యుక్రెయిన్: దండయాత్రపై లెక్క తప్పిన పుతిన్.. దాడి తీవ్రతను మరింత పెంచుతారా?

యుక్రెయిన్ మీద రష్యా దండయాత్ర

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జాన్ సింప్సన్
    • హోదా, బీబీసీ వరల్డ్ అఫైర్స్ ఎడిటర్

వ్లాదిమిర్ పుతిన్ ఊహించిన దానికన్నా.. ఇంకా చెప్పాలంటే తన సైనిక జనరళ్లు చెప్పిన దానికన్నా.. మరింత బలంగా రష్యా సైనిక దాడిని ప్రతిఘటిస్తోంది యుక్రెయిన్. అయితే.. ఈ యుద్ధం ఇప్పుడింకా తొలి దశల్లోనే ఉంది. ఇది మరింత హింసాత్మకంగా మారబోతోంది.

రష్యా బలగాలు దండెత్తిన కొద్ది రోజులకే కీయెవ్ పతనమవుతుందని పుతిన్ ఆశించి ఉండాలి. పశ్చిమ దేశాలు మెత్తబడి, చీలిపోయి.. చారిత్రకంగా రష్యాలో భాగమని తాను వాదిస్తున్న ప్రాంతాన్ని తాను తిరిగి సొంతం చేసుకోవటాన్ని అంగీకరిస్తాయని కచ్చితంగా భావించి ఉండాలి.

ఇదేమీ జరగలేదు. యుక్రెయిన్ గట్టి పిండమని నిరూపించుకుంది. ఇక పశ్చిమ దేశాల ప్రతిస్పందన, ముఖ్యంగా జర్మనీ స్పందన.. ఆయన అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ భీకరంగా ఉంది. రష్యా ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికే దారుణమైన దెబ్బ తగిలింది.

పశ్చిమ ప్రపంచపు ఆగ్రహం పెరిగిపోవటం.. ఏదో ఒక రోజు తన మీదకు మళ్లవచ్చునని, తమ దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తీవ్ర నష్టం కలిగించవచ్చునని.. పుతిన్ పెద్ద స్నేహితుల్లో ఒకటైన చైనా ఇప్పుడు ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. రష్యా దండయాత్ర నుంచి చైనా ఇప్పటికే దూరం జరిగింది.

దీనికి విరుద్ధంగా నాటో బలోపేతం కావచ్చు. ఫిన్‌లాండ్, స్వీడన్ దేశాలు రెండూ తమ స్వీయ రక్షణ కోసం చివరికి ఈ కూటమిలో చేరవచ్చు. యుక్రెయిన్ రేపో మాపో నాటోలో చేరకుండా అడ్డుకోవాలన్నది పుతిన్ ఈ దండయాత్ర చేయటానికి పాక్షిక కారణం. కానీ.. తన వాయువ్య సరిహద్దులో మరింత ఎక్కువ మంది నాటో సభ్యులవటం ఆయన చూసే అవకాశముంది.

ఖార్కియెవ్‌లో మార్చి 1వ తేదీన గాయపడ్డ మహిళకు సాయం చేస్తున్న స్థానికులు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఖార్కియెవ్‌లో మార్చి 1వ తేదీన గాయపడ్డ మహిళకు సాయం చేస్తున్న స్థానికులు

ఇవన్నీ పుతిన్‌కు భారీ ఎదురుదెబ్బలు. ఇవన్నీ.. పుతిన్ కోవిడ్ కారణంగా ఐసొలేషన్‌లో ఉండి సొంతంగా వేసుకున్న లెక్కలు తప్పటం వల్లే తగిలిన దెబ్బలు. ఆయనకు చాలా తక్కువ మందే సలహాదారులున్నారు. ఆయన వినాలని కోరుకున్నదే వారు చెప్పి ఉంటారని మనం భావించవచ్చు. ఇప్పుడు ఆయన కొత్త మార్గాలను వెదుక్కోవాల్సి ఉంటుంది. ఎదురుదెబ్బ తిన్న ప్రతిసారీ పుతిన్ వెనక్కు తగ్గటానికి తిరస్కరిస్తారు. మరింత గట్టిగా దెబ్బకొడతారు. ఆ పని చేయటానికి ఆయన దగ్గర ఆయుధాలున్నాయి.

రష్యా బలగాలు ఇప్పటికే ధర్మోబారిక్ బాంబును ఉపయోగించాయని అమెరికాలో యుక్రెయిన్ రాయబారి చెప్తున్నారు. దానిని వాక్యూమ్ బాంబు అని కూడా పిలుస్తారు. ఇది చుట్టుపక్కల ఆక్సిజన్‌ను పీల్చేసుకుని అత్యధిక వేడితో పేలుడును సృష్టిస్తుంది.

ఇటువంటి సమయాల్లో రాయబారులు తరచుగా పరిస్థితులకు విపరీతమైన వాదనలు చేస్తుంటారు. కానీ.. రష్యా థర్మోబారిక్ రాకెట్ లాంచర్లు యుక్రెయిన్ వెళ్తున్న వీడియోలను మనం చూశాం. వాటిని మరింత విస్తృతంగా వినియోగించటానికి ఎక్కువ కాలం పట్టదని విశ్లేషకులు అంటున్నారు.

ఖార్కియేవ్‌లో పౌరుల మీద క్లస్టర్ బాంబులను ఉపయోగించినట్లు కూడా ఫొటోలు చూపుతున్నాయి. ఇవి ఒకేసారి బాంబుల వర్షం కురిపిస్తాయి. వాటి పరిధిలో ఉన్న వారికి పదునైన గాయాలు చేస్తాయి. ఈ క్లస్టర్ బాంబులను 2008లో అంతర్జాతీయ ఒప్పందం నిషేధించింది. కానీ రష్యా దాని మీద సంతకం చేయలేదు. అంతర్జాతీయ మానవతా చట్టానికి అనుగుణంగా తాను ఈ క్లస్టర్ బాంబులను ఉపయోగిస్తానని చెప్పింది. ఈ మాటతో ఖార్కియేవ్ ప్రజలు విభేదించవచ్చు.

సాలిస్‌బరీలో సెర్గీ స్క్రిపాల్

ఫొటో సోర్స్, Getty Images

అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను వినియోగించటంపై వ్లాదిమిర్ పుతిన్‌కు ఎప్పుడూ సంశయాలు, సంకోచాలు లేవు. మాజీ కేజీబీ ఏజెంట్ అలెగ్జాండర్ లిట్వినెంకోను 2006లో లండన్‌లో హత్య చేయటానికి అణుధార్మిక పొలోనియంను ఉపయోగించటానికి ఆయన అనుమతించినట్లు భావిస్తారు.

మరో ఫిరాయింపుదారు సెర్గీ స్కిర్పాల్ మీద రష్యన్ సైనిక నిఘా విభాగం 2018లో సాలిస్‌బరీలో నోవిచోక్ అనే విషపదార్థంతో దాడి చేయటానికి కూడా ఆయన అంగీకరించినట్లు భావిస్తారు. స్కిర్పాల్ ఆ దాడి నుంచి కోలుకున్నప్పటికీ.. ఆ ప్రాణాంతక రసాయనం వల్ల డాన్ స్ట్రగెస్ అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు.

అమాయక పౌరులకు ప్రమాదమనే ఆందోళన ఆయనకు ఉన్నట్లు కనిపించదు. ఒకరిని గురిపెట్టి చేసే హత్యలుగా ఈ ప్రణాళికలను రచించారు. ఇప్పుడు యుక్రెయిన్‌లో మనం చూస్తున్న తరహా విస్తృత దాడుల తరహావి కావు. కానీ వీటి సూత్రం ఒకటే - రష్యా విస్తృత ప్రయోజనాల విషయానికి వస్తే పౌరుల ప్రాణాలు లెక్కలోకి రావు.

యుక్రెయిన్ విషయంలో ఆయన అనుకున్నట్లు జరగకపోతే పుతిన్ అణ్వస్త్రాలు వాడతారా? అలా జరిగే అవకాశం ఉండాలి. కానీ ఆ దశకు ఇంకా మనం చేరువ కాలేదని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు. యుక్రెయిన్ విషయంలో బయటి నుంచి ఎవరైనా జోక్యం చేసుకోవాలని భావిస్తే.. వారి చరిత్రలో ఎన్నడూ లేనంత తీవ్ర పరిణామాలను వారు ఎదుర్కొంటారని పుతిన్ హెచ్చరించటం నిజం.

పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

'ప్రపంచంలో రష్యా లేకపోయినట్లయితే.. ప్రపంచం ఎందుకు మనుగడ కొనసాగించాలి?' అనే తన ఆలోచనను ఆయన తరచుగా చెప్తునే ఉంటారు. అయితే.. అణుయుద్ధం దిశగా పరిస్థితులు దిగజారాలంటే నాటో కూడా చాలా తప్పుడు లెక్కలు వేసుకోవాల్సి ఉంటుంది.

చరిత్ర తనకు తాను పునరావృతం కావచ్చు. 1939లో ఫిన్‌లాండ్ మీద స్టాలిన్ దాడి చేశారు. ఆ దేశం కొన్ని రోజుల్లోనే పతనమవుతుందని ఆయన అంచనా వేసుకున్నారు. కానీ ఫిన్‌లాండ్ ఎదురుతిరిగి పోరాడింది. రష్యా ముఖం పగిలి రక్తమోడింది. వింటర్ వార్ (శీతాకాల యుద్ధం) అని పిలిచే ఆ పోరాటం ముగియటానికి 100 రోజులకు పైగా పట్టింది. యుద్ధం ముగిసేసరికి.. ఫిన్‌లాండ్ కొంత భూభాగాన్ని కోల్పోయినా, అది స్వతంత్ర దేశంగానే నిలిచివుంది. యుక్రెయిన్‌లో యుద్ధం కూడా అదే తరహాలో ముగిసే అవకాశమూ ఉంది.

ఇప్పుడు పరిణామాలు ఆరంభ దశలోనే ఉన్నాయి. యుక్రెయిన్ ఇప్పటివరకూ ప్రతిఘటిస్తూ నిలబడింది కాబట్టి.. రష్యా పూర్తి శక్తిని ఎక్కువ కాలం ప్రతిఘటించగలదని అనుకోలేం. కానీ తొలి రౌండ్ బాగా సాగిందనేది నిస్సందేహం. పశ్చిమ దేశాల ప్రతిస్పందన కూడా చాలా మంది ముఖ్యంగా వ్లాదిమిర్ పుతిన్ ఊహించిన దానికన్నా చాలా బలంగా ఉంది.

వీడియో క్యాప్షన్, వట్టి చేతులతో రష్యా ట్యాంకుకు ఎదురు నిలిచిన యుక్రెయిన్ పౌరుడు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)