కోవిడ్: మనం ‘సూపర్ ఇమ్యూనిటీ’ సాధించటం అపోహేనా

ఫొటో సోర్స్, SCIENCE PHOTO LIBRARY
ఈసారి మీకు ఎప్పుడైనా కొంచెం నలతగా ఉంటే.. మీ తరఫున కోట్లాది మంది శత్రువులతో పోరాడే సైన్యం గురించి ఆలోచించండి.
మీ శరీరంలోని లక్షలాది కణాలపై చొరబాటుదార్లు దాడి చేసినప్పుడు.. మీ రోగనిరోధక శక్తి సంక్లిష్టమైన రక్షణ వ్యవస్థలను నిర్వహిస్తూ ఉంటుంది. సుదూరాలకు సమాచారం పంపిస్తూ.. ఆ చొరబాటుదార్లను కోట్లాదిగా కాకున్నా లక్షలాదిగా హతమారుస్తూ ఉంటుంది.
ఇదంతా.. అనారోగ్యంగా ఉందని కాస్త చికాకు పడుతూ మీరు షవర్ కింద నిలుచుని స్నానం చేస్తున్నపుడు కూడా జరుగుతూనే ఉంటుంది.
మీరు అనుభవించే ముక్కు దిబ్బడ, జ్వరం, గొంతులో మంట, కొంత మూడీగా ఉన్న భావన.. అన్నీకూడా నిజానికి మన కళ్లకు కనిపించకుండా జరుగుతున్న ఈ యుద్ధం ప్రభావమే.
రోగనిరోధక వ్యవస్థ ఎంత సంక్లిష్టమైనదంటే.. దాని ముందు ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించటం ప్రకృతిలో హాయిగా నడవటం లాగా అనిపిస్తుంది. మానవ శరీరంలో మొదడు తర్వాత అత్యంత సంక్లిష్టమైన జీవవ్యవస్థ అది.
దీని గురించి గతంలో ఎన్నడూలేనంత ఎక్కువగా ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కోవిడ్ మహమ్మారి మన జీవితాలకు కొత్త పదజాలాన్ని పరిచయం చేసింది. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో సహజ రోగ నిరోధక శక్తి గురించి, వ్యాక్సీన్ల వల్ల లభించే రోగనిరోధక శక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం.
టీకాలు, బూస్టర్లు, సైడ్ ఎఫెక్ట్‌లు.. ఇవిప్పుడు మన రోజువారీ సంభాషణల్లో మామూలు విషయంగా మారిపోయాయి.
అయితే.. రోగనిరోధక శక్తి గురించి ఎక్కువగా మాట్లాడుకోవటం వల్ల మనకు ఎక్కువ అర్థమవుతోందనేం కాకపోవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. అతిపెద్ద అపోహ.. బలమైన, సూపర్ ఇమ్యూనిటీ పవర్ సాధించటం. ఈ అంశం ఇప్పుడు సమాజంలో ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయింది.
అలాంటి సూపర్ ఇమ్యూనిటీని అందించే ఉత్పత్తులంటూ ఇంటర్నెట్ పోటెత్తుతోంది. మూలికల కషాయం మొదలుకుని ప్రొటీన్ పౌడర్ల వరకూ.. అమెజాన్ అడవుల్లో తవ్వుకొచ్చిన వేర్లు నుంచి.. విటమిన్ మాత్రల వరకూ.. ఈ జాబితాకు అంతులేకుండా పోయింది.

ఫొటో సోర్స్, SCIENCE PHOTO LIBRARY
అయితే చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్న విషయం ఏమిటంటే.. ఈ రోగనిరోధక వ్యవస్థ స్వయంగా ప్రమాదకరం కూడా కావచ్చు. ఇది మన శరీరంలో పరిమితులు, పట్టపగ్గాలు లేకుండా పేట్రేగిపోవాలని మనం కోరుకోలేం.
సొంతంగా బాగుపడటం పెద్ద వ్యాపారమైన ఈ ప్రపంచంలో.. మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయటమనే ఆలోచన చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ మనకు కావలసింది బలమైన రోగనిరోధక వ్యవస్థ కాదు. అన్ని రకాల వ్యవస్థలను అదుపులో ఉంచే సంతులనమైన రోగనిరోధక శక్తి.
మన శరీరమంతటా విస్తరించి, పరస్పరం అనుసంధానితమై ఉన్న వందలాది స్థావరాలు, రిక్రూట్‌మెంట్ కేంద్రాల సంక్లిష్ట సముదాయం గురించి మనం మాట్లాడుతున్నాం. అవన్నీ ఒక సూపర్‌హైవే ద్వారా అనుసంధానితమై ఉంటాయి. విస్తారమైన, అన్నిచోట్లా ఉండే మన హృదయ రక్తనాళాల వ్యవస్థ లాగానే ఇది కూడా అంతటా విస్తరించి ఉండే నాళాల వ్యవస్థ.
శరీరంలోని అంతర్గత అవయవాలు, ఇతర నిర్మాణాలకు అదనంగా.. వందల కోట్ల రోగనిరోధక కణాలు.. ఈ సూపర్‌హైవేలు లేదా మన రక్తప్రవాహంలో గస్తీ కాస్తుంటాయి. పిలుపు అందగానే శత్రువులతో తలపడటానికి సిద్ధంగా ఉంటాయి.
మన శరీరంలోపల.. బయటి సరిహద్దులకు సమీపంలోని కణజాలంలో ఇంకా వందల కోట్ల రోగనిరోధక కణాలు.. చొరబాటుదార్లు వస్తారేమోనని కాచుకుని ఉంటాయి. ఇవిగాక ల్యాండ్ మైన్ల వంటి లక్షల కోట్ల ప్రొటీన్ ఆయుధాలు కూడా ఉంటాయి.
మన రోగనిరోధక వ్యవస్థలో ప్రత్యేకమైన యూనివర్సిటీలు కూడా ఉంటాయి. ఎవరితో యుద్ధం చేయాలి, ఎలా యుద్ధం చేయాలి అనేది మన శరీర కణాలు వీటిలో నేర్చుకుంటాయి. విశ్వంలోనే అతిపెద్ద బయోలాజికల్ లైబ్రరీ ఈ యూనివర్సిటీల్లో ఉంటుంది. మీ జీవితంలో ఎప్పుడు ఏ చొరబాటుదారులు ఎదురైనా వారిని గుర్తుపట్టి, ఎల్లకాలం గుర్తుంచుకునే సామర్థ్యం వీటికి ఉంటుంది.
చాలా లోతుగా చూసినపుడు.. ఈ రోగనిరోధక వ్యవస్థ.. తనను, పరాయి వారిని గుర్తించే పరికరం. అయితే.. ఆ పరాయి వారు మనకు హాని చేస్తారా లేదా అనే దానితో సంబంధం లేదు.
ఆ పరాయి వారు.. స్వేచ్ఛగా ప్రవేశించే అనుమతి గల చాలా విశిష్టమైన అతిథుల జాబితాలో లేకపోతే.. దాని మీద దాడి చేసి ధ్వంసం చేయాల్సిందే. లేదంటే ఆ పరాయి వారు మనకు హానిచేయవచ్చు.
ఇప్పటికి మీకు ఒక అవగాహన ఏర్పడి ఉండవచ్చు. చాలా విభిన్న అంశాలతో తయారైన అత్యంత సంక్లిష్టమైన వ్యవస్థ ఇది. బాగా పనిచేసే రోగనిరోధక వ్యవస్థ.. ఏ ఇన్‌ఫెక్షన్ మీదనైనా సరైన మోతాదులో సైన్యాన్ని ప్రయోగించటంలో బాగా పనిచేస్తుంది. కాబట్టి.. ఈ రోగ నిరోధక వ్యవస్థలను బలోపేతం చేయటమనే అనే ఆలోచన విడ్డూరంగా ఉంటుంది.
మనకు కావల్సింది.. దూకుడుగా ధ్వంసం చేసే ఓ రగ్బీ ప్లేయర్ కాదు. సుశిక్షితమైన, కచ్చితంగా, సులభంగా, లయబద్ధంగా దాడిచేసే బాలే డాన్సర్ కావాలి.
హోమోస్టాసిస్ అనే పాత గ్రీకు పదం ఒకటుంది. అర్థం.. అన్ని అంశాల సమతుల్యత. దానికోసం మనం కష్టపడాలి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇదొక సంకీర్ణ వ్యవస్థ. దీనిని మోతాదుకు మించి బలోపేతం చేస్తే చాలా పొరపాట్లు జరగొచ్చు. చిన్న ఇన్ఫెక్షన్‌కి విపరీంగా ప్రతిస్పందించవచ్చు. ఈ పొరపాటు అవగాహనకు పాక్షిక కారణం.. రోగనిరోధక శక్తి అనే మాటకు సరైన అర్థం తెలియకపోవటం. దీనిని చార్జ్ చేయగలిగే ఒక శక్తి కవచం లాగా జనం భావిస్తారు. కానీ అది ఒక వ్యవస్థ కాదు. అనేకానేక వ్యవస్థల కలయిక.
నిజానికి.. మన రోగనిరోధక వ్యవస్థ పూర్తి సామర్థ్యంలో పనిచేయాలంటే ఏ తరహావి ఎన్ని కణాలు, ఏ స్థాయిలో పనిచేసేవి కావాలో ఎవరికీ తెలియదు. ఏం కావాలో తమకు తెలుసునని ఎవరైనా చెప్తున్నారంటే.. వారు మీకు ఏదో అమ్మటానికి ప్రయత్నిస్తుండవచ్చు.
కనీసం ఇప్పటికైతే.. ఏదో సూపర్‌ఫుడ్ ద్వారా కానీ, మరేదైనా మాత్ర ద్వారా కానీ.. మన రోగనిరోధక వ్యవస్థను విపరీతంగా బలోపేతం చేయగలమని శాస్త్రీయంగా నిరూపితమైన మార్గాలేవీ లేవు. ఒకవేళ ఏవైనా ఉన్నట్లయితే.. వైద్య పర్యవేక్షణ లేకుండా వాటిని వాడటం ప్రమాదకరమవుతుంది.
సులువైన, వేగవంతమైన పరిష్కారాలకు జనం ప్రాధాన్యమిస్తారు. కానీ ఆరోగ్యమనేది జనం వినటానికి ఇష్టపడని చాలా విసుగుపుట్టించే అంశాలపై ఆధారపడి ఉంటుంది. వ్యాయామం, సంతులన ఆహారం, ఒత్తిడి తగ్గించుకోవటం. ఇవి మనకు మంచిదని మనందరికీ తెలుసు. కానీ వాటిని పాటించటానికి మనం ఇష్టపడం.
మన శరీరానికి అవసరమైన అన్ని వైటమిన్లు, పోషకాలను అందించే పండ్లు, కూరగాయలు వంటి ఆహారం తినటం అత్యంత ముఖ్యమైన అంశం. మన రోగనిరోధక వ్యవస్థ నిరంతరం ఎన్నో వందల కోట్ల కొత్త కణాలను తయారు చేస్తుంటుంది. వాటికి ఆహారం అందించటం అవసరం.
కనీసం ఒక మాదిరిగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల లభించే సానుకూల ఆరోగ్య ప్రభావల గురించి చాలా కాలంగా తెలుసు. మంచి ప్రసరణ వల్ల మన కణాలు, రోగనిరోధక ప్రొటీన్లు మరింత సమర్థవంతంగా, స్వేచ్ఛగా సంచరించగలుగుతాయి. తద్వారా అవి తమ పని మెరుగుగా చేయగలుగుతాయి. వ్యాయామం చేయటం.. వృద్ధాప్యంలో ఈ కణాలు తగ్గిపోవటాన్ని కూడా నెమ్మదింపజేస్తుంది.
తక్కువ ఒత్తిడి ఉండే జీవితాలు గడపటం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. వాటిలో రోగనిరోధక వ్యవస్థ ఒకటి. ఒత్తిడి అనేది.. ఈ రోగనిరోధక వ్యవస్థ పనికి ఆటంకం కలిగించే, ఈ వ్యవస్థ సంతులనాన్ని దెబ్బతీసే ఘటనల వరుసను ప్రేరేపిస్తుంది.
మరి కొంతమందికి ఇతరులకన్నా ఎక్కువ సార్లు జలుబు, ఫ్లూ ఎందుకు వస్తుంది? ఇందుకు మూడు కారణాలున్నాయి.
వాస్తవం ఏమిటంటే.. మనమంతా ఒకే రకంగా ఉండం. జీవనశైలి ప్రాధాన్యాతలు లెక్కలోకి వస్తాయి. ఒకరు పొగతాగుతారేమో. లేదంటే మిగతా వారిలాగా మంచిగా తినరేమో. ఒకరు ఒత్తిడితో కూడిన ఉద్యోగం చేస్తుండవచ్చు. లేదంటే వైరస్‌లకు తరచుగా ఎక్స్‌పోజ్ అయ్యే పని చేస్తుండవచ్చు. లేదంటే కుర్చీలోంచి అసలు కదలకుండా ఉంటారేమో.
ఇక జన్యు కారణాలూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కొంత విభిన్నంగా ఉంటారు. ఒక వ్యక్తి వైరస్‌లతో పోరాడటంలో మెరుగ్గా ఉంటే.. మరొకరు బ్యాక్టీరియాతో పోరాడటంలో మెరుగ్గా ఉండొచ్చు.
మూడోది.. దృక్కోణం. మేమెప్పుడూ జబ్బుపడం అని చెప్పే ఎవరో ఒకరు.. ప్రతి ఒక్కరికీ తెలుసుంటారు. కానీ అది నిజం కాదు.
కాబట్టి ఈసారి మీరు నిద్రలేచేసరికి ముక్కుకారుతూ, కాస్త చెమటలు పడుతూ ఉన్నపుడు.. మిమ్మల్ని సజీవంగా ఉంచుతున్న సహాయకుల సైన్యం గురించి కాస్త ఆలోచించండి.
మీ దురదృష్టాన్ని తిట్టుకోవటానికి బదులు.. కృతజ్ఞతలు చెప్పండి.
ఫిలిప్ డిట్మర్.. ‘ఇమ్యూనిటీ’ అనే పుస్తక రచయిత. యూట్యూబ్‌లో అత్యంత ప్రజాదరణ గల సైన్స్ చానళ్లలో ఒకటైన Kurzgesagt సృష్టికర్త.
ఇవి కూడా చదవండి:
- మియన్మార్: సాయుధ సైనికులను అడ్డుకునేందుకు ఒక నన్ మోకాళ్ల మీద కూర్చున్నపుడు ఏం జరిగింది?
- 768 కిలోమీటర్ల పొడవైన మెరుపు.. సరికొత్త ప్రపంచ రికార్డు
- గుంటూరు జిన్నా టవర్: ఆకుపచ్చగా ఉన్న ఈ టవర్‌కి భారత్ జెండా రంగులు ఎవరు., ఎందుకు వేశారు?
- స్టాలిన్గ్రాడ్ యుద్ధం: హిట్లర్ ఆత్మహత్యకు కారణమైన ఈ యుద్ధంలో ఏం జరిగింది? ఎలా ముగిసింది?
- రష్యాను యుద్ధంలోకి లాగాలని అమెరికా ప్రయత్నిస్తోంది - పుతిన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















