Women's Day: అత్యంత వెనుకబడిన తెగ, అడుగడుగునా ఆటంకాలే.. అయినా, ఎవరెస్ట్ ఎక్కడమే లక్ష్యంగా ప్రయాణం

హిమాలయ పర్వాతాల సమీపంలో కన్నీబాయి

ఫొటో సోర్స్, KANNIBAI

ఫొటో క్యాప్షన్, హిమాలయ పర్వాతాల సమీపంలో కన్నీబాయి
    • రచయిత, శుభం ప్రవీణ్ కుమార్
    • హోదా, బీబీసీ కోసం....

"నేను ఆదివాసీ 'కొలాం' జాతిలో పుట్టిపెరిగాను. మా తెగ సంప్రదాయాల ప్రకారం నెలసరి వస్తే గూడెం బయట గుడిసెల్లో ఉంచుతారు. ఇలా గుడిసెల నుంచి మొదలైన నా జీవితం, పర్వతారోహణలో భాగంగా హిమాలయాలలో క్యాంప్ వేసే స్థాయికి చేరింది'' అని ఆత్మవిశ్వాసంతో చెప్పారు కన్నీబాయి.

మడావి కన్నీబాయి కొమురంభీమ్ జిల్లా కెరామెరి మండలం 'భీమన్ గోంది'కి చెందినవారు. తమ తెగలో ఆడపిల్లపై ఉండే అనేక ఆంక్షల మధ్య నుంచి 'తెలంగాణ అడ్వెంచర్ టూరిజం' బ్రాండ్ అంబాసిడర్ వరకు సాగిన తన ప్రస్థానాన్ని ఆమె బీబీసీకి వివరించారు.

పర్వతాలను ఎక్కాలనుకునే వారికి శిక్షణ కూడా ఇస్తున్నారు కన్నీబాయి. ఈ స్థాయికి చేరడానికి ఆమె చాలా శ్రమించాల్సి వచ్చింది.

వీడియో క్యాప్షన్, ఆదివాసీ గూడెం నుంచి 'తెలంగాణ అడ్వెంచర్ టూరిజం' బ్రాండ్ అంబాసిడర్ అయిన మడావి కన్నీబాయి..

కొలాం తెగ- అత్యల్ప జనాభా, మూఢనమ్మకాలు

అభివృద్దికి దూరంగా అత్యంత వెనుకబడిన తెగగా, ఎక్కువగా మూఢ నమ్మకాలు పాటించే తెగగా 'కొలాం' తెగను భావిస్తారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు మహారాష్ట్రలోనూ వీరు ఎక్కువగా కనిపిస్తారు. తెలంగాణలో ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో వీరు ఎక్కువగా కనిపిస్తారు.

నెలసరి సమయంలో మహిళలను గూడెం బయట ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గుడిసెలలో ఉంచుతారు. ఈ క్రమంలో పాము కాట్లకు, చిరుతపులి దాడులకు గురైన సంఘటనలు ఉన్నాయి. గత ఏడాది ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం 'ధరమడుగు'లో కొలాం మహిళ ఒకరు ఇలాగే పాము కాటుతో ప్రాణాలు కోల్పోయారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: కొండరెడ్ల జీవితాల్లో అక్షర దీపం వెలిగిస్తున్న కొండబడి

''కొలాం గిరిజనుల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. అయితే వారిని ఒప్పించడం అంత త్వరగా సాధ్యమయ్యేది కాదు. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రసవం కోసం కొంతమంది ఆసుపత్రులకు వెళ్తున్నారు. పాత తరం అంత త్వరగా మా మాట వినడం లేదు. అక్షరాస్యులైన కొత్త తరంతోనే మార్పు సాధ్యమని భావిస్తున్నాం'' అని కొలాం తెగకే చెందిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు 'కుమ్ర ఈశ్వరీ బాయి' బీబీసీ తో అన్నారు.

పర్వతారోహకుల బృందంతో కన్నీబాయి

ఫొటో సోర్స్, KANNIBAI

ఫొటో క్యాప్షన్, పర్వతారోహకుల బృందంతో కన్నీబాయి

ఆచారం పేరుతో కొలాం మహిళలు పీరియడ్స్ సమయంలో గూడెం బయట గుడిసెల్లో ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతుండటంతో, అంగన్వాడీ కేంద్రాలు ఉన్న గూడేలలో వాటిని ఆనుకుని వీరి కోసం ప్రత్యేక హాల్‌లను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లు ఈశ్వరీబాయి వివరించారు.

''కొలాం ఆదివాసుల్లోనే కాదు నాగరిక ప్రపంచంలోనూ పీరియడ్స్ సమయంలో మహిళల పట్ల వివక్ష వివిధ రూపాల్లో కొనసాగుతోంది. కొలాంలకు వారికి అది తమ ఆచారం అని మాత్రమే తెలుసు. తప్పు అన్న అవగాహన కూడా ఉండదు. దీని వెనుక వారికి సామాజిక, సాంస్కృతిక కారణాలు ఉండొచ్చు. వారిలో మార్పు తీసుకురావలనుకుంటే వారి దగ్గరికి విద్యా, వైద్యం చేరాలి" అని శాతవాహన యూనివర్సిటీ సామాజిక శాస్త్ర విభాగం ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత బీబీసీతో అన్నారు.

సాహసక్రీడల్లో అనేకమందికి కన్నీబాయి శిక్షణ కూడా ఇస్తున్నారు
ఫొటో క్యాప్షన్, సాహసక్రీడల్లో అనేకమందికి కన్నీబాయి శిక్షణ కూడా ఇస్తున్నారు

సాహస క్రీడలంటే తెలియదు

సాహస క్రీడల్లో భాగంగా పర్వాతారోహకురాలిగా మారడం, ఆ తర్వాత మరికొందరికి శిక్షణ ఇచ్చే స్థాయికి చేరడం వెనుక చాలా శ్రమపడ్డానని, చదువు మొదలుపెట్టేందుకే ఇబ్బందులు పడాల్సి వచ్చిందని కన్నీబాయి వివరించారు.

''నన్ను స్కూల్‌లో చేర్చాలన్నా మా నాన్న నిర్ణయాన్ని మా గూడెం పెద్దలు వ్యతిరేకించారు. గ్రామ బహిష్కరణ చేస్తామని బెదిరించారు. కొలాం జాతి అమ్మాయిలు బయటకు వెళ్లొద్దు అని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. అప్పట్లో చిన్న వయసులోనే వివాహాలు జరిపించేవారు. గూడెం పెద్దల మాటకు ఎదురుచెప్పే పరిస్థితులు లేవు. అయితే మా నాన్న మాత్రం ఈ విషయాలు పట్టించుకోవద్దని నాతో అనేవారు. ఆయన ఇచ్చిన ధైర్యంతో హైస్కూల్, కాలేజ్ చదువులు కొనసాగించాను'' అన్నారు కన్నీబాయి.

2014లో ఓ పత్రికలో వచ్చిన ప్రకటనతో తొలిసారి 'అడ్వెంచర్ గేమ్స్' గురించి కన్నీబాయికి తెలిసింది. చదువుకునే సమయంలో క్రీడల పట్ల ఉన్న ఆసక్తితో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన సాహస క్రీడల క్యాంప్ కు హాజరయ్యారామె. ఆ తర్వాత తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందారు.

ప్రస్తుతం కన్నీబాయి 'తెలంగాణ అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు.

కన్నీబాయి

ఫొటో సోర్స్, KANNIBAI

2020 జనవరిలో విశాఖ 'కటికి వాటర్ పాల్స్' వద్ద నిర్వహించిన 'వరల్డ్ వాటర్‌ఫాల్ రాపెల్లింగ్ పోటీల్లో 18 దేశాల క్రీడాకారులతో పోటీపడి గోల్డ్ మెడల్ సాధించారు. హిమాలయ శ్రేణుల్లోని భాగీరథి-2 పర్వాతాన్ని అధిరోహించారు. ప్రస్తుతం అవే శ్రేణుల్లోని పంగర్చులా శిఖరం ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు.

''నాకు మొదట్లో సాహస క్రీడలంటే ఏంటో తెలియదు. సాహస క్రీడలంటే సాహసాలు బాగా చేయొచ్చనుకుని క్యాంప్‌కు హాజరయ్యాను. అక్కడే నాకు వాటర్ ఫాల్ రాపెలింగ్, జుమరింగ్, పారా గ్లైండింగ్‌ల గురించి తెలిసింది. వీటిలో ప్రతిభ కనబరిస్తే పర్వాతారోహణకు ఎంపిక చేస్తారని తెలుసుకున్నా. అలా పర్వాతారోహణపై ఆసక్తి పెరిగింది'' అని వివరించారు కన్నీబాయి.

''ఇప్పుడు నా గోల్ ఎవరెస్ట్ శిఖరం. నేను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలి. విజయం సాధించాలి. నాలాంటి ఆడపిల్లలను మరెందరినో తయారు చేయాలి. ముఖ్యంగా మా ఆదివాసీ మహిళలకి కచ్చితంగా ఒక భరోసాను ఇవ్వాలి'' అని కన్నీబాయి వివరించారు.

కొండకోనల్లో పుట్టిపెరిగిన తనకు పర్వాతారోహణ పెద్ద కష్టం కాదంటారు కన్నీబాయి

ఫొటో సోర్స్, KANNIBAI

ఫొటో క్యాప్షన్, కొండకోనల్లో పుట్టిపెరిగిన తనకు పర్వాతారోహణ పెద్ద కష్టం కాదంటారు కన్నీబాయి

క్రీడలతోనే ఉపాధి మార్గం

ఓవైపు పర్వాతారోహణ కొనసాగిస్తూ మరోవైపు స్థానిక యువతకు సాహసక్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు కన్నీబాయి.

రాక్ క్లైంబింగ్, జిప్ సైక్లింగ్, వాటర్ ఫాల్ రాపెలింగ్ లాంటి అంశాల్లో తెలంగాణ అడ్వెంచర్ టూరిజం క్లబ్, టూరిజం శాఖ సహకారంతో ప్రత్యేక క్యాంప్ లలో భాగంగా యువతకు ట్రైనింగ్ క్యాంప్ లు ఏర్పాటు చేసి మరింతమందిని ఈ క్రీడల వైపు ఆసక్తి పెంచుకునేందుకు ప్రోత్సహిస్తున్నారు.

ఇందులో ఆదివాసీ యువత కూడా ఉన్నారు. ఇలా ఆమె ఆధ్వర్యంలో శిక్షణ పొందినవారు ఆ క్రీడల ద్వారానే ఉపాధి పొందేలా చేసారు.

ఆమె వద్ద శిక్షణ పొందిన ఆదివాసీ యువత కొందరు ఆదిలాబాద్ శివారులోని మావల ఫారెస్ట్ పార్క్ లో ''అడ్వెంచర్ పార్క్'' విభాగాన్ని ఏర్పాటు చేసి ఫారెస్ట్ శాఖతో సంయుక్తంగా నిర్వహిస్తూ ఉపాధి పొందారు.

2020లో హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం లో ట్రైనీ ఐఏఎస్ అధికారులకు సాహస క్రీడలపై కన్నీబాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో సాహసక్రీడల అభివృదికి కృషి సాగిస్తున్నారు.

ఆదివాసీలను అవగాహానా కార్యక్రమాలతో చైతన్యపరుస్తున్నారు కన్నీబాయి
ఫొటో క్యాప్షన్, ఆదివాసీలను అవగాహానా కార్యక్రమాలతో చైతన్యపరుస్తున్నారు కన్నీబాయి

ఆదివాసీ మహిళ చైతన్యం కోసం...

ఓ వైపు సాహస క్రీడలతో పాటు మరోవైపు ఆదివాసీ మహిళల్లో చైతన్యం కోసం కన్నీబాయి కార్యక్రమాలు కొనసాగాయి.

గతంలో ఆదిలాబాద్ జిల్లా కెరామెరి మండలానికి చెందిన ఇద్దరు 'నాయక్ పోడ్' ఆదివాసీ తెగ యువతులను రాజస్థాన్‌కు అక్రమ రవాణా చేసిన సందర్భంలో కన్నీబాయి ముందుండి పోరాడి వారిని తిరిగి రప్పించారు.

కొలాం ఆదివాసీ మహిళా సంఘంలో పనిచేసే క్రమంలో తిర్యాణి, ఆసిఫాబాద్, కెరమెరి మండలాల పరిధిలో ఆదివాసీలకు అటవీ భూముల హక్కు పత్రాల సాధన, కంటి చూపు మందగించిన వృద్ధులకు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్లు జరిగేలా చూశారు.

వీడియో క్యాప్షన్, 'యుక్రెయిన్‌ నుంచి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని వచ్చేశాం' - సాయి నిఖిత
కన్నీబాయి

ఫొటో సోర్స్, KANNIBAI

మంత్రాల నెపంతో ఆదివాసుల్లో జరిగే దాడులు, వైద్యానికి విముఖత చూపే సందర్భంలో జరిగే శిశు మరణాలు, నాటు వైద్యం వల్ల కలిగే నష్టాల పై 'జనమైత్రి' పేరుతో అధికారుల సహాయంతో అవగాహన కల్పించే ప్రయత్నం చేసారు.

కోవిడ్ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల పై తమ కొలామి భాషలో తానే పాటలు పాడి ప్రచారం చేసారు.

మాలో మూఢనమ్మకాలు,మహిళలపై వివక్ష పోవాలి. కొండలు,గుట్టల్లో పుట్టి పెరిగిన మాకు పర్వతారోహణ కొత్తేమి కాదనే కన్నీబాయి మరింత మంది ఆదివాసీ యువతులు సాహసక్రీడల వైపు ధైర్యంగా ముందుకు రావాలని ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)