eSanjeevani OPD: ఆన్‌లైన్‌లో అన్ని స్పెషాలిటీల డాక్టర్ల కన్సల్టేషన్.. పైసా ఫీజు లేదు, ఎవరైనా వాడుకోవచ్చు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నాగ సుందరి
- హోదా, బీబీసీ కోసం
కరోనా మహమ్మారి ఆరోగ్యం విషయంలో మనకు కొన్ని కొత్త అలవాట్లు నేర్పింది. అందులో ఒకటి ఆన్‌లైన్ ట్రీట్మెంట్. లాక్‌డౌన్ సమయంలో ఆసుపత్రి వరకు వెళ్లలేని వారు దీన్ని వరంగా భావించారు.
చాలా ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రులు ఇప్పటికీ దీన్ని కొనసాగిస్తున్నాయి. సాధారణ కన్సల్టెన్సీ కన్నా దీనికి ఫీజు ఎక్కువ.
అయితే ఇపుడు కేంద్ర ప్రభుత్వం ఈ–సంజీవని ఓపీడీ పేరుతో స్వయంగా ఇలాంటి సర్వీసును అందిస్తోంది. దేశంలోని ఎవరైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం.
వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఆన్‌లైన్‌లోనే నిపుణులైన వైద్యుల నుంచి ట్రీట్మెంట్ పొందవచ్చు. అందరికన్నా ఇది సీనియర్ సిటిజన్లకు ఎంతో సౌకర్యవంతమైన స్కీమ్ అని చెప్పవచ్చు.
ఎక్కడో ఉన్న డాక్టర్ల దగ్గరకు వెళ్లి, గంటల తరబడి అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసి ఇబ్బంది పడే బదులు ఇంటి దగ్గరే కూర్చొని తమకు అవసరమైన డాక్టర్లను సంప్రదించవచ్చు. అన్ని రకాల స్పెషాలిటీల డాక్టర్లు అందుబాటులో ఉంటారు.
ఏమిటీ స్కీమ్?
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లో భాగంగా చేపట్టిన సర్వీసు ఇది. ఈ–సంజీవన్ ఓపీడీ (అవుట్ పేషంట్ డిపార్ట్మెంట్) స్కీమ్ కోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను ప్రారంభించింది.
దీన్ని సెంటర్ ఫర్ డెవలెప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ–డాక్) నిర్వహిస్తుంది. ఈ–సంజీవని ఓపీడీ స్కీమ్‌ను 2021 ఏప్రిల్ 13న ప్రారంభించారు.
దేశంలోని ఏ ప్రాంతం వారైనా తమకు అనుకూలంగా ఉన్న క్లినిక్లలో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. డెస్క్‌టాప్, ల్యాప్టాప్, ట్యాబ్, స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆన్‌లైన్‌లోనే డాక్టర్‌ను సంప్రదించి ట్రీట్మెంట్ పొందవచ్చు.
ఈ–ప్రిస్క్రిప్షన్ ద్వారా డాక్టర్లు అవసరమైన వైద్యాన్ని సూచిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన డాక్టర్లు ప్యానెల్లో ఉంటారు. కాబట్టి, మీ రాష్ట్రానికి చెందిన డాక్టర్లే ఆన్‌లైన్‌లోకి వచ్చి ట్రీట్మెంట్ అందిస్తారు.
వెబ్సైట్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్లేస్టోర్లో అందుబాటులో ఉండే యాప్ (ఈ–సంజీవనీ ఓపీడీ) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా లక్షా 55 వేల హెల్త్, వెల్నెస్ సెంటర్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
ఈ–సంజీవని ఓపీడీ అధికారిక వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా హోం పేజీలో పేషంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీని కోసం స్క్రీన్పై కనిపించే రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
మీ మొబైల్ నంబరు ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా మీ మొబైల్ నంబర్ కన్ఫార్మ్ అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
తర్వాత మీకు కనిపించే పేషంట్ రిజిస్ట్రేషన్ ఫారంను పూర్తి చేయాలి. ఆ ప్రాసెస్ పూర్తయిన తర్వాత టోకెన్ కోసం రిక్వెస్ట్ పెట్టాలి.
ఒకవేళ పాత హెల్త్ రికార్డులు ఏమైనా ఉంటే వాటిని అప్లోడ్ చేయాలి. ఇది పూర్తయ్యాక పేషంట్‌కు ఎస్ఎంఎస్ ద్వారా ఒక ఐడీ, టోకెన్ నంబర్లు వస్తాయి.
ఐడీ నెంబర్‌తో అపాయింట్మెంట్ కోసం లాగిన్ కావాలి. దాంతో మీరు ఆన్‌లైన్ క్లినిక్‌లోకి ప్రవేశిస్తారు. పేషంట్ల సంఖ్యను బట్టి మీకు సీరియల్ నెంబర్ ఇస్తారు. ఎవరూ వెయిటింగ్‌లో లేకపోతే మీరు సీరియల్ నెంబర్ 1 రావొచ్చు.
తర్వాత పేషంట్‌కు డాక్టర్‌ను కేటాయిస్తారు. అపుడు స్క్రీన్ మీద మీకు ‘‘కాల్ నౌ”అనే బటన్ యాక్టివేట్ అవుతుంది. 120 సెకండ్లలో యూజర్ దాన్ని క్లిక్ చేయాలి.
అప్పుడు పది సెకండ్లలో డాక్టర్ మీకు వీడియోలో కనిపిస్తారు. డాక్టర్‌కు మీ సమస్య చెప్పుకోవచ్చు. మీ పాత రికార్డులను పరిశీలించిన తర్వాత డాక్టర్ మీకు ఈ-ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. దాంతో కాల్ ముగుస్తుంది.
పేషంట్ ఈ–ప్రిస్క్రిప్షన్‌ను సేవ్ చేసుకొని లేదా ప్రింట్ తీసుకొని లాగ్ అవుట్ కావొచ్చు. మొబైల్‌కు కూడా ఈ–ప్రిస్క్రిప్షన్ వస్తుంది.
ఒక మొబైల్ నెంబర్‌తో ఎందరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే కుటుంబంలోని సభ్యులందరూ ఒకే ఫోన్ ద్వారా లాగిన్ కావొచ్చు. మొదట లాగిన్ అయిన వ్యక్తి మిగితా వాళ్ల వివరాలు ఎంటర్ చేయాలి.
సాధారణంగా ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఓపీ అందుబాటులో ఉంటుంది. కొన్ని క్లినిక్‌లలో 9 నుంచి 2 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు ఎంచుకునే క్లినిక్‌ను బట్టి ఓపీ సమయాల వివరాలు తెలుస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ–సంజీవని ఓపీడీ వినియోగానికి అవసరమైనవి ఏవి?
ఈ కింద చెప్పినవన్నీ అవసరం.
- ల్యాప్ టాప్ లేదా పర్సనల్ కంప్యూటర్ ఉండాలి. దానికి వెబ్ కెమెరా, ఇంటర్నెట్ ఉండాలి.
- ఈ– సంజీవని ఓపీడీ లాగిన్ కోసం లేటెస్ట్ వర్షన్ క్రోమ్ లేదా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ వాడాలి.
- ఎంఎస్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతుంటే విండోస్ 8.0 వర్షన్ ఉండాలి.
- ఎస్ఎంఎస్ ద్వారా ఓటీపీ పంపడానికి, రిసీవ్ చేసుకోవడానికి వర్కింగ్ మొబైల్ ఫోన్ ఉండాలి.
- ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్లు యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా కూడా లాగిన్ కావొచ్చు.
- ఇంటర్నెట్ స్పీడ్‌గా ఉండేలా చూసుకోవాలి.
ఈ– సంజీవని ఓపీడీ ఫీచర్లు
పేషంటు రిజిస్ట్రేషన్, టోకెన్ జనరేషన్, క్యూ మేనేజ్మెంట్, డాక్టరుతో ఆడియో, వీడియో కన్సల్టేషన్, ఈ ప్రిస్క్రిప్షన్, ఎస్ఎంఎస్, ఇమెయిల్ నోటిఫికేషన్లు,స్టేట్ డాక్టర్ల సేవలు, ఉచిత సర్వీసు, స్లాట్స్, కన్సల్టేషన్ టైమ్ లిమిట్స్ వంటివి ఇందులో ఉంటాయి.
ఆన్లైన్ ఓపీడీ, టెలిమెడిసెన్, స్టేట్ సర్వీస్ డాక్టర్ల సేవలు, వీడియో కన్సల్టేషన్, చాట్, ఉచిత సేవలు అందుతాయి.
- అధికారిక వెబ్‌సైట్: https://esanjeevaniopd.in/
- హెల్ప్‌లైన్ నెంబర్ :+911123978046
- టోల్‌ఫ్రీ నంబర్ : 1075
- హెల్స్‌లైన్ ఈమెయిల్ ఐడీ: [email protected]

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
- రష్యా యుద్ధం యుక్రెయిన్‌తో ఆగుతుందా? తర్వాత జరిగేది ఏంటి?
- యుక్రెయిన్‌పై రష్యా చేస్తున్న సైబర్ దాడులు ప్రపంచ సైబర్ యుద్ధానికి పునాదులవుతాయా?
- ‘నా పదేళ్ల కుమారుడు భయంతో వణికిపోయాడు, ఆ తరువాత కీయెవ్ నుంచి వెళ్లిపోయాం’
- బాంబుల వర్షం, దారిపొడవునా యుద్ధ ట్యాంకులు, మృత్యువును తప్పించుకుంటూ పయనం
- యుక్రెయిన్: ‘లోపల ఎంత భయం ఉన్నా, పిల్లల కోసం పైకి నవ్వుతున్నా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














