యుక్రెయిన్ సంక్షోభం ఎలా మొదలైంది? 4 మ్యాప్‌లలో అర్థం చేసుకోండి

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్‌పై దాడి చేసే ఉద్దేశం తమకు లేదంటూ చాలాకాలంగా చెబుతూ వస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం యుక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగుతున్నట్లు ప్రకటించారు.
ఆ తరువాత యుక్రెయిన్ రాజధాని కీయెవ్ సహా మిగతా పట్టణాలలో పేలుళ్లు మొదలయ్యాయి.
గత కొద్దినెలలుగా రష్యా 2 లక్షల మంది సైనికులను యుక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించింది.
ప్రస్తుతం కీయెవ్‌ను తమ అధీనంలోకి తీసుకునేందుకు రష్యా దాడులు చేస్తోంది.
యుక్రెయిన్ సంక్షోభాన్ని 4 మ్యాప్‌లలో వివరించేదే ఈ కథనం..

1) సోవియెట్ పతనం తరువాత రష్యా, నాటోలు ఎలా మారుతూ వచ్చాయి?
సోవియట్ యూనియన్ దూకుడును నివారించేందుకు గాను కొన్ని యూరప్, ఉత్తర అమెరికా దేశాలు కలిసి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) 1949లో ఏర్పాటు చేశాయి.
అప్పటికి రష్యా, యుక్రెయిన్‌లు రెండూ సోవియట్ యూనియన్ (యూనియన్ ఆఫ్ సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్ - యూఎస్ఎస్ఆర్)లో భాగమే.
అయితే, 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత నాటో మరింత విస్తరించింది. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన దేశాలనూ నాటోలో చేర్చుకున్నారు. దీంతో రష్యా సరిహద్దుల వరకు నాటో విస్తరించినట్లయింది.

ప్రస్తుతం నాటోలో 30 సభ్య దేశాలున్నాయి. తన సరిహద్దుల వరకు నాటో విస్తరించడం రష్యాకు ఆగ్రహం తెప్పిస్తోంది.
మరోవైపు యుక్రెయిన్ కూడా నాటోలో చేరేందుకు ఆసక్తి చూపుతోంది. అలాగే, ఈయూ సహా ఇతర యూరోపియన్ ఇనిస్టిట్యూషన్లలో చేరాలని కోరుకుంటోంది.
అయితే, రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం యుక్రెయిన్ పాశ్చాత్య దేశాల చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆరోపిస్తున్నారు. అంతేకాదు... యుక్రెయిన్‌ను కమ్యూనిస్ట్ రష్యా సృష్టించిన ఒక అక్రమ దేశంగా చూస్తున్నారు.
యుక్రెయిన్ నాటోలో చేరరాదని, సైన్యాన్ని ఉపసంహరించుకుని తటస్థ దేశంగా ఉండాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు.
అయితే, పుతిన్ డిమాండ్లను యుక్రెయిన్, నాటోలు తిరస్కరించాయి.

2) క్రైమియాలో యుక్రెయిన్ భూభాగాన్ని రష్యా సీజ్ చేసింది
2014లో అప్పటి రష్యా అనుకూల అధ్యక్షుడు పదవీచ్యుతుడైన తరువాత యుక్రెయిన్ రాజకీయంగా రెండుగా విడిపోయింది. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.
పశ్చిమ దేశాలకు అనుకూలంగా సాగుతున్న యుక్రెయిన్‌కు వ్యతిరేకంగా పుతిన్ చర్యలు మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుంది. ఇది యుక్రెయిన్‌కు దక్షిణాన ఉన్న ద్వీపకల్పం. రష్యన్ మాట్లాడే యుక్రెయినియన్లు ఇక్కడ అధికంగా ఉంటారు.
భౌగోళిక రాజకీయాల పరంగా అత్యంత కీలకమైన ఓడరేవు సెవాస్టాపోల్ క్రిమియాలోనే ఉంది.
క్రిమియాను స్వాధీనం చేసుకున్న తరువాత రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. కానీ, క్రిమియా స్వాధీనం తరువాత యుక్రెయిన్‌లోని దోన్బస్ ప్రాంతంలోనూ రష్యా అనుకూల భావజాలం పెరిగింది. మరోవైపు రష్యన్లు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో వేర్పాటువాదులకు రష్యా మద్దతిచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా బలగాల మోహరింపు
యుక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా తన బలగాలను మోహరిస్తున్నట్లుగా ఉపగ్రహ చిత్రాలు బయటకొచ్చాయి. యుక్రెయిన్‌పై ఎలాంటి దాడులకు పాల్పడినా ఆంక్షలు తప్పవని రష్యాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డిసెంబరులో హెచ్చరించారు. అయితే, అందుకు ప్రతిస్పందించిన పుతిన్... తూర్పు ఐరోపాలో నాటో కార్యకలాపాలన్నీ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఆ తరువాత రష్యా యుద్ధ సన్నాహాలు వేగవంతం చేయడంతో బలగాలను ఉపసంహరించుకోవాలంటూ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా అనేక దేశాలు పుతిన్‌ను కోరాయి.
ఫిబ్రవరి మధ్య నాటికి రష్యా, బెలారూస్‌తో యుక్రెయిన్ సరిహద్దులో 150,000 మంది సైనికులు ఉన్నట్లు అమెరికా అంచనా వేసింది.

3) యుక్రెయిన్‌లో రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించిన రష్యా
సోమవారం రష్యా నాటకీయమైన నిర్ణయం ఒకటి ప్రకటించారు. తూర్పు యుక్రెయిన్‌లో రష్యా మద్దతుతో స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించుకున్న దోన్యస్క్, లూహాన్స్స్‌లను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తూ పుతిన్ నిర్ణయం ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన కొద్దిసేపట్లోనే శాంతిస్థాపన కోసమంటూ అక్కడికి రష్యాల బలగాలను పంపించారు.
దోన్యస్క్, లూహాన్స్స్‌లలో పాలనను రష్యా చేతిలోని గ్రూపులే నడిపిస్తున్నాయి.
వీటిని స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తూ పుతిన్ జారీచేసిన ఉత్తర్వులతో అక్కడ రష్యా స్థావరాల ఏర్పాటుకు అవకాశమేర్పడడంతో పాటు అప్పటికే ఉన్న సంక్షోభాన్ని మరింత పెంచినట్లయింది.

ఫొటో సోర్స్, Getty Images
4) దాడికి దిగిన రష్యా
యుక్రెయిన్‌పై దాడి చేసిన రోజున పుతిన్ మాస్కో కాలమానం ప్రకారం ఉదయం 5.55 గంటలకు అక్కడి టెలివిజన్ చానళ్లలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. యుక్రెయిన్‌ను ఆక్రమించుకునే ప్రణాళికలేవీ తమకు లేవని, యుక్రెయిన్ మిలటరీ ఆయుధాలు అప్పగించాలని కోరారు.
యుక్రెయిన్‌పై రష్యా దాడులను ప్రతిఘటించేందుకు బయటి శక్తులు జోక్యం చేసుకుంటే వారిపై తక్షణ ప్రతిస్పందన ఉంటుందనీ పుతిన్ హెచ్చరించారు.
పుతిన్ ప్రసంగించిన కొన్ని క్షణాలకే యుక్రెయిన్‌లోని సైనిక లక్ష్యాలపై రష్యా సేనలు దాడులు ప్రారంభించాయి.
మరోవైపు యుక్రెయిన్ కూడా రష్యా తమపై పూర్తిస్థాయి దండయాత్రకు దిగిందని ప్రకటించింది.
కొద్దిసేపట్లోనే యుక్రెయిన్ రాజధాని కీయెవ్ సహా వివిధ పట్టణలలో బాంబుదాడులు, పేలుళ్లు జరిగినట్లు వార్తలు వచ్చాయి.
యుక్రెయిన్‌లో మార్షల్ లా ప్రకటించారు. అంటే, దేశాన్ని తాత్కాలికంగా సైన్యం తన అధీనంలోకి తీసుకుంది. అంతేకాదు.. రష్యాతో దౌత్య సంబంధాలను తెంచుకుంది.
రష్యా తీరును ఆ దేశ ప్రజలు నిరసించాలని యుక్రెయిన్ అధ్యక్షుడు కోరారు. అలాగే, యుక్రెయినియన్లు ఎవరైనా యుద్ధంలో పాల్గొనేందుకు ఆయుధాలు కావాలంటే ఇస్తామనీ ప్రకటించారు.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- డీఫిబ్రిలేషన్ ఇచ్చి ఉంటే మంత్రి గౌతమ్ రెడ్డి ప్రాణాలు కాపాడగలిగేవారా?
- సైబర్ నేరాల ఆరోపణలతో ఒకే ఊళ్లో 31 మంది అరెస్ట్, మూడు జిల్లాలు సైబర్ మోసాలకు అడ్డాగా మారాయా-గ్రౌండ్ రిపోర్ట్
- ఫైనాన్షియల్ ప్లానింగ్ పక్కాగా ఉండాలంటే... కోటీశ్వరులు చెప్పిన 7 సూత్రాలు
- 1857 సిపాయిల తిరుగుబాటు: చపాతీలే బ్రిటిష్ పాలన అంతానికి నాంది పలికాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











