కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు సరిగా నిద్రపట్టకపోవడానికి కారణమేంటి? నిద్రలో కూడా మీ మెదడు మిమ్మల్ని ఎలా కాపాడుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జాక్ తమ్మినెన్
- హోదా, ది కాన్వర్జేషన్
బాతులు పడుకోవడం ఎప్పుడైనా చూశారా? ఒక కన్ను తెరిచి పడుకుంటాయి. బాతులతో సహా అనేక పక్షులు సగం పడుకుని, సగం మెలకువగా ఉంటాయి. అంటే వాటి మెదడులో సగ భాగం నిద్రపోతే, మరో సగం మేలుకొని ఉంటుంది.
దీనిని "యూనిహెమిస్పెరిక్ స్లీప్" అంటారు. నిద్రపోతూనే, పరిసరాలపై ఓ కన్నేసి ఉంచడం అన్నమాట.
మానవ మెదడు కూడా నిద్రలో చుట్టూ ఉన్న విషయాలను గమనిస్తూ ఉంటుందని సైన్స్ చెబుతోంది. అయితే, మనం కళ్లు మూసుకుని నిద్రపోతాం కాబట్టి చెవుల ద్వారా పరిసరాలను గమనిస్తూ ఉంటాం.
కానీ, ఇది మెదడుకు కఠిన పరీక్షే. బాగా నిద్రపోవాలంటే చిన్న చిన్న శబ్దాలను విస్మరించగలగాలి. ఉదాహరణకు కొళాయిలోంచి నీటి చుక్కలు పడుతున్న శబ్దం లేదా మీ భాగస్వామి ఇంటికి ఆలాస్యంగా వచ్చినప్పుడు శబ్దాలు.. వీటిని వినకూడదు. కానీ, ప్రమాదకరమైన శబ్దం వినిపించిన వెంటనే లేవగలగాలి.
ఈ పనిని మెదడు ఎలా చేస్తుందో ఇటీవల జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం వివరిస్తోంది.
తెలిసిన స్వరాలకు ఒకలాగ, తెలియని స్వరాలకు వేరొకలాగ మెదడు స్పందిస్తుంది. తద్వారా సురక్షితమైన శబ్దాలకు, ప్రమాదకరమైన శబ్దాలకు మధ్య తేడాను గుర్తిస్తుంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
తెలిసిన గొంతులకు ఒకలాగ, తెలియని గొంతులకు ఒకలాగ..
ఈ అధ్యయనం కోసం 17 మంది వలంటీర్లను ఒక రాత్రంగా గమనించారు సాల్జ్‌బర్గ్ విశ్వవిద్యాలయం (ఆస్ట్రియా) పరిశోధకులు.
వారు నిద్రపోతున్నప్పుడు, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ (ఈఈజీ) ఉపయోగించి వారి మెదడులోని అంతర్గత కార్యకలాపాలు నమోదు చేశారు.
ఆ రాత్రంతా వారికి కొన్ని శబ్దాలను వినిపించారు. వాళ్లు నిద్ర లేవకుండా ఉండేందుకు వాటిని మెల్లగా ప్లే చేశారు. ఆ రికార్డుల్లో వలంటీర్లకు తెలిసిన గొంతులూ, తెలియని గొంతులూ ఉన్నాయి. ఉదాహరణకు తండ్రి లేదా భాగస్వామి వారిని పేర్లతో పిలవడం. లేదా కొత్తవారు వారిని పిలవడం.
తెలిసిన గొంతులకు, తెలియని గొంతులకు మెదడు ఎలా స్పందిస్తోందో గమనించారు పరిశోధకులు.
మెదడులో రెండు రకాల స్పందనలు వారికి కనిపించాయి. గొంతు పరిచయాన్ని బట్టి అవి మారుతూ ఉన్నాయి. ఆ రెండిటినీ 'కే-కాంప్లెక్సెస్', 'మైక్రో-అరౌసల్స్' అంటారు.
కే-కాంప్లెక్సెస్ అనేవి ఈఈజీలపై కనిపించిన పదునైన తరంగాలు. ఒక అరక్షణం మాత్రమే అవి ఉంటాయి. మెదడు వాటిని అప్పటికప్పుడే పుట్టిస్తుంది. ఎవరైనా మిమ్మల్ని తాకినప్పుడు లేదా చిన్న చిన్న శబ్దాలు వినిపించినప్పుడు ఇవి వస్తాయి. ప్రమాదకరం కాని శబ్దాలకు మీ నిద్ర పాడవ్వకుండా ఇవి మిమ్మల్ని కాపాడుతాయని పరిశోధకుల అంటున్నారు.
అయితే, తెలియని గొంతులకు కే కాంప్లెక్సెస్ ఎక్కువగా స్పందించాయని పరిశోధకులు గమనించారు. ప్రమాదకరమైన శబ్దాలకు మనం నిద్ర లేచే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా వాటిని అణచివేయడానికి మెదడు మరింత కష్టపడాల్సి ఉంటుందని వారు వివరించారు.
ఆసక్తికరంగా, కే కాంప్లెక్స్ తరంగాల్లో తెలిసిన, తెలియని శబ్దాల మధ్య వ్యత్యాసం సగం రాత్రి అయ్యాక కనుమరుగైపోయింది. అంటే తెలియని శబ్దం వల్ల ప్రమాదం లేదని మెదడు గ్రహించిందన్నమాట.
మైక్రోఅరౌసల్స్ విషయంలో కూడా పరిచయం లేని గొంతులే ఎక్కువ తరంగాలను సృష్టించాయి. ఈ మైక్రోఅరౌసల్స్ సాధారణంగా నిద్ర సమయంలో కనిపించేవే. నిద్ర, మెలకువల కలయికగా ఇవి ఈఈజీ మీద నమోదవుతాయి.
ఇవి కూడా మెదడులో అప్పటికప్పుడు పుడతాయి. కానీ, అవి కొన్ని సెకన్ల పాటు నిలకడగా ఉంటాయి. సాధారణంగా ఇవి నిద్రకు భంగం కలిగించవు.
అయితే, వీటి పాత్ర ఏమిటో శాస్త్రవేత్తలకు కచ్చితంగా తెలీదు. పరిసరాల్లో ప్రమాదం పొంచి ఉందా, లేదా తెలుసుకునే మార్గంలో ఇవి సహకరిస్తాయని గత పరిశోధనలు చెబుతున్నాయి.
ఇంతకూ సారాంశమేమిటి?
ఇది చిన్న అధ్యయనమే అయినా, నిద్రపోతున్నప్పుడు కూడా మన మెదడు మనల్ని ఎలా కాపాడుతుందని చెప్పే అధ్యయనాలకు బలాన్ని ఇస్తోంది.
నిద్రపోతున్నప్పుడు మన మెదడు "సెంటినల్ ప్రాసెసింగ్ మోడ్" లేదా "స్టాండ్‌బై మోడ్"లోకి వెళ్లిపోతుందని గతంలో శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు.
అంటే, మనం గాఢ నిద్రలోకి జారుకున్నా, మెదడు పరిసరాలను గమనిస్తూనే ఉంటుంది. ప్రమాదానికి అవకాశముంటే మనల్ని లేపుతుంది.
పరిచయమున్న గొంతులు సురక్షితమైనవిగానూ, తెలియని గొంతులు ప్రమాదకరంగానూ మెదడు పరిగణిస్తుందని ఈ అధ్యయనంలో తేలింది.
అయితే, తెలియని గొంతులకు కే కాంప్లెక్స్, మైక్రోఅరౌసల్ తరంగాలు పెరగడం అనేది ప్రమాదానికి సూచిక అని కచ్చితంగా చెప్పలేం. కొత్త గొంతులకు ఎక్కువగా రియాక్ట్ అవ్వడం కావొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఒక్కోసారి కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు మనకు సరిగా నిద్రపట్టదు. కారణమేమిటో ఇప్పుడు తెలిసింది కదా. కొత్త శబ్దాలు, కొత్త గొంతులకు మెదడు అప్రమత్తమవుతూ ఉంటుంది.
బాతు ఒక కన్ను తెరిచి పడుకున్నట్టు, మీ మెదడు కూడా పరిసరాలపై ఎక్కువ దృష్టి పెడుతుంది. మెదడులో కే కాంప్లెస్, మైక్రోఅరౌసల్ తరంగాలు విపరీతంగా పుడుతూ ఉంటాయి.
అయితే, తొందరగా మెదడు వాటిని గ్రహించి అలవాటు చేసుకుంటుంది. అందుకే, రెండోరోజు, మూడోరోజు మనకి హాయిగా నిద్రపడుతుంది.
(జాక్ తమ్మినెన్ లండన్‌లోని రాయల్ హోలోవే యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్. ఈ వ్యాసం మొదట ది కాన్వర్జేషన్‌లో ప్రచురితమయింది. క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కింద దీన్ని తిరిగి ప్రచురించాం.)

ఇవి కూడా చదవండి:
- బప్పి లహిరి మరణానికి కారణమైన ఈ నిద్ర సమస్య ఏమిటి? దీన్ని ఎలా గుర్తించాలి?
- యుక్రెయిన్ సంక్షోభం: బలగాలు వెనక్కి వస్తున్నాయన్న రష్యా
- ‘నదీ జలాల్లో పారాసెటమాల్, నికోటిన్, కెఫీన్, డయాబెటిస్ మందుల ఆనవాళ్లు’
- పెళ్లై 91 ఏళ్లు.. వీళ్లు సంతోషంగా ఉండటానికి కారణాలు ఏంటంటే..
- హిప్పోక్రటిస్ ప్రమాణం ఏంటి? దీనికీ చరక శపథానికీ తేడా ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















