యుక్రెయిన్-రష్యా యుద్ధం: సాల్ట్ రాక్ గుహల్లో చమురును దాచి పెట్టిన అమెరికా

అమెరికా చమురు నిల్వ చేసే గుహ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాలో చమురు నిల్వ చేసే గుహ

రష్యా, యుక్రెయిన్ మధ్య కొన్ని రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. దీంతో చమురు సంక్షోభం ముంచుకొస్తుందన్న భయం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది.

ఇటీవల చమురు ధర బ్యారెల్‌కు వంద డాలర్ల మార్కును దాటేసింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా, యూరప్‌ సహా అన్ని దేశాలపై చమురు సంక్షోభం ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.

ఇలాంటి గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు అమెరికా దృష్టి చమురుతో నిండిన గుహలపై పడుతుంది. ఇవి అమెరికాలోని లూసియానా, టెక్సస్‌ రాష్ట్రాల్లో ఉన్నాయి.

ప్రస్తుత రష్యా, యుక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అమెరికా సహా అంతర్జాతీయ ఇంధన సంస్థకు అనుబంధంగా ఉన్న మరికొన్ని దేశాలు చమురు ధరలను నియంత్రించడానికి 60 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేయాలని నిర్ణయించాయి.

అమెరికా భౌగోళిక చమురు నిల్వలు చాలా పెద్దవి. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు డిమాండ్‌కు తగ్గట్టుగా చమురు సరఫరా చేయడానికి, ధరలను అదుపులో ఉంచడానికి అమెరికాకు ఇవి సాయం చేస్తున్నాయి.

అమెరికా చమురు నిల్వ చేసే గుహ

ఫొటో సోర్స్, Getty Images

ఉప్పు, చమురు

అమెరికాలోని ఈ చమురు నిల్వలు 60 సాల్ట్ రాక్‌ గుహల్లో ఉన్నాయి. లూసియానాలోని బెటన్ రాగ్ నుంచి టెక్సస్‌లోని ఫ్రీపోర్ట్ వరకు ఇవి వ్యాపించి ఉన్నాయి.

చమురును నిల్వ చేయడానికి ఉప్పు చాలా బాగా పనికొస్తుంది. ఈ రెండు ఒకదానిలో ఒకటి కలవవు. అందుకే చమురును నిల్వ చేయడానికి ఇలాంటి గుహలు ఉత్తమమైనవి.

ఈ గుహల్లో 70 కోట్ల బ్యారెళ్ల చమురును నిల్వ చేయొచ్చు. అమెరికా ఇంధన విభాగం చెప్పిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 25 నాటికి ఈ గుహల్లో 58 కోట్ల బ్యారెళ్ల చమురును నిల్వ చేశారు.

వీడియో క్యాప్షన్, ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న దేశంలో పెట్రోల్ దొరకట్లేదు

కానీ పై నుంచి చూస్తే కొన్ని బావులు, పైపులు తప్ప మనకు పెద్దగా ఏమీ కనిపించదు.

ఈ పైపులు భూమి లోపల కొన్ని వేల మీటర్ల వరకు ఉంటాయి. వీటి సాయంతోనే అవసరమైనప్పుడు చమురును బయటకు తీస్తారు.

అయితే, సాల్ట్ రాక్‌తో నిర్మించిన ఈ గుహలు పూర్తి స్థిరంగా ఉండవు. వాటి పైకప్పు లేదా గోడలు అప్పుడప్పుడు కూలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు లోపలున్న యంత్రాలు ధ్వంసమవుతాయి. అందుకే ప్రమాదం జరిగే అవకాశం లేని చోట ఆ యంత్రాలను చాలా జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది.

ఆ యంత్రాల నిర్వహణ కూడా చాలా ఖర్చుతో కూడిన పని. వాటి నిర్వహణ కోసం ఏడాదికి సుమారు 15వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు.

వీటి సాయంతో చమురు సరఫరాలో సంక్షోభం వచ్చినా కూడా ఆ ప్రభావం తనపై పడకుండా అమెరికా తప్పించుకోగలుగుతుంది.

అంతేకాదు.. బయటి ప్రపంచం నుంచి కొత్తగా చమురు కొనుగోలు చేయకుండా తన దగ్గరున్న నిల్వలను వాడుకుంటూ కొన్ని నెలల పాటు తన ఇంధన అవసరాలు తీర్చుకోగలదు.

చమురు నిల్వ

ఫొటో సోర్స్, Getty Images

చమురు నిల్వలను అమెరికా ఎందుకు సృష్టించింది?

అమెరికా ఇలా చమురు నిల్వ చేయడానికి గల కారణాల మూలాలు 1973 నాటి యోమ్ కిప్పూర్ యుద్ధంలో ఉన్నాయి. ఈ యుద్ధంలో పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చాయి.

దీంతో ఆగ్రహించిన అరబ్ దేశాలు పాశ్చాత్య దేశాలకు చమురు సరఫరా చేసేందుకు నిరాకరించాయి. ఇది ఆర్థిక సంక్షోభానికి దారి తీసింది.

అరబ్ దేశాల నిర్ణయం కారణంగా 1974 నాటికి తీవ్రమైన చమురు కొరత ఏర్పడింది. డిమాండ్‌కు సరిపడా చమురు సరఫరా లేకపోవడంతో ముడి చమురు ధర నాలుగు రెట్లు పెరిగింది.

ఈ సంక్షోభం వల్ల అమెరికా కూడా చాలా చమురు కొరత ఎదుర్కోవాల్సి వచ్చింది.

వీడియో క్యాప్షన్, అంతర్జాతీయంగా గరిష్టానికి చేరిన క్రూడాయిల్ ధరలు, త్వరలో ఆ భారం మోయాల్సింది మనమే

పెట్రోల్ కోసం అమెరికన్లు బంకుల వద్ద పొడవాటి లైన్లలో గంటల తరబడి నిల్చోవాల్సి వచ్చింది.

పరిస్థితి ఎంత వరకు వచ్చిందంటే.. తమ దగ్గరున్న పెట్రోల్‌ను ఎవరైనా దొంగతనం చేస్తారేమోనన్న భయంతో అమెరికన్లు తుపాకులు పట్టుకుని తిరగడం మొదలుపెట్టారు.

ఆ రోజుల్లో అమెరికా పారిశ్రామిక రంగం చౌకగా దొరికే చమురుపై ఆధారపడి ఉండేది. కానీ చమురు సంక్షోభం కారణంగా ఆ పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చింది.

అందుకే చమురు మార్కెట్‌ ఒడుదొడుకుల నుంచి రక్షించుకోవడానికి 1975లో వ్యూహాత్మక చమురు నిల్వలను అమెరికా నిర్మించాల్సి వచ్చింది. అలా చేయడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు అమెరికాకు నష్టం జరగకుండా చూసుకోవచ్చని భావించారు.

1991 గల్ఫ్ యుద్ధం, 2005లో కత్రినా తుపాను సమయంలో అమెరికా ఇంధన రంగంపై ప్రభావం పడింది. కానీ చమురు సరఫరాలో ఏర్పడిన కొరతను ఈ వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి భర్తీ చేశారు. అలా ఆ గండం నుంచి గట్టెక్కారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)