నోట్ల రద్దు సమయంలో వేలాది మంది చనిపోయారని బీబీసీ రాయటం నిజమా? - FACT CHECK

- రచయిత, బీబీసీ న్యూస్
- హోదా, ఫ్యాక్ట్ చెక్
బీబీసీ పేరుతో సోషల్ మీడియాలో ఒక వాదనను ప్రచారం చేస్తున్నారు. నోట్ల రద్దు సమయంలో వేలాది మంది చనిపోయారని.. దానిని రిపోర్టు చేయలేదని ఆ వాదన సారాంశం.
భారత ప్రభుత్వం 2016 నవంబర్ 8వ తేదీన పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
వాట్సాప్ పాఠకుల నుంచి పలు స్క్రీన్ షాట్లు బీబీసీకి అందాయి.
కానీ ఆ వాదనలు అబద్ధం.

ఫొటో సోర్స్, SM Viral Post
పెద్ద నోట్ల రద్దు వల్ల మరణాల సంఖ్య వేలల్లో ఉందని చెప్తూ బీబీసీ ఎటువంటి వార్తనూ ప్రచురించలేదు.

పెద్ద నోట్ల రద్దు విఫలమైన తర్వాత ప్రజల్లో ఎందుకు ఆగ్రహం రాలేదు?
పెద్ద నోట్ల రద్దు విఫలమైన తర్వాత ప్రజల్లో ఎందుకు ఆగ్రహం రాలేదో అర్థం చేసుకోవటానికి బీబీసీ ప్రతినిధి జస్టిన్ రోలెట్ ఒక విశ్లేషణ నిర్వహించారు.
రోలెట్ రాసినది ఇది:
దేశంలోని కరెన్సీలో 86 శాతాన్ని రద్దు చేస్తున్నట్లు అకస్మాత్తుగా ప్రకటించటం పట్ల జనంలో ఆగ్రహం పెల్లుబికింది.
ఒక సందర్భంలో.. దేశంలోని 120 కోట్ల మంది ప్రజలంతా బయటకు వచ్చి బ్యాంకుల ముందు వరుసల్లో నిలుచున్నట్లు కనిపించింది.
దేశంలో నోట్ల రద్దు తర్వాత పలు వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. చాలా జీవితాలు ధ్వంసమయ్యాయి. చాలా మంది ప్రజలకు కనీసం తిండికి కూడా డబ్బులు లేవు.
నగదు కొరత వల్ల కనీసం ఒక కోటి మంది ప్రజలు బాధలు పడ్డట్లు భావిస్తున్నారు.
పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు వాపసు తీసుకున్న తర్వాత ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతారని అందరూ అనుకున్నారు.
కానీ.. ఆ పథకం విఫలమైనా కూడా ప్రజలు ఎందుకు ఆగ్రహంగా లేరు?

ఫొటో సోర్స్, Getty Images
నగదును భారీగా రద్దు చేయటానికి సంబంధించిన వివరాలు సాధారణ ప్రజలు అర్థం చేసుకోవటం కష్టం కావటం అందుకు ఒక కారణం.
ధనిక వర్గాల నుంచి నల్లధనాన్ని స్వాధీనం చేసుకోవటానికి చేపట్టిన చర్య ఇది అని ఒప్పించటం ద్వారా పేదల అభిమానం పొందటానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నించటం రెండో కారణం.
ఈ విధానం విఫలమైనట్లు తేలిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలు చెప్తున్నాయి. కానీ మోదీ సందేశం ప్రజల మీద చాలా ప్రభావం చూపింది.
ఈ విధానం విఫలమైనట్లు ప్రభుత్వం గుర్తించిన వెంటనే.. దీనివల్ల ప్రయోజనాలను లెక్కలోకి తీసుకునేలా ప్రభుత్వం చూడటం వల్ల ఇలా జరిగింది.
మొదట ఇది.. 'నల్లధనా'నికి ముగింపు పలకటం కోసం చేపట్టిన చర్య అని చెప్పారు.
కానీ ఈ విధానం ప్రకటించిన కొన్ని వారాల తర్వాత.. తిరిగి వస్తున్న డబ్బులు ప్రభుత్వం ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం కొత్త ఆలోచనను ముందుకు తెచ్చింది.
ఇండియాను ''డిజిటల్ ఎకానమీ''గా చేయటం కోసం చేపట్టిన చర్యగా అప్పుడు అభివర్ణించింది.

ఫొటో సోర్స్, Getty Images
లాభాలా? నష్టాలా?
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఐదేళ్లు పూర్తిచేసినపుడు.. మోదీ చేపట్టిన నోట్ల రద్దు వల్ల లాభాలు, నష్టాల గురించి బీబీసీ రియాలిటీ చెక్ అంచనా వేసింది.
అందులో మిశ్రమ ఫలితాలు వచ్చాయి.
అప్రకటిత ఆస్తులకు సంబంధించిన ఆధారాలు దాదాపు సూన్యం. కానీ పన్ను వసూళ్ల పరిస్థితి మెరుగుపడటానికి ఈ చర్య దోహదం చేసింది.
నోట్ల రద్దు.. డిజిటల్ లావాదేవీలను పెంచింది. కానీ నగదు పరిమాణం పడిపోయింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2018 ఆగస్టులో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. 99 శాతం బ్యాంకు నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి. జనం దగ్గర నల్లడబ్బు ఉందన్న వాదన సరికాదని ఇది నిరూపిస్తోంది.
ఒకవేళ జనం దగ్గర నల్ల ధనం ఉన్నా.. దానిని చట్టబద్ధమైన ఆస్తిగా మార్చుకోవటానికి వారు దారులు కనుక్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నోట్ల రద్దు.. దొంగ నోట్లను అరికట్టిందా?
రిజర్వ్ బ్యాంక్ చెప్తున్న దాని ప్రకారం అదేమీ జరగలేదు.
కొత్త 500, 2000 రూపాయల నోట్లకు నకిలీలు తయారు చేయటం కష్టమని ప్రభుత్వం చెప్పింది. కానీ.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థికవేత్తలు చెప్తున్న ప్రకారం.. ఈ నోట్లకు నకిలీలు తయారు చేయటం సాధ్యమే. నిజానికి ఈ కొత్త నోట్లకు దొంగ నోట్లు వచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి.
నోట్ల రద్దు తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ డిజిటలీకరణ దిశగా పురోగమించిందన్నది మరో వాదన.
కానీ.. ఈ వాదనలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ బలమైన ఆధారాలు ఇవ్వటం లేదు.

ఇండియా నగదురహిత లావాదేవీల దిశగా నెమ్మదిగా పురోగమించింది. అయితే.. 2016 చివర్లో నోట్ల రద్దు ప్రకటన అనంతరం అందులో ఒక్కసారిగా భారీ వృద్ధి కనిపించింది.
కానీ.. మళ్లీ తిరిగి పాత గమనానికే వచ్చేసింది.
నిపుణులు చెప్తున్న దాని ప్రకారం.. నగదు రహిత లావాదేవీలు పెరగటానికి కారణం మెరుగైన సాంకేతిక పరిజ్ఞానమే కానీ నోట్ల రద్దు కాదు.
అయితే.. నోట్ల రద్దు తర్వాత నగదును ఉపయోగించటం తగ్గిపోయింది.
(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)
- ‘‘పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ల సాధారణ ప్రజలకు మేలు జరగట్లేదు... మెజారిటీ ప్రజలు తిరుగుబాటు చేస్తారు’’
- అందరికీ సొంత ఇల్లు అన్న మోదీ హామీ ఎంతవరకు నెరవేరింది?
- పల్లెపల్లెకూ బ్రాడ్‌బ్యాండ్: మోదీ ప్రభుత్వం ఏంచెప్పింది? ఏం సాధించింది?
- ‘అభినందన్‌లా నా భర్త కూడా పాక్ సైన్యానికి చిక్కారు.. ఆయన కోసం 48ఏళ్లుగా ఎదురు చూస్తున్నా..’
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో...: ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
- మహిళల్లో సున్తీ (ఖత్నా) అంటే ఏమిటి... ఐక్యరాజ్య సమితి దీన్ని ఎందుకు నిషేధించాలంటోంది... #EndFGM
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








