భావన మేనన్: లైంగిక దాడికి గురైన అయిదేళ్లకు గొంతు విప్పిన నటి, ఆమె ఏం చెప్పారంటే...

భావన మేనన్ 80కి పైగా చిత్రాల్లో నటించారు

ఫొటో సోర్స్, BHAVANA MENON

ఫొటో క్యాప్షన్, భావన మేనన్ 80కి పైగా చిత్రాల్లో నటించారు
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

తెలుగుతో పాటు పలు దక్షిణాది చిత్రాల్లో నటించిన మలయాళీ నటి భావన మేనన్‌ మీద 2017లో లైంగిక దాడి జరిగింది. ఆమెను కొందరు కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ ఘటనపై అయిదేళ్ల తరువాత భావన గొంతు విప్పారు. 'బాధితురాలి దశ నుంచి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొని నిలిచిన దశ' వరకూ సాగిన తన జీవన ప్రయాణాన్ని ఆమె వివరించారు.

భావన సుమారు 80 దక్షిణాది భాషా చిత్రాల్లో నటించారు. నటిగా అనేక అవార్డులు కూడా అందుకున్నారు. 2017 ఫిబ్రవరిలో త్రిసూర్ నుంచి కొచ్చికి బస్సులో వెళుతుండగా కొంత మంది పురుషులు ఆమెపై లైంగిక దాడి చేశారు.

ఈ దాడి నిందితుల్లో ఆమె సహ నటుడు దిలీప్ పేరు కూడా వినిపించింది. దీంతో, ఆమెపై జరిగిన దాడి వార్తల్లోకెక్కింది. దిలీప్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే, ఆయన తనపై వచ్చిన అభియోగాలను ఖండించారు.

పోలీసులు దిలీప్‌ను అరెస్ట్ చేసి మూడు నెలలు జైలులో ఉంచారు. తర్వాత ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది.

"నేనొక సాధారణ అమ్మాయిని. ఈ ఘటన నా జీవితాన్ని తలకిందులు చేసింది. సోషల్ మీడియాలో నవ్వుతూ కనిపించే నా ఫోటోలను చాలా మంది చూస్తారు. కానీ, నేను నరకాన్ని చూసి కోలుకున్నాను" అని బీబీసీతో భావన చెప్పారు.

వీడియో క్యాప్షన్, నటి భావనపై లైంగిక దాడి కేసు: ఆ రోజు ఏం జరిగింది? నిందితులు ఎవరు?

"నేను ఒక బాధితురాలిగా మారాను. 'దాడికి గురైన నటి'గా పిలిచేవారు. నాకే ఇలా ఎందుకు జరిగింది అంటూ బాధపడేదాన్ని. నన్ను నేనే నిందించుకుంటూ బయటపడే మార్గాన్ని వెతుక్కుంటూ ఉండేదాన్ని" అని అన్నారు.

"2020లో ఈ కేసు విచారణ మొదలయ్యాక కోర్టు, సాక్ష్యాలు అంటూ 15 రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. ఓవైపు నేను జరిగిందంతా మర్చిపోయి ముందుకు సాగాలని అనుకున్నా. కానీ, కోర్టులో చెప్పడం కోసం నాకు జరిగిన ప్రతీ చిన్న అంశాన్ని కూడా నేను గుర్తు చేసుకోవాల్సి వచ్చేది'' అని ఆమె గుర్తు చేసుకున్నారు.

దాడికి గురైన రోజు ఆమె బస్సులో త్రిసూర్ నుంచి కొచ్చి వెళుతున్నారు. ఆ మరుసటి రోజు ఉదయం ఒక సినిమా కోసం డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. అదే సమయంలో ఆమెను కిడ్నాప్ చేశారు. ఆమెపై దాడి చేస్తూ దుండగులు వీడియోలు తీసుకున్నారు. ''వాళ్ళు నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని అనుకుని ఉంటారు" అని ఆమె చెప్పారు.

2017లో మూడు నెలల పాటు నటుడు దిలీప్ జైలులో ఉన్నారు

ఫొటో సోర్స్, ARUN CHANDRA BOSE

ఫొటో క్యాప్షన్, 2017లో మూడు నెలల పాటు నటుడు దిలీప్ జైలులో ఉన్నారు

ఇందులో ఉన్న ఇద్దరు వ్యక్తులూ ప్రముఖ నటులే కావడంతో ఈ ఘటన మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. కొన్ని స్థానిక చానెళ్లు ఈ అంశంపై చర్చలు కూడా నిర్వహించాయి.

కొంతమంది సోషల్ మీడియాలో బాధితురాలిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. రాత్రి 7 గంటల సమయంలో ఆమె ప్రయాణం చేయాల్సిన అవసరమేంటి? అంటూ అని ఆమె నైతికత గురించి ప్రశ్నలు వేశారు. ఇది కల్పిత కేసు అని మరికొంతమంది ఆరోపించారు.

"నేను కుమిలిపోయాను. నా గుండె పగిలిపోయింది. ఈ విషయాలన్నీ నన్ను చాలా బాధపెట్టాయి. కొన్నిసార్లు గట్టిగా అరవాలనిపించేది" అని ఆమె మోజో స్టోరీ అనే డిజిటల్ పోర్టల్‌కు చెప్పారు.

"నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి నన్ను అవమానపరిచారు."

''భారతీయ చట్టాల ప్రకారం లైంగిక వేధింపులకు గురైన వారి వివరాలను గోప్యంగా ఉంచాలి. కానీ, ఘటన జరిగినరోజు నుంచే ఆ దాడి నాపైనే జరిగినట్లు అందరికీ తెలిసిపోయింది'' అని భావన చెప్పారు.

"నేనొక పేరున్న నటిని. మొదట్లో నేను కేవలం కిడ్నాప్‌కు గురైనట్లే వార్తలు వచ్చాయి. కొన్ని టీవీ చానెళ్లు నా ఫోటోలను చూపించాయి. లైంగిక దాడి గురించి తెలియగానే ఫోటోలు, పేరు తీసేసినప్పటికీ అప్పటికే నాగురించి అందరికీ తెలిసింది'' అని చెప్పుకొచ్చారు.

లైంగిక దాడికి గురైన ఐదేళ్ల తర్వాత ఈ ఏడాది జనవరిలో తొలిసారి భావన తనపై దాడి జరిగినట్లు, ఆ దుర్ఘటన నుంచి బయటపడినట్లు పేర్కొంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.

"ఇదంత సులభమైన ప్రయాణం కాదు. బాధితురాలి స్థితి నుంచి బయటపడి నిలదొక్కుకునే స్థితికి చేరాను. లైంగిక దాడి బాధితురాలు అనే బరువును నాపై మోపి ఈ ఐదేళ్లలో నా ఉనికిని, నా పేరును అణిచివేశారు'' అని ఆమె రాశారు.

"నేరం చేసింది నేను కాకపోయినప్పటికీ, నన్ను అవమానించి నా గొంతును నొక్కేసి, ఒంటరి చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అటువంటి సమయాల్లోనే నా గొంతును వినిపించేందుకు నాకు కొందరి మద్దతు లభించింది. నాకు మద్దతిచ్చే గొంతులు వింటున్నప్పుడు న్యాయం కోసం చేసే ఈ పోరాటంలో నేను ఒంటరిని కాదని అనిపిస్తుంది" అని అన్నారు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది

ఆమె రాసిన పోస్టును ప్రముఖ మలయాళీ నటులు మోహన్‌లాల్, మమ్ముట్టి తమ ట్విటర్ అకౌంట్సులో షేర్ చేశారు. చాలా మంది బాలీవుడ్ నటీమణులు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు.

"గొంతెత్తాలని నిర్ణయించుకొని భావన మేనన్ తెగువను ప్రదర్శించారు'' అని 'ది న్యూస్ మినిట్‌' వెబ్‌సైట్ ఎడిటర్ ధన్య రాజేంద్రన్ అన్నారు.

"లైంగిక దాడి జరగడమే చింతించాల్సిన అంశం. పైగా భావన, పేరున్న వ్యక్తి కావడంతో ప్రజల నుంచి సునిశితమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చిత్ర పరిశ్రమ నుంచి కూడా ఆమె రకరకాల వ్యాఖ్యానాలు వినాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. ఆమెపై దాడిని చిత్రించిన వీడియో కూడా ఉంది. ఆ వీడియో ఎక్కడ బహిర్గతం అవుతుందో అనే భయం నిత్యం వెంటాడుతూనే ఉంటుంది'' అని అన్నారు.

సెలెబ్రిటీ కావడంతో ఆమెకు కొన్ని ప్రత్యేకతలున్నాయని తెలుసు. ఆమెకు భర్త, కుటుంబ సహకారం పూర్తిగా ఉంది. ఈ కేసు పోరాడేందుకు తగిన ఆర్థిక స్తోమత ఉంది. కానీ, గత ఐదేళ్లూ ఆమెకు అంత సులభంగా గడవలేదు.

"ఈ విషయాన్ని వదిలిపెట్టేయాలని కనీసం ఒక వందసార్లు అనుకొని ఉంటాను. దేశం వదిలి ఎక్కడికైనా పారిపోయి కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టాలని అనుకున్నాను. చాలాసార్లు ప్రాణాలు తీసుకోవాలని కూడా అనిపించింది" అని అన్నారు.

"మరి ఆమెను ముందుకు నడిపించిన అంశమేంటని అడిగాను?"

"ఈ విషయాన్ని వదిలేయాలని అనుకున్న ప్రతీసారి, 24 గంటల తర్వాత నా మనసును మార్చుకుంటూ ఉండేదాన్ని. ఇది నా ఆత్మాభిమానానికి సంబంధించిన సమస్య. కాబట్టి నేనేమీ తప్పు చేయలేదని, నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి అనుకునేదాన్ని" అని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, దివ్యవాణి: 'సినీ పరిశ్రమలో నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎదుర్కొన్నాను'

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)