రష్యా, యుక్రెయిన్ సంక్షోభం: ‘శత్రు దేశంలో బందీగా చిక్కిన నా కొడుకును విడిపించమని ఎవరిని అడగాలి’

రఫీక్ రఖ్మన్‌కులోవ్‌

ఫొటో సోర్స్, Rafik Rachmankulov

ఫొటో క్యాప్షన్, రఫీక్ రఖ్మన్‌కులోవ్‌

యుక్రెయిన్‌పై దాడి మొదలైన రోజు నుంచి రష్యా సైనిక యూనిఫాం ధరించిన ఇద్దరి ఫోటోలు యుక్రెయిన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కమాండర్ ఇన్ చీఫ్ వాలెరీ జాలుజ్నీ ఫేస్ బుక్ పేజీలో కనిపిస్తున్నాయి. వీరిని యుద్ధ ఖైదీలుగా చెబుతున్నారు.

కానీ, ఆ ఫోటోలలో ఉన్న ఇద్దరిలో ఓ వ్యక్తి తల్లి మాత్రం తన కొడుకు యుద్ధంలో పాల్గొంటున్న విషయమే తెలియదని చెబుతున్నారు.

ఫేస్‌బుక్ పోస్ట్‌లో తన కొడుకు రఫీక్ రఖ్మన్‌కులోవ్‌ ఫొటో చూశాక... ఆయన యుద్ధంలో పాల్గొంటున్నట్లు తల్లి నటాల్య డేనేకాకు తెలిసింది.

ఈ ఫోటో గురించి తన సోదరి ద్వారా తెలిసిందని ఆమె ‘బీబీసీ రష్యా’తో చెప్పారు. నటాల్యకు ఇప్పటి వరకు రఫీక్ క్షేమ సమాచారం ఏమీ తెలియలేదు.

"రఫీక్ పనిచేసే మిలిటరీ యూనిట్‌లోని అధికారులను సంప్రదించి జరిగిన విషయాన్నివివరించాను" అని నటాల్య చెప్పారు.

రఫీక్‌ను బంధించారో లేదోననే విషయం గురించి కౌంటర్ ఇంటెలిజెన్స్ పరిశీలిస్తుందని, ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎవరూ ధ్రువీకరించలేదని ఆమె చెప్పారు

రఫీక్ కు 19 సంవత్సరాలు. ఆయన సైన్యంలో చేరి ఏడాది కూడా కాలేదు. కానీ, ఆయనను యుక్రెయిన్ యుద్ధ సేనలతో పాటు పంపిన విషయాన్ని మాత్రం మిలిటరీ అధికారులు ఖండించలేదు.

నటాల్య డేనేకా
ఫొటో క్యాప్షన్, నటాల్య డేనేకా

"యుద్ధభూమికి పంపిస్తారని రఫీక్‌కు తెలియదు"

"రఫీక్ రష్యా సైన్యంలో ఫోర్త్ గార్డ్స్ ట్యాంక్ డివిజన్‌లో కంబాట్ ఇంజనీర్‌గా పని చేసేవారు. రష్యా యుక్రెయిన్ పై యుద్ధానికి పంపే సైనికులతో పాటు ఆయనను కూడా పంపిస్తారని రఫీక్‌కు తెలియదు. అక్కడకు వెళ్లిన తర్వాతే ఈ విషయం తెలిసింది" అని చెప్పారు.

నటాల్య ఆఖరు సారి ఫిబ్రవరి 23న రఫీక్‌తో మాట్లాడారు. ఆయన యుక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్నట్లు అప్పుడే చెప్పారు.

"అక్కడికెందుకు బదిలీ చేశారని అడిగినప్పుడు, "నువ్వేమి విచారించకు. ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది" అని చెప్పారు.

యుద్ధఖైదీల ఫోటోలు షేర్ కాగానే అదంతా తప్పుడు సమాచారమని రష్యా టీవీ ఛానెల్ రష్యా 24 ఖండించింది.

రఫీక్
ఫొటో క్యాప్షన్, రఫీక్

నటాల్య తన కొడుకు కోసం 'కమిటీ ఆఫ్ సోల్జర్స్ మథర్స్' లాంటి చాలా స్వచ్చంద సంస్థలను సంప్రదించినట్లు చెప్పారు.

"వాళ్ళు నా సమాచారమంతా తీసుకున్నారు, కానీ, ఇప్పటివరకు వారి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం లేదు" అని చెప్పారు.

"నాకేమి చేయాలో అర్థం కావడం లేదు. మీడియా ఏమి మాట్లాడటం లేదు. లేదా వారికీ విషయం గురించి తెలిసి కూడా ఉండకపోవచ్చు".

రఫీక్ జూన్ 2021లో సైన్యంలో బలవంతంగా చేరారు. చట్టప్రకారం అలా చేర్చినవారిని సైనిక చర్యలకు, యుద్ధానికి పంపించరు.

కానీ, గత డిసెంబరులో ఆయనను కాంట్రాక్టు సైనికునిగా నియమించినట్లు రఫీక్ గర్ల్ ఫ్రెండ్ లిలియా బీబీసీ రష్యాకు చెప్పారు.

"ఎంత వారిస్తున్నా కూడా భవిష్యత్తులో కుటుంబాన్ని పోషించాలంటే స్థిరమైన ఆదాయం ఉండాలనే ఉద్దేశంతో ఆయనలా చేశారు" అని ఆమె చెప్పారు.

రఫీక్ ఒక వ్యవసాయ పాఠశాలలో చదువుతున్నట్లు ఆయన తల్లి చెప్పారు. కానీ, చదువు మధ్యలోనే ఆపేసి సైన్యంలో చేరారని చెప్పారు.

సైన్యంలో చేరడం వల్ల ఆర్థిక భద్రత కలుగుతుందని ఆయన భావించారు.

"సైన్యంలో పని చేసేవారికి ఉండడానికి ఇల్లుతో పాటు జీతం కూడా లభిస్తుంది. ప్రస్తుతం దేశంలో ఉద్యోగావకాశాలు లేవు" అని నటాల్యా చెప్పారు.

"నా కొడుకు సైన్యంలో కెరీర్‌ కొనసాగించే ఆసక్తి లేదు. కేవలం తన కాళ్ళ మీద నిలబడటానికి, స్థిరమైన ఆదాయం కోసం సైన్యంలో ఉద్యోగాన్ని ఒక అవకాశంగా తీసుకున్నారు".

రఫీక్ నటాల్య ముగ్గురు పిల్లల్లో ఒకరు. ఆమె ప్రస్తుత భాగస్వామికి కూడా మరో ముగ్గురు పిల్లలున్నారు.

"నా కొడుకు ఇష్టపూర్వకంగా సైన్యంలో చేరలేదు"

రష్యా యుక్రెయిన్ పై చేస్తున్న దాడి గురించి ఆమె అభిప్రాయం చెప్పమని అడిగినప్పుడు, ఆమె రాజకీయాలు, లేదా వార్తలను చూడనని చెప్పారు. "నిజానికి ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకర్ధం కావడం లేదు. మా దేశంలో కొంత మందికి తినడానికి తిండి లేదు. ఇలాంటి సమయంలో ఈ సైనిక చర్యలు, యుద్ధం ఎందుకో నాకర్ధం కావడం లేదు" అని అన్నారు.

సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్లు ఆమెను కలచివేశాయని అర్థమవుతోంది.

ఆ కామెంట్లలో కొన్ని రఫీక్‌కు, మరి కొందరు రష్యా సైనికులను యుద్ధ ఖైదీలుగా బందిస్తారని వచ్చిన బెదిరింపులు కూడా ఉన్నాయి.

"నా కొడుకు తన ఇష్టంతో అక్కడకు వెళ్ళలేదు. కమాండర్ ఇన్ చీఫ్ అక్కడకు పంపారు" అని చెప్పారు.

"ఎందుకు పంపారో తెలియదు. నాకు గాని, నా కొడుకుకు గాని యుద్ధానికి వెళ్లాల్సిన అవసరం లేదు".

"నా కొడుకును వెనక్కి తెచ్చుకునేందుకు ఎవరి తలుపు కొట్టాలి" అని ఆమె అడుగుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)