యుక్రెయిన్ సంక్షోభం: రష్యా అధ్యక్షుడు పుతిన్ న్యూక్లియర్ బటన్ నొక్కుతారా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్టీవ్ రోసెన్‌బర్గ్
- హోదా, బీబీసీ న్యూస్, మాస్కో
''పుతిన్ ఈ పని అసలెప్పుడూ చేయరు'' అని నేను చాలాసార్లు అనుకున్నా. కానీ అంతలోనే ఆయన ఆ పని చేసేస్తారు.
''ఆయన క్రైమియాను ఎన్నడూ కలుపేసుకోరు'' అనుకున్నా. ఆయన కలిపేసుకున్నారు.
''ఆయన డోన్బాస్‌లో ఎప్పుడూ యుద్ధం మొదలెట్టరు'' అనుకున్నా. ఆయన మొదలుపెట్టారు.
''ఆయన యుక్రెయిన్ మీద ఎన్నడూ పూర్తిస్థాయి దండయాత్ర చేయరు'' అనుకున్నా. ఆయన చేశారు.
దీంతో.. ''ఎన్నడూ చేయరు'' అనే మాట వ్లాదిమిర్ పుతిన్‌కు వర్తించబోదని నేను నిర్ధరణకు వచ్చాను.
ఈ నిర్ధరణ ఒక ఇబ్బందికరమైన ప్రశ్నను లేవనెత్తుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
''న్యూక్లియర్ బటన్‌ను ఆయన ఎన్నడూ నొక్కరు అనుకుంటున్నాను... మరి ఆయన ఆ బటన్ నొక్కుతారా?''
ఇది ఊహాజనిత ప్రశ్న కాదు. రష్యా అధ్యక్షుడు తాజాగా తన దేశ అణు బలగాలను ''ప్రత్యేకంగా'' అప్రమత్తం చేశారు. నాటో నాయకులు యుక్రెయిన్ విషయంలో 'దౌర్జన్యపూరిత ప్రకటనలు' చేయటమే దీనికి కారణంగా చెప్పారు.
పుతిన్ ఏం చెప్తున్నారో శ్రద్ధగా వినండి. తన 'ప్రత్యేక సైనిక చర్య' గురించి గత గురువారం ఆయన టీవీలో ప్రకటిస్తున్నపుడు.. వణుకుపుట్టించే ఒక తీవ్ర హెచ్చరిక జారీ చేశారు:
''బయటి నుంచి జోక్యం చేసుకోవాలని ఎవరైనా భావించినట్లయితే.. మీరు జోక్యం చేసుకున్నట్లయితే, మీలో ప్రతి ఒక్కరూ చరిత్రలో ఎదుర్కొన్న వాటికన్నా అతి తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కొంటారు.''
''పుతిన్ మాటలు అణు యుద్ధం హెచ్చరిక లాగా కనిపిస్తున్నాయి'' అని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, నోవయా గజెటా వార్తాపత్రిక చీఫ్ ఎడిటర్ దిమిత్రి మురటోవ్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''ఆ టీవీ ప్రసంగంలో పుతిన్ రష్యా యజమానిగా కాదు.. ప్రపంచ యజమానిగా ప్రవర్తించారు. ఓ ఖరీదైన కారు యజమాని తన దర్పం ప్రదర్శించుకోవటానికి కారు కీ చెయిన్‌ను వేలికి తగిలించి గిరిగిరా తిప్పుతున్నట్లు.. పుతిన్ న్యూక్లియర్ బటన్‌ను వేలి మీద తిప్పుతున్నారు. ఆయన చాలాసార్లు చెప్పారు: రష్యా అనేది లేకపోతే, మనకు ఈ భూగోళం ఎందుకు? ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇదొక హెచ్చరిక. రష్యాతో గనుక తను కోరుకున్నట్లు వ్యవహరించకపోతే.. అంతా ధ్వంసమైపోతుందనే హెచ్చరిక'' అని చెప్పారాయన.
2018 నాటి ఒక డాక్యుమెంటరీలో.. ''రష్యాను నిర్మూలించాలని ఎవరైనా నిర్ణయించుకున్నట్లయితే.. దానికి ప్రతిస్పందించే చట్టబద్ధమైన హక్కు మాకు ఉంది. అవును, అది మానవాళికి, ప్రపంచానికి మహావిపత్తే అవుతుంది. రష్యా లేని ప్రపంచం మనకెందుకు?'' అని పుతిన్ వ్యాఖ్యానించారు.
2022 వచ్చింది. యుక్రెయిన్ మీద పుతిన్ పూర్తిస్థాయి యుద్ధం ఆరంభించారు. కానీ యుక్రెయిన్ సైనిక బలగాలు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. రష్యాకు ఆశ్చర్యం కలిగిస్తూ పశ్చిమ దేశాలు సంఘటితంగా ఆ దేశం మీద తీవ్రస్థాయి ఆర్థిక, ద్రవ్య ఆంక్షలు విధించాయి. పుతిన్ వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకం కావచ్చు.
''పుతిన్ క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. ఆయనకు ఎక్కువ మార్గాలేవీ లేవు. రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను పశ్చిమ దేశాలు స్తంభింపచేస్తే.. రష్యా ద్రవ్య వ్యవస్థ నిజంగా బద్దలవుతుంది. దానివల్ల వ్యవస్థ పనిచేయదు'' అని మాస్కోకు చెందిన రక్షణ రంగ విశ్లేషకుడు పావెల్ ఫెల్గెన్‌హోవర్ అభిప్రాయపడ్డారు.
''ఆయనకున్న ఒక మార్గం.. యూరప్ దేశాలు దిగివస్తాయనే ఆశతో.. యూరప్‌కు గ్యాస్ సరఫరాలను కత్తిరించటం. మరో అవకాశం.. ఉత్తర సముద్రంలో బ్రిటన్, డెన్మార్క్‌ల మధ్య ఒక అణుబాంబును పేల్చి, ఏం జరుగుతుందో చూడటం'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఒకవేళ పుతిన్ అణ్వస్త్ర మార్గాన్ని ఎంచుకున్నట్లయితే, వద్దని ఆయనపై ఒత్తిడి చేయటానికి కానీ, ఆయనను ఆపటానికి కానీ, ఆయన సన్నిహిత వర్గంలోని వారు ఎవరైనా ప్రయత్నిస్తారా?
''రష్యా ఉన్నత స్థాయి రాజకీయ ప్రముఖులు ఎన్నడూ జనంతో ఉండరు. వాళ్లు ఎప్పుడూ పాలకుడి పక్షమే వహిస్తారు'' అంటారు దిమిత్రీ మురాటోవ్.
వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన రష్యాలో పాలకుడే సర్వశక్తిసంపన్నుడు. అడ్డుకట్టలు, సంతులనాలు అతి తక్కువగా ఉన్న దేశమిది. ఇక్కడ నిర్ణయాలు తీసుకునేది అధ్యక్ష భవనమే. ''పుతిన్‌కు ఎదురు చెప్పటానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. మనం ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాం'' అంటారు పావెల్.
యుక్రెయిన్‌లో యుద్ధం వ్లాదిమిర్ పుతిన్ యుద్ధం. ఆయన తన సైనిక లక్ష్యాలను సాధించినట్లయితే, సార్వభౌమ దేశంగా యుక్రెయిన్ భవిష్యత్తు సందేహాస్పదమవుతుంది.
ఒకవేళ ఆయన విఫలమవుతున్నానని, తనవైపు భారీగా ప్రాణానష్టం సంభవిస్తోందని భావించినట్లయితే.. అది అధ్యక్ష భవనం మరింత తీవ్రమైన చర్యలను ఎంచుకునేలా చేస్తుందని భయపడుతున్నారు.
ముఖ్యంగా ''అలా ఎన్నడూ చేయరు'' అనేది ఆయనకు ఇక వర్తించనపుడు ఈ పరిణామాలు ఎలా ఉంటాయోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి:
- బ్రిటిష్ కాలం నాటి వించ్ రవాణా: డ్రైవర్ ఒకచోట, వాహనం మరోచోట.. చూస్తే భయం, ఎక్కితే సరదా
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య 5 గ్రామాల వివాదం ఏంటి... కొత్త జిల్లాల ఏర్పాటుతో చిక్కులు తప్పవా?
- కొత్త బిజినెస్ చేయాలనుకుంటున్నారా? శిక్షణ ఇచ్చి, రూ.25 లక్షల దాకా చేయూత కూడా ఇస్తున్నారు ఇక్కడ..
- యుక్రెయిన్: ‘లోపల ఎంత భయం ఉన్నా, పిల్లల కోసం పైకి నవ్వుతున్నా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











