యుక్రెయిన్‌‌ కన్నీటి చిత్రాలు: బాంబుల వర్షం, దారిపొడవునా యుద్ధ ట్యాంకులు, మృత్యువును తప్పించుకుంటూ పయనం

యుక్రెయిన్ ప్రజల్లో కొందరు అండర్‌గ్రౌండ్ రైల్వే స్టేషన్లలో తలదాచుకోగా మరికొందరు ఆయుధాలు పట్టుకుని రష్యా సేనలతో యుద్ధానికి ముందుకు ఉరుకుతున్నారు. యుద్ధంలో పాల్గొనేందుకు ముందుకొచ్చిన వలంటీర్లకు 18 వేల తుపాకులు ఇచ్చింది ప్రభుత్వం.

దేశం వీడుతున్న యుక్రెయిన్ ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, శుక్రవారం ఉదయం చెవులు దద్దరిల్లేలా భారీ పేలుడు శబ్దం విని 36 ఏళ్ల అల్యోనా ఖషెంకో, ఆమె కుటుంబం నిద్ర లేచారు. యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లోని వారి ఇంటికి సమీపంలో మిసైళ్ల వర్షం కురుస్తోంది. ‘‘మా ఇంటికి సమీపంలోనే ఉండే మరో ఇల్లు మంటల్లో చిక్కుకుంది. అందులో చాలామంది బాధితులున్నారు’’ అని రాయిటర్స్ వార్తాసంస్థతో అల్యోనా చెప్పారు. వైమానిక దాడుల సైరన్ ఆగిపోయిన తరువాత తన పిల్లలు, తల్లిదండ్రులను తీసుకుని డ్నీపర్ నదికి అవతల వైపు ఉన్న మరో చోటికి ఆమె ఉరుకులపరుగులతో చేరుకున్నారు.
ధ్వంసమైన భవనాలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రష్యా దళాలు కీయెవ్‌కు తూర్పు, ఉత్తర దిశల నుంచి నగరంలో ప్రవేశించడంతో శుక్రవారం ఉదయమంతా ఆ నగరంపై వైమానిక దాడులు ఆగకుండా జరిగాయి. దాడుల ప్రభావంతో అపార్ట్‌మెంట్ల కిటికీలు ధ్వంసమయ్యాయి. వీధుల్లో రోడ్లు బీటలువారాయి. రాజధాని కీయెవ్‌లో అనేక చోట్ల ధ్వంసమైన భవనాలు, సైనిక సామగ్రి శిథిలాలు కనిపిస్తున్నాయి.
ఖాళీ షెల్స్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, తాజా పరిణామాలపై కీయెవ్ నగరవాసి అనతోలీ మార్షెంకో(57) మాట్లాడుతూ తాను రష్యన్‌ని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానన్నారు. ఒకప్పుడు సోవియట్ ఆర్మీలో పనిచేసిన ఆయన తాజా రష్యా దాడులలో దెబ్బతిన్న తన ఇంటి బాల్కనీని పరిశీలిస్తూ ఈ మాట చెప్పారు. ‘‘అక్కడున్న ప్రజలలో నా స్నేహితులున్నారు. వాళ్లు నా నుంచి ఏం కోరుకుంటున్నారు? నా ఇంటి వరకు యుద్ధం వచ్చింది’’ అన్నారు అనతోలీ.
ప్రజల్లో కొందరు అండర్‌గ్రౌండ్ రైల్వే స్టేషన్లలో తలదాచుకుంటున్నారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ప్రజల్లో కొందరు అండర్‌గ్రౌండ్ రైల్వే స్టేషన్లలో తలదాచుకోగా మరికొందరు ఆయుధాలు పట్టుకుని రష్యా సేనలతో యుద్ధానికి ముందుకు ఉరుకుతున్నారు. యుక్రెయిన్ ప్రభుత్వం యుద్ధంలో పాల్గొనేందుకు ముందుకొచ్చిన వలంటీర్లకు 18 వేల తుపాకులు ఇచ్చింది. రష్యాతో పోరాడేందుకు బాంబులు తయారుచేయాలని ప్రజలను అక్కడి అధికారులు కోరారు.
కీయెవ్ నుంచి పిల్లలతో కలిసి వెళ్లిపోతున్న మహిళ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అయితే, శుక్రవారం రష్యా దాడి మొదలైనప్పటి నుంచి వేలాది మంది కీయెవ్‌ను విడిచి పొరుగు దేశాలకు వెళ్లిపోయారు. 36 ఏళ్ల ఇరీనా తన ఇద్దరు కుమార్తెలు, తల్లితో కలిసి స్లొవేకియా వెళ్లిపోగా ఆమె భర్త మాత్రం కీయెవ్‌లోనే ఉండి ప్రభుత్వానికి మద్దతుగా రష్యా సేనలతో పోరాడుతున్నారు. ‘‘యుక్రెయిన్ కోసం మేమంతా ప్రార్థిస్తున్నాం. అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు ఇరీనా.
ధ్వంసమైన ఇల్లు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, రష్యా సేనలు రోజురోజుకీ యుక్రెయిన్‌లో ముందుకు వెళ్తున్నకొద్దీ అనేక నగరాలపై దాడులు పెరిగాయి. వందల మంది యుక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. యుక్రెయిన్ ఉత్తర, తూర్పు, దక్షిణ సరిహద్దుల మీదుగా రష్యా సేనలు ముందుకు దూసుకెళ్తున్నాయి.
ఒలెనా కురిలో

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌ తూర్పు ప్రాంత నగరం చుహీవ్‌లో దాడుల వల్ల గాయపడిన 52 ఏళ్ల టీచర్ ఒలెనా కురిలో మాట్లాడుతూ... ‘‘ఇలా జరుగుతుందని నేను ఎన్నడూ అనుకోలేదు’’ అన్నారు. ఆమె తలకు బ్యాండేజ్‌తో కనిపించారు.
వేలాది మంది ఇప్పటికే తమ ఇళ్లను వీడి వెళ్లారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వేలాది మంది ఇప్పటికే తమ ఇళ్లను వీడి వెళ్లారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 40 లక్షల మంది దేశాన్ని వీడొచ్చని ఐరాస శరణార్థుల సంస్థ యూఎన్‌హెచ్‌ఆర్‌సీ అంచనా వేస్తోంది.
శరణార్థులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇతర నగరాల్లోనూ ప్రజలు సురక్షిత స్థానాలు వెతుక్కుంటున్నారు. చాలామంది అండర్‌గ్రౌండ్ రైల్వే స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. యుక్రెయిన్ సరిహద్దులకు సమీపంలోని పోలాండ్ నగరం ప్రెజ్‌మిల్‌లోని అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్లో చాలామంది యుక్రెయిన్ శరణార్థులు ఆశ్రయం పొందారు.
యుక్రెయిన్ శరణార్థులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ‘‘కీయెవ్‌లోని మా ఇంటి పక్కనే బాంబులు పడ్డాయి. వెంటనే నేను మా సామాన్లన్నీ ప్యాక్ చేసుకుని అక్కడి నుంచి బయటపడ్డాను’’ అని ఓలా అనే పాలిటెక్నిక్ టీచర్ ‘ఏఎఫ్‌పీ’ న్యూస్ ఏజెన్సీతో చెప్పారు. ‘‘నేనిక్కడ సురక్షితంగానే ఉన్నాను. కానీ, నా బంధువులు, స్నేహితులకు ఏమీ చేయలేకపోతున్నాను. వారిలో చాలామంది ప్రమాదంలో ఉన్నారు. నాలా వెంటనే అక్కడి నుంచి బయటపడలేకపోయారు’’ అన్నారామె.