యుక్రెయిన్: కీయెవ్ వైపు వెళ్తున్న 64 కిలోమీటర్ల పొడవైన రష్యా ఆర్మీ కాన్వాయ్ ఎందుకు ఆగింది

ఫొటో సోర్స్, MAXAR TECHNOLOGIES
యుక్రెయిన్ రాజధాని కీయెవ్ వైపు కదులుతున్న రష్యా ఆర్మీ భారీ కాన్వాయ్ గత కొన్నిరోజులుగా చాలా కష్టంగా ముందుకెళ్తోందని బ్రిటన్ రక్షణ శాఖ చెప్పింది. ఈ కాన్వాయ్ 64 కిలోమీటర్ల పొడవు ఉన్నట్టు చెబుతున్నారు.
కానీ, రష్యా ఇప్పటికీ 30 లక్షల జనాభా ఉన్న కీయెవ్‌ను చుట్టుముట్టిందని, అవసరమైతే దానిపై దాడులు కూడా చేయాలనుకుంటోందని అమెరికా రక్షణ అధికారులు చెబుతున్నారు.
ఫిబ్రవరి 28న ఈ కాన్వాయ్‌కు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు వెలుగులోకి వచ్చిన తర్వాత రష్యా త్వరలోనే యుక్రెయిన్ మీద దాడి చేయబోతోందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
బహుశా లాజిస్టిక్స్ అంటే సరుకుల రవాణాకు సంబంధించిన సమస్యల వల్ల ఈ కాన్వాయ్ ముందుకు వెళ్లలేక ఇబ్బందులు పడుతుండవచ్చని బ్రిటిష్, అమెరికా అధికారులు అంటున్నారు.
"రష్యా ఆర్మీ కాన్వాయ్ గత మూడు రోజులుగా చాలా మామూలుగా ముందుకు వెళ్తోంది. అది కీయెవ్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది" అని గురువారం ఒక బ్రిటన్ రక్షణ శాఖ నిఘా అప్‌డేట్‌లో చెప్పింది.
కాన్వాయ్ ఎందుకు ఆగింది
దీని వెనుక చాలా కారణాలు ఉండచ్చు. ఈ భారీ రష్యా ఆర్మీ కాన్వాయ్‌లో ఆర్మ్‌డ్ వెహికల్స్, ట్యాంకులు, ఇతర సైనిక పరికరాల వాహనాలు ఉన్నాయి. ఇది రాజధానివైపు వెళ్లడం ఎందుకు ఆగిపోయింది.
కాన్వాయ్‌కు సరుకుల సమస్యలతోపాటూ, యుక్రెయిన్ అనూహ్య ప్రతిఘటన, రష్యా సైనికుల మనోబలం సన్నగిల్లడం లాంటి కారణాలు కూడా ఉండచ్చని భావిస్తున్నారు.
మెకానికల్ బ్రేక్‌డౌన్ అంటే వాహనాలు పాడవడం, జామ్ కావడం వల్ల కూడా ఇలా జరిగుండచ్చని బ్రిటన్ ప్రభుత్వం చెప్పింది.
దీనితోపాటూ రష్యా ఆర్మీ కాన్వాయ్‌కు ఆహారం, ఇంధన కొరత కూడా ఉందని చెబుతున్నారు. చెత్త క్వాలిటీ టైర్లను సరిగా మెయింటనన్స్ చేయకపోవడం వల్ల కూడా వారికి ఇబ్బందులు ఎదురయ్యాయంటున్నారు.
"ఇంధనం, ఆహారం, స్పేర్ పార్టులు, టైర్ల రవాణాకు సంబంధించి వారికి భారీ సమస్యలు వస్తున్నాయి. వారు బురదలో ఇరుక్కుపోయారు. అక్కడ నుంచి బయటపడ్డం వారికి కష్టంగా ఉంది" అని బ్రిటన్ జాయింట్ మిలిటరీ కమాండ్ మాజీ కమాండర్ జనరల్ సర్ రిచర్డ్ బారెన్స్ చెప్పారు,
అయితే రేడియో నెట్‌వర్క్, కమ్యూనికేషన్ లాంటి పరికరాలు పాడైతే ఆదేశాలివ్వడానికి, నియంత్రణ చర్యలకు అవి పెను సవాళ్లుగా మారవచ్చని కూడా ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
రష్యా సైన్యానికి రవాణాకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని అమెరికా రక్షణ హెడ్‌క్వార్టర్స్ పెంటగాన్ కూడా చెప్పింది. అది కావాలనే తనను తాను పునర్వవస్థీకరించుకోవాలని, తమ పురోగతిని సమీక్షించాలని, చేజారిన సమయాన్ని తిరిగి పొందాలని అనుకుంటోందని చెప్పింది.
యుక్రెయిన్ గట్టిగా పోరాడుతుండడం వల్ల బహుశా కాన్వాయ్ ముందుకు వెళ్లడంలో సమస్యలు వస్తుండచ్చు అని పెంటగాన్ చెప్పింది. అయితే, ఈ విషయాన్ని తాము స్వతంత్రంగా ధ్రువీకరించడం లేదని తెలిపింది.
యుక్రెయిన్ తను అనుకున్న దానికంటే ఎక్కువ బలంగా వ్యతిరేకించిందని అందుకే, రష్యా సైనికుల మనోబలంపై దాని ప్రభావం పడడం వల్ల కాన్వాయ్ వేగం కూడా తగ్గుంటుందని చెబుతున్నారు,
"యుక్రెయిన్ సైన్యంలో తమ రాజధానిని కాపాడుకోవాలనే తెగింపు కనిపిస్తోంది. రష్యా కాన్వాయ్ మనోబలం రోజురోజుకూ తగ్గిపోతోంది" అని యుక్రెయిన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కౌన్స,ల్ మాజీ సెక్రటరీ ఒలెక్సాండ్ర్ డైనిల్యూక్ అన్నారు.
రష్యాసైన్యంలో మనోబలం సన్నగిల్లిన సంకేతాలు కనిపిస్తున్నాయని మంగళవారం ఒక అమెరికా అధికారి కూడా మీడియాతో చెప్పారు. తమను యుద్ధం కోసం పంపిస్తున్నారనే విషయం వారిలో చాలామందికి తెలీదన్నారు.

ఆ కాన్వాయ్‌ను నాశనం చేయవచ్చా
యుక్రెయిన్‌కు గగనతల దాడులు చేయగలిగే సామర్థ్యం కొంతవరకూ ఉంది. టర్కీలో తయారైన శక్తివంతమైన డ్రోన్ల సాయంతో అది రష్యా మిగతా సైన్యాన్ని లక్ష్యంగా మార్చుకుంటోంది.
కానీ, జనరల్ బారెన్స్ వివరాల ప్రకారం యుక్రెయిన్ దగ్గర రష్యా సైన్యాన్ని నాశనం చేయగలిగేంత పెద్ద సైనిక సామర్థ్యం లేదు.
అది, ఆ కాన్వాయ్‌పై నేరుగా, రెండు వైపుల నుంచీ సమర్థంగా దాడులు చేయగలదు. కానీ గగనతల దాడులు చేయడానికి వారికి తగిన సామర్థ్యం ఉండాలి.
"రష్యా సైన్యం దగ్గర కూడా కాన్వాయ్‌ను గగనతల దాడుల నుంచి కాపాడుకోడానికి తగిన వ్యూహాలు ఉంటాయి. అది యుక్రెయిన్‌లోతమ లక్ష్యాలపై దాడులు చేయవచ్చు. తమ కాన్వాయ్ మీద దాడి చేయాల్సిన పరిస్థితే వస్తే, ఇప్పటికే పరిమితంగా ఉన్న యుక్రెయిన్ సైనిక సామర్థ్యం మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది" అని జనరల్ బారెన్స్ అన్నారు.
కొంతమంది నాటో దళాలు కాన్వాయ్‌ను టార్గెట్ చేయలేవా అని కూడా చర్చిస్తున్నారు. కానీ అలా చేస్తే పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. రెండు అణు శక్తుల మధ్య యుద్ధం మొదలవుతుంది.
తమకు ఈ యుద్ధంలో నేరుగా దిగే ఉద్దేశం లేదని పశ్చిమ దేశాలు పదే పదే చెబుతూ వస్తున్నాయి.
ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ, కీయెవ్ చాలా దగ్గర్లో ఉత్తరంగా రష్యా ఆర్మీకి చెందిన ఒక పెద్ద యూనిట్ ఉందనేది వాస్తవం. అది ఏ సమయంలో అయినా ముందుకు కదలవచ్చు.
"ఈ రష్యా కాన్వాయ్ ఎంత పెద్దదంటే, రాజధానిని చుట్టుముట్టి తమ అధీనంలోకి తెచ్చుకోగలదు" అని బ్రిటిష్ సైన్యం మాజీ చీఫ్ జనరల్ లార్డ్ డైనాట్ చెప్పారు.
రష్యా సైన్యం కీయెవ్‌లోకి చొచ్చుకెళ్లి ఒక్కో దారిలో పోరాడుతూ ముందుకు వెళ్లి దానిని స్వాధీనం చేసుకోవడం వల్ల వినాశనం కూడా జరుగుతుందని ఆయన అన్నారు.
ఈ కాన్వాయ్‌కు కీయెవ్‌కు అపార నష్టం కలిగించే సైనిక సామర్థ్యం ఉందని జనరల్ బారెన్స్ కూడా చెప్పారు. ఈ కాన్వాయ్ రష్యా సైన్యంలో ఒక భాగం కావచ్చు. అందులోని ఫిరంగి దళం, పదాతి దళంతో అది కీయెవ్‌ను ముట్టడించవచ్చన్నారు.
అదే సమయంలో రష్యాకు రెండు ప్రత్యామ్నాయాలు ఉంటాయి. యుక్రెయిన్‌కు లొంగిపోవాలని అల్టిమేటం జారీ చేయడం, లేదా అది లొంగిపోదు అనుకుంటే ఖార్కియెవ్ మీద చేసినట్లే దాడులకు దిగడం.
ప్రస్తుతం, రష్యా భారీ కాన్వాయ్ ఏం చేయగలదో తెలిసేవరకూ కీయెవ్ ప్రజలు వేచిచూడక తప్పదు.
ఇవి కూడా చదవండి:
- 'బాంబులకు బాబు' వ్యాక్యూమ్ బాంబు.. థర్మోబారిక్ బాంబు అంటే ఏమిటి?
- యుక్రెయిన్‌ను రష్యా ఆక్రమిస్తే ఆ తర్వాత ఏం జరుగుతుంది?
- ‘దండయాత్రపై లెక్క తప్పిన పుతిన్’ యుక్రెయిన్‌పై దాడి తీవ్రతను మరింత పెంచుతారా
- యుక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాను భారత్ ఎందుకు విమర్శించలేకపోతోంది?
- యుక్రెయిన్ సంక్షోభం: పుతిన్ యుద్ధాన్ని నడిపిస్తున్నారు, మరి పుతిన్‌ను నడిపిస్తున్నదెవరు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














