Clubhouse: ఈ సోషల్ ఆడియో యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్‌‌లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?

మహిళల న్యూడ్ చిత్రాలు

ఫొటో సోర్స్, KLAWE RZECZY

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అదొక విశాలమైన హవేలీ లాంటి క్లబ్.... అందులో కొన్ని లక్షల గదులు...ఒక్కసారి హవేలీలోకి అడుగు పెడితే ఏ గదిలోకైనా అడుగు పెట్టవచ్చు. ఆ గదుల్లో రాజకీయ చర్చలు జరుగుతూ ఉంటాయి. సామాజిక అంశాల పై వాదనలు, ఆర్ధిక విషయాల పై అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. కొన్ని గదుల నుంచి శ్రావ్యమైన సంగీతం వినిపిస్తూ ఉంటుంది. మరొక చోట ఛలోక్తులు విసురుతూ ఉంటారు. మనుషులెవరూ కనిపించరు. ఈ క్లబ్‌లో కేవలం గొంతు మాత్రమే వినిపిస్తుంది. ఇదెక్కడుందో తెలుసా? మీ అరచేతిలో ఉన్న మొబైల్‌లోనే. అదే క్లబ్ హౌస్ యాప్.

క్లబ్ హౌస్ అంటే ఏంటి?

క్లబ్ హౌస్ ఒక సోషల్ ఆడియో యాప్. ఇదేమి డేటింగ్ యాప్ కాదు. మొబైల్‌లో ప్లే స్టోర్‌లో ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని వేల, లక్షల గదులు ఉంటాయి. కొన్ని గదులకు తాళాలుంటాయి. కొన్ని గదుల్లోకి నేరుగా వెళ్ళవచ్చు. తాళాలున్న గదుల్లోకి వెళ్లాలంటే తలుపు కొట్టాల్సి ఉంటుంది. అనుమతి లభిస్తుంది. ఏ గదిలోకి అడుగుపెట్టాలనేది మన వ్యక్తిగత అభిరుచుల పై ఆధారపడి ఉంటుంది.

వీడియో క్యాప్షన్, ‘నా న్యూడ్ ఫొటోలను టెలిగ్రాం తొలగించట్లేదు... అలాంటి ఫొటోలు ఇంకా కావాలంట’

ఈ చర్చలు కేవలం బహిరంగంగా చర్చించే అంశాలు మాత్రమే కాదు, సెక్స్, లైంగిక ఆసక్తులు, ఇతర వ్యక్తిగత అంశాలతో కూడినవి కూడా ఉంటాయి. ఎవరైనా తమకు నచ్చిన అంశంతో ఒక రూమ్ క్రియేట్ చేయవచ్చు. లెస్బియన్ సెక్స్, ఫ్రీ టాక్, గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ నీడ్స్ , వాట్సాప్ వీడియో కాల్ ఓన్లీ లాంటి రూమ్స్ కూడా ఉంటాయి.

కొన్ని యాప్స్‌కు నేరుగా వెళ్ళవచ్చు. కొన్నిటికి మాత్రం అడ్మిన్ ఆమోదం కావాలి. కొన్ని రాత్రి 11 గంటల నుంచి మాత్రమే పని చేస్తాయి.

ఇలాంటి కొన్ని రూమ్స్‌లోకి వెళ్లి ఏమి జరుగుతుందో పరిశీలించినప్పుడు, అక్కడ ఒక 18-28 వయసు మధ్యలో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు పది మందికి పైగా ఉన్నారు.

అక్కడ వారు పూర్తిగా సెక్స్‌కు సంబంధించిన సంభాషణలు మాత్రమే చేస్తారు. ఎవరికైనా సెక్స్ పట్ల ఆసక్తి ఉంటే ఆ గదుల్లో ఉన్న అమ్మాయిల వివరాలను తీసుకుని అక్కడ నుంచి వాట్సాప్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌కు వెళ్లి చాట్ చేయవచ్చు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్ అమ్మాయిలు ఎవరికీ కనిపించని భాగాల్లోనే టాటూలు వేయించుకుంటున్నారు ఎందుకు?

కొన్ని గదుల్లో సాగే చర్చలెలా ఉన్నాయి?

మోడరేటర్ : "నీ వయసెంత? నువ్వెన్ని సార్లు సెక్స్ చేశావు? " "ఎంత మందితో చేశావు?"

యూజర్: 23, లెక్క లేదు, 50

మోడరేటర్ :"నువ్విక్కడెందుకు ఉన్నావు? నీకేమి ఇష్టం?"

యూజర్: "నాకు సెక్స్ ఇష్టం, నాకు న్యూడ్ కాల్స్ ఇష్టం"

"నాకు సెక్స్ చాట్స్ ఇష్టం"

మోడరేటర్: "అయితే, నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను ఫాలో అవ్వు."

"ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు... ఫాలోవర్లు వచ్చారు".

ఇదే తరహా సంభాషణ సాగుతూ ఉంటుంది. కొన్ని సంభాషణలు మాటల్లో చెప్పలేని తరహాలో కూడా సాగుతూ ఉంటాయి. కొంత సేపటికి రూమ్‌లో సంభాషణ ఆగిపోతుంది. మోడరేటర్లు తమకు కావాల్సినంత మంది ఫాలోవర్లు వచ్చిన తర్వాత రూమ్‌కి తాళం వేసి వెళ్లిపోయినట్లు చాట్ ముగిస్తారు.

ఇలా మాట్లాడేదెవరు?

అయితే, ఆ మాట్లాడుతున్న వ్యక్తి, ఫోటో, పేరు తప్ప మరే ఇతర వివరాలు ఉండవు. మాట్లాడుతున్నది నిజంగా ఆ ఫొటోలో ఉన్న వ్యక్తా కాదా, మాట్లాడుతున్న వారి వయసెంత అనేది కూడా తెలియదు. ఈ గదుల్లోకి 18 సంవత్సరాల లోపు ఉన్న వారు వచ్చినా కూడా ఎవరికీ తెలియదు.

క్లబ్ హౌస్ ముసుగులో ఆ సంభాషణ, డేటింగ్, ఇతర అనైతిక వ్యవహారాలకు కూడా దారి తీస్తుందేమో ఎవరికీ తెలియదు.

ఈ విషయం గురించి బీబీసీ క్లబ్ హౌస్‌ను సంప్రదించింది.

న్యూడిఫయర్ యాప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈ యాప్‌తో ఏ మహిళ ఫోటోనైనా నగ్నంగా మార్చేయవచ్చు

క్లబ్ హౌస్ మాత్రం ఏదైనా అసభ్యకర లేదా హింసాత్మక సమాచారం ఉన్న పక్షంలో ఆ గదిలో ఉన్న కుడి వైపు పై భాగంలో ట్యాప్ చేసి, ఆ సంఘటనను రిపోర్ట్ చేయమని చెబుతోంది.

ఆ రూమ్ దాటి వెళ్లి రిపోర్ట్ చేస్తే, ఆ కంటెంట్‌ను యాక్సెస్ చేసే అవకాశం ఉండదని మాత్రం తెలిపింది. ఎవరైనా ప్రొఫైల్స్ సరైనవి కావని భావిస్తే, వాటిని కూడా రిపోర్ట్ చేయవచ్చని సూచించింది.

అయితే, సూపర్ సెక్స్‌టింగ్ యుగంలో ప్రైవసీ కోల్పోయినప్పుడు వాటిని పరిష్కరించేందుకు కఠినమైన చట్టాలేవీ లేకపోవడం వల్లే ఇటువంటి సంభాషణలకు దారి తీస్తున్నట్లు విశాఖపట్నంకు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త సాయి పద్మ అన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో జరిగిన చాట్ ఎక్కడికి దారి తీస్తుందో ఎవరికీ తెలియదు. బీబీసీ చాలా ప్రొఫైల్స్ పరిశీలించినప్పుడు, కొంత మంది నేరుగా కాల్ గర్ల్స్ అని ప్రొఫైల్స్ పెట్టుకోగా, మరి కొంత మంది యూనివర్సిటీ, కాలేజీ విద్యార్థులమని ప్రొఫైల్స్ బయో డేటా లో రాశారు. నిజానికి వీరు యూనివర్సిటీ విద్యార్థులా కాదా అనేది సందేహమే. ఇందులో చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లకు 5వేలకు పైగా ఫాలోవర్లు కూడా ఉన్నారు.

ఇటువంటి సంభాషణలు మానసిక, శారీరక, ఆర్ధిక సమస్యలకు దారి తీస్తున్నాయని సాయి పద్మ అన్నారు.

ఒక వర్గం మహిళలను టార్గెట్‌గా చేసుకుని ఫొటోల వేలంపాట నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి

ఫొటో సోర్స్, JILLA DASTMALCHI/BBC

ఫొటో క్యాప్షన్, ఒక వర్గం మహిళలను టార్గెట్‌గా చేసుకుని ఫొటోల వేలంపాట నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి

క్లబ్ హౌస్ ఎలా పని చేస్తుంది?

క్లబ్ హౌస్ యాప్ ప్రారంభించిన కొత్తలో కేవలం ఇతరులను ఆహ్వానించడం ద్వారా మాత్రమే చేర్చుకునే అవకాశముండేది. కానీ, ఇప్పుడు ఎవరైనా యాప్ డౌన్ లోడ్ చేసుకుని నచ్చిన గదిలోకి తొంగి చూడవచ్చు. మాట్లాడాలనుకుంటే, చేతితో సంకేతం చేయాలి . గ్రూప్ అడ్మిన్స్ మీకు మాట్లాడే అవకాశాన్నిఇస్తారు. అనుమతి లభించగానే సంబంధిత అంశం గురించి మాట్లాడవచ్చు.

గతంలో ఈ యాప్ లో ఫాలోవర్లకు సందేశం పంపే అవకాశముండేది కాదు. కానీ, ప్రస్తుతం అక్కడ ఫాలో అయ్యే ఎవరికైనా వ్యక్తిగతంగా మెసేజ్ పంపే అవకాశాన్ని కూడా వెసులుబాటులోకి వచ్చింది.

రూమ్‌లో ఎవరు మాట్లాడాలనే విషయాన్ని మోడరేటర్లు నిర్ణయిస్తారు.

క్లబ్ హౌస్ నియమావళి ఏమి చెబుతుంది?

యూజర్లు తమ అసలు పేర్లతోనే ప్రొఫైల్స్ కూడా క్రియేట్ చేయాలని యాప్ నియమావళి చెబుతుంది. కళాకారులు, రచయితల లాంటి వారికి లేదా మానవ హక్కుల కార్యకర్తలు భద్రత రీత్యా మారు పేర్లు పెట్టుకునే అవకాశముంది.

సెల్ఫీ తీసుకుంటున్న టీనేజ్ అమ్మాయి

ఈ యాప్‌లో వ్యక్తులను బెదిరించడం కానీ, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం కానీ, నిషేధం అని చెబుతుంది.

కానీ, ఈ నియమావళిని పాటిస్తున్నారో లేదో పర్యవేక్షించేది ఎవరని సాయి పద్మ ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల ఇదే యాప్‌లో ముస్లిం మహిళలపై కొంత మంది వ్యక్తులు చేసిన అసభ్యకర సంభాషణ వెలుగులోకి రావడంతో ముగ్గురిని అరెస్టు చేసి ఐటీ చట్టం 2000లోని ఐపీసీ సెక్షన్లు 153 (ఏ), 295 (ఏ), 354 (ఏ), 354 (డి) కింద కేసులు కూడా నమోదు చేశారు.

న్యూడ్ ఫోటోలు, వీడియోలు అనుమతించమని నియమావళి చెబుతుంది, కానీ, ఈ సెక్స్ చాట్స్‌తో కూడిన రూమ్‌లో చాలా ప్రొఫైల్ చిత్రాలు మాత్రం న్యూడిటీని ప్రతిబింబిస్తూ ఉంటాయి.

ఒక యాప్‍కి సంబంధించిన బిజినెస్ మోడల్ ఏమన్నా ఉండుండొచ్చు, కానీ యాప్ యూజర్లకి ప్రైవసీకి సంబంధించిన ఫీచర్స్ ఇవ్వాలి. సోషల్ మీడియా యాప్‍లో మన పేరు, డీపీ లాంటి వివరాలు ఎవరు చూడగలరు, మనల్ని ఎవరు ఫాలో/కాంటాక్ట్ చేయగలరు, మనం బ్లాక్ చేయగలమా వంటివి అందుబాటులో ఉండాలని టెక్ నిపుణులు పూర్ణిమ తమ్మిరెడ్డి అంటారు.

"క్లబ్ హౌస్ ఇలాంటి విషయాల్లో ముందు నుంచి వెనుకబడి ఉంది. సాఫ్ట్-వేర్ డిజైన్, ఇంప్లిమెంటేషన్ పరంగా ఇవేవీ చేయలేని పనులు కాదు. వాళ్ళు చేయలేదంతే! ప్రపంచవ్యాప్తంగా అనేకులు నిరసన, విమర్శ వ్యక్తం చేసేవరకూ వారు బేసిక్ ప్రైవసీ విషయాలని కూడా పట్టించుకోలేదు. మన దేశంలోని ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ (ఐ.ఎఫ్.ఎఫ్) ఈ విషయమై పోరాడుతోంది" అని చెప్పారు.

ఈ సెక్స్ చాట్స్ ఎక్కడకు దారి తీయవచ్చు?

"ముందు జస్ట్ చాట్ కదా అనుకుంటారు. తర్వాత అవతల అమ్మాయి అంగీకారంతోనే న్యూడ్ కాల్స్ చేస్తోంది కదా అనుకుంటారు".

కానీ, ఇలాంటి సెక్స్ చాట్స్ లో పాల్గొన్న తర్వాత డబ్బుల కోసం బ్లాక్ మెయిలింగ్, సెక్స్ చాట్స్ బయటపెడతామని బెదిరింపులు జరిగే అవకాశముందని సాయి పద్మ అన్నారు. "అప్పటికే, మన ఫోన్ నంబర్లు, సోషల్ మీడియా ప్రొఫైల్స్ అవతలి వారి చేతుల్లో ఉండటంతో బయటకు రాలేని అగాధంలోకి కూరుకుపోయే అవకాశం ఉంది" అని చెప్పారు.

వేధింపులక గురైన మహిళ

ఫొటో సోర్స్, Getty Images

"ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక ఆన్ లైన్ వ్యభిచార వృత్తిలా కొనసాగుతోంది. దీనికి చట్టబద్ధంగా పరిష్కారం లభించడం కూడా చాలా కష్టమైన వ్యవహారం. సమస్యలు తేలక కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం కూడా ఉంది" అని హెచ్చరించారు.

సోషల్ మీడియాలో చోటు చేసుకున్న మోసాల గురించి ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారోననే భయం, అటువంటి ఫిర్యాదుల పట్ల సానుకూలంగా స్పందించరనే అభిప్రాయాల కారణంగా చాలా మంది బయటకు చెప్పరని అన్నారు. వ్యవస్థ కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు తప్పెందుకు చేశావని ప్రశ్నించే బదులు పరిష్కారం అందించగలిగితే బాగుంటుందని సాయి పద్మ అభిప్రాయపడ్డారు.

క్లబ్ హౌస్ లాంటి యాప్స్‌లో మన స్నేహితులు, కుటుంబ సభ్యులూ అందరూ ఉంటే మనం కూడా జాయిన్ అవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని అంటారు పూర్ణిమ.

"కిటికీలు తలుపులు సరిగ్గా లేక, ఏ క్షణాన్నైనా కూలిపోయే సీలింగ్ ఉన్న భవంతుల్లోకి మనం నడుచుకుంటూ ఎలా వెళ్ళమో, ఇంకెవ్వరినీ వెళ్ళనివ్వమో, మనల్ని మన కాంటాక్ట్స్ ప్రైవసీని రిస్క్‌లో పెట్టే యాప్స్ కి దూరం ఉండాలి. ఇలాంటి యాప్స్ ఉపయోగించడం వల్ల బాడ్ యాక్టర్స్ (అవతలివారి హాని కలిగించే ఉద్దేశ్యం ఉన్న వ్యక్తుల) చేతిలో పడే అవకాశాలే ఎక్కువ. అందుకని మనమే జాగ్రత్తగా ఉండాలి" అని సూచించారు.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)