న్యూజీలాండ్ మసీదు కాల్పులు: దాడి చేసింది ‘ఒంటరి గన్‌మన్’

ఫొటో సోర్స్, Reuters
న్యూజీలాండ్‌లో శుక్రవారం నాడు రెండు మసీదులపై దాడికి పాల్పడి మారణహోమం సృష్టించిన వ్యక్తి ఒంటరిగానే ఆ పని చేసినట్లు భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా పౌరుడైన బ్రెంటన్ టారంట్ (28) తనను తాను శ్వేతజాతి ఆధిపత్యవాదిగా ప్రకటించుకున్నాడు. క్రైస్ట్‌చర్చ్‌లో తన దాడులను ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు.
న్యూజీలాండ్ చరిత్రలో అత్యంత దారుణమైనదిగా పరిగణిస్తున్నఈ దాడిలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది గాయపడ్డారు.
క్షతగాత్రుల్లో ఇంకా 34 మంది ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. వారిలో ఒక నాలుగేళ్ల బాలిక పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
అతడిని అరెస్ట్ చేసిన అనంతరం పోలీసులు మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. అయితే వారికి ఈ దాడితో సంబంధం లేదని అనుకుంటున్నామని.. అయితే ఈ విషయాన్ని ఇప్పుడే నిర్ధారించలేనని పోలీస్ కమిషనర్ మైక్ బుష్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తుపాకీ విధానాన్ని సంస్కరిస్తాం: ప్రధానమంత్రి
ప్రధానమంత్రి జసిండా ఆర్‌డెర్న్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. తుపాకీ లైసెన్సుల విధానంలో సంస్కరణలతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు సోమవారం మంత్రివర్గ సమావేశాలు జరుగుతాయని చెప్పారు.
‘‘మన తుపాకీ చట్టాల్లో మార్పులు వస్తాయి’’ అని ఆమె పేర్కొన్నారు. కాల్పుల బాధితులకు మంగళవారం పార్లమెంటు నివాళులు అర్పిస్తుందన్నారు.
అలాగే.. ఈ దాడులను ప్రత్యక్షంగా ప్రసారం చేయటానికి ఉపయోగించిన ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వెబ్‌సైట్ల పాత్ర మీద కూడా ‘‘జవాబులు చెప్పాల్సిన ప్రశ్నలూ ఉన్నాయి’’ అని చెప్పారు.
‘‘ఈ సోషల్ మీడియా వేదికలకు విస్తృత పరిధి ఉంది. అది న్యూజీలాండ్‌కు వెలుపల కూడా విస్తరించి ఉన్న సమస్య’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే.. క్రైస్ట్‌చర్చ్ దాడులకు సంబంధించి తొలి 24 గంటల్లో దాదాపు 15 లక్షల వీడియోలను తమ వేదిక మీద నుంచి తొలగించామని ఫేస్‌బుక్ పేర్కొంది. ఆ వీడియోలకు సంబంధించి ఎడిట్ చేసిన దృశ్యాలన్నిటినీ తొలగించినట్లు తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మసీదులపై దాడి మొదలవటానికి తొమ్మిది నిమిషాల ముందు తన కార్యాలయానికి నిందితుడి నుంచి ఒక డాక్యుమెంట్ అందిందని ప్రధాని ఆర్‌డెర్న్ ధృవీకరించారు. అయితే.. అందులో ఏ ప్రాంతం అనే నిర్దిష్ట వివరాలేవీ లేవన్నారు.
ఆ పత్రాన్ని రెండు నిమిషాలలోపే భద్రతా బలగాలకు పంపించటం జరిగిందన్నారు.
మరోవైపు.. అల్ నూర్, లిన్‌వుడ్ మసీదుల్లో జరిగిన ఈ దాడిలో బాధితులను గుర్తించటానికి అధికారులు సాధ్యమైనంత వేగంగా పనిచేస్తున్నారని కమిషనర్ బుష్ తెలిపారు.

ఫొటో సోర్స్, EPA
దాడులతో సంబంధం ఉన్నవారు ఎవరు?
ప్రధాన నిందితుడిని తెల్లటి జైలు చొక్కా, చేతులకు బేడీలతో శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. అతడు నవ్వుతూ కెమెరాలకు ఫోజు ఇచ్చాడు.
అతడిపై హత్య అభియోగం నమోదుచేశారు. మరిన్ని అభియోగాలు అతడిపై మోపే అవకాశం ఉంది. ఈ కాల్పులు జరిపింది 28 ఏళ్ల టారంట్ ఒక్కడేనని అభియోగం నమోదు చేసినట్లు కమిషనర్ బుష్ తెలిపారు.
''అతడిని నిలువరించటానికి మా సిబ్బంది తెగువ ప్రదర్శించారు. దాడి కొనసాగకుండా నివారించటానికి వాళ్లు తమను తాము ప్రమాదంలోకి నెట్టారు. మరిన్ని దాడులు జరగకుండా వాళ్లు నిరోధించారని నేను నమ్ముతున్నా'' అని ఆయన పేర్కొన్నారు.
ఘటనా స్థలంలో అరెస్ట్ చేసిన మరో ఇద్దరికి ఈ కాల్పుల్లో ప్రమేయం ఉందని పోలీసులు నమ్మటం లేదని బుష్ చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ఒక మహిళను ఎటువంటి అభియోగాలూ లేకుండా వదలిపెట్టారు. మరొక వ్యక్తి మీద ఆయుధ నేరం నమోదు చేశారు.
మరొక 18 ఏళ్ల యువకుడిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇందులో అతడి పాత్ర లేదని చెప్తున్నారని, అతడిని సోమవారం కోర్టులో ప్రవేశపెడతామని కమిషనర్ బుష్ చెప్పారు.
అయితే.. ''ఎంతమంది పాత్ర ఉందన్న విషయం మీద పూర్తిగా ఒక నిర్ధారణకు వచ్చే వరకూ'' తాను ఏదీ నిర్ధారించి చెప్పబోనని ఆయన పేర్కొన్నారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారెవరికీ నేర చరిత్ర లేదు.
టారెంట్‌ను కస్టడీ రిమాండ్ విధించారు. ఏప్రిల్ ఐదో తేదీన అతడు మళ్లీ కోర్టులో హాజరవ్వాల్సి ఉంది. అతడి నిష్పక్షపాత విచారణ హక్కులను కాపాడటానికి.. అతడి ఫొటోలు, వీడియోలలో అతడి ముఖాన్ని కనిపించకుండా చేయాలని జడ్జి ఆదేశించారు.
టారంట్‌కు తుపాకులు ఉపయోగించటానికి లైసెన్స్ ఉందని, అతడి వద్ద సొంతంగా ఐదు తుపాకులు ఉన్నాయని ప్రధానమంత్రి జసిండా ఆర్‌డెర్న్ చెప్పారు.
మసీదులపై దాడులకు ముందు బ్రెన్టన్ టారంట్ పేరుతో ఉన్న సోషల్ మీడియా అకౌంట్లను ఉపయోగించి.. సుదీర్ఘమైన, జాతివిద్వేష పత్రాలను పోస్ట్ చేశారు. ఈ పత్రంలో ఉటంకించిన మసీదులపైనే ఆ తర్వాత జరిగింది.
- ‘ఐదేళ్ల వయసులోనే సెక్స్ కోరికలు కలిగాయి.. మూడేళ్లకే టీనేజర్లా కనిపించాను’
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో...: ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
- #గమ్యం: డిగ్రీలు లేకుండా ఇంటర్నెట్లో డబ్బు సంపాదించడం ఎలా?
- పెళ్లికొడుకు మెడలో తాళి కట్టిన పెళ్లికూతురు.. ఎందుకిలా చేశారు? ఇది ఏమి ఆచారం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








