యుక్రెయిన్‌పై రష్యా దండెత్తినా అమెరికా సైన్యాన్ని అధ్యక్షుడు జో బైడెన్ ఎందుకు రంగంలోకి దించలేదు? మీరు తెలుసుకోవాల్సిన 6 కీలక అంశాలు..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బార్బరా ప్లెట్ ఉషెర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
యుక్రెయిన్‌పై రష్యా దాడిని తిప్పికొట్టేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దౌత్య మార్గాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు.
యుక్రెయిన్‌పై రష్యా ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చని బైడెన్ పాలక వర్గం మొదట్నుంచీ హెచ్చరికలు చేస్తూనే ఉంది. ఈ దాడి వల్ల ప్రపంచ శాంతి భద్రతలకు ముప్పు పొంచి వుందని హెచ్చరించింది. వారి అంచనాల ప్రకారం రష్యా దాడిని చేసింది కూడా.
రష్యా దాడికి సిద్ధంగా ఉన్నప్పటికీ, నేరుగా తలపడేందుకు అమెరికన్లు సిద్ధంగాలేరని జో బైడెన్ స్పష్టంచేశారు. యుక్రెయిన్‌లోని అమెరికా పౌరులను కాపాడేందుకు బలగాలను పంపే అవకాశాన్ని కూడా బైడెన్ తోసిపుచ్చారు. అంతేకాదు సైనిక సలహాదారులు, పరిశీలకులను ముందుగానే యుక్రెయిన్ నుంచి వెనక్కి తీసుకొచ్చేశారు.
తీవ్రమైన ఈ సంక్షోభంలో నేరుగా సైనిక చర్యలు తీసుకోకూడదని బైడెన్ ఎందుకు హద్దులు పెట్టుకున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
1. జాతీయ ప్రయోజనాలు లేవు..
మొదటగా యుక్రెయిన్.. అమెరికా పొరుగున లేదు. ఈ రెండు దేశాలకు సరిహద్దు లేదు. పైగా యుక్రెయిన్‌లో అమెరికా సైనిక స్థావరం కూడా ఏర్పాటు చేయలేదు.
యుక్రెయిన్‌లో వ్యూహాత్మక చమురు నిల్వలు లేవు. పైగా యుక్రెయిన్ అమెరికాకు ప్రధాన వాణిజ్య భాగస్వామి కాదు.
అయితే చరిత్రను పరిశీలిస్తే, జాతీయ ప్రయోజనాలు లేనంత మాత్రాన, అమెరికా నేరుగా సైనిక చర్యలు చేపట్టకుండా లేదు. తమ మిత్ర దేశాల తరఫున ఇదివరకు చాలాసార్లు అమెరికా సైనిక జోక్యం చేసుకుంది.
1995లో బిల్ క్లింటన్.. యుగోస్లావియా కుప్పకూలడంతో మొదలైన యుద్ధంలో జోక్యం చేసుకున్నారు. 2011లో లిబియా అంతర్యుద్ధ సమయంలో ఒబామా కూడా అదే చేశారు. మానవతా దృక్పథంతో లేదా మానవ హక్కులను కాపాడేందుకు యుద్ధంలో పాల్గొంటున్నట్లు అప్పుడు అమెరికా చెప్పుకొచ్చింది.
1990ల్లో కువైట్‌ను ఆక్రమించిన ఇరాక్ బలగాలను శాంతి భద్రతలను కాపాడుతున్నామని చెబుతూ హెచ్‌డబ్ల్యూ బుష్ వెళ్లగొట్టారు. అయితే, మొదట్లో రష్యా చర్యలను తొప్పికొట్టేందుకు ఇలాంటి చర్యలు తీసుకోబోతున్నట్లు అమెరికా ప్రధాన జాతీయ భద్రతా అధికారులు చెప్పారు. అయితే, సైనిక చర్యలకు బదులుగా తాము ఆర్థికపరమైన ఆంక్షలతో యుద్ధంలో జోక్యం చేసుకోబోతున్నట్లు వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
2. సైనిక చర్యలపై మనసు మార్చుకున్న బైడెన్
సైనిక చర్యలకు బైడెన్ సుముఖంగా లేరని తాజా పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది.
1990ల్లో బాల్కన్ దేశాల్లో జాతి పేరుతో జరిగే ఘర్షణలను అడ్డుకునేందుకు ఆయన సైనికపరమైన జోక్యానికి ఓటు వేశారు. 2003లో ఇరాక్ అతికమ్రణ సమయంలోనూ ఆయన సైనిక చర్యలకే మొగ్గు చూపారు. అయితే, ఆ తర్వాత ఆయన సైనిక చర్యల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
లిబియా, అఫ్గానిస్తాన్‌లలో సైనిక పరమైన జోక్యం కోసం ఒబామా తీసుకున్న నిర్ణయాన్ని బైడెన్ తప్పు పట్టారు. మరోవైపు అఫ్గానిస్తాన్‌ను మానవతా సంక్షోభం చుట్టుముట్టినప్పటికీ, బలగాల ఉపసంహరణకే ఆయన మొగ్గుచూపారు.
బైడెన్ విదేశాంగ విధాన రూపరక్తల్లో ఆంటొనీ బ్లింకెన్ కూడా ఒకరు. తమ విదేశాంగ విధాన ప్రాథమ్యాల గురించి చెబుతూ.. సైనికపరమైన జోక్యం కంటే వాతావరణ మార్పులు, ప్రపంచాన్ని పీడిస్తున్న వ్యాధులు, చైనాతో పోటీకే తాము ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
3. అమెరికాన్లు కూడా అదే కోరుకుంటున్నారు
రష్యా-యుక్రెయిన్ సంక్షోభంలో అమెరికా పెద్దగా జోక్యం చేసుకోకూడదని లేదా అసలు జోక్యం చేసుకోకూడదని ఇటీవల ఏపీ-ఎన్‌వోపీఆర్ సర్వేలో పాల్గొన్న 72 శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా అమెరికాను పట్టిపీడిస్తున్న ధరల పెరుగుదల లాంటి సమస్యలపై అమెరికా ప్రభుత్వం దృష్టిసారించాలని వారు సూచిస్తున్నారు.
అయితే, రష్యాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాలని చాలామంది సూచిస్తున్నారు. మరోవైపు రిపబ్లికన్ సెనేటర్ టెడ్ క్రూజ్ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై యుద్ధానికి సైన్యాన్ని పంపకపోవడమే మేలని సూచించారు.
మరో రిపబ్లికన్ సెనేటర్ మార్కో రుబియో కూడా... రెండు అగ్రదేశాల మధ్య యుద్ధం ఎవరికీ మంచిదికాదని చెప్పుకొచ్చారు.
4. ప్రత్యర్థి రష్యా
నేరుగా సైనికపరమైన జోక్యం చేసుకోవడానికి అమెరికా నిరాకరించడానికి కారణాల్లో.. రష్యా దగ్గర భారీగా ఉన్న అణ్వాయుధాలు కూడా ఒకటి.
నేరుగా జోక్యం చేసుకొని మరో ప్రపంచ యుద్ధానికి తెరతీసేందుకు బైడెన్ సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని బహిరంగంగానే ఆయన అంగీకరించారు కూడా.
‘‘మనం ఉగ్రవాద సంస్థతో పోరాడటం లేదు’’అని ఎన్‌బీసీ వార్తా సంస్థతో ఇటీవల బైడెన్ చెప్పారు. ‘‘ప్రపంచంలో అతిపెద్ద సైన్యమున్న దేశాల్లో ఒక దేశంతో మనం పోరాడుతున్నాం. ఇది చాలా క్లిష్టమైన సమస్య’’అని ఆయన అన్నారు.
5. యుక్రెయిన్ నాటో సభ్యదేశం కాదు, ఒప్పందాలేమీ లేవు
అమెరికా జోక్యాన్ని తప్పనిసరి చేసే ఒప్పందం కూడా ఏదీ లేదు. నాటో దేశాల్లో ఒక దేశంపై దాడి జరిగితే, అన్ని దేశాలపైనా దాడి జరిగినట్లుగా భావించే చర్యలు తీసుకోవాలని నాటో నిబంధనల్లో ఆర్టికల్ 5 చెబుతోంది.
కానీ యుక్రెయిన్ నాటో సభ్య దేశం కాదు. అమెరికా నేరుగా జోక్యం చేసుకోకపోవడానికి ఇది కూడా ఒక కారణమని బ్లింకెన్ వివరించారు. అయితే, నాటోలో ఎప్పటికీ యుక్రెయిన్‌కు స్థానం కల్పించబోమని రష్యా డిమాండ్ చేస్తోంది. కానీ, నాటో దీనికి అంగీకరించడం లేదు.
6. అమెరికా రంగంలోకి ఎప్పుడు దిగుతుందంటే..
నిజానికి యూరప్‌కు జో బైడెన్ బలగాలను తరలిస్తున్నారు. రష్యా, యుక్రెయిన్‌లకు సరిహద్దుల్లో నాటో దేశాల్లో ఈ బలగాలను మోహరిస్తున్నారు.
రష్యా చర్యలతో అనిశ్చితిలో పడిన మాజీ సోవియట్ యూనియన్ దేశాలకు అండగా నిలబడేందుకు బైడెన్ ఈ బలగాలను తరలిస్తున్నారు. ఈ దేశాల నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని పుతిన్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, యుక్రెయిన్‌పై రష్యా దాడితో, ఈ సంక్షోభం ఇతర దేశాలకూ విస్తరించే ముప్పుందని టీవీ చర్చలు నడుస్తున్నాయి.
అదే జరిగితే నాటో నిబంధనల్లోని ఆర్టికల్ 5 ప్రకారం అమెరికా సైన్యం జోక్యం చేసుకోవాల్సి రావొచ్చు.
‘‘వారు నాటో దేశాల్లో జోక్యం చేసుకుంటే, మేం కూడా జోక్యం చేసుకుంటాం’’అని ఇప్పటికే బైడెన్ స్పష్టంచేశారు.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- 'స్విఫ్ట్' అంటే ఏమిటి? ఈ పేమెంట్ నెట్వర్క్ నుంచి రష్యాను నిషేధిస్తే ఎవరికి నష్టం?
- పుతిన్‌కు ఏం కావాలి? యుక్రెయిన్‌పై రష్యా ఎందుకు దాడి చేస్తోంది
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య 5 గ్రామాల వివాదం ఏంటి... కొత్త జిల్లాల ఏర్పాటుతో చిక్కులు తప్పవా?
- భీమ్లానాయక్: పవన్ నోట పొలిటికల్ డైలాగులు, అభిమానుల్లో ఫుల్ జోష్
- యుక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులు: ‘ఇక్కడ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి, మమ్మల్ని ఎలాగైనా ఇండియాకి తీసుకెళ్లండి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















