న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్: “తీవ్రవాదంపై పోరాటానికి ప్రపంచదేశాలు ఏకం కావాలి”

ఫొటో సోర్స్, Getty Images
జాత్యాహంకార మితవాద భావజాలాన్ని వేర్లతోసహా పెకిలించేందుకు అంతర్జాతీయ స్థాయిలో పోరాడాలని న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్ పిలుపునిచ్చారు.
గతవారం న్యూజీలాండ్‌లో జరిగిన కాల్పుల ఘటన అనంతరం జసిండా ఆర్డెన్ తన మొదటి ఇంటర్వ్యూను బీబీసీకి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. న్యూజీలాండ్‌లోకి వస్తున్న వలసలు, జాతివివక్షకు ఆజ్యం పోస్తున్నాయన్న వాదనతో తాను విభేదిస్తున్నానని అన్నారు.
గత శుక్రవారం జరిగిన దాడిలో 50మంది మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాల్పుల్లో మరణించినవారిలో మొదటగా, సిరియాకు చెందిన తండ్రీకొడుకుల మృతదేహాలకు బుధవారంనాడు అంత్యక్రియలు నిర్వహించారు.
క్రైస్ట్‌చర్చ్‌లోని లిన్‌ఉడ్ ఇస్లామిక్ సెంటర్ వద్దవున్న స్మశానవాటికలో వందలసంఖ్యలో ప్రజలు హాజరై సంతాపం తెలిపారు.
50మంది ప్రాణాలు బలిగొన్న నిందితుడు బ్రెంటన్ టారంట్ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి. ఇతనిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.

ఆర్డెన్ ఏమన్నారు?
న్యూజీలాండ్‌లో పెరుగుతున్న మితవాద జాతీయవాదం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ..
''నిందితుడు ఆస్ట్రేలియా పౌరుడు. కానీ ఇలాంటి భావజాలం న్యూజీలాండ్‌లో లేదని నా ఉద్దేశం కాదు.. దేశంలో ఇలాంటి ఆలోచనలు ఉండటం, చాలామంది న్యూజీలాండ్ పౌరులకు అవమానం. దీన్ని వేళ్లతోసహా పెకిలించాల్సిన అవసరం ఉంది. ఈ భావజాలాన్ని మేం ఎప్పుడూ ప్రోత్సహించలేదు'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
''అంతర్జాతీయంగా నేను పిలుపునిస్తున్నా.. వేరొక ప్రాంతంలో పెరిగినవాడు, వేరొక ప్రాంతంలో జాతివివక్ష భావజాలాన్ని అలవరుచుకున్న వ్యక్తి నుంచి న్యూజీలాండ్.. హింసను చవిచూసింది. మాది సురక్షితమైన దేశమని, సహనం కలిగిన, కలిసిపోయే మనస్తత్వం ఉన్న దేశమని ప్రపంచానికి తెలియచెప్పడానికి, ఈ ఘటనను అడ్డంకిగా భావించడం లేదు. అందరికీ ఆహ్వానం పలికే దేశం మాది'' అన్నారు.
కాల్పుల ఘటనలో అనుమానితుడైన టారంట్ పేరును ఉచ్చరించబోనని ఆర్డెన్ ప్రకటించారు. తన నిర్ణయాన్ని ఆమె మరోసారి సమర్థించుకున్నారు.
''ఈ ఘటన ద్వారా అతను నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ప్రసిద్ధి చెందడం కూడా ఒకటి. కానీ అతనికి ఆ అవకాశం ఇవ్వము'' అని ఆర్డెన్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
హైవెల్ గ్రిఫిత్, బీబీసీ ప్రతినిధి, క్రైస్ట్ చర్చ్:
ఇలాంటి సంఘటనలకు ఎవరూ సిద్ధంగా ఉండలేరు. కానీ ఈ సంఘటనకు ప్రధాని ఆర్డెన్ స్పందించిన తీరు అద్భుతం. బహుశా.. ఆమెలో నిజాయితీ, నిబద్ధత కనిపించడం కారణం కావొచ్చు. దాడి జరిగిన మొదటి ఘడియ నుంచి ఆమె బాధితులు, బాధిత కుటుంబాల పక్షాన నిలిచారు. ముస్లింల పట్ల గౌరవపూర్వకంగా హిజబ్ ధరించడం అందుకు చక్కటి ఉదాహరణ.
దాడి జరిగినప్పటి నుంచి ఆమె కొన్ని మాటలను పదేపదే చెబుతున్నారు. నేను విన్న మాటల్లో.. ''మనమంతా ఒక్కటే.. వారు మనవారే.'' బాధితుల కుటుంబాలతో నేను మాట్లాడినపుడు కూడా, ఈ మాటలే వినిపించాయి. పూలగుచ్ఛాల మీదున్న కార్డ్స్, పోస్టర్ల మీద కూడా ఈ మాటలే కనిపించాయి. జాతీయ ఐక్యతా భావాన్ని కొనసాగించడం మరొక సవాలు. కానీ ఇప్పటికే ఆర్డెన్.. 'నమ్మకం' అనే వేదికను తయారుచేశారు. ఒక మార్పు గురించి మాట్లాడటానికి ఇదొక సరైన వేదిక.

ఫొటో సోర్స్, AL-KHAADEM YOUTH CLUB
తాజా పరిణామాలు ఎలా ఉన్నాయి?
మృతుల్లో ఆరుగురి పేర్లను పోలీసులు బుధవారం ప్రకటించారు. బుధవారం రాత్రికి మృతదేహాలను వారివారి కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది.
అన్ని మృతదేహాలకు పోస్ట్‌మార్టమ్ పూర్తయ్యిందని పోలీసులు తెలిపారు. కానీ ఈ వ్యవహారంలో జాప్యం జరగడం పట్ల మృతుల కుటుంబసభ్యులు నిరాశ చెందారు.
చనిపోయినవారిలో ఒకరి కుమారుడు 23ఏళ్ల మొహమ్మద్ సఫీ.. మృతుల గురించి సరైన సమాచారం అందలేదంటూ ఫిర్యాదు చేశారు.
''మా పని మేం చేస్తున్నామని వారంటున్నారు. అయితే, మృతులను గుర్తించడానికి ఏం చేస్తున్నారో నేను ఎందుకు తెలుసుకోకూడదు?'' అని మొహమ్మద్ సఫీ ఏఎఫ్‌పీ వార్తాసంస్థతో అన్నారు.
అయితే.. ఇది హత్య అని కోర్టుకు చెప్పడానికి, వీరి చావుకు గల కారణాన్ని రుజువు చేయాల్సిన అవసరం అధికారులకు ఉంది అని పోలీస్ కమిషనర్ మైక్ బుష్ అన్నారు.
అంత్యక్రియల అనంతరం, అధికారులు మీడియా కోసం కొన్ని కఠినమైన మార్గదర్శకాలు విడుదల చేశారు. బాధితుల కుటుంబాలను ఒంటరిగా వదిలేయాలని మీడియాను కోరారు.
ఇవి కూడా చదవండి
- సూట్ కేసులో మానవ పిండం.. ముంబయికి అక్రమ రవాణా
- ఎన్టీఆర్ ఫొటో ఎంత పని చేసిందంటే...
- ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు... అతి చౌక నగరాలు
- మసూద్ అజర్: ‘పాకిస్తాన్‌లోని టెర్రరిస్టులకు చైనా ఎందుకు అండగా ఉంటోంది?’
- నెదర్లాండ్స్: ట్రామ్ బండిపై కాల్పుల కేసులో టర్కీ పౌరుడి అరెస్టు
- జేఎన్‌యూలో అదృశ్యమైన విద్యార్థి ఐఎస్ఐఎస్లో చేరాడా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








