగ్గేదే లే.. అంటూ బాలీవుడ్‌కు పోటీ ఇస్తున్న దక్షిణాది సినిమా
- రష్యా-యుక్రెయిన్ సంక్షోభం: భారత వైఖరిపై ఇంత చర్చ ఎందుకు
- యుక్రెయిన్ సంక్షోభ సమయంలో ఇమ్రాన్‌ఖాన్ రష్యా ఎందుకు వెళ్లారు, భారత్‌పై చూపే ప్రభావమేమిటి?
- డీఫిబ్రిలేషన్ ఇచ్చి ఉంటే మంత్రి గౌతమ్ రెడ్డి ప్రాణాలు కాపాడగలిగేవారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













