ఫైనాన్షియల్ ప్లానింగ్ పక్కాగా ఉండాలంటే... కోటీశ్వరులు చెప్పిన 7 సూత్రాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఐవీబీ కార్తికేయ
- హోదా, బీబీసీ కోసం
ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలి అనే అంశం మీద గత కొన్ని దశాబ్దాలలో చాలా సిద్దాంతాలు వచ్చాయి. భవిష్యత్ అవసరాల కోసం మదుపు చేసేవాళ్ల దగ్గర నుంచి మదుపు చేయడమే వృత్తిగా ఉన్నవారి వరకూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సిద్దాంతాన్ని ప్రామాణికంగా పెట్టుకుని ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటున్నారు.
ఏ ఫైనాన్షియల్ ప్లాన్ అయినా ఆర్థిక స్వావలంబన సాధించడమే అంతిమ లక్ష్యం. కనుక ఈ సిద్దాంతాల మంచి, చెడు బేరీజు వేసే ముందు మన వ్యక్తిగత జీవితాలలో ఆర్థిక స్వావలంబన అనే విషయాన్ని ఎలా అన్వయించుకోవాలో చూద్దాం.
ఆర్థిక స్వావలంబన అంటే ఏమిటి?
నెల జీతం మీద ఆధారపడ్డ వారు జీతం రాని పరిస్థితులు లేదా ఆదాయంలో తగినంత పెరుగుదల లేని పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా జీవన ప్రమాణాలలో ఎలాంటి ఇబ్బంది రాకుండా తగినన్ని ఆర్థిక వనరులు ఉండటమే ఆర్థిక స్వావలంబనకు నిర్వచనం.
ఇదే సూత్రాన్ని వ్యాపారస్తులకు కూడా అన్వయించుకోవచ్చు. ఇలాంటి విపత్కర పరిస్థితుల గురించి సాధారణంగా మనం ఆలోచించం. కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైన విషయం.
ప్రస్తుతం 2007 తర్వాత ఉద్యోగంలో చేరిన ప్రభుత్వ ఉద్యోగస్థులకు కూడా పెన్షన్ సౌకర్యం లేదు. ప్రైవేట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఎప్పుడూ తక్కువే.
2008 ఆర్థిక మాంద్యం తర్వాత లక్షల మంది ఉద్యోగులకు రెండు మూడేళ్ల వరకు, జీతాలలో పెంపు నామ మాత్రమే. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ లాంటివి ఉన్నా మనకు అవసరమైన సమయానికి అవి అందుబాటులోకి రాకపోవచ్చు. అందుకే ఆర్థిక స్వావలంబన సాధించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

ఫొటో సోర్స్, Getty Images
మంచి ఆదాయం, చెడు ఆదాయం
ఇక ఫైనాన్షియల్ ప్లానింగ్ సమయంలో అర్థం చేసుకోవలసిన ముఖ్య విషయం, మంచి ఆదాయం, చెడు ఆదాయం. వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఈ అవగాహన ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో చాలా కీలకం.
మన సమయం లేదా మేధోశక్తి వెచ్చిస్తే వచ్చే రాబడి చెడు ఆదాయం, అంటే మన జీతం, పార్ట్ టైం ఉద్యోగంలో వచ్చే ఆదాయం లేదా కన్సల్టింగ్ ద్వారా వచ్చే ఆదాయం ఇత్యాదులన్నీ ఈ కోవలోకి వస్తాయి.
మంచి ఆదాయం అంటే మన వైపు నుంచీ ఎలాంటి శ్రమ లేదా సమయం లేకుండా వచ్చే ఆదాయం. మనం గతంలో చేసిన మదుపు మీద వచ్చిన రాబడి, కొన్ని రకాల సైలెంట్ పార్ట్నర్ అవకాశాలలో వచ్చే రాబడి లాంటివి మంచి ఆదాయం అనవచ్చు.
మన ఖర్చులన్నీ పైన చెప్పిన మంచి ఆదాయం ద్వారా భరించగలిగేలా ఉండటమే ఆర్థిక స్వావలంబనకు అత్యంత కీలకం. అంటే మనం చేసిన మదుపు నుంచి వచ్చే ఆదాయం మన ఖర్చుల కంటే ఎక్కువగా ఉండాలి.
వారెన్ బఫెట్, రాకేశ్ ఝుంఝున్‌వాలా లాంటి మదుపర్లు ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో చెప్పిన ముఖ్య విషయాలను సూక్ష్మంగా చూద్దాం.
1. మొట్ట మొదటగా జీవిత బీమా, ఆరోగ్య బీమా తప్పకుండా ఉండాలి.
2. మదుపు అంటేనే ఒక దీర్ఘకాలిక ఆలోచన. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలలో ఏదో ఒక రకమైన అవకతవకలు ఉంటాయన్నది చరిత్ర చెప్పిన సత్యం.
3. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మదుపు చేయడం మొదలు పెట్టాలి. వారెన్ బఫెట్ తన తొమ్మిదవ ఏట నుంచి మదుపు చేయడం మొదలు పెట్టారు. ఒక వాదన ప్రకారం ముప్పై ఏళ్ల లోపు మదుపు చెయడం మొదలు పెట్టిన వారు నలభై ఐదేళ్ల వయసులో ఆర్థిక స్వావలంబన సాధించే అవకాశం చాలా ఎక్కువ.
4. కచ్చితంగా వచ్చే ఖర్చులకు మన సేవింగ్ అకౌంట్ అంటే నెల జీతం నుంచి వాడకూడదు. ఆ ఖర్చులకు తగిన విధంగా మంచి ఆదాయం ఉండేలా చూసుకోవాలి.
5. ఒక వ్యక్తి వయసు నలభై ఏళ్లు దాటాక జీవితం మళ్ళీ మొదలవుతుంది అంటారు. పిల్లల చదువులు, కెరియర్లో ఇబ్బందులు, పెద్దల అనారోగ్యం లాంటి ఇబ్బందులన్నీ నలభై ఏళ్లు దాటాక వచ్చే సమస్యలు. మన ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.
6. మనకు ప్రస్తుతం ఉన్న ఖర్చులే కాకుండా భవిష్యత్తులో వచ్చే ఖర్చుల గురించి కూడా ఆలోచించి తగిన విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలి. పిల్లల స్కూల్ ఫీజులు ఇందుకు ఒక ఉదాహరణ. నేడు సాలుకు లక్ష రూపాయలు ఉన్న ఫీజులు మరో ఐదేళ్ళల్లో ఎంతగా పెరుగుతాయో బేరీజు వేసుకుని ఆ ఖర్చులకు సిద్దంగా ఉండాలి.
7. ఫైనాన్షియల్ ప్లానింగ్ సమయంలో పరిగణలోకి తీసుకోవలసిన మరొక అంశం ద్రవ్యోల్బణం. నవంబర్ నెల ద్రవ్యోల్బణం 14% పైగా నమోదు అయ్యింది. ప్రతీ నెలా ఇంత ఎక్కువగా కాకున్నా గతంలో కూడా 10% కంటే ఎక్కువ ద్రవ్యోల్బణం నమోదు అయిన రోజులు ఉన్నాయి.

ఫొటో సోర్స్, NOAH SEELAM/GETTY IMAGES
ఫైనాన్షియల్ ప్లానింగ్ పద్దతులు ఏమిటి?
మూలనిధిని సాధించే ప్లానింగ్: ఒక నిర్ధిష్టమైన మొత్తం మన దగ్గర ఉండి దాని ద్వారా వచ్చే వడ్డీ మన అవసరాలకు సరిపోయేలా ఉండటం ఇందులో ప్రధానం.
మన ఖర్చులకు తగినంత వడ్డీ రావాలంటే మూల నిధి ఎంత ఉండాలో చూసుకోవాలి. ఈ మూల నిధి లెక్కింపులో ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ఉదాహరణకు ఫిక్సడ్ డిపాజిట్ మీద వచ్చే ఆదాయం మన ఖర్చులకు సరిపోవాలి అనుకుందాం. మన నెలవారి ఖర్చులు యాభైవేలు అనుకుంటే సాలుకు ఆరు లక్షలు, టాక్స్ కూడా కలుపుకుంటే ఏడు లక్షలకు పైగా వార్షిక వడ్డీ రావాలి.
వడ్డీ 6%-6.5% ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ తీసుకుంటే కోటి రూపాయల పైగా మూల నిధి ఉండాలి. ఆ మూల నిధిని సాధించాలంటే మనం ప్రస్తుతం ఎంత ప్రతి నెలా ఎంత మదుపు చేయాలి అని ఆలోచించుకోవాలి.
ఇదే సూత్రాన్ని మ్యూచువల్ ఫండ్స్ మీద ఆపాదించి మనం ఎలాంటి ఫండ్స్ మీద మదుపు చేస్తే మనకు తగినంత ఆదాయం వస్తుందో చూసుకోవాలి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) లాగా సిస్టమేటిక్ విత్ డ్రావల్ ప్లాన్(SWP) కూడా ప్లాన్ చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతి ఖర్చుకు ఒక మదుపు: మన ఇంట్లో కరెంట్ పొయిన వెంటనే కుడి చేతికి టార్చ్ లైట్ అందేలా ఇంటిని అమర్చుకోవాలి. ఇదే ఉపమానాన్ని ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో కూడా అన్వయించుకోవాలి.
మనం చేసే ప్రతి మదుపు ఒక నిర్ధిష్టమైన లక్ష్యంతో భవిష్యత్తులో కచ్చితంగా వచ్చే ఖర్చును భరించేలా ఉండాలి. సొంత ఇల్లు, పిల్లల చదువు, విహార యాత్రలు లాంటి ఖర్చులకు తగిన విధంగా ఉండే మదుపు మార్గాలను చూసుకోవాలి.
మనం చేసిన మదుపు మనకు అవసరమైన సమయానికి మెచ్యుర్ అయ్యి మనకు అందేలా ఉండాలి. మూల నిధి పద్దతికి, ఈ పద్దతికి ప్రధానమైన తేడా ఇదే. ఆ పద్దతిలో మదుపు చేసే మొత్తం ముఖ్యం. ఇందులో సమయం కూడా ముఖ్యం.
మనం ఎలాంటి పద్దతిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసినా గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఆర్థిక స్వావలంబనకు ప్రధానం ఆర్థిక క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణే పునాదిగా నిర్మించిన ఫైనాన్షియల్ ప్లాన్ కచ్చితంగా విజయవంతం అవుతుంది.
ఇవి కూడా చదవండి:
- అమరావతి: క్యాపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ వ్యవహారం మళ్లీ ఎందుకు ముందుకొచ్చింది?
- కాలిఫోర్నియాలో వేర్వేరు సంవత్సరాల్లో జన్మించిన కవలలు
- సింధుతాయి సప్కాల్: అనాథల అమ్మ ఇక లేరు... చేతిని ముంగిస కొరికేస్తున్నా ఆమె ఓ కాగితం కోసం ఎందుకంత పోరాటం చేశారు?
- మనిషి, మొసళ్ల మధ్య మనుగడ పోరాటం
- కొంపముంచిన అలెక్సా, పదేళ్ల చిన్నారికి ప్రమాదకరమైన చాలెంజ్
- గోవాలో క్రిస్టియానో రొనాల్డో విగ్రహ ఏర్పాటుపై వివాదం
- అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామిని భూమిపైకి తెచ్చేందుకు డబ్బుల్లేక ప్రభుత్వం అక్కడే ఉంచేసింది
- WAN-IFRA ‘సౌత్ ఏసియా డిజిటల్ మీడియా అవార్డ్స్’లో బీబీసీకి 4 పురస్కారాలు
- స్పైడర్ మ్యాన్ జోరుకు అల్లు అర్జున్ పుష్ప, రణ్వీర్ సింగ్ 83 తగ్గక తప్పలేదా? బాక్సాఫీస్ వద్ద మార్వెల్ సినిమా కలెక్షన్ల జోరుకు కారణాలేంటి?
- మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?.. ‘24 గంటల్లో డబ్బు రెట్టింపు.. 50 వేలు పెట్టుబడి పెడితే ఆరు లక్షలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














