బ్రిటిష్ కాలం నాటి వించ్ రవాణా: డ్రైవర్ ఒకచోట, వాహనం మరోచోట.. చూస్తే భయం, ఎక్కితే సరదా

వించ్ రవాణా

ఫొటో సోర్స్, L.Srinivas/BBC

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఏ వాహనంలోనైనా డ్రైవరు ఉండి దాన్ని నడిపిస్తారు. కానీ, మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి రాకపోకలు సాగించే ఒక ప్రత్యేకమైన వాహనం డ్రైవర్ మాత్రం ఆ వాహనంలో లేకుండా దూరంగా ఉన్న ఒక ప్రత్యేకమైన గదిలో ఉంటారు.

దాని స్టీరింగ్ ఆయన చేతిలోనే ఉంటుంది, ఆ వాహనం దిశ, వేగం, రాకపోకలన్నింటినీ అక్కడ నుంచే నియంత్రిస్తారు.

ఈ వాహనం కొండపై నుంచి వాలుగా 2 వేల అడుగులు కిందకు వెళ్లి, మళ్లీ తిరిగి పైకి వస్తుంటుంది.

ఈ వాహనం బ్రిటిష్ కాలంలో తయారైంది. ఇందులో ప్రయాణించడమే కాదు, ఆ రవాణా వ్యవస్థ ఎలా పనిచేస్తుందో కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది.

వించ్ రవాణా

ఫొటో సోర్స్, L.Srinivas/BBC

వించ్ (WINCH) అంటే...

కొండ దిగువన ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని చూసేందుకు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే మాచ్‌ఖండ్ విద్యుత్ కేంద్రం అడవి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రాన్ని ఒనకఢిల్లీ అనే దట్టమైన అటవీ ప్రాంతంలో 2 వేల అడుగుల దిగువన నిర్మించాలని అనుకున్నారు.

అంత దిగువకు వెళ్లి, తిరిగి పైకి రావడం చాలా కష్టమైన పని. దాంతో ఈ ప్లాంట్ నిర్మాణ పనులు మొదలు పెట్టేందుకు అప్పటి బ్రిటిష్ ఇంజనీర్లు ఒక పరిష్కారం చూపించారు. అదే వించ్.

ఒక బలమైన ఇనుప తీగ సాయంతో కిందకూ, పైకీ వెళ్లగలిగే ఉండే ఒక ట్రాలీ లాంటి వాహనాన్నే వించ్ అంటారు. ఈ వించ్ వేగాన్ని పెంచడం, తగ్గించడం వించ్ డ్రైవర్ నియంత్రిస్తుంటారు. కానీ ఆయన వించ్ లోపల ఉండరు, ఆయనొక ప్రత్యేకమైన గదిలో ఉంటూ దాన్ని ఆపరేట్ చేస్తారు.

దీనికి అప్పట్లో రూ.2 లక్షల 45 వేలు ఖర్చు చేశారు. ఇది 20 టన్నుల బరువు వరకూ తీసుకుని వెళ్లగలదు. వించ్ రాకపోకలకు ఆధారమైన ఇనుప వైరు పొడవు 800 మీటర్లు, అలాగే దాని మందం 80 మిల్లీ మీటర్లు. వించ్ గరిష్ట వేగం సెకనుకి 143 అడుగులు.

వించ్ రవాణా

ఫొటో సోర్స్, L.Srinivas/BBC

చూస్తే భయం...ఎక్కితే సరదా

కొండ పైనుంచి కిందకు, మళ్లీ పైకి వెళ్లే వించ్ మార్గాన్ని చూస్తే భయంగా అనిపిస్తుంది. ఎందుకంటే, కిందకు వాలుగా ఉండే వించ్ ట్రాక్ చూస్తే, ఒక్కసారిగా జారిపోతుందేమోనని భయం కలగడం సహజం.

కానీ ఇదే ట్రాక్‌పై వించ్ 90 ఏళ్లకు పైబడే నడుస్తోంది. కానీ ఇప్పటీ వరకు ఒక్క ప్రమాదం కూడా జరగలేదని ప్లాంట్ ఉద్యోగి ఈశ్వరరావు చెప్పారు.

"నేను ఉద్యోగంలో చేరిన్పప్పటీ నుంచి ఈ వించ్ పైనే ప్రయాణం చేస్తున్నాను. మొదటి సారి చూసినప్పుడు ఇందులో ప్రయాణమా…? అని నేను భయపడ్డాను. కానీ ఇందులో ఎక్కి ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. కిందకు వెళ్తున్నప్పుడు వాలుగా ఒకేసారి సులభంగా దిగిపోవడం, పైకి వెళ్తున్పప్పుడు కష్టంగా వెళ్లడం అంటూ ఉండదు. దీని వేగాన్ని వించ్ డ్రైవర్ వించ్ హౌస్ నుంచి నియంత్రిస్తారు. ఈ వించ్ ఎక్కితే పైనుంచి కిందకు, కింద నుంచి పైకి ఒక్కో వైపు చేరుకోడానికి పావు గంట సమయం పడుతుంది. అదే బస్సులో అయితే ఘాట్ రోడ్డులో ఆరు కిలోమీటర్లు రావాలి. దానికి అరగంటకు పైనే పడుతుంది. అది కూడా రోటీన్‌గా ఉంటుంది. అదే వించ్ అయితే ఏదో తెలియని సరదా అనిపిస్తుంది" అన్నారు.

మాచ్‌ఖండ్ నిర్మాణానికి సాక్ష్యం ఇదే

ఫొటో సోర్స్, L.Srinivas/BBC

మాచ్‌ఖండ్ నిర్మాణానికి సాక్ష్యం ఇదే

మాంచ్‌ఖండ్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టడం నుంచి...రాళ్లను పేల్చి నిర్మించిన మాచ్‌ఖండ్ విద్యుత్ ప్లాంట్‌లోని ప్రతి దశకు ఈ వించ్ ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది.

ఈ ప్లాంట్ నిర్మాణానికి రాతికొండను తొలచడం నుంచి ప్రస్తుతం ఉన్న యంత్ర సామాగ్రి వరకు, కూలీలు, ఉద్యోగులు, పర్యవేక్షించిన అధికారులను ఈ వించే ప్లాంట్ వరకు తీసుకొచ్చింది.

ఇప్పుడంటే రోడ్డు సౌకర్యం ఉంది కానీ...అప్పట్లో ఇక్కడ కాలిబాట కూడా లేదని వించ్ విండో సీటులో ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ, ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు తన ఆనందాన్ని బీబీసీతో పంచుకున్నారు.

"చిన్న కాలి బాట కూడా లేని రోజుల్లో ఇక్కడ ఏకైక రవాణ సౌకర్యం వించ్ మాత్రమే. వించ్‌కు సమాంతరంగా మెట్లు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ప్లాంట్‌కు నేరుగా రోడ్డు మార్గం ఉన్నా, వించ్ ప్రయాణాన్నే ఇష్టపడతాం. బస్సులో, రైళ్లలో విండో సీటు కోసం ఎలా ఆశపడతామో...అలాగే వించ్‌లో కూడా ఒక చివర్న కూచోవాలని అనుకుంటారు. ప్రయాణం పావు గంటే అయినా...చివర్లో కూర్చుని అన్నీ చూస్తూ ప్లాంట్‌కు చేరుకోవడం, మళ్లీ విధులు ముగించుకుని పైకి వెళ్లడం రోజూ కొత్త అనుభూతిని ఇస్తుంది" అన్నారు.

వించ్ రవాణా

ఫొటో సోర్స్, L.Srinivas/BBC

వించ్ పర్యటకం

జల విద్యుత్ ప్లాంట్ నిర్మాణం మొత్తం పూర్తైన తర్వాతే ప్లాంట్ కు రోడ్డు మార్గం వేశారు. అప్పటీ వరకు అన్నీంటికి వించే ఆధారం.

కొండకోనల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వించ్ ప్రయాణం మరచిపోలేని అనుభూతి ఇస్తుందని ఉద్యోగులు చెప్తున్నారు. వించ్ లో ప్రయాణం చేసేందుకే ప్రత్యేకంగా ఇక్కడకు పర్యటకులు వచ్చేవారని తెలిపారు.

"ఈ వించ్‌లో ప్రయాణించేందుకు పర్యటకులు వస్తుంటారు. అయితే ఇప్పుడు ప్రత్యేక అనుమతితో ఈ వించ్ ఎక్కొచ్చు. గతంలో అయితే పర్యటకులకు ఈ వించ్ ప్రయాణాన్ని అనుమతించేవారు. కానీ, ప్రభుత్వం ఈ వించ్‌లో పర్యటకుల ప్రయాణాలను నిషేధించింది. దీంతో వారు రావడం మానేశారు. విజిటర్స్ వించ్ ప్రయాణం బాగా ఎంజాచ్ చేసేవారు. ప్రభుత్వం ఒకసారి ఆలోచించి వించ్ ప్రయాణాలకు పర్యటకులకు అనుమతిస్తే...ఈ ప్రాంతానికి టూరిజం బాగా పెరుగుతుంది" అని ప్లాంట్ ఉద్యోగి రమణ అన్నారు.

వించ్ హౌస్ టూ పవర్ ప్లాంట్

ఫొటో సోర్స్, L.Srinivas/BBC

వించ్ హౌస్ టూ పవర్ ప్లాంట్

మాచ్‌ఖండ్ ప్లాంట్‌లో పని చేసే ఉద్యోగులు, కార్మికులు అందరూ ప్లాంట్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే ఒనకఢిల్లీ గ్రామంలో ఉంటారు.

షిష్ట్‌కు వెళ్లే వారంతా ఒనకఢిల్లీ జంక్షన్‌కు వస్తారు. అక్కడకు అయా షిఫ్ట్ సమయాల్లో ప్లాంట్ బస్సు వస్తుంది. ఉద్యోగులను కిలోమీటరు దూరంలో ఉండే వించ్ హౌస్‌కు తీసుకుని వెళ్తుంది. అక్కడ నుంచి వారంతా 2 వేల అడుగుల కిందకు వించ్‌పై ప్రయాణిస్తారు. వించ్ వారిని నేరుగా ప్లాంట్ లోపలకే తీసుకెళ్తుంది.

"బస్సు, మమ్మల్ని వించ్ హౌస్ దగ్గర దించుతుంది. అక్కడ నుంచి వించ్ ఎక్కి కిందకు అంటే ప్లాంట్‌కు వెళ్తాం. అలాగే వించ్ ఎక్కి పైకి వెళ్లగానే బస్సు ఉంటుంది. ఆ బస్సు మళ్లీ మమ్మల్ని ఒనకఢిల్లీ జంక్షన్‌లో దింపుతుంది. బస్సు నేరుగా ప్లాంట్‌కు తీసుకెళ్తుంది. కానీ, వించ్ ప్రయాణం మాకు అలవాటైపోయింది. పైగా వించ్‌లో ప్రయాణిస్తూంటే మళ్లీ చిన్నపిల్లలం అయిపోయినట్లు అనిపిస్తుంది" అని మరో ఉద్యోగి రామకృష్ణ చెప్పారు.

మూడు సిగ్నల్స్...ఇద్దరు ఉద్యోగులు...

ఫొటో సోర్స్, L.Srinivas/BBC

మూడు సిగ్నల్స్...ఇద్దరు ఉద్యోగులు...

ఈ వించ్ రాకపోకలను వించ్‌లో ప్రయాణించే వించ్ గార్డు, వించ్ హౌస్‌లో ఉండే డ్రైవరు నియంత్రిస్తారు.

వించ్ గార్డు సిగ్నల్ రాడ్ సాయంతో వించ్ డ్రైవర్‌కు ఇచ్చే సిగ్నల్ ఆధారంగా ఇదంతా జరుగుతుంది.

ఆ సిగ్నల్ అందుకునే వించ్ డ్రైవర్...వించ్ హౌస్ నుంచే ఆ వాహనాన్ని ఆపరేట్ చేస్తారు. దశాబ్దాలుగా ఒక చిన్న టెక్నిక్‌తో వించ్ నడుస్తోంది.

వించ్ రవాణా

ఫొటో సోర్స్, L.Srinivas/BBC

"వించ్ ప్రయాణంలో మలుపులు తిరగాల్సి వచ్చినప్పుడు రన్నింగ్‌లో ఉన్న వించ్ నుంచి గార్డు కిందకు దిగి...మలుపులకు తగ్గట్టు దాని దారిని మళ్లీంచడం (దీనిని బుకింగ్ అంటారు) కూడా చూసి తీరాలి. దశాబ్దాలుగా ఈ వించ్ పని చేస్తున్నా...ఇప్పటివరకూ ఏనాడు ఒక్క ప్రమాదం కూడా జరగలేదు. 24 వాట్స్ విద్యుత్ తీగలపై సిగ్నల్ స్టిక్‌తో కొట్డడం ద్వారా వించ్ హౌస్‌లో అలారం మోగుతుంది. ఒక సారి మోగితే బ్రేక్, రెండు సార్లు మోగితే కిందకు వదలాలని, మూడు సార్లు మోగితే పైకి లాగాలని అర్థం. ఈ సిగ్నల్స్‌ను వించ్ డ్రైవర్ ఫాలో అవుతారు" అని వించ్ గార్డ్ అప్పలరాజు బీబీసీకు వివరించారు.

వించ్ జీపీఎస్

ఫొటో సోర్స్, L.Srinivas/BBC

వించ్ జీపీఎస్

వించ్ గార్డు ఇచ్చే సిగ్నలే కాకుండా...వించ్ హౌస్‌లో ఉండే డ్రైవర్ మరొక ఇండికేటర్ కూడా ఫాలో అవుతారు. దీన్నొక జీపీఎస్‌లా చెప్పొచ్చు. ఇండికేటర్ బోర్డుమీద ముల్లు కదలికలను బట్టి...ఎక్కడ వించ్ అపాలి..? ఎక్కడ స్లో చేయాలి..? అనేది వించ్ డ్రైవర్ నిర్ణయిస్తారు. సిగ్నల్ ఆధారంగా వించ్‌ను ఎక్కడైనా అపచ్చు, కదిలించవచ్చు.

"వించ్ గార్డు నుంచి ఎలాంటి సిగ్నల్ రాకపోతే వేగాన్ని ఒకే కంట్రోల్‌లో ఉంచుతాను. అలా కాకుండా మలుపులు వచ్చినప్పుడు నాకు వించ్ గార్డు సిగ్నల్‌తో పాటు ఇండికేటర్‌లో కూడా తెలుస్తుంది. అలాటప్పుడు స్లో చేస్తాను. అదే సమయంలో వించ్ గార్డు వైర్ పొజిషన్ మారుస్తారు. దీనినే బుంకింగ్ అంటాం. వించ్ కిందకు దిగడానికి 15 నిముషాలు, అలాగే పైకి రావడానికి 13 నిముషాలు పడుతుంది. రెండు కంపార్టుమెంట్లులా ఉండే ఈ వించ్‌లో ఒకే సారి 20 నుంచి 30 మంది ప్రయాణిస్తారు" అని వించ్ డ్రైవర్ ఎం.ఢిల్లీరావు చెప్పారు.

"వించ్‌లో లేకుండా బండి రాకపోకలను మొత్తం వించ్ హౌస్ నుంచే కంట్రోల్ చేస్తాం. కొత్తగా వచ్చినవారేవరైనా అంత కిందకు వాలుగా వెళ్తుందా...అది కూడా డ్రైవర్ లేకుండా అని ఆశ్చర్యపోయి...అసలు ఎక్కడానికే భయపడుతుంటారు. కానీ తర్వాత దీని గురించి తెలుసుకున్నాక వించ్ ప్రయాణాన్ని ఇష్టపడతారు. తమిళనాడులో పళని దేవాలయానికి వెళ్లేందుకు వించ్ వాడతారు. అయితే అది 300 మీటర్ల దూరమే. ఈ తరహా వించ్‌లు ఇంకెక్కడా ప్రయాణానికి వాడుతున్నట్లు వినలేదు'' అన్నారు.

ఇనుప తీగే ఆధారం

ఫొటో సోర్స్, L.Srinivas/BBC

ఇనుప తీగే ఆధారం

వించ్ ప్రయాణాలకు మూలాధారం ఇనుప తీగే. బలమైన ఆ 800 మీటర్ల ఇనుప తీగ వించ్‌ను పైకి లాగడం, కిందకు తీసుకెళ్లడం చేస్తుంది.

ఈ వైర్‌ను ప్రత్యేకంగా తయారు చేస్తారు. దీనికి రోజూ గ్రీజు పూయడం లాంటి సాధారణ మెయింటైనెన్స్ ఉంటుంది.

"ఐదేళ్లకు ఒకసారి మాత్రం దీని నాణ్యతను తప్పకుండా పరీక్షిస్తారు. దీని కోసం శాంపిల్ పీసులను చెన్నై, ముంబాయిల్లోని ల్యాబ్‌కు పంపుతారు. వీరు నాణ్యతను పరిశీలించి ఆ ఇనుప తీగ వాడచ్చా, లేదా అనే రిపోర్ట్ ఇస్తారు. వాడవద్దని రిపోర్ట్ వస్తే వెంటనే కొత్త రోప్ వేస్తాం. సాధారణంగా ఉషా మార్టిన్ లాంటి కంపెనీలు ఆ పరీక్షలు చేస్తాయి." అని ప్లాంట్ ఉద్యోగి సత్యకిరణ్ చెప్పారు.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)