జసిండా ఆర్డెన్: కోవిడ్ కారణంగా న్యూజీలాండ్ ప్రధాని పెళ్లి రద్దు

న్యూజీలాండ్ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెన్

న్యూజీలాండ్ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెన్ తన పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఆ దేశంలో కొత్తగా ప్రకటించిన కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఆమె తన పెళ్లి నిర్ణయాన్ని మార్చుకున్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుండడంతో న్యూజీలాండ్‌లో ఆంక్షలు తీవ్రతరం చేస్తున్నారు.

ప్రజా రవాణాలో ప్రయాణిస్తున్నప్పుడు, దుకాణాలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించడం.... ఏదైనా కార్యక్రమాలు నిర్వహిస్తే అతిథుల సంఖ్య 100 మందికి మించరాదని, పైగా వారంతా పూర్తిగా వ్యాక్సీన్ వేసుకున్నవారు అయి ఉండాలని నిబంధనలు విధించారు.

న్యూజీలాండ్‌లో ఇప్పటివరకు 15,104 కోవిడ్ కేసులు నమోదు కాగా 52 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ఆర్డెన్ తన వివాహం గురించి ఆదివారం ప్రకటన చేశారు. టీవీ వ్యాఖ్యాత క్లార్క్ గేఫోర్డ్‌తో జరగబోయే పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు.

చాలాకాలంగా కలిసి బతుకుతున్న వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పటికీ తాజా పరిస్థితులతో అది రద్దయింది.

''మహమ్మారి కారణంగా వేలాది మంది న్యూజీలాండ్ ప్రజలు కష్టాలు పడుతున్నారు. వారి కంటే నేనేమీ ప్రత్యేకమేమీ కాదు. మనం బాగా ప్రేమించేవారు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నా వారితో ఉండలేకపోతున్నాం'' అన్నారామె.

కరోనా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

న్యూజీలాండ్‌లో కొత్తగా విధించిన ఆంక్షలు అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ దేశంలో 9 ఒమిక్రాన్ కేసులు బయటపడిన తరువాత ఆంక్షలు కఠినతరం చేశారు.

ఆక్లాండ్‌లో ఒక వివాహానికి హాజరైన తరువాత ఓ కుటుంబం మొత్తానికి కోవిడ్ నిర్ధరణైంది. మరో ఫ్లైట్ అటెండెంట్‌కూ వైరస్ సోకింది.

కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ తీవ్రమవుతోందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆంక్షలు కఠినతరం చేశారు.

ఏవైనా కార్యక్రమాలు నిర్వహిస్తే గరిష్ఠంగా 100 మంది వ్యాక్సీన్ వేయించుకున్నవారు మాత్రమే హాజరు కావడానికి అనుమతి ఉంది ఇప్పుడు. వ్యాక్సీన్ పాస్‌లు వినియోగించకపోతే 25 మందికి మించి హాజరుకావడానికి వీల్లేదు.

జిమ్‌లు, వివాహాలకూ ఇదే నిబంధన వర్తిస్తుంది. స్కూల్ విద్యార్థులు కూడా మాస్కులు ధరించాల్సి ఉంది.

జసిండా ఆర్డెన్

ఫొటో సోర్స్, Getty Images

కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి న్యూజీలాండ్‌లో ఆంక్షలు తీవ్రంగానే ఉన్నాయి. నిబంధనలు, ఆంక్షలు కచ్చితంగా అమలు చేయడం వల్లే ఆ దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య తక్కువగా ఉంది.

కరోనా వచ్చిన కొత్తల్లోనే సరిహద్దులు మూసేసిన దేశాలలో న్యూజీలాండ్ కూడా ఒకటి.

అయితే, డెల్టా వేరియంట్ మొదలయ్యాక ఆ దేశంలో పరిస్థితి మారింది. కోవిడ్ నియంత్రణ వ్యూహం నుంచి వ్యాక్సినేషన్ వేగం పెంచడంతో పాటు వైరస్‌ను పాండమిక్‌లా కాకుండా ఎండమిక్‌గా చూస్తూ వ్యూహం మార్చుకున్నారు.

ప్రస్తుతం న్యూజీలాండ్‌లో 12 ఏళ్లకు పైబడినవారిలో 94 శాతం మంది పూర్తిగా వ్యక్సీన్ వేయించకున్నారు. 56 శాతం మందికి బూస్టర్ డోస్ కూడా వేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)