నైజీరియా: కంద దుంపలో ఒకే ముక్క, రెండే ప్యాడ్లు ఉన్న చిన్న శానిటరీ ప్యాకెట్లు కావాలని ప్రజలు ఎందుకు అడుగుతున్నారు?

నైజీరియా మహిళ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఒలీవియా ఎన్‌డుబుసీ
    • హోదా, బీబీసీ న్యూస్, లాగోస్

ప్రపంచంలోని ఏ మహిళ కూడా పీరియడ్స్ సమయంలో కేవలం రెండు శానిటరీ ప్యాడ్లతో సరిపెట్టుకోలేదు. సాధారణంగా 8 ప్యాడ్లు ఉండే ప్యాకెట్‌ ఉంటేనే అతికష్టమ్మీద సరిపోతుంది. కానీ నైజీరియాలో మాత్రం రెండు శానిటరీ ప్యాడ్లు ఉండే చిన్న ప్యాకెట్‌నే ఎక్కువగా కొంటున్నారు. ఎందుకంటే అదే వారికి తక్కువ ధరలో లభిస్తోంది.

సులభంగా తీసుకెళ్లడానికి వీలుగా రెండే శానిటరీ ప్యాడ్లు ఉండే ఈ ప్యాకెట్‌ను ధనిక దేశాల ప్రజలు ఉపయోగిస్తుండొచ్చు. కానీ నైజీరియాలో దీన్ని కొనడానికి దారితీసిన పరిస్థితులు మాత్రం ఆందోళనను కలిగిస్తున్నాయి.

''శానిటరీ ప్యాడ్ల చిన్న ప్యాకెట్లను కొనాల్సి రావడం చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని'' మహిళల ఆరోగ్య కార్యకర్త, డాక్టర్ చియోమా వాకన్మా అన్నారు.

వారు వీటిని సౌకర్యం కోసం కొనట్లేదు. కొంతమంది మహిళలు, తమ పీరియడ్స్ ఆసాంతం వీటిని ఉపయోగించలేని స్థితిలో ఉన్న కారణంగా తమ స్తోమతను బట్టి వీటివైపు మొగ్గు చూపుతున్నారు.

వీడియో క్యాప్షన్, వంటనూనెల ధరలు ఎన్నడూ లేనంతగా ఎందుకు పెరుగుతున్నాయి?

''8 ప్యాడ్లు ఉన్న ప్యాకెటే ఒక్కోసారి సరిపోదు. ఇక ఇదేం సరిపోతుంది. చిన్నవాటిని కొనుగోలు చేస్తోన్నవారు, నెలసరి వచ్చినప్పుడు ప్రతి రోజూ కాకుండా ఏ రోజున వీటిని ఉపయోగించుకోవాలో ముందే నిర్ణయించుకుంటున్నారు'' అని బీబీసీతో డాక్టర్ చియోమా చెప్పారు.

''శానిటరీ నాప్‌కిన్స్ కాకుండా టిష్యూలు, పాత దుస్తులను ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. ఇవి అపరిశుభ్రంగా, భయంకరంగా ఉంటున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో మనం ఊహించలేం.''

నైజీరియాలో చిన్న ప్యాకెట్లలో లభించే నిత్యావసర వస్తువులు, ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాలే ఎక్కువగా కొనుగోలు అవుతున్నాయి. ఈ కొనుగోళ్లు నైజీరియలోని ప్రజల జీవన వ్యయంలో జరిగిన మార్పుల గురించి చెబుతున్నాయి.

గత ఏడాది మార్చిలో వార్షిక ద్రవ్యోల్బణం 18 శాతం, ఆహార ద్రవ్యోల్బణం 23 శాతానికి చేరుకోవడంతో జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్) పెరిగింది. ఈ పెరుగుదల 'శాషే ఎకానమీ'ని సృష్టించింది.

నైజీరియాలో ఉల్లిగడ్డలు
ఫొటో క్యాప్షన్, ఉల్లిగడ్డల్లాంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి

శానిటరీ ప్యాడ్లతో పాటు చిన్నపిల్లల ఆహారం, వంటనూనెలు, బ్రేక్‌ఫాస్ట్ ఫుడ్స్ ఇలా ప్రతిదీ చిన్న చిన్న పరిమాణాల్లోనే అమ్ముతున్నారు. వేతనాల్లో పెరుగుదల కంటే ఈ వస్తువుల ధరల్లో పెరుగుదల అధికంగా ఉండటంతో ప్రజలు తక్కువ పరిమాణాల్లోని వస్తువుల వైపే మొగ్గుచూపుతున్నారు.

''ఒకప్పుడు డబ్బాల నిండా వస్తువులు కొనేదాన్ని. వాటిని చాలాకాలం పాటు ఉపయోగించేవాళ్లం. కానీ ఇప్పుడు ఏది తక్కువ ధరలో లభిస్తుందో చూసి కొనడం ప్రారంభించా'' అని చికా అడెటోయో అనే మహిళ చెప్పారు. తన ముగ్గురు పిల్లలకు సరిపడినంత ఆహారం అందించడం కోసం ఆమె ఆందోళన చెందుతున్నారు.

2020 చివరి నాటికి శాచెట్ల రూపంలో వస్తువులు, పదార్థాలు లభించడాన్ని గుర్తించారు. ఆ సమయంలో ప్యాకెట్ల రూపంలో ఉంటాయని అనుకోవడానికి కనీసం ఊహించలేని, గతంలో ఎప్పుడూ చూడని పదార్థాల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ అయ్యాయి. చివరకు బేలీస్ క్రీమ్ లిక్కర్ కూడా చిన్న ప్యాకెట్ల రూపంలో వచ్చింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ప్రాసెస్డ్ ఫుడ్, మెషినరీ వస్తువులతో పాటు తాజా ఉత్పత్తులపై కూడా ఈ ధరల పెరుగుదల ప్రభావం పడింది.

మార్కెట్లలో స్టాక్‌ కోసం గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో చెల్లింపులు చేసినట్లు గుర్తులేదని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు.

నిరంతరం రద్దీగా ఉండే లాగోస్‌లోని ఓయింగ్బో మార్కెట్, బేరాలకు ప్రసిద్ధి. కానీ ఇప్పుడు అక్కడ బేరం చేసే వారిని కనుగొనడం చాలా కష్టం.

'బిట్టర్ లీఫ్' అనే ఆకుకూర గతేడాది కంటే రెట్టింపు ధర పలుకుతోందని బీబీసీతో వ్యాపారి నాన్సీ చెప్పారు.

''వస్తువుల ఖరీదు చాలా పెరిగింది. ప్రజలు ఈ ధరలను భరించలేరు'' అని ఆమె చెప్పారు.

ప్రజల కష్టాలు పెరిగాయనడానికి మరో ఉదాహరణగా కందగడ్డ గురించి చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ప్రజలు మొత్తం కందగడ్డను కొనేవారు. కానీ ఇప్పుడు ఆ దుంపలో కొంత భాగాన్ని మాత్రమే ఇవ్వమని అడుగుతున్నారు.

గతనెలలో క్రిస్మస్ కోసం ఫుడ్ షాపింగ్ చేస్తున్నప్పుడు చియోమా ఈ వ్యత్యాసాన్ని మరింత బాగా గుర్తించారు.

''గతేడాది నేను 20,000 నైరాలతో (రూ. 3,620) మార్కెట్ వచ్చాను. ఈ సారి 30,000 నైరాలు (రూ. 5,430) ఖర్చు పెట్టాను. అయినప్పటికీ ఎక్కువ సరుకు పొందలేకపోయాను'' అని ఆమె వెల్లడించారు.

నైజీరియాలోని వరల్డ్ బ్యాంకు, సీనియర్ ఆర్థికవేత్త గ్లోరియా జోసెఫ్ రాజీ.. ఈ ధరల పెరుగుదలను, తాజా ప్రభుత్వ విధానాలతో ముడిపెట్టారు.

''తాజాగా మనం చూస్తోన్న ఈ అధిక ద్రవ్యోల్బణం, 2019లోనే ప్రారంభమైంది. సరిహద్దులు మూసివేసిన తర్వాతే ఇది ఏర్పడింది'' అని గ్లోరియా చెప్పారు.

''దేశవాళీ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా సరిహద్దుల నుంచి వచ్చే ఆహారసంబంధిత పదార్థాలు, ఇతర ఉత్పత్తులు తగ్గిపోయాయి. దీనివల్ల కొరత ఏర్పడింది'' అని ఆమె చెప్పుకొచ్చారు.

నైజీరియా ద్రవ్యోల్బణం

'వ్యాపారాలకు ఊతం కావాలి'

2020 డిసెంబర్‌లో సరిహద్దులు తెరుచుకున్నాయి. కానీ ఇప్పటికీ కొరత అలాగే ఉంది.

ప్రాథమిక ఆర్థిక సూత్రం ప్రకారం, వస్తు సరఫరా కన్నా డిమాండ్ ఎక్కువైతే కచ్చితంగా ధరలు పెరుగుతాయి.

''సరిహద్దులు తెరుచుకున్నాయి. కానీ సరిహద్దుల వెంట వ్యాపారం మాత్రం ఇంకా వెనుకబడే ఉంది'' అని గ్లోరియా తెలిపారు.

''వర్తక వ్యాపారాలను మెరుగుపరిచే చర్యలే ధరల తగ్గుదలకు దోహదపడతాయి.''

జనజీవనంపై అధిక ధరలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం, ఇటీవలి ద్రవ్యోల్బణం మరో 7 లక్షల మంది నైజీరియన్లను పేదరికంలోకి నెట్టింది. దీంతో మొత్తం పేదల సంఖ్య 10 కోట్లకు చేరింది. అక్కడి జనాభాలో ఈ సంఖ్య దాదాపు సగ.

ద్రవ్యోల్బణం పెరుగుదల ఇప్పటికే గరిష్ఠ స్థాయిని దాటి ఉండొచ్చు. అయితే ఇది ఎప్పుడు తగ్గుతుందో అనే అంశంలో స్పష్టత లేదు.

తమ బడ్జెట్‌కు అనుగుణంగా ప్రజలు జీవించడానికి ప్రయత్నిస్తున్నందున మరికొంతకాలం శానిటరీ ప్యాడ్స్ నుంచి కూరగాయల వరకు వస్తువులన్నీ శాషేల రూపంలో లభిస్తూనే ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)