టెస్టోటాక్సికోసిస్: ‘ఐదేళ్ల వయసులోనే సెక్స్ కోరికలు కలిగాయి.. టీనేజర్‌లా కనిపించాను’

ఫొటో సోర్స్, Patrick Burleigh
పాట్రిక్ బర్లీకి రెండేళ్ల వయసులోనే, అతని శరీరంపై వెంట్రుకలు వచ్చాయి. ఒంటిపై వెంట్రుకలు ఉండటం సాధారణమే కదా అనుకోకండి. యవ్వనారంభ దశలో శరీరంపై మొలిచే వెంట్రుకలు పాట్రిక్ బర్లీకి రెండేళ్లకే కనిపించాయి.
కానీ అతడి కుటుంబానికి ఈ విషయమేమీ కొత్త కాదు. తనతోపాటు, తన బంధువుల్లో కొందరు మగవాళ్లకు ఈ అరుదైన వ్యాధి ఉంది. ఈ వ్యాధి వారసత్వంగా వస్తుంది. దీన్ని 'ప్రికాషస్ ప్యుబర్టీ' అంటారు. జన్యుమార్పులే ఈ వ్యాధికి కారణం.
పాట్రిక్ బర్లీ లాస్ ఏంజిలస్‌లో నివసిస్తున్నాడు. ఈయన నటుడు, రచయిత కూడా. చిన్నతనంలో జన్యు మార్పుల కారణంగా తాను ఎదుర్కొన్న సమస్యల గురించి పాట్రిక్ ఏమంటున్నాడో చదవండి..
'చిన్నతనంలోనే శరీరంలో సెక్స్ హార్మోన్'
పాట్రిక్ పరిస్థితిని 'టెస్టోటాక్సికోసిస్' అంటారు. ఈ స్థితి వల్ల, పురుషుల్లో ఉండే 'టెస్టోస్టిరాన్' హార్మోన్‌ను విడుదల చేసేందుకు వృషణాలు సిద్ధమవుతాయి.
యవ్వనారంభ దశలో శరీరంలో కలిగే మార్పులకు ఈ టెస్టోస్టిరాన్ హార్మోనే కారణం. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఈ అరుదైన సమస్యను కలిగివున్నారో డాక్టర్లు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.
కానీ ప్రపంచంలో ఇలాంటివారు 1,000 మంది ఉంటారని ఓ అంచనా. కానీ పాట్రిక్ కుటుంబంలో ఒక తరం నుంచి మరొక తరానికి టెస్టోటాక్సికోసిస్ వ్యాపిస్తోంది.
ఈ వ్యాధి వల్ల పాట్రిక్.. మూడేళ్లకే ఏడేళ్ల పిల్లాడుండే ఎత్తు, బరువుతో కనిపించేవాడు.
''సమాజంలో ఓ కొత్త వ్యక్తిలా, పెద్దవాడిలా నాకు నేను కనిపించాను. అదే నా మొదటి జ్ఞాపకం. ఒంటిపై వెంట్రుకలు మొలవడం ఒక్కటే కాదు, శరీరంలో మార్పులు చోటుచేసుకున్నాయి'' అని పాట్రిక్ బీబీసీ రేడియో కార్యక్రమం 'ఔట్‌లుక్'తో అన్నాడు.

ఫొటో సోర్స్, Patrick Burleigh
'వింత జంతువును చూసినట్లు చూసేవారు!'
గతంలో పాట్రిక్ కుటుంబం న్యూయార్క్‌లో ఉండేది. తన చిన్నతనంలో ఆడుకుంటున్నపుడు, స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టేటపుడు, అందరూ పాట్రిక్‌ను వింతగా చూసేవారు. తన బాల్యం తనకెన్నో చేదు అనుభవాలను మిగిల్చింది.
''స్విమ్మింగ్ క్లాసులకు వెళ్లినపుడు మా అమ్మ నన్ను, ఆడవాళ్లు బట్టలు మార్చుకునే గదిలోకి తీసుకువెళ్లింది. అక్కడ ఓ మహిళ నన్ను చూసి అరవడం మొదలుపెట్టింది. నేను అంతపెద్దగా కనిపించేవాడిని'' అని తన అనుభవాన్ని పంచుకున్నాడు పాట్రిక్.
ఇలాంటి సందర్భాల్లో పాట్రిక్ తల్లి.. తన పరిస్థితిని ఎదుటివారికి వివరించే ప్రయత్నం చేసేవారు. అయినా, వారు పాట్రిక్ పట్ల అనుమానంగా చూసేవారు.
''అప్పుడు నాకు, మా అమ్మకు చాలా ఇబ్బందిగా అనిపించేది. మానసికంగా ఎంతో ఒత్తిడి కూడా ఉండేది'' అని పాట్రిక్ అన్నారు.
పాట్రిక్‌కు మూడేళ్ల వయసులో, తన శరీరంలోని టెస్టోస్టిరాన్ స్థాయిలు, 14ఏళ్ల టీనేజర్ స్థాయిలో ఉండేవి. శారీరకంగా తాను టీనేజర్‌లా కనిపించేవాడు కానీ, అతడి ప్రవర్తన చిన్నపిల్లవాడిలా ఉండేది.
''ఓ జంతువును చూసినట్లు అందరూ నన్ను వింతగా చూసేవారు'' అని పాట్రిక్ అన్నారు.

ఫొటో సోర్స్, Patrick Burleigh
‘వయసు నిర్ధరించడానికి నా వృషణాల సైజు కొలిచారు’
జెనిటిక్ మార్పుల గురించి తన కొడుకుపై అధ్యయనం చేయడానికి పాట్రిక్ తల్లి అంగీకరించారు. ఇందుకు ప్రతిగా, పాట్రిక్ శరీరంపై టెస్టోస్టిరాన్ ప్రభావాన్ని అడ్డుకోవడానికి ఉచితంగా వైద్యం అందేది. అందులో భాగంగా, ఆరు నెలలకోసారి 2వారాలపాటు పాట్రిక్ హాస్పిటల్లో గడిపేవాడు.
''డాక్టర్లందరూ నా చుట్టూ చేరేవారు. నా భౌతిక వయస్సును నిర్ధరించడానికి నా వృషణాలను కొలవడంతోపాటు, అన్నిరకాల వైద్యపరీక్షలు చేశారు. నాకు ఆరేడేళ్లు వచ్చేపాటికి అంతా అలవాటయ్యింది. ఈ వైద్య పరీక్షలన్నీ సాధారణంగా తోచేవి'' అని వివరించారు. పాట్రిక్‌పై వైద్యులు వివిధరకాల ప్రయోగాలు చేశారు.

ఫొటో సోర్స్, Patrick Burleigh
తొమ్మిదేళ్లకే సిగరెట్..
''చాలాకాలంపాటు ప్రతిరోజూ రాత్రిపూట ఇంజెక్షన్స్ వాడాల్సివచ్చింది. నా ఫ్రెండ్ ఇంట్లో నిద్రపోయినా, మా అమ్మ వచ్చి, నాకు ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లేది.''
కానీ పాట్రిక్‌కు స్కూల్లో కూడా సమస్యలు తప్పలేదు. తనకు అప్పుడపుడూ, ఎవరితోనైనా గొడవపడాలని అనిపించేది. అందరూ ఎగతాళి చేస్తున్నపుడు తనలో కలిగే ప్రతిస్పందనే అందుకు కారణం.
''స్కూల్లో నాకు బ్యాడ్ బాయ్‌గా పేరొచ్చింది. కానీ అలా ప్రవర్తించడం నాకిష్టం లేదు. నాకేకాదు.. ఎవ్వరికీ ఇష్టం ఉండదుగా..'' అని తన బాల్యాన్ని పాట్రిక్ గుర్తుచేసుకున్నారు.
తొమ్మిదేళ్లకే సిగరెట్ తాగడం ప్రారంభించాడు. అలాఅలా.. ఆ అలవాటు మారిజువానా తీసుకోవడం వరకూ వెళ్లింది. తనకు 11ఏళ్ల వయసులో ఇక వైద్యం ఆపేయాలని డాక్టర్లు నిర్ణయించారు. అసలు సమస్య అప్పుడు మొదలయ్యింది.
''అంతవరకూ నాలో విడుదలవుతున్న హార్మోన్లను మందులు నియంత్రిస్తూ వచ్చాయి. డాక్టర్లు తప్పుకోవడంతో, అంతవరకూ అదుపులో ఉన్న హార్మోన్లు ఒక్కసారిగా విజృంభించాయి. దాంతో నా చెడు ప్రవర్తన శృతిమించింది.

ఫొటో సోర్స్, Patrick Burleigh
‘చిన్నపుడు.. ఓ అమ్మాయి డ్రింక్‌లో డ్రగ్స్ కలిపితే, చేతికి సంకెళ్లు వేశారు’
'' నేను మొదటిసారి డేటింగ్ చేసినపుడు నా గర్ల్‌ఫ్రెండ్ వయసు 17. నాకు 16ఏళ్లని ఆమెకు చెప్పాను. కానీ అప్పటికి నాకు 12ఏళ్లు కూడా నిండలేదు'' అని పాట్రిక్ అన్నాడు. పాట్రిక్ మొదటిసారి ఎల్.ఎస్.డి. డ్రగ్ తీసుకుంది తన మొదటి గర్ల్ ఫ్రెండ్‌తోనే.
''నేను రెండు ఎల్.ఎస్.డి. మాత్రలను వేసుకున్నాను. మరుసటిరోజు అమ్మానాన్నలతో, ఇక నేను స్కూలుకు వెళ్లనని చెప్పేశాను.''
కానీ పాట్రిక్ స్కూలుకు వెళ్లక తప్పలేదు.
''స్కూల్లో లంచ్ టైంలో ఎల్.ఎస్.డి. అనుభవం గురించి నా ఫ్రెండ్స్‌కు చెప్పాను. వాళ్లలో ఒకడు.. ఆ మాత్రలను ఎవరికైనా తెలీకుండా ఇస్తే ఎలావుంటుంది.. అని ఐడియా ఇచ్చాడు. చివరికి ఆ మాత్రలను ఓ అమ్మాయి డ్రింక్‌లో, ఆమెకు తెలియకుండా కలిపాం. అది తాగాక ఆ అమ్మాయి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దాంతో నేను.. చేసిన తప్పును ఒప్పుకోవాల్సి వచ్చింది. అప్పుడు నన్ను అరెస్టు చేసి, చేతికి సంకెళ్లు వేసి, స్కూలు నుంచి తీసుకువెళ్లారు'' అని పాట్రిక్ చెప్పాడు.

ఫొటో సోర్స్, Patrick Burleigh
‘ఐదేళ్లపుడే లైంగిక వాంఛలు కలిగేవి!’
పాట్రిక్‌లాగే తన తండ్రికి కూడా ఇలాంటి సమస్య ఉంది. కానీ ఈ వ్యాధి గురించి ఆయన ఎక్కువగా మాట్లాడరు.
తాను ఎదుర్కొన్న సమస్యల గురించి పాట్రిక్ మాట్లాడుతూ..
''నాకు ఐదేళ్లపుడే లైంగిక కోరికలు కలిగేవి. ఆ సమస్యలను ఎలా అధిగమించాలో.. నాన్న నాకు చెప్పుండొచ్చు. కానీ చెప్పలేదు'' అని అన్నాడు.
15ఏళ్ల వయసులో.. పాట్రిక్‌కు కాస్త ఉపశమనం కలిగినట్లు అనిపించింది.

ఫొటో సోర్స్, Patrick Burleigh
''డ్రగ్స్ తీసుకునే స్నేహితులను దూరం పెట్టి, చదువుపై, ఆటలపై దృష్టి పెట్టాను. అప్పుడే.. పైచదువులకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను'' అన్నాడు.
పెద్దయ్యాక, తన పరిస్థితి గురించి తన భార్య, మిత్రులతో పంచుకోగలిగాడు. వారందరూ పాట్రిక్‌ను అర్థం చేసుకుని, ప్రేమ, జాలి చూపారు.
తన కథ వేరొకరితో పంచుకున్నపుడు, కాస్త స్వస్థత చేకూరినట్లయిందని, చివరకు తనను తాను సమాధానపరుచుకోగలిగానని పాట్రిక్ వివరించాడు.
2015లో పాట్రిక్ దంపతులకు బాబు పుట్టాడు. ఆ పిల్లాడి వైద్య పరీక్షల్లో.. అతనికి ఈ వ్యాధి లేదని తేలింది.
ఇవి కూడా చదవండి
- శివరాత్రి: మానవాకారంలో శివుడు ఎక్కడ ఉన్నాడు?
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- సిత్రాలు సూడరో: ఐదేళ్లలో నాలుగు కండువాలు మార్చేశారు
- తలపై జుట్టు లేకుండా.. 'పెళ్లి కూతురు' ఫొటోషూట్
- పెళ్లికొడుకు మెడలో తాళి కట్టిన పెళ్లికూతురు.. ఎందుకిలా చేశారు? ఇది ఏమి ఆచారం?
- 'విద్యుదీకరణతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాం' అన్న మోదీ మాటల్లో నిజమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








