ఉత్తర్‌ప్రదేశ్: యోగి ఆదిత్యనాథ్ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలో రైతులు బాగుపడ్డారా? BBC Reality Check

యోగీ ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శ్రుతి మేనన్, షాదాబ్ నజ్మీ
    • హోదా, బీబీసీ రియాలిటీ చెక్, విజువల్ జర్నలిజం

ఉత్తర్‌ప్రదేశ్‌లో 2017 తరువాత వ్యవసాయ రంగం అనేక ప్రమాణాల దృష్ట్యా మెరుగుపడిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల అన్నారు. ఈమధ్యే, ఆ రాష్ట్రానికి చెందిన రైతులు దిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా నిరసనలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్న మాటల్లో నిజమెంతో మేం పరిశీలించాం.

రైతుల ఆత్మహత్యలు

వాదన: "2014కు ముందు అనేక మంది రైతులు బలవన్మరణానికి పాల్పడేవారని మనకు తెలుసు. లక్షల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ, 2014 తరువాత రైతులకు అనుకూలమైన విధానాలు అమల్లోకొచ్చాయి. దాని ఫలితాలు మీరు చూస్తున్నారు."

ఫ్యాక్ట్ చెక్: 2014 నుంచి దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు కొంత మేర తగ్గాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో గణనీయంగా తగ్గాయి. అయితే, ఆ ఏడాది నుంచి డేటా సేకరణ పద్ధతుల్లో కూడా మార్పు వచ్చింది.

ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో జరిగిన ఒక రైతుల కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ ఈ విషయాలను ప్రస్తావించారు. అయితే, ఆయన ఉత్తర్‌ప్రదేశ్ గురించి మాత్రమే మాట్లాడారా లేక దేశం మొత్తం గురించి చెప్పారా అన్నది అస్పష్టం.

బీజేపీ 2014లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచగా, 2017లో ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది.

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం, 2014 నుంచి దేశవ్యాప్తంగా, రాష్ట్రస్థాయిలోనూ వ్యవసాయ సంబంధ ఆత్మహత్యలు తగ్గాయి.

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలే కారణమని కిందటి నెల నిర్వహించిన ఒక ర్యాలీలో యోగి అన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో వ్యవసాయ రంగంలో ఆత్మహత్యలు 2012, 2013లలో వరుసగా 745, 750 దగ్గర నమోదయ్యాయి. 2014 తరువాత ఈ మరణాల సంఖ్య 100 కన్నా తగ్గింది. కానీ, 2017లో 110, 2019లో 108కి పెరిగింది.

రైతుల రుణాలను విజయవంతంగా మాఫీ చేసిన రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్ మొదటిది అన్న యోగి వాదన తప్పు.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రైతుల రుణాలను విజయవంతంగా మాఫీ చేసిన రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్ మొదటిది అన్న యోగి వాదన తప్పు.

అప్పులు, కుటుంబ సమస్యలు, పంట నష్టం మొదలైనవి రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు.

అయితే, ఎన్‌సీఆర్‌బీ డేటా కలక్షన్ విధానంలో వచ్చిన మార్పుల కారణంగానే 2014 తరువాత రైతుల ఆత్మహత్యల సంఖ్య గత సంవత్సరాల కన్నా తక్కువగా నమోదైందన్నది గమనార్హం.

2014 మొదలు, వ్యవసాయ సంబంధ ఆత్మహత్యలను రెండు వర్గాలుగా విభజించారు. అవి 'రైతులు', 'రైతు కూలీలు'.

అంతే కాకుండా, రైతుల పేరు మీద భూమి లేకపోతే వారిని డేటాబేస్‌లో కలపరు.

ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్‌లో ఇచ్చిన నిర్వచనం ప్రకారం, 'రైతులు' అంటే పొల్లాల్లో పనిచేస్తూ, వ్యవసాయానికి కూలీలను నియమించుకునేవాళ్లు. రైతు కూలీలు, సొంత భూమి లేని వాళ్లు ఈ జాబితాలోకి రారు.

ఈ వర్గీకరణకు ఏడాది ముందు, అంటే 2013లో "రైతులు" నిర్వచనం కింద వచ్చేవాళ్లల్లో 11,774 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.

2014లో కొత్త వర్గీకరణ తరువాత, వ్యవసాయ రంగానికి చెందిన వారిలో 12,360 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో 5,650 మందిని "రైతులు" కేటగిరీలో లెక్కవేశారు.

చక్కెర ఉత్పత్తి

వాదన: "బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ), సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పీ) పదేళ్ల పాలనలో చక్కెర ఉత్పత్తి 64 లక్షల మెట్రిక్ టన్నులు. కానీ, బీజేపీ పాలనలో వార్షిక ఉత్పత్తే ఒక కోటి, పదహారు లక్షల మెట్రిక్ టన్నులు."

ఫ్యాక్ట్ చెక్: చక్కెర ఉత్పత్తి పెరిగిందన్నమాట వాస్తవమే. కానీ, 2017 ముందు నుంచే క్రమంగా పెరుగుతూ వచ్చింది.

గత అయిదేళ్లల్లో తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇది చెప్పారు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ షుగర్ రిసెర్చ్, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం డేటాలను పరిశీలిస్తే, బీఎస్‌పీ, ఎస్‌పీ అధికారంలో ఉన్న సమయంలో (2007-08, 2016-17 మధ్య) చక్కెర ఉత్పత్తి వార్షిక సగటు సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది.

2017 నుంచి వార్షిక ఉత్పత్తి ఒక కోటి మెట్రిక్ టన్నులకు పైనే ఉంది. అయితే, ప్రతీ ఏడాది హెచ్చుతగ్గులు ఉంటూనే ఉన్నాయి. 2021-22 గణాంకాలు ఇంకా తెలీవు.

ప్రస్తుతం చక్కెర ఉత్పత్తిలో ఉత్తర్‌ప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో ఉంది.

రుణమాఫీ

వాదన: "2017లో మేం అధికారంలోకి వచ్చినప్పుడు, మా తొలి క్యాబినెట్ సమావేశంలో 86 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.36,000 కోట్ల విలువైన రుణాలను మాఫీ చేశాం. దీన్లో విజయం సాధించిన మొట్టమొదటి రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్."

ఫ్యాక్ట్ చెక్: రుణమాఫీ జరిగింది. కానీ, 86 లక్షల మంది రైతులకు కాదు. ఉత్తర్‌ప్రదేశ్ ఇంకా ఆ లక్ష్యాన్ని చేరుకోలేదు. అలాగే, రుణమాఫీ ప్రకటించిన రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్ మొదటిదేం కాదు.

లఖ్‌నవూలో జరిగిన ఒక విలేఖరుల సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు.

2017లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన మొదటి క్యాబినెట్ సమావేశంలో 86 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.36,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు.

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2020 సెప్టెంబర్ నాటికి సుమారు 44 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ. 25,000 కోట్లకు పైగా రుణాలను మాఫీ చేశారు. ఆ తరువాత సంవత్సరాల డేటా ఇంకా అందుబాటులో లేదు.

మార్చి 2021 నాటికి, దేశంలో అత్యధిక వ్యవసాయ రుణ బకాయిలు ఉన్న రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్ ఒకటి. ఇది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తరువాతి స్థానంలో ఉంది.

మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం, 2012-2013 నాటికి ఉత్తర్‌ప్రదేశ్‌లో 79,000 వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి.

2018-19కి, అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత, ఈ సంఖ్య స్వల్పంగా తగ్గి 74,000కు చేరుకుంది.

రైతుల రుణాలను విజయవంతంగా మాఫీ చేసిన రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్ మొదటిది అన్న వాదన తప్పు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు లాంటి దక్షిణాది రాష్ట్రాలు 2014, 2016లలోనే వ్యవసాయ రుణమాఫీ పథకాలను అమలు చేశాయి.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)