'నిద్ర లేవగానే, నిద్రపోయే ముందు ఆలోచించేది నీళ్ల సమస్యే' #MyVoteCounts

వీడియో క్యాప్షన్, 'నిద్ర లేచిన వెంటనే, నిద్రపోయే ముందు ఆలోచించేది నీళ్ల సమస్యే' #MyVoteCounts

భారతదేశంలో సుమారుగా 46 శాతం మంది మహిళలు రోజులో కనీసం 15 నిమిషాలు, అంతకన్నా ఎక్కువ సమయం నీళ్లు తెచ్చుకోవడానికే కేటాయిస్తున్నారని ఐక్యరాజ్య సమితి నివేదికలు చెబుతున్నాయి. ఈ సమస్యపై యువ ఓటర్లేమంటున్నారు? బీబీసీ 'మై ఓట్ కౌంట్స్' సిరీస్‌లో భాగంగా- తొలిసారిగా ఓటుహక్కును వినియోగించుకోబోతున్న 18 ఏళ్ల మహారాష్ట్ర యువతి యశోద జోలేపై బీబీసీ ప్రతినిధులు అనఘా పాఠక్, పీయూష్ నాగ్పాల్ అందిస్తున్న కథనం ఇది.

''నా జీవితం ఈ నీటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నేను నిద్రలేవగానే గుర్తొచ్చే మొదటి విషయమూ అదే. నిద్ర పోయే ముందు గుర్తొచ్చే చివరి విషయమూ అదే'' అని యశోద చెప్పారు. తమకు ఎవరు నీటి సదుపాయం కల్పిస్తే వారికే రాబోయే ఎన్నికల్లో ఓటేస్తానని యశోద తెలిపారు. ''నేనొక్కదాన్నే కాదు మా గ్రామానికి చెందిన మహిళలందరూ వారికే ఓటేస్తారు'' అని చెప్పారు.

ఆమెది మహారాష్ట్రలోని జవహర్ ప్రాంతం. ఈ ప్రాంతంలో నాలుగు నెలలపాటు 3,287 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. సరైన నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడంతో మిగిలిన ఏడాదంతా నీటి కొరతతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.

రోజులో చాలాసేపు నీళ్లు తోడటంతోనే గడిపేస్తుంటానని యశోద తెలిపారు.

''నాలుగేళ్ల పిల్లల దగ్గర నుంచి 70 ఏళ్ల ముసలివారు వరకు ప్రతి ఒక్కరూ ప్రతి రోజు ఇక్కడ అదే పనిచేస్తూ కనిపిస్తారు. వీరిలో గర్భిణులు కూడా ఉంటారు. ఇది కేవలం నీటి సమస్య మాత్రమే కాదు, లింగ భేదానికి సంబంధించిన విషయం. ప్రభుత్వం నీటికొరతను పెద్ద సమస్యగా భావించడం లేదు. ఎందుకంటే ముందు మా గ్రామంలోని పురుషులే దీనిని సమస్య అనుకోవడం లేదు కాబట్టి. ఈ నీళ్లు ఊరికే వస్తున్నాయని వాళ్లనుకుంటారు'' అని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)