ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు: కాంగ్రెస్ పతనంతో యూపీ రాజకీయాల్లో పెను మార్పులు

ములాయం సింగ్ యాదవ్, యోగి ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నాంచారయ్య మెరుగుమాల
    • హోదా, బీబీసీ కోసం

ములాయం చివరిసారి సీఎంగా ఉండగా 2007లో జరిగిన శాసనసభ ఎన్నికలు, మాయావతి హయాంలో జరిగిన 2012 ఎన్నికలు, అఖిలేశ్‌ సీఎంగా ఉండగా జరిగిన 17వ శాసనసభ ఎన్నికల్లో 2007లో బీఎస్పీకి వచ్చినట్టు ఒకే పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తుందా? లేక సంకీర్ణమా అనే అంచనాలు పోలింగ్‌కు ముందు వేశారు.

కానీ, వరుసగా మూడు ఎన్నికల్లో మూడు పార్టీలకు సాధారణ మెజారిటీకి అవసరమైన 202 సీట్లు వచ్చాయి. మొదటి సార్వత్రిక ఎన్నికల (1952) తర్వాత 70 సంవత్సరాలకు జరుగుతున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచేది బీజేపీయా? లేక సమాజ్‌వాదీ పార్టీయా? అనే విషయమే చర్చనీయాంశమైంది. హంగ్‌ అసెంబ్లీ ఊసే లేదు, ఎన్నికల ముందు సర్వేలు కూడా త్రిశంకుసభ రాదనే చెబుతున్నాయి.

2014,2019 వరుస లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 80 సీట్లలో 60పైనే బీజేపీ గెలిచి గుజరాత్‌ నేత నరేంద్రమోదీ సునాయాసంగా ప్రధాని కాగలిగారు. రెండుసార్లూ కేంద్రంలో కాషాయ కూటమి పీఠమెక్కడానికి యూపీ గెలుపు కీలకమైంది.

ఈ రెండు పార్లమెంటు ఎన్నికల మధ్యలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ నాలుగింట మూడొంతులకు పైగా సీట్ల గెలిచి ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది.

ఇంతటి సుస్థిరత నేపథ్యంలో దేశంలో అతి పెద్దదైన యూపీలో గత ఏడు దశాబ్దాల రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం.

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్

యూపీ నుంచి ప్రధానులైన 9 మందిలోఆ రాష్ట్రంలో జన్మించినవారు ఆరుగురే

బ్రిటిష్‌వారి కాలంలో యునైటెడ్‌ ప్రావిన్సెస్‌ ఆఫ్‌ అవుద్‌ అండ్‌ ఆగ్రా (యూపీ) అనే పేరును 1950లో ఉత్తర్‌ ప్రదేశ్‌గా మార్చారు.

రాముడు, కృష్ణుడు పుట్టిన నేలగా ప్రజలు నమ్మే ఈ రాష్ట్రం మొత్తం 9 మంది ప్రధానులను అందించింది. కాంగ్రెస్‌కు మొదటి ముగ్గురు ప్రధానులూ యూపీ నుంచి లోక్‌సభకు ఎన్నికైనవారే.

తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత ఈ పదవి చేపట్టిన లాల్‌బహదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీ, చరణ్‌సింగ్, రాజీవ్‌గాంధీ, వీపీ సింగ్, ఎస్‌.చంద్రశేఖర్, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, నరేంద్రమోదీ యూపీ నుంచి పార్లమెంటుకు ఎన్నికై ప్రధాని పదవిలో కొనసాగారు.

ఈ 9 మందిలో నలుగురు కాంగ్రెస్‌ తరఫున, మిగిలిన ఐదుగురు బీజేపీ సహా కాంగ్రెసేతర పక్షాల తరఫున ప్రధానమంత్రి పీఠం అధిష్టించారు. వాస్తవానికి యూపీలో జన్మించిన ప్రధానులు ఎవరంటే-నెహ్రూ, ఇందిర, శాస్త్రి, చరణ్‌సింగ్, వీపీసింగ్, చంద్రశేఖర్‌.

యూపీ వెలుపల జన్మించినా, ఇక్కడ నుంచి లోక్‌సభకు ఎన్నికై ప్రధానులైనవారు-రాజీవ్‌గాంధీ, ఏబీ వాజ్‌పేయి, నరేంద్రమోదీ.

యూపీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఇద్దరు చరణ్‌సింగ్, వీపీ సింగ్‌కు తర్వాత ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. కేంద్రంలోగాని, రాష్ట్రాల్లోగాని మంత్రిగా అనుభవం లేని రాజీవ్‌గాంధీ, చంద్రశేఖర్‌ యూపీ లోక్‌సభ సభ్యులుగా ఉంటూ ప్రధాని పీఠమెక్కారు.

యూపీ రాజకీయాలే ప్రధాని ఎవరో నిర్ణయిస్తాయనే మాట చాలా దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉంది. అత్యధికంగా 80 లోక్‌సభ సీట్లు ఉండడమే దీనికి కారణం. 20వ శతాబ్దం ఆరంభంలో యూపీలో పాతిక కూడా సీట్లు గెలుచుకోలేని కాంగ్రెస్‌ జాతీయస్థాయిలో పదేళ్లు సంకీర్ణ సర్కారుకు నాయకత్వం వహించింది.

మరి యూపీలో రాజకీయ సుస్థిరత ఎలా ఉండేదో చూస్తే, మొదటి 20 ఏళ్లలో కాంగ్రెస్‌ సీఎంలు మధ్యలో మారినా ఈ పార్టీయే ప్రతి పదవీకాలం ఐదేళ్లూ అధికారంలో ఉంది.

అఖిలేశ్ యాదవ్

ఫొటో సోర్స్, Getty Images

17 శాసనసభలు-21 మంది ముఖ్యమంత్రులు

ఇరవై నాలుగు కోట్లకు పైగా జనాభా, 15 కోట్ల రెండు లక్షలకు పైగా ఓటర్లున్న యూపీకి ప్రస్తుత సీఎం యోగీ ఆదిత్యనాథ్‌తో కలిపి 21 మంది ముఖ్యమంత్రులయ్యారు.

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక తొలిసారి జరిగిన 1952 ఎన్నికల నుంచి లెక్కిస్తే, ఇప్పుడు పదవీకాలం ముగియనున్నది 17వ యూపీ అసెంబ్లీ.

ఈ 17 శాసనసభల కాలంలో అంటే 70 ఏళ్లలో 21 మంది సీఎంలు రాష్ట్రంలో 32 ప్రభుత్వాలకు నాయకత్వం వహించారు.

యూపీ మొదటి ముఖ్యమంత్రి పండిత్‌ గోవింద్‌ వల్లభ్‌ (జీబీ) పంత్‌. ఆయన బ్రిటిష్‌వారి పాలనలో 1937-39 మధ్య యునైటెడ్‌ ప్రావిన్సెస్‌ ప్రీమియర్‌ (ప్రధాని) పనిచేశారు. అంతేగాక, స్వాతంత్య్రం రావడానికి 17 నెలల ముందు 1946 ఏప్రిల్‌ ఒకటి నుంచి మొదటి సాధారణ ఎన్నికల వరకూ (1952 మే 20) కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఎన్నికలైన వెంటనే ఉత్తరాఖండ్‌ ప్రాంతానికి చెందిన ఈ బ్రాహ్మణ నేత ఈ పదవిని మరోసారి చేపట్టారు. అప్పటి నుంచి 1954 డిసెంబర్‌ 27 వరకూ యూపీ సీఎంగా కొనసాగి కేంద్రంలో నెహ్రూ కేబినెట్‌లో కీలక మంత్రిగా చేరారు.

అయితే, మొదటి సార్వత్రికల ఎన్నికలు జరిగిన 1952 మే నుంచి సాగిన కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే పంత్‌ వరుసగా రెండు ఎన్నికల మధ్య ఒకే పదవీకాలంలో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా లేరు.

పంత్‌ కేంద్రంలోకి వెళ్లిపోయాక ఆయన వారసునిగా సీఎం గద్దెనెక్కిన డాక్టర్‌ సంపూర్ణానంద్‌ 1954 నుంచి 1960 డిసెంబర్‌ 6 వరకూ పదవిలో కొనసాగారు. ఆయన హయాంలో జరిగిన 1957 రెండో సాధారన ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించాక ఆయన రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

డా.సంపూర్ణానంద్‌ కూడా పంత్‌ మాదిరిగానే వరుసగా రెండు పదవీకాలాల్లో దాదాపు ఆరేళ్లు ముఖ్యమంత్రిగా చేశారు. మధ్యలో ఎన్నికలొచ్చాయి కాబట్టి ఈయన కూడా ఐదేళ్ల సంపూర్ణ పదవీకాలం అధికారంలో ఉన్నట్టు లెక్కించరు.

ఈ లెక్కన ఒకే టెర్మ్‌లో వరుసగా ఐదేళ్లు (రెండు ఎన్నికల మధ్య) యూపీ ముఖ్యమంత్రి సీటులో కొనసాగిన రికార్డు (2007-2012) మొదట బీఎస్పీ నేత మాయావతికే సొంతం. ఆమె తర్వాత సంపూర్ణ మెజారిటీ సంపాదించిన సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ (2012-2017) పూర్తి పదవీకాలం సీఎంగా ఉన్న రెండో నేత.

ఆ తర్వాత 2017 ఫిబ్రవరి-మార్చిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి ఎప్పుడూ లేనంతగా 312 సీట్లు సాధించాక అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి వరించిన యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఐదేళ్లు పూర్తికాలం సీఎంగా కొనసాగిన మూడో ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కుతున్నారు. మార్చి 10న ఫలితాలు వచ్చే వరకూ సీఎం పీఠంపై ఉంటే యోగికి ఈ ఖ్యాతి దక్కుతుంది.

మాయావతి

ఫొటో సోర్స్, Getty Images

మాయావతికి ముందు ఎవరికీ దక్కని ఈ ప్రత్యేకత

మాయావతి మాదిరిగా నాలుగుసార్లు యూపీ సీఎంగా ప్రమాణం చేసిన కాంగ్రెస్‌ నేత నారాయణ్‌ దత్‌ (ఎన్డీ) తివారీ ఏ ఒక్కసారీ వరుసగా రెండేళ్లు కూడా పదవిలో లేరు.

మూడుసార్లు పీఠమెక్కిన ఎస్పీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌ సైతం వరుసగా ఐదేళ్లు పదవిలో కూర్చోలేకపోయారు.

1952 నుంచీ యూపీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాయకులు: 1. పండిత గోబింద్‌ వల్లభ్‌ పంత్‌ 2.డా.సంపూర్ణానంద్‌ 3.చంద్రభాను గుప్తా 4.సుచేతా కృపలానీ 5.చరణ్‌సింగ్‌ 6.త్రిభువన్‌ నారాయణ్‌ (టీఎన్‌)సింగ్‌ 7.కమలాపతి త్రిపాఠీ 8.హేమవతీ నందన్‌ బహుగుణ 9.నారాయణ్‌దత్‌ తివారీ 10.రామ్‌నరేష్‌ యాదవ్‌ 11.బనారసీ దాస్‌ 12.వీపీసింగ్‌ 13.శ్రీపతి మిశ్రా 14.వీర్‌బహాదూర్‌ సింగ్‌ 15.ములాయం సింగ్‌ యాదవ్‌ 16.మాయావతి 17. కల్యాణ్‌సింగ్‌ 18.రాంప్రకాశ్‌ గుప్తా 19.రాజ్‌నాథ్‌ సింగ్‌ 20.అఖిలేశ్‌ యాదవ్‌ 21.యోగీ ఆదిత్యనాథ్‌. ఈ 21 మందిలో కల్యాణ్‌సింగ్, రాంప్రకాశ్‌ గుప్తా, రాజ్‌నాథ్‌సింగ్, ఆదిత్యనాథ్‌ బీజేపీ తరఫున 1991 నుంచీ ముఖ్యమంత్రులయ్యారు.

ఈ నలుగురిలో యోగి ఒక్కరే ఇప్పుడు ఐదేళ్ల పూర్తి పదవీకాలం సీఎంగా కొనసాగిన బీజేపీ ముఖ్యమంత్రిగా రికార్డుకెక్కుతున్నారు.

గతంలో 1947-1967 మధ్య అధికార కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులుగా ఉన ్న నేతలు మొదటి నలుగురు. తర్వాత 1967లో నాలుగో శాసనసభ ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్‌కు మెజారిటీ రాకపోవడంతో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడింది.

స్వతంత్రుల మద్దతుతో సీబీ గుప్తా నేతృత్వంలో కాంగ్రెస్‌ మైనారిటీ సర్కారు ఏర్పడి నెలలోపే కూలిపోవడం, వెంటనే బీకేడీ నేత చరణ్‌సింగ్‌ నాయకత్వాన అధికారంలోకి వచ్చిన తొలి సంకీర్ణ కాంగ్రెసేతర ప్రభుత్వం కూడా ఏడాది లోపే పతనం కావడంతో యూపీలో రాజకీయ అస్థిరత్వం మొదలైంది.

రెండేళ్లకే నాలుగో అసెంబ్లీ రద్దయి 1969లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 1969 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించిందిగాని సాధారణ మెజారిటీ సాధించలేదు.

మొదట కాంగ్రెస్‌ నేత సీబీ గుప్తా నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం కూడా అదే ఏడాది కాంగ్రెస్‌ చీలిక, ఇతర పరిణామాల వల్ల ఏడాది లోపు కూలిపోయింది.

బీకేడీ నేత, మాజీ సీఎం చరణ్‌సింగ్‌కు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చెప్పుచేతుల్లోని కాంగ్రెస్‌ (ఆర్‌-రిక్విజిషనిస్ట్‌ లేదా కొత్త కాంగ్రెస్‌) మద్దతు లభించింది.

దాంతో 1970లో సింగ్‌ నాయకత్వాత మరో సంకీర్ణ సర్కారు అధికారంలోకి వచ్చిందిగాని ఏడు నెలల తర్వాత కూలిపోయింది. ఆ తర్వాత రెండు వారాల రాష్ట్రపతి పాలన అనంతరం సంస్థా కాంగ్రెస్‌ (కాంగ్రెస్‌-ఓ లేదా పాత కాంగ్రెస్‌) నేత, లోక్‌సభ సభ్యుడు టీఎన్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా ప్రతిపక్షాల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

అవైద్యనాథ్

ఫొటో సోర్స్, http://www.gorakhnathmandir.in/

ఉప ఎన్నికలో సీఎం టీఎన్‌ సింగ్‌ ఓటమి దేశంలోనే మొదటి సంచలనం

అయితే, ఆరు నెలలలోపు యూపీ అసెంబ్లీకి ఎన్నికవడానికి సీఎం టీఎన్‌ సింగ్‌ చేసిన ప్రయత్నం 1971లో విఫలమైంది.

గోరఖ్‌పూర్‌ జిల్లాలోని మణిరామ్‌ నుంచి ఉప ఎన్నికలో పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో ముఖ్యమంత్రి సింగ్‌ ఓడిపోవడం సంచలనంగా మారింది.

సింగ్‌ శాసనసభకు ఎన్నికవడానికి వీలుగా గోరఖ్‌నాథ్‌ మఠాధిపతి, ప్రస్తుత సీఎం యోగి గురువు, సిటింగ్‌ ఎమ్మెల్యే మహంత్‌ అవైధ్యనాథ్‌ (హిందూమహాసభ) శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు.

మహంత్‌ ఎంత ప్రచారం చేసినా సీఎం సింగ్‌పై కాంగ్రెస్‌ విజయం సాధించింది. అయితే, సింగ్‌ రాజీనామా తర్వాత కాంగ్రెస్‌ నేత కమలాపతి త్రిపాఠీ నాయకత్వాన కొత్త ప్రభుత్వం రెండు సంవత్సరాల రెండు నెలలు నడిచి కూలిపోయింది.

ఐదు నెలల రాష్ట్రపతి పాలన గడిచాక 1973 నవంబర్‌ 8న మరో ఉత్తరాఖండ్ కాంగ్రెస్‌ నేత హేమవతీ నందన్‌ (హెచ్‌ఎన్‌) బహుగుణ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాలుగు నెలలకు జరిగిన యూపీ ఆరో అసెంబ్లీ ఎన్నికల్లో (1974 మార్చి) కాంగ్రెస్‌ సంపూర్ణ మెజారిటీ సంపాదించింది.

1962 తర్వాత ఈ పార్టీకి మెజారిటీ రావడం ఇదే మొదటిసారి. పార్టీని విజయపథంలో నడిపించిన బహుగుణ రెండోసారి సీఎం అయ్యారు. సమర్ధ పాలకునిగా పేరు సంపాదించినాగాని ఆయనను ఇందిరాగాంధీ రెండేళ్లకు దిల్లీ రప్పించారు.

దాదాపు రెండేళ్ల రాష్ట్రపతి పాలన తర్వాత తన విధేయుడు, ఉత్తరాఖండ్‌ ప్రాంతానికి చెందిన మరో నేత ఎన్డీ తివారీని ముఖ్యమంత్రిని చేశారు ఇందిర.

1977 మార్చిలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన జనతాపార్టీ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలైందనే సాకుతో తివారీ సర్కారును బర్తరఫ్‌ చేసింది.

దీంతో రాష్ట్రంలో రాజకీయ అస్థిరత 1980 జనవరి వరకూ కొనసాగింది. అసెంబ్లీ రద్దుచేయించి జూన్‌లో నిర్వహించిన ఏడో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయింది.

మొదట రాంనరేష్‌ యాదవ్, తర్వాత రాంనరేష్‌ యాదవ్, బనార్సీదాస్‌ నేతృత్వంలో 1977-80 మధ్య కాలంలో కొనసాగిన రాజకీయ అస్థిరత తొలగిపోయింది.

1980-85 మధ్య కాంగ్రెస్‌ తరఫున ముగ్గురు (వీపీ సింగ్, శ్రీపతి మిశ్రా, ఎన్డీ తివారీ) ఐదేళ్లు పాలించారు.

ఎన్డీ తివారీ సీఎంగా ఉండగా 1985 మార్చిలో జరిగిన తొమ్మిదో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వరుసగా రెండోసారి మెజారిటీ సంపాదించింది.

ఈసారి ఇద్దరు సీఎంలతోనే (ఎన్డీ తివారీ, వీర్‌ బహదూర్‌ సింగ్‌) ఐదేళ్లనూ పూర్తి చేసింది కాంగ్రెస్‌. అయితే, ఈ 9వ అసెంబ్లీ మొదటి సీఎం తివారీ కాగా, ఆయనే వీర్‌బహదూర్‌ తర్వాత రెండోసారి సీఎం అయ్యారు- ఈ టెర్మ్‌లోనే.

ములాయం సింగ్ యాదవ్

ఫొటో సోర్స్, Getty Images

పన్నెండేళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెసేతర రెండో యాదవ ముఖ్యమంత్రి ములాయం

ఎన్డీ తివారీ సీఎంగా ఉండగా వరుసగా రెండోసారి జరిగిన అసెంబ్లీ (పదోది) ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయింది.

1989 చివర్లో మొదలైన రాజకీయ అస్థిరత 2003 ఆగస్టు వరకూ సాగింది. ములాయం పాలనతో మొదలైన రాజకీయ సంక్షోభం మళ్లీ ఆయన చివరిసారి 2003 ఆగస్టులో సీఎం అయ్యే వరకూ యూపీని కుదిపేస్తూనే ఉంది. 1989 డిసెంబర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో- జనతాదళ్‌కు మెజారిటీకి అవసరమైన 213కు ఐదు తగ్గి 208 సీట్లు వచ్చాయి.

యూపీ జనతాదళ్‌ శాసనసభా పార్టీ నేత పదవికి పార్టీ నేతలు అజిత్‌సింగ్, ములాయంసింగ్‌ మధ్య జరిగిన పోటీలో ములాయం విజయం సాధించారు. ఉపప్రధాని, హరియాణా నేత దేవీలాల్‌ మద్దతుతో తొలిసారి 50 ఏళ్ల వయసులో ఆయన 1989 డిసెంబర్‌ 5న యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. 1990 చివర్లో జనతాదళ్‌లో చీలిక, 1991 ఆరంభంలో కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరణతో ములాయం అసెంబ్లీ రద్దు చేయించి మే-జూన్‌ నెలల్లో లోక్‌సభ మధ్యంతర ఎన్నికలతోపాటే ఎలక్షన్లు జరిపించారు.

పదకొండో శాసనసభ ఎన్నికల్లో తొలిసారి బీజేపీ మెజారిటీ సీట్లు 221 సాధించగా బీసీ నేత కల్యాణ్‌సింగ్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

1992 డిసెంబర్‌ 6న అయోధ్య బాబరీ మసీదు విధ్వంసాన్ని నివారించలేదనే కారణంపై అదే రోజు కల్యాణ్‌ సర్కారును కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం బర్తరఫ్‌ చేసి రాష్ట్రపతి పాలన విధించింది.

ఇలా మొదటి బీజేపీ సర్కారు ఆయష్షు ఏడాదిన్నర గడవకుండానే ముగిసింది. ఒకే ముఖ్యమంత్రి పాలనతో అతి తక్కువ కాలం ఉనికిలో ఉన్న యూపీ శాసనసభగా ఈ 11వ అసెంబ్లీ చరిత్రకెక్కింది.

సంవత్సరం తర్వాత 1993 డిసెంబర్‌లో 12వ అసెంబ్లీకి జరిగాయి. ఏ పార్టీకి మెజారిటీ రాకుండా హంగ్‌ అసెంబ్లీ ఏర్పడగా ఇద్దరు సీఎంల పాలన (ములాయం, మాయావతి తొలి పాలన), ఏడాదిన్నర రాష్ట్రపతి పాలనతో ఇది మూడేళ్లు కూడా ఉనికి లో లేకుండా రద్దయిపోయింది.

మళ్లీ 1996 అక్టోబర్‌లో ఎన్నికల తర్వాత ఏర్పడిన 13వ అసెంబ్లీ ఆరంభంలోనే ప్రభుత్వం ఏర్పాటు అవకాశాలు లేక 5 నెలలు సుప్తచేతనావస్థలో ఉంది.

రాష్ట్రపతి పాలన తొలగించాక మరోసారి బీజేపీ, బీఎస్పీ దోస్తీతో 1997 మార్చి 21న మాయావతి నేతృత్వంలో రెండో సంకీర్ణం ఏర్పడింది. ముందస్తు ఒప్పందం ప్రకారం మాయావతి ఆరు నెలలకు రాజీనామా చేయగా 1997 సెప్టెంబర్‌ 21న బీజేపీ-బీఎస్పీ సంకీర్ణ సారధిగా కల్యాణ్‌సింగ్‌ రెండో, చివరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లకు పైగా కొనసాగింది. బీజేపీ అంతర్గత కుమ్ములాటల ఫలితంగా కల్యాణ్‌తో పార్టీ నాయకత్వం రాజీనామా చేయిందింది.

దాదాపు 10 ఏళ్ల తర్వాత యూపీలో అగ్రవర్ణాలకు (వైశ్యుడు) చెందిన నాయకుడు రామ్‌ ప్రకాశ్‌ గుప్తా (బీజేపీ వృద్ధ నేత) ముఖ్యమంత్రిగా 1999 నవంబర్‌ 12న ప్రమాణం చేసి పదవిలో సంవత్సరం నిండే సమయానికి రాజీనామా చేశారు. ఠాకూర్‌ (రాజ్‌పూత్‌ లేదా క్షత్రియ) నేత రాజ్‌నాథ్‌సింగ్‌ బీజేపీ తరఫున బీఎస్పీతో కలిసి నడుపుతున్న సంకీర్ణానికి ముఖ్యమంత్రి అయ్యారు.

రాజ్‌నాథ్‌ హయాంలోనే 2000 నవంబర్‌ 9న యూపీ నుంచి ఉత్తరాంచల్‌ ప్రాంతాన్ని విడదీసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశారు. ఏడాది నాలుగు నెలలకే బీఎస్పీతో కీచులాటల ఫలితంగా ఈ ప్రభుత్వం కూలిపోయింది. రాష్ట్రపతి పాలన విధించారు.

ఈ శాసనసభ పదవీ కాలం కొద్ది నెలల్లో ముగుస్తుందనగా రద్దు చేసి 2002 మేలో 14వ అసెంబ్లీకి ఎన్నికలు జరిపించగా మరోసారి, ఆఖరిసారి యూపీలో త్రిశంకుసభ ఏర్పడింది.

ఈ ఎన్నికల్లోనే మొదటిసారి ములాయం నేతృత్వంలోని ఎస్పీ అత్యధిక సీట్లతో (403కు 143) అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీకి, బీఎస్పీకి చివరిసారి అంగీకారం కుదరడంతో మాయావతి 2002 మే 3న చివరిసారి సంకీర్ణ సీఎంగా అధికారం చేపట్టారు.

ఈ సంకీర్ణానికి కాంగ్రెస్‌ చీలికవర్గం (లోక్‌తాంత్రిక్‌ కాంగ్రెస్‌) కూడా మద్దతు ఇచ్చి సర్కారులో చేరింది. బీజేపీతో విభేదాల వల్ల ఏడాది నాలుగు నెలలకు మాయావతి సర్కారు కూలిపోవడంతో బీఎస్పీలో చీలిక వచ్చింది. ఈ చీలికవర్గం, లోక్‌తాంత్రిక్‌ కాంగ్రెస్, ఇండిపెండెంట్ల మద్దతుతో ఎస్పీ నేత ములాయం చివరిసారి 2003 ఆగస్టు 29న ముఖ్యమంత్రి అయ్యారు.

ఫిరాయింపుదారులు, కాంగ్రెస్, వామపక్షాలు, చీలికవర్గాల మద్దతుతో ఈ సంకీర్ణం దాదాపు నాలుగేళ్లు అధికారంలో కొనసాగి రికార్డు సృష్టించింది. యూపీలో ఒక సంకీర్ణ ప్రభుత్వం ఇంతకాలం ఉండడం ఇదే మొదటిసారి, చివరిసారి. బీఎస్పీ, కాంగ్రెస్‌ను దెబ్బదీయడానికి ములాయం

సర్కారు ఏర్పాటయ్యేలా కేంద్రంలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం పరోక్షంగా సహకరించిందే ఆరోపణలు కూడా వచ్చాయి. ములాయం ఈసారి మొత్తంమీద మూడు సంవత్సరాల 257 రోజులు అధికారంలో ఉన్నారు.

ఎన్డీ తివారీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎన్డీ తివారీ

రాష్ట్రపతి పాలన లేకుండా సాగిన అతి కొద్ది శాసనసభల్లో ఒకటి 14వ అసెంబ్లీ

యూపీలో 1950 జనవరి 26 నుంచి ఇప్పటి వరకూ 9 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఈ ఒక్క విషయం చాలు రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత గతంలో తక్కువ అని చెప్పడానికి. చివరిసారి విధించినది 13వ అసెంబ్లీ కాలంలో రాజ్‌నాథ్‌ సంకీర్ణ సర్కారు కూలిపోయాక 2002 మార్చి 8 నుంచి మే 3 వరకూ.

2002 మే నెలలో 14వ అసెంబ్లీ ఉనికిలోకి వచ్చాక ఒక ప్రభుత్వం (మాయావతి) కూలిపోయిందిగాని రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం రాలేదు. ఒకే సీఎం ఐదేళ్లూ కొనసాగిన 15వ, 16, 17వ శాసనసభల కాలంలో(2007-12, 2012-17, 2017-22) రాష్ట్రపతి పాలన ఊసే లేదు, అంతకు ముందు మొదటిసారి 1968 ఫిబ్రవరి 25న చరణ్‌సింగ్‌ మొదటి మంత్రివర్గం కూలిపోయాక రాష్ట్రపతి పాలన యూపీలో విధించారు.

అంటే నాలుగోఅసెంబ్లీతో అస్థిరత మొదలైంది. తర్వాత 1970 అక్టోబర్‌లో 17 రోజులు, 1973లో 148 రోజులు, 1975-76లో 52 రోజులు, 1977 ఏప్రిల్‌-జూన్‌ మధ్య 54 రోజులు, 1980 ఆరంభంలో 113 రోజులు, 1992-93 మధ్య 363 రోజులు, 1995 అక్టోబర్‌ 18 నుంచి 1997 మార్చి 21 వరకూ ఏడాది 154 రోజులు, 2002లో ముందే చెప్పినట్టు చివరిసారి విధించిన కేంద్ర పాలన కేవలం 54 రోజులే సాగింది. కాంగ్రెస్‌ ఆధిపత్యం కొనసాగిన రోజుల్లో కూడా తరచు ముఖ్యమంత్రుల మార్పు, ముఖ్యమంత్రిపై కాంగ్రెస్‌ ప్రధానికి నమ్మకం లేకపోవడం వంటి కారణాల వల్ల అసెంబ్లీలో మెజారిటీ ఉన్నా రాష్ట్రపతి పాలన విధించిన సందర్భాలున్నాయి.

ఇలా రాజకీయ సంక్షోభాలకు, సుస్థిర పాలన లేమికి యూపీ చాలా కాలం చిరునామా అయింది. ఇలాంటి రాజకీయ అస్థిరతను దాటి ముందుకు రావడంతో యూపీలో ఇప్పుడు 18వ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎవరూ రాజకీయ సుస్థిరత గురించి మాట్లాడడం లేదు. దేశంలో రాజకీయ సుస్థిరతకు మారుపేరుగా పరిగణించే భారత జాతీయ కాంగ్రెస్‌ బాగా బలహీనమైన తర్వాతే బిహార్‌తోపాటు యూపీలో రాజకీయ సుస్థిర పరిస్థితులు ఏర్పడడం విశేషం.

మరో ఆసక్తికరమైన అంశం-రెండు సభలున్న యూపీలో 2017 నుంచీ ముఖమంత్రి పదవిలో పూర్తికాలం కొనసాగిన నేతలు మాయావతి, అఖిలేశ్, యోగీ ఆదిత్యనాథ్‌ శాసనమండలి సభ్యులుగానే ఉన్నారు.

ఇక ముఖ్యమంత్రుల కులాల విషయానికి వస్తే యూపీలో అత్యధికంగా బ్రాహ్మణ నేతలు ఆరుగురు-జీబీ పంత్, సుచేతా కృపలానీ, కమలాపతి త్రిపాఠీ, హెచ్‌ఎన్‌ బహుగుణ, ఎన్డీ తివారీ, శ్రీపతి మిశ్రా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

వారి తర్వాత ఠాకూర్‌ వర్గానికి చెందిన ఐదుగురు-టీఎన్‌ సింగ్, వీపీ సింగ్, వీర్‌బహదూర్‌ సింగ్, రాజ్‌నాథ్‌ సింగ్, యోగీ ఆదిత్యనాథ్‌ సీఎంలు అయ్యారు.

అగ్రవర్ణమైన కాయస్థ కులస్తుడైన డా. సంపూర్ణానంద్, ఇద్దరు వైశ్య నేతలు సీబీ గుప్తా, రాంప్రకాశ్‌ గుప్తా, ఏకైక ఎస్సీ సీఎం మాయావతి వివిధ కాలాల్లో లక్నో గద్దెనెక్కారు.

బీసీలు నలుగురు సీఎంలు కాగా (రాంనరేష్‌ యాదవ్, ములాయం, కల్యాణ్, అఖిలేశ్‌) వారిలో ముగ్గురు (కల్యాణ్‌ తప్ప మిగినినవారు) యాదవులు కావడం బీసీల్లో వారి ఆధిపత్యానికి సంకేతం. నలుగురు రాజపుత్ర ముఖ్యమంత్రుల్లో ఐదేళ్లు పదవిలో ఉన్న నేతగా గోరఖ్‌పూర్‌ మఠాధిపతి యోగి రికార్డు సృష్టించారు. అలాగే బీజేపీ సీఎంలలో కూడా ఈ ప్రత్యేకత ఆయనకే సొంతమైంది.

ISWOTY

ఫొటో సోర్స్, Reuters

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)