యుక్రెయిన్: ‘లోపల ఎంత భయం ఉన్నా, పిల్లల కోసం పైకి నవ్వుతున్నా’

ఫొటో సోర్స్, SARAH RAINSFORD
- రచయిత, సారా రెయిన్‌ఫోర్డ్
- హోదా, బీబీసీప్రతినిధి
నేల కింద అనేక అంతస్తుల అడుగున ఉన్న బాంబు షెల్టర్‌లో కూర్చుని ఈ కథ రాస్తున్నాను. ఇక్కడ చాలామంది ఉన్నారు. నాలుగు పెంపుడు కుక్కలు, ఒక కుందేలు కూడా ఉంది.
అర్థరాత్రి దాటిన తరువాత హోటల్ సిబ్బంది అన్ని గదుల తలుపులూ కొట్టుకుంటూ వచ్చారు. అత్యంత వేగంగా మమ్మల్ని మెట్లు దింపి భూమి కింద అంతస్తులకు తరలించారు.
రష్యా యుద్ధవిమానం దిగుతుందన్న వదంతులకు హోటల్ సిబ్బంది ఎక్కువ హడావిడి పడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ, అదేం ఆశ్చర్యం కాదు. అందరూ అప్రమత్తంగా ఉన్నారు.
ఆరోజు, సాయంత్రం రోడ్డుకు అవతల పక్క ఉన్న ఒక పెద్ద అపార్ట్మెంటులో హన్నా సివా కుటుంబాన్ని కలిశాను. రెండు రోజుల ముందు రష్యా దాడి ప్రారంభించిన దగ్గర నుంచి హన్నా సివా కుటుంబం మొత్తం హాల్లో సోఫాల వెనుక తలదాచుకుంటోంది. ఆమె భర్త తన తుపాకీని బయటకు తీశారు. ముందు జాగ్రత్తగా పక్కనే పెట్టుకున్నారు.

ఫొటో సోర్స్, SARAH RAINSFORD
హన్నా సివాకు ఇద్దరు పిల్లలు. లోపల ఎంత భయం ఉన్నా, పిల్లల కోసం బయటకు నవ్వుతూ ఉన్నానని ఆమె చెప్పారు.
"నిన్న బాగా ఏడ్చారు. వాళ్లు చాలా భయపడుతున్నారు. నేను కూడా భయపడుతున్నట్టు కనిపిస్తే వాళ్లు బెంబేలెత్తిపోతారు" అని హన్నా అన్నారు.
హన్నా, పిల్లలిద్దరికీ ఒక వారం ముందే చేతికి బ్రేస్‌లెట్లు కొన్నారు. వాటిపై వాళ్ల పేర్లు, ఫోన్ నంబర్, బ్లడ్ గ్రూపు వివరాలు రాసి, చేతికి కట్టారు.
"బ్లడ్ గ్రూపు రాస్తుంటే నాకు గుండె దడదడలాడింది. నమ్మశక్యంగా అనిపించలేదు. ఒక తల్లిగా నేను భరించలేకపోయాను" అన్నారామె.
ఇప్పటివరకు, నీప్రో సమీపంలో మాత్రమే పేలుళ్లు సంభవించాయి. అది కూడా రష్యా దాడి ప్రారంభించిన కొద్ది గంటల్లోనే. ఆ తరువాత నగరంలో పెద్దగా అలజడి లేదు. కానీ, ఈ ప్రాంతానికి మూడు దిక్కుల్లోనూ (దక్షిణం, ఉత్తరం, తూర్పు) రష్యా బలగాలు దాడి చేస్తున్నాయి.
అందుకే, హన్నా రక్షణ కోసం సన్నాహాలు చేసుకుంటూ, మనసు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు. పక్కింటివాళ్లతో కలిసి కింద బేస్‌మెంట్ శుభ్రం చేసుకున్నారు. అవసరం అయితే, అక్కడకు వెళ్లి తలదాచుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్ని బట్టలు, ఆహారం, నీళ్లు అన్నీ బ్యాగుల్లో సర్ది తలుపు పక్కనే పెట్టారు.
బేస్‌మెంట్ అపార్ట్మెంటులో వాళ్లందరికీ సరిపోదు. కానీ, కొంతమంది పశ్చిమం వైపుకు తరలివెళ్లారు. అయితే, డోన్‌బస్ నుంచి కొంతమంది ఇక్కడకి తరలివచ్చారు.
2014 నుంచి డోన్‌బస్‌లో తిరుగుబాటుదారులకు రష్యా మద్దతు ఇస్తోంది. కానీ, ఇపుడు నేరుగా రష్యా యుద్ధరంగంలోకి దిగింది. స్థానికులు అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు వర్ణించి చెప్పారు. అయితే, యుక్రెయినియన్లు పట్టు కోల్పోలేదని, బలంగా పోరాడుతున్నారని కూడా చెప్పారు.

ఫొటో సోర్స్, SARAH RAINSFORD
'మా సైన్యానికి మేం సహాయం అందించాలి'
రక్తదాన కేంద్రం వెలుపల ఉన్న పెద్ద క్యూలో లీజాను కలిశాను. నర్సింగ్ చదువుతున్న లీజా ఎనిమిదేళ్ల క్రితం అంటే వివాదం మొదలైనప్పుడు నీప్రోకు మారారు.
మళ్లీ ఇక్కడి నుంచి తరలివెళ్లడమంటే చాలా కష్టమని, ఆ ఆలోచనే భయపెడుతోందని ఆమె అన్నారు. నీప్రోకు వచ్చిన కొత్తల్లో ఇల్లు వెతుక్కుని స్థిరపడడానికి ఎంత శ్రమపడాల్సి వచ్చిందో ఆమె గుర్తుతెచ్చుకున్నారు.
లోపల ఎన్ని భయాలున్నా, యుక్రెయిన్ సైనికులకు సహాయం అందించాలనుకుంటున్నారు లిజా. అందుకే, గాయపడినవారికి రక్తం దానం చేయడానికి వచ్చారు.
చలిలో, వర్షంలో 90 నిముషాల పాటు ఆ క్యూ నడిచింది.
20 ఏళ్ల వ్లాద్ కూడా సైన్యానికి సహాయం అందించడం కోసం వచ్చారు. రష్యా తమ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంటుందని ఆయన భయపడుతున్నారు. వ్లాదిమర్ పుతిన్ తమకు అధ్యక్షుడు కాకూడదని కోరుకుంటున్నారు.
"చాలా షాకింగ్‌గా ఉంది. నేను కుడా చేతుల్లోకి ఆయుధాలు తీసుకోవాలా అని ఆలోచిస్తున్నా. కనీసం, నా చుట్టు ఉన్న జిల్లాలను రక్షించడానికైనా ఆయుధం చేపట్టాలనిపిస్తోంది. రక్తం మరిగిపోతోంది" అని వ్లాద్ అన్నారు.

ఫొటో సోర్స్, SARAH RAINSFORD
అయితే, అక్కడ క్యూలో నిల్చున్న వారిలో కొంత నిరాశ కూడా కనిపించింది.
"ఆంక్షలు విధించడం సరే, అవి కొంతవరకు సహకరిస్తాయి. కానీ, అది సరిపోదు. ఇంకా ఎక్కువ కావాలి. ఇప్పుడు దీన్ని ఆపడానికి యూరోప్ మీద ఆధారపడి ఉన్నాం" అని హన్నా అన్నారు.
పశ్చిమ దేశాలు ఆలస్యంగా ఆంక్షలు విధించాయని, అవి కూడా కఠినంగా లేవని మరొక విద్యార్థి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందరూ యుక్రెయిన్‌ను ఒంటరిగా విడిచిపెట్టారని ఆయన భావిస్తున్నారు. అందుకే సైన్యానికి తన వంతు సహాయం అందించాలనుకుంటున్నారు.
"గాయపడినవారికి సహాయం అందించడం చాలా ముఖ్యం. వాళ్లు ఒంటరివారు కాదని తెలియజేయాలి. సహాయం చేయడానికి మేమున్నాం అని చెప్పాలి" అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ల నుంచి మన కళ్లను ఎలా కాపాడుకోవాలి?
- సైబర్ నేరాల ఆరోపణలతో ఒకే ఊళ్లో 31 మంది అరెస్ట్, మూడు జిల్లాలు సైబర్ మోసాలకు అడ్డాగా మారాయా-గ్రౌండ్ రిపోర్ట్
- భీమ్లా నాయక్: ‘గజినీ మొహమ్మద్ 17 సార్లు యుద్దం చేసి ఓడిపోయాడు. నెగ్గినోడి పేరు తెలుసా?’
- యుక్రెయిన్ సంక్షోభం: నాటో ఆహ్వానించినా భారత్ ఎందుకు ఆ కూటమిలో చేరలేదు?
- 'స్విఫ్ట్' అంటే ఏమిటి? ఈ పేమెంట్ నెట్వర్క్ నుంచి రష్యాను నిషేధిస్తే ఎవరికి నష్టం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













