యుక్రెయిన్: నాటో అంటే ఏంటి, అది రష్యా దాడులపై ఎలా స్పందించింది?

ఫొటో సోర్స్, Getty Images
నాటో తన 73 ఏళ్ల చరిత్రలో ఎదుర్కున్న అతిపెద్ద సవాళ్లలో యుక్రెయిన్‌పై రష్యా దాడి ఒకటి.
రష్యా, యుక్రెయిన్ సరిహద్దులకు పాశ్చాత్య కూటమి అదనపు దళాలను పంపుతోంది. కానీ, ప్రస్తుత ఘర్షణలో జోక్యం చేసుకునే ఆలోచనలో లేదు.
నాటో అంటే ఏమిటి?
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) - రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా 12 దేశాలతో ఏర్పాటైన సైనిక కూటమి.
ఈ కూటమిలోని ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా, మిగతా సభ్య దేశాలు సహాయం అందించాలన్నది నాటో ఒప్పందం.
రెండో ప్రపంచ యుద్ధానంతరం యూరప్‌లో సోవియట్ రష్యా విస్తరణను అడ్డుకోవడమే లక్ష్యంగా నాటో ఏర్పడింది.
నాటో ఏర్పాటుకు ప్రతిస్పందనగా, సోవియట్ రష్యా 1955లో తూర్పు యూరప్ కమ్యూనిస్టు దేశాలతో కలిసి సొంత సైనిక కూటమిని ఏర్పాటు చేసింది. దీన్ని వార్సా ఒప్పందం అంటారు.
1991లో సోవియట్ యూనియన్ పతనం తరువాత, చాలా దేశాలు వార్సా ఒప్పందం నుంచి బయటికొచ్చి నాటో కూటమిలో చేరాయి. ప్రస్తుతం నాటోలో 30 సభ్య దేశాలు ఉన్నాయి.

యుక్రెయిన్‌లో నాటో ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు?
యుక్రెయిన్ నాటోలో భాగం కాదు. అందుచేత, దానికి కచ్చితంగా సహాయం చేయాలనే నిబంధన లేదు.
ఒకప్పుడు సోవియట్ రిపబ్లిక్‌లో భాగమైన యుక్రెయిన్ అనేక సంవత్సరాలుగా నాటోలో చేరేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి యుక్రెయిన్ రష్యాలో భాగమని పుతిన్ ఇటీవల పేర్కొన్నారు.
యుక్రెయిన్ నాటోలో చేరేందుకు ఎప్పటికీ అనుమతించకూడదన్నది రష్యా వాదన. అయితే, నాటో కూటమి దీనికి సమ్మతించలేదు. దాడికి ముందు రష్యాకు ఉన్న కోపాల్లో ఇదీ ఒకటి.
ఇప్పుడు నాటో దళాలు యుక్రెయిన్ విషయంలో జోక్యం చేసుకుంటే సమస్య మరింత జటిలం కావొచ్చు. ఒకవేళ అదే జరిగితే, అణ్వాయుధాల వరకు వెళ్లాల్సి వస్తుందని పుతిన్ పరోక్షంగా హెచ్చరించారు.
"రష్యా వెంటనే స్పందిస్తుంది. ఫలితంగా, మీ చరిత్రలో ఎన్నడూ చూడని పరిణామాలను చూస్తారు" అంటూ పుతిన్ బెదిరించారు.
యుక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ దాన్నొక "క్రూరమైన యుద్ధ చర్య"గా పేర్కొన్నారు.
తూర్పు యూరప్ సభ్య దేశాలు ఆందోళన వ్యక్తపరచడంతో, నాటో ఇప్పటికే వందలాది యుద్ధ విమానాలను, నౌకలను అప్రమత్తం చేసింది. ఆ ప్రాంతంలో సైనికుల సంఖ్యను పెంచనుంది.
యుక్రెయిన్‌కు మరిన్ని సైనిక దళాలను పంపించేందుకు అమెరికా కూడా సిద్ధంగా ఉంది. అయితే, ఈ దళాలు అక్కడ ఉన్న నాటో భూభాగాన్ని రక్షించడానికి మాత్రమేనని, యుక్రెయిన్‌లో యుద్ధం కోసం కాదని బైడెన్ స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
తూర్పు యూరప్ సరిహద్దుల్లో నాటో దళాల విస్తరణ ఎలా ఉంది?
నాటో దళాలు ఇప్పటికే ఉత్తరాన బాల్టిక్ రిపబ్లిక్స్ నుంచి దక్షిణాన రొమేనియా వరకు విస్తరించి ఉన్నాయి.
2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకున్న తరువాత ఈ దళాలను అక్కడ మోహరించారు. ఒకవేళ రష్యా దాడి చేస్తే ప్రతిఘటించేందుకు సిద్ధంగా వాటిని అక్కడ ఉంచారు.
తూర్పు మధ్యధరా ప్రాంతంలో పెట్రోలింగ్ చేసే నౌకాదళాలు, రష్యాతో సరిహద్దుల వెంబడి "ఎయిర్ పోలీసింగ్" చేసే విమానాలు ఈ నాటో దళంలో భాగం.
అలాగే, నాటోకు ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్‌లలో నాలుగు మల్టీనేషనల్ బెటాలియన్-సైజ్ యుద్ధ దళాలు, రొమేనియాలో మల్టీనేషనల్ బ్రిగేడ్ ఉన్నాయి.
భవిష్యత్తులో రొమేనియాలో నాటో మిషన్‌కు నాయకత్వం వహించేందుకు ఫ్రాన్స్ ముందుకొచ్చింది. ఈ మిషన్‌లో వివిధ దేశాల నుంచి సుమారు 1,000 మంది సైనికులు పాల్గొనవచ్చు.
రొమేనియా, బల్గేరియా, హంగేరి, స్లోవేకియాలో అదనపు యుద్ధ బృందాలను ఏర్పాటు చేసేందుకు నాటో రెస్పాన్స్ ఫోర్స్ నుంచి అధికంగా 40,000 మంది సైనికులను నాటో పంపించే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
సంక్షోభానికి ముందు నాటో రక్షణ వ్యవస్థను ఎలా విస్తరించింది?
ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకునే ముందు, నాటో తూర్పు సరిహద్దులను పటిష్టం చేయడానికి అమెరికా సుమారు 3,000 మంది సైనికులను పోలాండ్, రొమేనియాలకు పంపింది. మరో 8,500 యుద్ధసైనికులను అప్రమత్తం చేసింది.
అంతేకాకుండా, జావెలిన్ యాంటీ ట్యాంక్ క్షిపణులు, స్టింగర్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణులతో సహా అమెరికా 200 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,502 కోట్లు) విలువైన ఆయుధాలను యుక్రెయిన్‌కు పంపింది. అలాగే అమెరికాలో తయారైన ఆయుధాలను యుక్రెయిన్‌కు సరఫరా చేసేందుకు ఇతర నాటో దేశాలకు అనుమతి ఇచ్చింది.
బ్రిటన్, పోలాండ్‌కు 350 మంది సైనికులను అదనంగా పంపింది. ఎస్టోనియాకు 900 మంది సైనికులను పంపి అక్కడ తమ బలగాన్ని రెట్టింపు చేసింది. యుక్రెయిన్‌కు 2,000 షార్ట్ రేంజ్ యాంటీ ట్యాంక్ క్షిపణులను సరఫరా చేసింది.
అలాగే, దక్షిణ యూరప్‌కు మరిన్ని ఆర్ఏఎఫ్ జెట్‌లను పంపింది. నాటో యుద్ధనౌకలతో పాటు తూర్పు మధ్యధరా ప్రాంతంలో పెట్రోలింగ్ చేయడానికి రాయల్ నేవీ నౌకను పంపింది.
యుక్రెయిన్‌పై రష్యా దాడి వలన మానవతా సంక్షోభం ఏర్పడితే, సహాయం అందించడానికి 1,000 మంది సైనికులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించింది.
డెన్మార్క్, స్పెయిన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ కూడా తూర్పు యూరప్, తూర్పు మధ్యధరా ప్రాంతాలకు యుద్ధ విమానాలు, యుద్ధనౌకలను పంపాయి.
ఇవి కూడా చదవండి:
- 'స్విఫ్ట్' అంటే ఏమిటి? ఈ పేమెంట్ నెట్వర్క్ నుంచి రష్యాను నిషేధిస్తే ఎవరికి నష్టం?
- పుతిన్‌కు ఏం కావాలి? యుక్రెయిన్‌పై రష్యా ఎందుకు దాడి చేస్తోంది
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య 5 గ్రామాల వివాదం ఏంటి... కొత్త జిల్లాల ఏర్పాటుతో చిక్కులు తప్పవా?
- భీమ్లానాయక్: పవన్ నోట పొలిటికల్ డైలాగులు, అభిమానుల్లో ఫుల్ జోష్
- యుక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థులు: ‘ఇక్కడ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి, మమ్మల్ని ఎలాగైనా ఇండియాకి తీసుకెళ్లండి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












