చనిపోయే ముందు జీవితం మన కళ్ల ముందు కనిపిస్తుంది - తాజా అధ్యయనం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హాలీ హోండెరిక్
- హోదా, బీబీసీ న్యూస్
చనిపోయే ముందు జీవితం మన కళ్ల ముందు కనిపిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.
మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న 87ఏళ్ల వ్యక్తి మెదడు తరంగాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. చనిపోయేముందు ఆయన మెదడులోని నాడీ చర్యలను పరిశీలించారు.
అయితే, చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు అతడికి గుండెపోటు వచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు.
కలలు కంటున్నప్పుడు లేదా ఏవైనా విషయాలను గుర్తు చేసుకుంటున్నప్పుడు మెదడులో ఎలాంటి తరంగాలు జనిస్తాయో అచ్చం అలాంటి తరంగాలే చనిపోవడానికి 30 సెకన్ల ముందు సదరు వ్యక్తి మెదడలో పరిశోధకులు గుర్తించారు.
‘‘జీవితం చివరి క్షణాల్లో మరచిపోలేని అన్ని విషయాలను గుర్తు చేసుకోవడానికి ఈ తరంగాలు సంకేతం కావొచ్చు’’అని ఏజింగ్ న్యూరోసైన్స్ మ్యాగజైన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
మరణిస్తున్న మెదడులో మేం అనుకోకుండా ఇలాంటి తరంగాలను రికార్డు చేయగలిగామని పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ అజ్మన్ జెమ్మర్ చెప్పారు.
‘‘ఇదంతా అనుకోకుండా జరిగింది. మేం ఇలాంటి తరంగాలను రికార్డు చేయాలని ముందుగా అనుకోలేదు’’అని ఆయన బీబీసీతో చెప్పారు.
‘‘మన జీవితంలో ప్రేమించిన వారితో గడిపిన మధురమైన క్షణాలను చివరి క్షణాల్లో గుర్తుచేసుకోవడానికి ఇది సంకేతంగా అనుకోవచ్చా’’అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ఆ విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని అన్నారు.
‘‘తార్కికంగా ఆలోచిస్తే, మధురమైన క్షణాలను చివర్లో గుర్తుచేసుకుంటున్నామని అనుకోవచ్చు. ఎందుకంటే దురదృష్టకర లేదా చెడు ఘటనలను ఎవరూ చివర్లో గుర్తు చేసుకోరు కదా’’అని ఆయన వివరించారు.
‘‘అయితే, గుర్తు చేసుకోవాలనుకునే ఘటనలు ఒక్కొకరికి ఒక్కోలా ఉండొచ్చు’’అని ఆయన చెప్పారు.
మెదడుకు రక్త సరఫరా నిలిచిపోవడానికి 30 సెకన్ల ముందు.. ఏకాగ్రత పెట్టడం, కలలు కనడం, ఏవైనా సంగతులను గుర్తు చేసుకోవడం లాంటి సమయాల్లో మెదడు క్రియాశీలమైనప్పుడు ఉత్పత్తయ్యే తరంగాలను మేం గుర్తించామని లూయిస్‌విల్ యూనివర్సిటీలో న్యూరోసర్జన్‌గా పనిచేస్తున్న జెమ్మర్ చెప్పారు.
ఆ తరంగాలు 30 సెకన్లపాటు కనిపించాయి. ఆ తర్వాత గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అంటే సదరు వ్యక్తి మరణించాడని అర్థం.
‘‘మన జీవితంలో మరపురాని సంఘటనలను చివరిసారిగా గుర్తుచేసుకోవడానికి దీన్ని సంకేతంగా చెప్పొచ్చు. ఇవి చనిపోయే ముందు మెదడుకు వస్తున్నాయి.’’
సరిగ్గా ప్రాణం ఎప్పుడు? ఎలా పోతుంది? గుండె ఎప్పుడు కొట్టుకోవడం ఆగిపోతుంది? లేదా మెదడు ఎప్పుడు పనిచేయడం ఆగిపోతుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ఈ అధ్యయనం చేపట్టారు.
అయితే, ఒక వ్యక్తిపై చేపట్టిన అధ్యయనంతో ఒక అవగాహనకు అప్పుడే రాకూడదని జెమ్మర్ అన్నారు. పైగా సదరు వ్యక్తి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడని, అతడి మెదడులో రక్త స్రావం కూడా అయిందని వివరించారు.
2013లో ఎలుకలపై చేపట్టిన అధ్యయనంలోనూ ఇలాంటి ఫలితాలే కనిపించాయి.
చనిపోయేముందు ఎలుకల మెదడు క్రియాశీలమైనట్లు అమెరికా పరిశోధకులు గుర్తించారు. చనిపోవడానికి 30 సెకన్ల ముందు ఎలుకల మెదడులో ఏదో వెతుకున్నది దొరికినట్లు తరంగాలు కనిపించాయని జెమ్మర్ చెప్పారు.
ఈ రెండు అధ్యయనాల్లో ఒకేలాంటి ఫలితాలు కనిపించడంతో అద్భుతంగా అనిపించిందని జెమ్మర్ వివరించారు.
తాజా అధ్యయనం నుంచి స్ఫూర్తి పొంది జీవితం చివరి క్షణాల్లో ఏం జరుగుతుందనే విషయంపై మరిన్ని అధ్యయనాలు జరగాలని ఆయన ఆకాంక్షించారు.
‘‘ఇది కాస్త ఆశ్చర్యకరమైన, ఆధ్యాత్మిక విషయమని చెప్పుకోవచ్చు. చనిపోయే ముందు ఏం జరుగుతుందని కనిపెట్టేందుకు ఎప్పటినుంచో పరిశోధనలు జరుగుతున్నాయి.’’

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- 'స్విఫ్ట్' అంటే ఏమిటి? ఈ పేమెంట్ నెట్వర్క్ నుంచి రష్యాను నిషేధిస్తే ఎవరికి నష్టం?
- పుతిన్‌కు ఏం కావాలి? యుక్రెయిన్‌పై రష్యా ఎందుకు దాడి చేస్తోంది
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య 5 గ్రామాల వివాదం ఏంటి... కొత్త జిల్లాల ఏర్పాటుతో చిక్కులు తప్పవా?
- భీమ్లానాయక్: పవన్ నోట పొలిటికల్ డైలాగులు, అభిమానుల్లో ఫుల్ జోష్
- యుక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులు: ‘ఇక్కడ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి, మమ్మల్ని ఎలాగైనా ఇండియాకి తీసుకెళ్లండి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















