యుక్రెయిన్‌లో ‘నాజీ పాలన’ అంతం, నిస్సైనికీకరణే లక్ష్యమని పుతిన్ ఎందుకన్నారు

ఫొటో సోర్స్, EPA
- రచయిత, మరియానా సాంచెజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
యుక్రెయిన్‌పై "ప్రత్యేక సైనిక చర్య" ప్రారంభించనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఫిబ్రవరి 24, గురువారం ఉదయం ప్రకటించారు. "యుక్రెయిన్‌ను డీనాజిఫై, డీమిలటరైజ్" చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, ఆయన తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
అంటే యుక్రెయిన్‌ను నాజీ రహితంగా మార్చడం, నిస్సైనికీకరణ లక్ష్యమని పుతిన్ అన్నారు.
"ప్రత్యేక సైనిక చర్య చేపట్టాలని నేను నిర్ణయించుకున్నాను. కీయెవ్ పాలనలో ఎనిమిదేళ్లుగా హింస అనుభవిస్తున్న ప్రజలను రక్షించడమే దీని లక్ష్యం. దీని కోసం, యుక్రెయిన్‌ను డీమిలటరైజేషన్, డీనాజిఫికేషన్ చేయడంపై గురిపెడతాం" అని ఆయన అన్నారు.
పుతిన్ ఈ మాటలను ఒక టీవీ ప్రసంగంలో చెప్పారు. అయితే, ఆయన చెప్పిన కారణాలకు ఏ రకమైన ఆధారలనూ చూపించలేదు.
యుక్రెయిన్ సరిహద్దుల్లో పుతిన్ తమ సైనిక బలగాలను మోహరించినప్పటి నుంచి అంటే గత నాలుగు నెలల్లో ఏర్పడిన అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ సంక్షోభ పరిణామం ఇది.

మొదట్లో తమ దేశ భద్రత గురించి ఆందోళన పడుతున్నామని పుతిన్ చెప్పారు. తూర్పు యూరప్‌లో నాటో విస్తరణ తమ దేశ భద్రతకు ముప్పు అని పేర్కొన్నారు.
యుక్రెయిన్ నాటోలో చేరదనే హామీ కావాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడు రష్యాకు పొరుగునే అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసే అవకాశం ఉండదు. అదే పుతిన్‌కు కావాలి.
ఆ తరువాత, ప్రస్తుత యుక్రెయిన్ ప్రభుత్వాన్ని నాజీ ప్రభుత్వంగా ఆరోపించారు. దానికి ఎలాంటి రుజువులూ చూపలేదు. దేశ భద్రతకు సంబంధించిన ఆందోళనలకు అతీతంగా తన వాదనను సమర్థించుకోవడానికి పుతిన్ కొత్త తర్కాలు, చారిత్రక వాస్తవాలు తీసుకొచ్చి ప్రపంచం ముందు, ముఖ్యంగా రష్యా పౌరుల ముందుంచారు. అందుకే సైనిక చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు.
యూరప్‌పై అడాల్ఫ్ హిట్లర్ దాడులు, ముఖ్యంగా సోవియట్ యూనియన్‌పై నాజీ దండయాత్ర, ఒక జాతికి వ్యతిరేకంగా హింస (ఈ సందర్భంలో యుక్రెయిన్‌లోని రష్యన్ వేర్పాటువాదులు).. వీటన్నింటినీ ప్రజల జ్ఞాపకాల్లోంచి మేలుకొల్పారు. నాజీల 'జాతి నిర్మూలన' భావన, మారణహోమం అంశాలను తెరపైకి తీసుకొచ్చారు.
తాము చేపట్టిన సైనిక చర్యలు, యుక్రెయిన్, అమెరికా, పశ్చిమ యూరప్ దేశాలు ఆరోపిస్తున్నట్టు మరో దేశంపై దురాక్రమణ కాదని, రక్షణ కోసమని సమర్థించుకున్నారు.
"రెండో ప్రపంచ యుద్ధం, రష్యా సంస్కృతి, రాజకీయాలలో ఒక ముఖ్యమైన భాగంగానే ఎప్పటికీ నిలిచిపోతుంది. కానీ, ప్రస్తుత యుక్రెయిన్ ప్రభుత్వాన్ని రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీ పక్షం వహించిన యుక్రెయిన్ లేదా యుక్రెయినియన్ లిబరేషన్ ఆర్మీ (నాజీలకు మద్దతుగా యుద్ధంలో పాల్గొన్న సమూహం)తో పోల్చి చూడడం అంటే రష్యన్ అభిప్రాయలను ప్రపంచంపై రుద్దడమే" అని మిషిగాన్ యూనివర్సిటీ (అమెరికా)లో రాజనీతి శాస్త్రవేత్త ఆడమ్ కేసీ బీబీసీతో చెప్పారు. ప్రొఫెసర్ కేసీ రష్యా వ్యవహారాలపై అధ్యయనం చేస్తుంటారు.
ఇంతకీ పుతిన్ వాదనలు ఎక్కడి నుంచి వచ్చాయి?

రైష్ కమిషనరేట్ యుక్రెయిన్
పుతిన్ వాదనలను అర్థం చేసుకోవాలంటే చరిత్రలో కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్లి చూడాల్సిందే. రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ రెడ్ ఆర్మీ, నాజీ జర్మన్ సైన్యాన్ని ఓడించిన విధానం ఇప్పటికీ రష్యా పౌరులకు గర్వకారణమే.
అయితే, ఆ సమయంలో పొరుగు దేశమైన్ యుక్రెయిన్ నాజీలతో చేతులు కలపడం వాళ్లు ఎప్పటికీ జీర్ణించుకోలేని విషయం. యుక్రెయిన్‌తో శత్రుత్వానికి ఇదీ ఒక కారణం.
1941లో నాజీ సైన్యం యుక్రెయిన్ ప్రాంతాల్లోకి ప్రవేశించినప్పుడు, ఆ దేశ జనాభాలో కొంత భాగం జర్మన్లతో చేతులు కలపాలని నిర్ణయించుకుంది. మిగతా భాగమంతా చాలావరకు బాధలు, విధ్వంసాన్ని చవిచూసింది.
నాజీలతో పోరాడి 50 లక్షల కన్నా ఎక్కువ మంది యుక్రెయినియన్లు మరణించారు. 15 లక్షల యుక్రెయినియన్ యూదులలో చాలామందిని నాజీలు చంపేశారు.
1944 వరకు జర్మన్ల ఆక్రమణ కొనసాగింది. నాజీ జర్మన్‌లకు సహకరించిన యుక్రెయినియన్లు స్థానిక పరిపాలనలో భాగమయ్యారు. నాజీ పోలీస్ విభాగంలో సభ్యులుగా, నిర్బంధ శిబిరాల్లో కాపలా సిబ్బందిగా పనిచేశారు.
యుక్రెయిన్‌లో స్థానిక నాజీ ప్రభుత్వానికి 'రైష్‌కమిషనరేట్ యుక్రెయిన్' (ఇంపీరియల్ కమిషనరేట్ ఆఫ్ యుక్రెయిన్) అని పేరు పెట్టారు. పొట్టిగా ఆర్‌కేయూ అని పిలిచేవారు. వీరి పాలన కింద ప్రస్తుత యుక్రెయిన్, బెలారస్, పోలాండ్ ప్రాంతాలు ఉండేవి.

ఫొటో సోర్స్, Getty Images
స్టెపాన్ బాండెరా
నాజీలతో చేతులు కలిపిన యుక్రెయిన్ జాతీయవాదులలో ముఖ్యుడు, వివాదాస్పద వ్యక్తి స్టెపాన్ బాండెరా.
ఈ ప్రాంతంపై నాజీ ఆధిపత్యం సాధించడానికి మొదట సహకరించినా, యుక్రెయిన్ స్వతంత్రం కోసం తాము వేసిన ప్రణాళిక ఫలించదని గ్రహించిన వెంటనే వాళ్లకు ఎదురుతిరిగారు బాండెరా.
నాజీ నిర్బంధ శిబిరంలో ఏళ్ల తరబడి బందీగా ఉన్నారు. చివరికి 1959లో కేజీబీ ఏజెంట్ చేతిలో ప్రాణాలు కోల్పోయారు.
కేజీబీ అంటే కోమిటేట్ గొసుడర్స్‌స్ట్వెన్నోయ్ బెజోపాస్నోస్టి (Komitet Gosudarstvennoy Bezopasnosti). ఇది సోవియట్ యూనియన్ ప్రధాన భద్రతా సంస్థ.
తమ దేశానికి స్వతంత్రం సాంధించాలన్న కాంక్షతోనే యుక్రెయినియన్లు నాజీలతో చేతులు కలిపారు. సోవియట్ నాయకుడు జోసెఫ్ స్టాలిన్‌ను వదిలించుకోవడానికి జర్మన్లు సహాయపడతారని భావించారు.
వాళ్లు ఇలా భావించడానికి కారణం ఉంది. ఆ సంఘటనకు ఈమధ్యే 90 ఏళ్లు నిండాయి.
అదే హోలోడోమోర్ లేదా తీవ్ర కరవు. ఆ సమయంలో సుమారు 33 లక్షల మంది ఆకలితో చనిపోయారని యేల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, చరిత్రకారుడు తిమోతీ స్నైడర్ అంచనా వేశారు. వాస్తవంలో ఈ సంఖ్య అంతకు మూడు రెట్లు ఎక్కువే ఉంటుందని మరికొందరు అంటారు.
ఆ సమయంలో సోవియట్ యూనియన్ మొత్తం కరువు బారిన పడినప్పటికీ, స్టాలిన్ ప్రభుత్వ ఆర్థిక విధానాల వలనే తమకు తీవ్రమైన పరిస్థితులు దాపురించాయని యుక్రేనియన్ సహా మరో 15 దేశాలు భావించాయి. అందుకే హోలోడోమర్‌ను ఒక మారణహోమంగా పరిగణించాయి.
మిగిలిన ప్రాంతాల కన్నా యుక్రెయిన్ చాలా ఘోరమైన కరవును ఎదుర్కొంది. ఆ ప్రాంతానికి తక్కువ వనరులను పంపాలని, ఆహారం కోసం ప్రజలు మరోచోటికి తరలివెళ్లడాన్ని నిషేధించాలన్న స్టాలిన్ ఉద్దేశపూర్వక నిర్ణయాలే అందుకు కారణమని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు.
రైతులు తమ సారవంతమైన వ్యవసాయ భూములను దేశానికి అప్పగించాలని ఆదేశించింది సోవియట్ యూనియన్ ప్రభుత్వం. అందుకు అంగీకరించని యుక్రెయిన్ రైతులను శిక్షించాలని, వారిపై ఒత్తిడి తేవాలని స్టాలిన్ నిర్ణయించుకున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
హోలోడోమర్ యుక్రెయినియన్లకు సామూహిక వేదనగా మిగిలింది. 1930, 1940లలో బాండెరా రగిల్చిన సోవియట్ వ్యతిరేక భావజాలానికి అది ఇప్పటికీ ఆజ్యం పోస్తూ ఉంటుంది.
ఇది జరిగి శతాబ్దం కావొస్తోంది. అయినా సరే, ఇప్పుడెందుకు బాండెరా కథ మనం గుర్తు చేసుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
రెండు తీవ్రవాద గుంపుల మధ్య ఘర్షణలు
దీనికి సమాధానం తెలియాలంటే 2013లో జరిగిన సంఘటనలు చూడాలి. అప్పుడు యుక్రెయిన్‌లో రష్యా అనుకూల అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ అధికారంలో ఉన్నారు. ఆయన పుతిన్ ఒత్తిడికి తలొగ్గి.. దేశాన్ని యూరోపియన్ యూనియన్‌కు చేరువ చేసే ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించారు. అయితే, మెజారిటీ యుక్రెయినియన్లు సంతకం చేయాలని కోరుకున్నారు.
యనుకోవిచ్ నిర్ణయం దేశవ్యాప్తంగా నిరసనలకు దారి తీసింది. యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో సుమారు 1,00,000 మంది పాల్గొన్నారు.
కొన్ని నెలల తరబడి ఈ నిరసనలు కొనసాగాయి. దాంతో, యనుకోవిచ్ 2014లో రష్యా పారిపోయారు. యుక్రెయిన్ అధ్యక్ష పదవిని కోల్పోయారు.
"2013 డిసెంబర్ ప్రాంతంలో రష్యా మీడియాలో నాజీలు, నియో-నాజీల ప్రస్తావన ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే, యుక్రెయిన్‌లో నిరసనల్లో కొందరు స్టెపాన్ బాండెరా జెండాలు పట్టుకున్నారు. నాజీ జాత్యహంకార ధోరణులను సమర్థించకపోయినా యుక్రెయిన్ దేశభక్తులు, జాతీయ నాయకులు, తమ దేశ స్వతంత్రం కోసం అప్పట్లో స్టాలిన్‌కు వ్యతిరేకంగా హిట్లర్‌తో పొత్తు పెట్టుకోవడం యుక్రెయినియన్లలో కొందరికి ఇంకా గుర్తుంది" అని 'ది కోడ్ ఆఫ్ పుతినిజం' పుస్తక రచయిత బ్రియాన్ టేలర్ బీబీసీతో చెప్పారు. టేలర్ సిరక్యూస్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
క్రైమియాను స్వాధీనం చేసుకోవడం ద్వారా యనుకోవిచ్ బహిష్కరణకు రష్యా ప్రతీకారం తీర్చుకుంది. అలాగే, తూర్పు యుక్రెయిన్‌లో వేర్పాటువాదులకు మద్దతు ఇచ్చింది. ఈ తిరుగుబాటుదారులకు, యుక్రెయిన్ సైన్యానికి జరిగిన ఘర్షణల్లో సుమారు 14,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
అదే సమయంలో రైట్ వింగ్ తీవ్రవాదులు రష్యా వేర్పాటువాదులను తిప్పికొట్టేందుకు ప్రయత్నించారు.
ప్రావీ సెక్టార్, అజోవ్ బెటాలియన్ వంటి బృందాలు తరచుగా బాండెరా జెండాలు పట్టుకుంటూ ఉంటాయి. బాండెరాను యుక్రెయిన్‌లో నేషనల్ హీరోగా గుర్తిస్తారు. పుతిన్, బాండెరాను "హిట్లర్ సహాయకుడు" అని పిలుస్తారు.
అయితే, ఈ తీవ్రవాద గుంపులేవీ కూడా నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ యుక్రెయిన్‌లో పదవులు పొందలేకపోయాయి. ఎగ్జిక్యూటివ్‌లో వీరి ప్రతినిధులు కూడా లేరు.
"యుక్రెయిన్‌లో నాజీలు లేదా ఫాసిస్టుల ఆధిపత్యం లేదు. ఇటీవల సంవత్సరాలలో అతివాద జాతీయవాదులు, ఫాసిస్టులు పెరుగుతున్నా యుక్రెయిన్ వారి నియంత్రణలో లేదు. ఇలాంటి సమూహాలు పెరగడం అనేది కేవలం యుక్రెయిన్ సమస్య కాదు. ఇది అంతర్జాతీయ సమస్య" అని శాంతా క్లారా (అమెరికా) యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎమీ రాండల్ బీబీసీతో చెప్పారు.
"వాస్తవానికి యుక్రెయిన్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియెన్క్సీ యూదుడు. ఆయన తాతముత్తాతలు చాలామంది నాజీ హోలోకాస్ట్‌లో ప్రాణాలు కోల్పోయారు" అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Reuters
జెలియెన్క్సీ ఉద్వేగభరిత ప్రసంగం
ఫిబ్రవరి 23 బుధవారం రాత్రి, పుతిన్‌తో మాట్లాడడానికి చాలా ప్రయత్నించారు జెలియెన్క్సీ. కానీ, ఆయన ప్రయత్నాలను రష్యా అధ్యక్షుడు విస్మరించారు. దాంతో, రష్యా ప్రభుత్వం యుక్రెయిన్‌పై దాడికి దిగకుండా నిరోధించాలని ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు జెలియెన్క్సీ.
రష్యన్ భాషలో చేసిన ఉద్వేగభరిత ప్రసంగంలో జెలియెన్క్సీ, తమది నాజీ ప్రభుత్వమని పుతిన్ చేసిన ఆరోపణలను ప్రస్తావించారు.
"మీరు (రష్యన్లు) మమ్మల్ని నాజీలు అన్నారు. కానీ, నాజీయిజంపై విజయం కోసం 80 లక్షలకు పైగా ప్రాణాలను త్యాగం చేసిన దేశం నాజీలకు మద్దతు ఇవ్వగలదా?
నేనెలా నాజీ అవుతాను? సోవియట్ ఆర్మీ పదాతిదళంలో సైనికుడిగా యుద్ధం చేసి, స్వతంత్ర యుక్రెయిన్‌లో కల్నల్‌గా మరణించిన మా తాతకు చెప్పండి ఆ మాట" అంటూ గంభీరంగా ప్రసంగించారు జెలియెన్క్సీ.
ఆ తరువాత కొన్ని గంటలకు యుక్రెయిన్‌పై సైనిక చర్య చేపడుతున్నట్టు పుతిన్ ప్రకటించారు. అప్పుడు కూడా ఈ నాజీల ప్రస్తావన తెచ్చారాయన.
పుతిన్ వ్యూహం, వాదనలు
పుతిన్ చేసే ఇలాంటి వాదనలను రష్యా ప్రజలు నమ్ముతున్నారని, ఎక్కువమంది పౌరుల మద్దతు కుడగట్టుకోవడానికి ఇది ఆ దేశ అధ్యక్షుడి వ్యూహమని రష్యా నిపుణులు అంటున్నారు.
"నాజీల ప్రస్తావన తీసుకురావడం, యుక్రెయిన్‌ను డీనాజిఫికేషన్ చేస్తాననడం చాలా శక్తిమంతమైన మాటలు. అవి, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ ప్రజలు పడ్డ బాధలు, చివరికి విజయం సాధించడాన్ని రష్యా ప్రజలకు గుర్తుచేస్తాయి." అని రాండల్ అన్నారు.
"ఇటీవలి సంవత్సరాలలో పుతిన్ ఉద్దేశపూర్వకంగా రెండవ ప్రపంచ యుద్ధం ప్రస్తావనను తీవ్రతరం చేశారు. రెండవ ప్రపంచ యుద్ధాన్ని రష్యాలో "మహా దేశభక్తి యుద్ధం" అంటారు. విక్టరీ డే (విజయం సాధించిన రోజు)ను సెలవు రోజుగా ప్రకటించడం, రష్యన్లలో జాతీయవాదాన్ని పెంచడానికి ఆ యుద్ధాన్ని ప్రస్తావించడం వంటివన్నీ చేస్తున్నారు" అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
మారణహోమం ప్రస్తావన
అలాగే, యుక్రెయిన్‌లో రష్యన్లపై మారణహోమం జరుగుతోంది అని పుతిన్ చెప్పడం కూడా ప్రజల్లో యుద్ధ కాంక్షను మేల్కొల్పే వ్యూహమేనని నిపుణులు అంటున్నారు.
ఈ వ్యూహాన్ని ఇంతకుముందు కూడా పుతిన్ ఉపయోగించారని, ఇరుగు పొరుగు ప్రాంతాలపై మిలటరీ దాడికి వెళ్లినప్పుడల్లా ఈ వ్యూహం వాడారని బ్రియాన్ టేలర్ గుర్తుచేశారు.
"2008లో జార్జియాతో ఇదే చేశారు. 2014లో క్రైమియాతోనూ ఇదే చేశారు" అని ఆయన అన్నారు.
గత ఎనిమిదేళ్లుగా తూర్పు యుక్రెయిన్‌లో దోన్యస్క్, లుహాన్స్క్‌లలో వేర్పాటువాదులకు మద్దతు ఇస్తూ, వాళ్లను యుక్రెయిన్ పైకి ఉసిగొల్పినప్పుడు కూడా తప్పుడు సమాచారాన్ని యుద్ధ వ్యూహంలో భాగంగా వాడారు.
ఉదాహరణకు 2015లో బీబీసీ టీమ్ ఒక ఫ్యాక్ట్ చెక్ చేసింది. 2014 నుంచి రష్యన్ టీవీ నెట్‌వర్క్‌లకు మాత్రమే యాక్సెస్ ఉన్న దోన్యస్క్ ప్రాంతంలో యుక్రెయిన్ బాంబు దాడిలో పదేళ్ల రషన్ పిల్ల మరణించిందన్న వార్తను ఎలా సృష్టించారో బీబీసీ బయటపెట్టింది.
అలాంటి పిల్ల ఉనికిలోనే లేదని ఈ కథనాన్ని రిపోర్టింగ్ చేసిన రష్యన్ జర్నలిస్టులు అంగీకరించారు.
"మేం ప్రసారం చేయక తప్పలేదు" అని రష్యన్ ప్రొఫెషనల్స్ బీబీసీకి చెప్పారు.
"మారణహోమం అనేది తీవ్రమైన అభియోగం. అంతర్జాతీయ సమాజం దాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. రష్యా చెబుతున్నట్టు యుక్రెయిన్‌లో మారణహోమం ఏమీ జరగట్లేదు. కానీ, రష్యా సమాజానికి రక్షకుడిగా తనను తాను అభివర్ణించుకోవడం పుతిన్ విదేశీ విధానంలో భాగం. ఇప్పుడు కూడా ఏ రుజువులూ చూపించకుండా మారణహోమం జరుగుతోందని ఆరోపించడం తనను తాను రష్యన్ జాతి పరిరక్షకుడిగా చిత్రీకరించుకునే ప్రయత్నమే" అని ప్రొఫెసర్ ఆడం కేసీ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రష్యా యుద్ధం యుక్రెయిన్‌తో ఆగుతుందా? తర్వాత జరిగేది ఏంటి?
- బాంబుల వర్షం, దారిపొడవునా యుద్ధ ట్యాంకులు, మృత్యువును తప్పించుకుంటూ పయనం
- యుక్రెయిన్ కన్నీటి చిత్రాలు: బాంబుల వర్షం, దారిపొడవునా యుద్ధ ట్యాంకులు, మృత్యువును తప్పించుకుంటూ పయనం
- యుక్రెయిన్ సంక్షోభం ఎలా మొదలైంది? 4 మ్యాప్‌లలో అర్థం చేసుకోండి
- రష్యా యుద్ధం యుక్రెయిన్‌తో ఆగుతుందా? తర్వాత జరిగేది ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











