ఉత్తరప్రదేశ్ ఎన్నికలు: యోగి ఆదిత్యనాథ్ ఇటావా ర్యాలీ అంటూ ఫేక్ ఫొటో షేర్ చేశారా - బీబీసీ ఫ్యాక్ట్ చెక్

ఫొటో సోర్స్, TWITTER/YOGI ADITYANATH
- రచయిత, మేధావి అరోరా
- హోదా, బీబీసీ డిసిన్ఫర్మేషన్ యూనిట్
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం అంటే ఫిబ్రవరి 15న సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటగా భావించే ఇటావాలో ఒక బహిరంగసభలో ప్రసంగించారు.
దేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఈ ర్యాలీ నిర్వహించారు. వివిధ న్యూస్ చానళ్లు, ఏజెన్సీల ఫొటోల్లో ఈ ర్యాలీలో వందలాది మంది హాజరైనట్టు కనిపిస్తోంది.
ఇటావా ర్యాలీ తర్వాత యోగి ఆదిత్యనాథ్ తన అధికారిక ట్విటర్, ఫేస్‌బుక్ అకౌంట్లలో ఒక ఫొటో ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 15 సాయంత్రం 6.21కి ట్వీట్ చేసిన ఈ ఫొటోలో ఆయన భారీ జనసందోహానికి చేయి ఊపుతూ అభివాదం చేస్తూ కనిపిస్తున్నారు.
“ఇటావా చరిత్ర సృష్టించబోతోంది. ఉగ్రవాద నేతలు, నేరస్థుల సంరక్షకులు ఇక్కడ ఓటమి పాలవుతారు. ప్రతి బూత్‌లో కమలం వికసించేలా చేయాలని ఇటావా కంకణం కట్టుకుంది. ధన్యావాదాలు ఇటావా” అంటూ ఆ ట్వీట్‌లో రాశారు.
కానీ, యోగి షేర్ చేసిన ఈ ఫొటోలో కాస్త గందరగోళం ఉన్నట్టు అనిపిస్తోంది.
ఈ పోస్ట్ చేసిన కాసేపటికే దీనిపై కామెంట్స్ వెల్లువ మొదలయ్యింది. కామెంట్స్ చేసిన వాళ్లందరూ ఈ ఫొటోను ఫొటోషాప్ చేశారని ఆరోపించారు. అంటే ఫొటోలో మార్పులు, చేర్పులు చేసిన తర్వాత దానిని విడుదల చేశారు.
ఇలా, ఆరోపించిన వారిలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలున్నారు. ఆప్ ఉత్తర్‌ప్రదేశ్ యూనిట్ అయితే ఏకంగా “సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో ఫొటోషాప్ ప్రభుత్వం నడిపిస్తున్నారు” అని తన అధికారిక అకౌంట్‌లో ఆరోపించింది.
ఫొటో ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తిన వారందరూ ఇందులో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బట్టల అంచుల్లో బ్లర్ ఉందని చెబుతున్నారు. ర్యాలీలో గుమిగూడిన జనం కూడా ఆయన వైపు చూడకుండా మరోవైపు చూస్తున్నారని అంటున్నారు.
ఈ ట్వీట్ వెంటనే వైరల్ అయింది. ఈ కథనం రాసే సమయానికి ఈ ట్వీట్‌ను 9,300సార్లకు పైగా రీట్వీట్ చేశారు. దీనికి 7600కు పైగా కామెంట్స్, 5 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
మరోవైపు, ఆయన తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫొటోకు 1900కు పైగా షేర్లు, 4300కు పైగా కామెంట్స్, 41 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

ఫొటో సోర్స్, TWITTER/YOGI ADITYANATH
అసలు నిజం ఏంటి?
బీబీసీ ఈ పోస్ట్ గురించి వాస్తవం తెలుసుకోడానికి ప్రయత్నించింది. మేం ఫ్యాక్ట్ చెక్ చేసినపుడు ఈ ఫొటోను నిజంగానే ఫొటోషాప్ చేసినట్టు తెలిసింది. ఓపెన్-సోర్స్ ఫొటో వెరిఫికేషన్ టూల్స్ కూడా అదే జరిగినట్లు స్పష్టం చేశాయి.
మేం రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినపుడు దీని ఒరిజినల్ ఫొటో మధురకు చెందినదని, ఇది ఇటావాది కాదని తేలింది. నిజానికి 2021 డిసెంబర్లో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా తీసిన ఫొటో ఇది.
ఇక్కడ తమాషా ఏంటంటే ఈ ఒరిజినల్ ఫొటోను స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండు నెలల క్రితం 2021 డిసెంబర్ 19న తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
ఆయన అప్పట్లో ఈ ఫొటోను షేర్ చేస్తూ “ఈరోజు మా ప్రభుత్వం నాలుగేళ్ల 9 నెలలు పూర్తి చేసుకుంది. ఈ సమయంలో రాష్ట్రంలో ఒక్క అల్లర్ల ఘటన కూడా జరగలేదు. గత ప్రభుత్వాలు మాఫియా, నేరస్థులతో వ్యాపారులను, హిందువులను తరిమికొట్టాయి. ఇప్పుడు రాష్ట్రం నుంచి ఏ వ్యాపారీ, హిందూ వెళ్లడం లేదు. ఇప్పుడు పారిపోయేవారంతా నేరస్థులు, మాఫియాలే” అని కామెంట్ పెట్టారు.
అయితే, ముఖ్యమంత్రి అధికారిక అకౌంట్ నుంచి ఇటావా బహిరంగ సభ అసలు ఫొటో షేర్ చేయడానికి బదులు ఫేక్ ఫొటో షేర్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది అనే ప్రశ్న మాత్రం అలాగే మిగిలిపోయింది.

ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీ చెప్పినట్లు యోగి పాలనలో మహిళలు సురక్షితంగా ఉన్నారా, వారి జీవితం మెరుగుపడిందా?
- బప్పి లహిరి మరణానికి కారణమైన ఈ నిద్ర సమస్య ఏమిటి? దీన్ని ఎలా గుర్తించాలి?
- స్నేహను కాపాడేందుకు రైలు కిందికి దూకిన మొహమ్మద్ మహబూబ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- గుడ్ మార్నింగ్ ధర్మవరం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పర్యటనల్లో ఏం జరుగుతోంది? ప్రజలు ఏమంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









