యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో రష్యా, యుక్రెయిన్ సైన్యాల భీకర పోరు
యుక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దాడి మూడో రోజు కొనసాగుతోంది. కీయెవ్‌కు సమీపంలోని ఎయిర్‌బేస్‌ను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా భారీ పేలుడు శబ్ధాలు వినిపించాయి.
యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో పేలుళ్లు జరుగుతున్నట్లు, దాని చుట్టుపక్కల భీకర ఘర్షణలు జరుగుతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి.
రాజధానిలోని మైదాన్ స్క్వేర్ దగ్గర భారీ పేలుడు శబ్ధాలు వినిపించాయి. ట్రోయిష్చినా ప్రాంతంలో అనేక పేలుళ్లు జరిగినట్లు చెబుతున్నారు.
పేలుడు శబ్దాలు రాజధానికి కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
రాజధానిలోని ట్రోయిష్చినా జిల్లాలో ఉన్న సీహెచ్‌పీ-6 పవర్ స్టేషన్ సమీపంలో రష్యా, యుక్రెయిన్ బలగాల మధ్య ఘర్షణ జరుగుతోంది. రాజధానికి విద్యుత్ సరఫరా నిలిపివేసే ప్రయత్నంలో ఇక్కడ రష్యా దాడి చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
కీయెవ్‌లోని పెరెమోయ్ ఎవెన్సులో ధ్వంసమైన వాహనాలు, మంటలు కనిపించాయి. వాసిల్కివ్‌లోని ఎయిర్‌ఫీల్డ్‌కు సమీపంలో భీకర పోరాటం జరుగుతోందని రిపోర్టులు వస్తున్నాయి.
కీవ్‌లో వైమానిక దాడుల హెచ్చరికలతో ప్రజలు భూగర్భ షెల్టర్లలో తలదాచుకున్నారు. వేల మంది యుక్రెయిన్ ప్రజలు ప్రాణ భయంతో పొరుగు దేశాలకు పారిపోతున్నారు.
మైకోలావ్ నగరం నుంచి రష్యా సైన్యాన్ని తిప్పికొట్టామని యుక్రెయిన్ సైన్యం చెబుతోంది.
యుక్రెయిన్ నాయకత్వాన్ని అధికారం నుంచి దింపేయాలని యుక్రెయిన్ సైనికులకు రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపు ఇచ్చారు.
అమెరికా, యురోపియన్ యూనియన్, బ్రిటన్, కెనడాలు రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాయి.
తూర్పు యూరప్‌కు నాటో మరిన్ని అదనపు బలగాలను పంపిస్తోంది. గతంలో అణు ప్రమాదం జరిగిన చెర్నోబిల్ ప్రాంతాన్ని రష్యా తమ ఆధీనంలోకి తీసుకుంది.
యుక్రెయిన్‌పై దాడిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమర్థించుకున్నారు. రష్యాను కాపాడుకునేందుకు ఇది తప్పనిసరని ఆయన చెప్పారు.
యుక్రెయిన్‌కు సంఘీభావం ప్రకటిస్తూ ప్రపంచ వ్యాప్తంగా చారిత్రక కట్టడాలపై యుక్రెయిన్ జెండా రంగుల లైట్లు కనిపించాయి.
ఇవి కూడా చదవండి:
- కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ల నుంచి మన కళ్లను ఎలా కాపాడుకోవాలి?
- బ్రిటిష్ కాలం నాటి వించ్ రవాణా: డ్రైవర్ ఒకచోట, వాహనం మరోచోట.. చూస్తే భయం, ఎక్కితే సరదా
- యుక్రెయిన్‌పై రష్యా దండెత్తినా అమెరికా సైన్యం ఎందుకు రంగంలోకి దిగలేదు? మీరు తెలుసుకోవాల్సిన 6 కీలక అంశాలు..
- చనిపోయే ముందు జీవితం మన కళ్ల ముందు కనిపిస్తుంది - తాజా అధ్యయనం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)