యుక్రెయిన్ సంక్షోభం: 8,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి యుక్రెయిన్‌లో పోరాడేందుకు వెళ్తున్న కమెడియన్

ఆంథోని వాకర్

ఫొటో సోర్స్, Anthony WALKER

ఫొటో క్యాప్షన్, ఆంథోని వాకర్
    • రచయిత, బెర్న్డ్ డీబస్‌మాన్ జూనియర్
    • హోదా, బీబీసీ న్యూస్ వాషింగ్టన్

ఆయనెప్పుడూ యుద్ధంలో పాల్గొనలేదు. కొన్ని వారాల క్రితం వరకూ ఆయనొక యూనివర్సిటీ విద్యార్థి, కమెడియన్. ఆయనకు సోషల్ మీడియాలో 100,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆయన డోనల్డ్ ట్రంప్ మద్దతుదారులుపై నిరంతరం ట్రోలింగ్ చేసేవారు.

కెనడాకు చెందిన ఆంథోని వాకర్ ప్రస్తుతం పోలండ్ యుక్రెయిన్ సరిహద్దు దగ్గర ఉన్నారు. యుక్రెయిన్‌లో సహాయం చేసేందుకు వస్తున్న అనేక మంది విదేశీయులతో పాటు ఆయన కూడా చేరారు. ఆయనకు 29 సంవత్సరాలు.

యుక్రెయిన్‌లో యుద్ధ వాతావరణాన్ని, దృశ్యాలను టీవీలోచూసిన తర్వాత టొరంటోలో ముగ్గురు పిల్లలతో హాయిగా సాగుతున్న జీవితాన్ని కూడా వదులుకుని రావడానికి సిద్ధపడినట్లు వాకర్ బీబీసీకి చెప్పారు.

"నేను, నా భార్య కలిసి యుక్రెయిన్ వార్తలను చూశాం. ఆ వార్తలు కలచివేసేవిగా ఉన్నాయి. ఇదే పరిస్థితి కెనడాలో చోటు చేసుకుంటే మాకెవరైనా సహాయం చేసి ఉంటే బాగుండేదని తప్పకుండా అనుకునేవాళ్లం" అని అన్నారు.

ఆ దృశ్యాలు చూసిన తర్వాత ఒక సుస్థిరమైన, ధనిక దేశంలో, యుద్ధం అంటే తెలియని దేశంలో పుట్టడం తన అదృష్టం అని అనిపించినట్లు చెప్పారు.

"మా పై ఈ విధంగా ఎవరూ దాడి చేసి ఉండేవారు కాదు" అని అన్నారు.

"యుక్రెయిన్‌తో నాకెటువంటి సంబంధాలు లేవు. నేను యుక్రెయిన్‌కు చెందినవాడిని కాదు. నేనొక మనిషిని. ఇక్కడకు రావడానికి ఈ ఒక్క కారణం చాలని అనుకుంటున్నాను" అని అన్నారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌లో కారుపైకి ఎక్కిన రష్యా ట్యాంకర్

వాకర్‌కు సైన్యంలో పని చేసిన అనుభవం లేదు. నిజానికి మూడు సంవత్సరాల క్రితం ఆరోగ్య కారణాల రీత్యా ఆయన సైన్యంలో పని చేసేందుకు అర్హులు కాదని కెనడా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆయన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది.

ఆయన కార్పెంటర్‌గా, ట్రక్ డ్రైవర్‌గా రక రకాల పనులు, ఉద్యోగాలు చేశారు. ఆయన సర్టిఫైడ్ మెడికల్ టెక్నీషియన్ కూడా. ఈ నైపుణ్యం యుక్రెయిన్‌లో ప్రజలకు సహాయపడేందుకు పనికొస్తుందని భావిస్తున్నారు. ఆయన కెనడా యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ హ్యాకింగ్ కోర్స్ కూడా చేస్తున్నారు.

ప్రస్తుతానికి ఆయన పోలండ్ సరిహద్దుల దగ్గర ఉండాలని అనుకుంటున్నారు. అక్కడాయన మాజీ కెనడా సైనికులతో పాటు యూకే, అమెరికా, దక్షిణ కొరియా నుంచి వచ్చే వలంటీర్ల కోసం ఎదురు చూస్తున్నారు. యుక్రెయిన్ సైన్యానికి ట్రక్ ద్వారా సోమవారం కొన్ని వస్తువుల సరఫరా చేసినట్లు చెప్పారు.

అక్కడ నుంచి పశ్చిమ యుక్రెయిన్ లో ఉన్న లీయెవ్‌కు వెళ్లాలని అనుకుంటున్నారు.

పోలండ్, యుక్రెయిన్ మధ్య సరిహద్దు అంతా దేశం విడిచి పెట్టి వెళ్లాలనుకుంటున్న శరణార్థులతో నిండిపోయిందని చెప్పారు.

"సరిహద్దులు దాటేందుకు కొంత మంది నాలుగు రోజుల నుంచి లైన్లలో నిలబడి ఎదురు చూస్తున్నారని చెప్పారు. వారంతా ఆకలితో బాధపడుతూ, చలికి అలమటిస్తున్నారు. వారి పరిస్థితి దారుణంగా ఉంది" అని అన్నారు.

పోలండ్ -యుక్రెయిన్ సరిహద్దు

ఫొటో సోర్స్, ANTHONY WALKER

ఫొటో క్యాప్షన్, పోలండ్ -యుక్రెయిన్ సరిహద్దు

వాకర్ యుక్రెయిన్ వెళ్లాలనే నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే, చాలా మంది వలంటీర్లు ఆయనను అనుసరిస్తామని సందేశాలు పంపినట్లు చెప్పారు.

ముఖ్యంగా యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్క్సీ, ఇతర సీనియర్ అధికారులు విదేశీ వాలంటీర్ల కోసం పిలుపునివ్వడం మొదలైన తర్వాత పదుల్లో మొదలైన సందేశాలు వరదలా రావడం మొదలుపెట్టాయని చెప్పారు.

దీంతో, ప్రపంచ వ్యాప్తంగా రెడిట్, డిస్‌కార్డ్ లాంటి సోషల్ మీడియా వేదికల పై కొన్ని వేల సందేశాలు వచ్చాయి.

వీడియో క్యాప్షన్, బాంబుల వర్షం మధ్య బంకర్లలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, కాపాడమంటూ వేడుకోలు

అయితే, నిజంగా స్వచ్చంద సేవ కోసం ఎంత మంది ముందుకు వస్తారనేది స్పష్టంగా తెలియనప్పటికీ, లెక్కలేనంతమంది విదేశీయులు మాత్రం యుక్రెయిన్‌లో పోరాడేందుకు అనుమతించమని అభ్యర్ధనలు చేసినట్లు యూకే లో యుక్రెయిన్ రాయబారి వాదిమ్ ప్రిస్టయికో చెప్పారు.

స్వచ్ఛందంగా యుద్ధానికి ముందుకొచ్చేవారికి ఆయుధాలిస్తామని యుక్రెయిన్ చెబుతున్నప్పటికీ, ఆయుధాల శిక్షణ, నిర్వహణ ఎవరికి ఎలా ఇస్తుంది, వారిని రంగంలోకి ఎలా దించుతారనే విషయాలు మాత్రం తెలియడం లేదు.

యుక్రెయిన్‌లో ఎవరైనా పోరాడాలనుకుంటే అది వ్యక్తిగత నిర్ణయమని కెనడా విదేశాంగ శాఖ మంత్రి మెలానీ జోలీ చెప్పినట్లు గ్లోబ్, మెయిల్ పత్రికలు పేర్కొన్నాయి.

బ్రిటన్ పౌరులు కూడా ఈ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు పూర్తిగా వారి సొంతమని యూకే విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ కూడా అన్నారు.

ప్రభుత్వాలు ఇస్తున్న మద్దతును ప్రశంసిస్తూ, స్వచ్చంద సేవకోసం వచ్చే వారు ఇక్కడకు రావడంలో ఉన్న ముప్పు గురించి కూడా ఆలోచించాలని వాకర్ చెప్పారు. యుద్ధం కారణంగా పెరిగిన ధరలు, ఆదాయం కోల్పోవడం లాంటి విషయాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.

ఆంథోని వాకర్

ఫొటో సోర్స్, ANTHONY WALKER

ఫొటో క్యాప్షన్, ఆంథోని వాకర్

ఆయన డిజిటల్ భద్రత గురించి కూడా విచారిస్తున్నారు. ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలను హ్యాక్‌టివిస్ట్ నెట్‌వర్క్ ద్వారా రీ రూట్ చేస్తున్నారు.

చాలా మంది స్వచ్చంద సేవకులు యువకులు కావడంతో వారికి యుద్ధం గురించి పూర్తి అవగాహన ఉండదు. యుద్ధాన్ని ఫ్యాన్సీగా చూస్తారు. శిక్షణ లేకుండా, సిద్ధం కాకుండా వచ్చే స్వచ్చంద సేవకుల వల్ల దేశానికి భారమే అవుతుంది తప్ప సహాయం చేసినట్లు కాదని కొంత మంది మాజీ సైనికులు ఆన్‌లైన్‌లో హెచ్చరించారు.

"ఇది వీడియో గేమ్ కాదు. యుద్ధ భూమి వార్ థీమ్‌తో ఉండే "గ్రెనేడ్స్ అండ్ బుల్లెట్స్ కిల్" అనే వీడియో గేమ్‌లా ఉండదని అంటూ, యుద్ధానికి పిలుపునిచ్చారని రావాలనుకుంటే మాత్రం ఇక్కడకు రావద్దు" అని చెప్పారు.

రష్యా సైన్యాన్ని ఎదుర్కొంటాననే ఆందోళన ఉందా అని ప్రశ్నించినప్పుడు, కీయెవ్ లో ఒక క్యాన్సర్ ఆసుపత్రి పై జరిగిన బాంబుల దాడిలో ఒక చిన్నారి మరణించినట్లు వచ్చిన వార్తలు చూసిన తర్వాత రష్యా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు స్థిర చిత్తంతో ఉన్నట్లు వాకర్ చెప్పారు.

"ఈ చిన్నారి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు నాకు తోచింది చేస్తాను. నేను సరైన పనే చేస్తున్నానని అనుకుంటున్నాను" అని అన్నారు.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)