War Crime: యుద్ధ నేరం అంటే ఏమిటి? యుక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందా?

ఖార్కియెవ్ నేషనల్ యూనివర్శిటీ

ఫొటో సోర్స్, State Emergency of Ukraine/PA

ఫొటో క్యాప్షన్, మంటల్లో ఖార్కియెవ్ నేషనల్ యూనివర్శిటీ, యుద్ధ నేరాలకు పాల్పడటం లేదని రష్యా చెబుతోంది

యుక్రెయిన్‌లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడిందన్న ఆరోపణలపై దర్యాప్తు మొదలవుతోంది. యుక్రెయిన్ పౌరులపై దాడులు చేసిందని రష్యాపై ఆరోపణలు వచ్చాయి.

రష్యా చేసినట్లు చెబుతున్న యుద్ధ నేరాలు, మారణహోమంపై ఆధారాలు సేకరిస్తామని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) చీఫ్ ప్రాసిక్యూటర్ చెప్పారు.

రష్యా యుద్ధ నేరాలపై దర్యాప్తు చేయాలని 39 దేశాలు కోరడంతో ఈ విచారణ మొదలవుతోంది.

అయితే, సామాన్య ప్రజలపై దాడులు చేశారన్న ఆరోపణలను రష్యా ఖండిస్తోంది.

అసలు యుద్ధ నేరాలు అంటే ఏమిటి? రష్యాపై వచ్చిన ఆరోపణలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ అణ్వాయుధాలు కొనడానికి ప్రయత్నించిందా

యుద్ధ నేరం అంటే ఏంటి?

యుద్ధ నేరాలంటే ఏమిటో నిర్వచించే అనేక చట్టాలు జెనీవా ఒప్పందాల్లో ఉన్నాయి.

ఒకప్పటి యుగోస్లేవియా, రువాండ కోసం ఏర్పాటైన అంతర్జాతీయ క్రిమినల్ ట్రైబ్యునళ్ల వంటి కొన్ని సంస్థలు కూడా యుద్ధ నేరాలను నిర్వచించాయి.

జెనీవా కన్వెన్షన్స్ అంటే కొన్ని అంతర్జాతీయ ఒప్పందాలు. యుద్ధ సమయంలో ప్రజలను మానవతాకోణంలో ఎలా చూడాలన్న విషయంలో అంతర్జాతీయ చట్ట ప్రమాణాలకు అనుగుణంగా ఇవి మార్గనిర్దేశం చేస్తాయి.

పోరాడుతున్న ప్రజలకు, యుద్ధ ఖైదీలకు జెనీవా ఒప్పందాల్లోని మొదటి మూడు రక్షణ కల్పిస్తాయి.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాలుగో ఒప్పందాన్ని తీసుకొచ్చారు. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లోని ప్రజలను ఇది కాపాడుతుంది.

1949 జెనీవా ఒప్పందాలను రష్యా సహా ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్నీ ఆమోదించాయి.

1949 జెనీవా ఒప్పందంపై సంతకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1949 జెనీవా ఒప్పందంపై సంతకాలు

నాలుగో జెనీవా ఒప్పందం యుద్ధ నేరాలను ఇలా నిర్వచించింది..

  • ఉద్దేశపూర్వకంగా చంపడం
  • హింసించడం లేదా అమానవీయంగా ప్రవర్తించడం
  • ఉద్దేశపూర్వకంగా తీవ్రంగా బాధపెట్టడం, గాయపరచడం
  • ఆస్తులను తీవ్రంగా ధ్వంసం చేయడం లేదా స్వాధీనం చేసుకోవడం
  • బందీలుగా పట్టుకోవడం
  • చట్ట విరుద్ధంగా బహిష్కరించడం లేదా నిర్బంధించడం

సాయుధ పోరాటాలకు సంబంధించి 1998 నాటి రోమ్ శాసనం మరొక ముఖ్యమైన అంతర్జాతీయ ఒప్పందం.

సాధారణంగా సాయుధ పోరాటాల్లో ఏ ఏ చర్యలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం కిందికి వస్తాయో ఇది చెబుతుంది. ఇదొక మంచి గైడ్‌లా పనికొస్తుంది.

వీడియో క్యాప్షన్, భారత్‌కన్నా పాకిస్తాన్ దగ్గరే ఎక్కువ అణు బాంబులున్నాయా?

1998 నాటి రోమ్ శాసనం యుద్ధ నేరాలను ఇలా నిర్వచించింది..

  • సాయుధ పోరాటంలో పాల్గొనని పౌర సమూహాలు, వ్యక్తులపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం
  • దాడి చేయడం వల్ల పౌరుల ప్రాణాలకు అపార నష్టం జరుగుతుందని, ఎంతో మంది గాయపడతారని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం
  • రక్షణ వ్యవస్థలు లేని పట్టణాలు, గ్రామాలు, నివాసాలు, భవనాలపై దాడులు, బాంబు దాడులు చేయడం

ఆస్పత్రులు, స్కూళ్లు, మతపరమైన భవనాలపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయకూడదని ఇది స్పష్టం చేస్తోంది.

కొన్ని రకాల ఆయుధాలు, విషపూరిత వాయువుల వినియోగంపైనా ఇది నిషేధం విధించింది.

నెదర్లాండ్‌లోని ది హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ భవనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నెదర్లాండ్‌లోని ది హేగ్‌లో ఉన్న ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ భవనం

ఐసీసీ అంటే ఏమిటి? యుద్ధ నేరాలను ఎలా విచారిస్తుంది?

నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లో ఐసీసీ ఉంది. రోమ్ శాసనం ద్వారా 1998లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది స్వతంత్ర సంస్థ. అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసే, అత్యంత తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన వ్యక్తులను ఇది విచారిస్తుంది.

ఇది యుద్ధ నేరాలు, నరమేధం, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే నేరాలు, దురాక్రమణ వంటి వాటిని ఇది పరిశోధిస్తుంది.

అనుమానిత నేరస్తులపై దేశాలు తమ సొంత కోర్టులో విచారణ చేయవచ్చు. దేశాలు చేయలేని లేదా చేయడానికి సముఖంగా లేనప్పుడు మాత్రమే ఐసీసీ తన అధికార పరిధిని వినియోగించుకుంటుంది.

ఈ కోర్టుకు సొంత పోలీసులు లేరు. అనుమానితులను అరెస్ట్ చేయడానికి ఆయా దేశాల సహకారంపై ఐసీసీ ఆధారపడుతుంది. నేరం రుజువైన వారికి జైలు శిక్షలు, జరిమానాలు ఐసీసీ విధిస్తుంది.

ఐసీసీలో 123 సభ్య దేశాలు ఉన్నాయి. కానీ రష్యా, యుక్రెయిన్‌లకు ఐసీసీలో సభ్యత్వం లేదు.

కానీ, ఐసీసీ పరిధిని యుక్రెయిన్ అంగీకరించింది. అంటే ఆరోపణలు వచ్చిన కొన్ని రకాల నేరాలను ఐసీసీ విచారించొచ్చు.

అమెరికా, చైనా, ఇండియా కూడా ఐసీసీలో సభ్య దేశాలు కాదు.

1946 నూరెంబర్గ్‌ విచారణలో ప్రతివాదులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1946 నూరెంబర్గ్‌ విచారణలో ప్రతివాదులు

ఇదివరకు యుద్ధ నేరాల విచారణ జరిగిందా

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీ చేతిలో లక్షలాది మంది, ప్రధానంగా యూదులు చనిపోయారు. పౌరులు, యుద్ధ ఖైదీల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించడం, దానికి కారణమని భావిస్తున్న వ్యక్తులపై విచారణ ప్రారంభించేలా మిత్రదేశాలను ప్రేరేపించింది.

1945, 1946లో నూరెంబర్గ్ ట్రయల్స్‌లో పది మంది నాజీ నాయకులకు మరణ శిక్ష పడింది.

1948లో ఇలాంటి ప్రక్రియే టోక్యోలో మొదలైంది. అక్కడ ఏడుగురు జపనీస్ కమాండర్లను ఉరి తీశారు.

ఈ ట్రయల్స్ ఆ తర్వాత వచ్చిన విచారణలకు ఉదాహరణగా నిలిచాయి.

2002, 2003 సంవత్సరాల్లో తన రెబల్ ఆర్మీలో చిన్నారులను సైనికులుగా నియమించుకోవడం, వారితో పని చేయించిన కేసులో కాంగోకు చెందిన థామస్ లుబంగాను ఐసీసీ దోషిగా తేల్చింది. 2012లో ఆయనకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

2012లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో థామస్ లుబాంగా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2012లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో థామస్ లుబాంగా

ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రైబ్యునల్ ఫర్ ద ఫార్మర్ యుగోస్లేవియా (ఐసీటీవై) అనేది ఒక ఐక్యరాజ్యసమితి విభాగం. ఇది 1993 నుంచి 2017 వరకు నడిచింది. యుగోస్లేవియా యుద్ధాల సమయంలో పాల్పడిన నేరాలను విచారించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు.

బోస్నియన్ సెర్బ్ మాజీ నాయకుడు రాడొవాన్ కరాడిక్.. మారణహోమం, యుద్ధ నేరాలకు పాల్పడినట్లు 2016లో ఐసీటీవై తేల్చింది. 2017లో ఇవే నేరాలపై బోస్నియా సెర్బ్ బలగాల కమాండర్ రాట్కో మాడిక్ కూడా దోషిగా తేలారు.

రువాండా, కాంబోడియాలో మారణహోమం, మానవత్వం మరిచి చేసిన నేరాల కేసుల్లో మరికొందరిని తాత్కాలిక కోర్టులు విచారించాయి.

అత్యాచారం కూడా మారణహోమం కిందికే వస్తుందని ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రైబ్యునల్ ఫర్ రువాండా తొలిసారిగా గుర్తించింది.

మార్చి 1న ఖార్కియెవ్‌లోని ప్రాంతీయ పరిపాలన భవనం దగ్గర దాడులు

ఫొటో సోర్స్, State Emergency Services of Ukraine/REUTERS

ఫొటో క్యాప్షన్, మార్చి 1న ఖార్కియెవ్‌లోని ప్రాంతీయ పరిపాలన భవనం దగ్గర దాడులు

రష్యాపై వచ్చిన ఆరోపణలు ఏమిటి?

యుక్రెయిన్‌లోని కీయెవ్‌, ఖార్కియెవ్‌ ఖేర్సన్‌ నగరాలపై ఇటీవల తీవ్రస్థాయిలో దాడులు జరిగాయి.

ఖార్కియెవ్‌పై రష్యా చేసిన వైమానిక దాడుల్లో పౌరులు మరణించారని, యుద్ధ నేరాలకు రష్యా పాల్పడిందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు.

నగరంపై చేసిన మరో దాడిలో రష్యా, క్లస్టర్ బాంబులను ఉపయోగించిందని మరో ఆరోపణ ఉంది.

2008లో జరిగిన ఒక ఒప్పందం ప్రకారం క్లస్టర్ బాంబులను చాలా దేశాలు నిషేధించాయి.

కానీ రష్యా, యుక్రెయిన్‌ ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు.

వాక్యూమ్ బాంబులను కూడా ఉపయోగించిందని ఐక్యరాజ్యసమితిలో యుక్రెయిన్ రాయబారి, మానవ హక్కుల సంఘాలు రష్యాపై ఆరోపణలు చేశాయి.

ఖార్కియెవ్‌లో ధ్వంసమైన పౌరుల వాహనాలు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఖార్కియెవ్‌లో ధ్వంసమైన పౌరుల వాహనాలు

ఈ వాక్యూమ్ బాంబ్ అంటే ఒక థర్మోబారిక్ ఆయుధం. వాక్యూమ్ బాంబును ఏరోసోల్ బాంబు, ఫ్యూయల్ ఎయిర్ ఎక్స్‌ప్లోజివ్ అని కూడా పిలుస్తారు. ఇందులో ఒక ఇంధన కంటైనర్, రెండు వేర్వేరు ఎక్స్‌ప్లోజివ్ చార్జ్‌లు ఉంటాయి.

ఈ బాంబును రాకెట్ తరహాలో ప్రయోగించవచ్చు. లేదంటే విమానం నుంచి బాంబు లాగా జారవిడవవచ్చు. ఇది తన లక్ష్యాన్ని తాకినపుడు మొదటి ఎక్స్‌ప్లోజివ్ చార్జ్.. ఇంధన కంటైనర్‌ను తెరిచి, అందులోని ఇంధన మిశ్రమాన్ని ఒక మేఘం తరహాలో వెదజిమ్ముతుంది.

లక్ష్యంగా చేసుకున్న భవనంలో తెరిచి ఉన్న ఖాళీల నుంచి ఈ మేఘం లోపలికి చొచ్చుకుపోగలదు. అలా చొచ్చుకుపోయిన మేఘాన్ని.. బాంబులోని రెండో చార్జ్ పేల్చివేస్తుంది. దీంతో భారీ అగ్నిగోళం, పెను విస్ఫోటనం సంభవించటంతో పాటు.. ఒక శూన్యం ఏర్పడి పరిసరాల్లోని ఆక్సిజన్ అంతటినీ పీల్చివేస్తుంది. అత్యంత దృఢంగా నిర్మించిన భవనాలను, పరికరాలను సైతం ఈ బాంబు ధ్వంసం చేస్తుంది.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌కు అంతమంది వైద్య విద్యార్థులు ఎందుకు వెళ్లారు?

ఈ బాంబుల వినియోగాన్ని నిషేధించే అంతర్జాతీయ చట్టాలేవీ లేవు. కానీ ప్రజలున్న ప్రాంతాలు, స్కూళ్లు, ఆస్పత్రులపై ఈ బాంబులు ప్రయోగిస్తే మాత్రం 1899, 1907 ద హేగ్ ఒప్పందాల ప్రకారం అది యుద్ధ నేరం కిందికి వస్తుంది.

అయితే యుద్ధ నేరాలకు పాల్పడినట్టుగానీ, క్లస్టర్ బాంబులు, వాక్యూమ్ బాంబులు వాడినట్లుగానీ రష్యా అంగీకరించడం లేదు. అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ రష్యా తోసిపుచ్చుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)