యుక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులు: కొందరు రాత్రంతా నడిచి బోర్డర్ చేరుకున్నారు, మిగతావారు ఏమయ్యారు

అనస్ చౌధరి, మిత్రులు

ఫొటో సోర్స్, ANAS CHAUDHARY

    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"మూడు రోజుల క్రితం మొదలైన పేలుళ్లు ఇంకా ఆగలేదు. మిగతావాళ్లతో పాటు మేం భారతీయ విద్యార్థులం కూడా బంకర్‌లో ఉన్నాం. ఏదైనా పెద్ద శబ్దం వస్తే మా గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈ యుద్ధం మావరకు వస్తుందేమోనని భయమేస్తుంది. మున్ముందు ఏం జరుగుతుందో మాకు తెలీదు."

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన అనస్ చౌదరి మెడిసిన్ చదవడానికి యుక్రెయిన్ వెళ్లారు. అక్కడ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ ఖార్కియెవ్‌లో చదువుకుంటున్నారు.

ఈ యూనివర్సిటీలో సుమారు రెండు వేల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నట్లు అంచనా.

వీరిలో కొందరిని ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో అక్కడి నుంచి తీసుకొచ్చారు. కానీ, గగనతలం మూసివేయడంతో మిగిలినవారు అక్కడే చిక్కుకుపోయారు.

తూర్పు యుక్రెయిన్‌లో రష్యా సరిహద్దులకు చాలా దగ్గరగా ఉంది ఖార్కియెవ్‌. ఆ దేశంలో ఇది రెండవ అతిపెద్ద నగరం. ప్రస్తుతం భయంకరమైన దాడిని ఎదుర్కొంటోంది. స్థానికులు పెద్దఎత్తున నగరం విడిచి వెళ్లిపోయారు.

కానీ, ఇక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు బయటపడే మార్గమే లేదు.

మెట్రో స్టేషన్లలో

ఫొటో సోర్స్, ANAS CHAUDHARY

మెట్రో స్టేషన్లు బాంబు షెల్టర్లుగా మారాయి

శనివారం కొంతసేపు బాంబు దాడులు ఆగడంతో అనస్ ఆహార పదార్థాలు తెచ్చుకోవడానికి బయటికొచ్చారు. ప్రభుత్వం కొద్దిసేపు నిత్యావసర వస్తువుల దుకాణాలను తెరిచింది.

అనస్ అక్కడి పరిస్థితిని వీడియో కాల్‌లో బీబీసీకి చూపించారు. ఏవో కొన్ని దుకాణాలు మినహా అన్నీ మూతపడ్డాయి. వీధుల్లో నిశ్శబ్దం ఆవరించుకుంది. వస్తువుల కోసం బయటకు వచ్చిన కొందరు భారతీయ విద్యార్థులు మాత్రమే కనిపించారు.

నగరంలోని మెట్రో స్టేషన్లు బాంబు షెల్టర్లుగా మారాయి. అనస్ మెట్రో స్టేషన్ కూడా చూపించారు. అక్కడ వందలాది స్థానికులు ఆశ్రయం పొందుతున్నారు. అందులో చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు.

దాడులు తీవ్రం కావడంతో, స్థానికులు తమ ఇళ్లకు వెళ్లలేకపోతున్నారు. భారతీయ విద్యార్థుల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది.

యుద్ధం ప్రారంభానికి ముందే ఖార్కియెవ్‌లో చదువుతున్న చాలామంది భారతీయ విద్యార్థులను బీబీసీ కాంటాక్ట్ చేసింది.

ఒక వారం ముందు వాళ్లు బీబీసీతో మాట్లాడుతూ, అక్కడి నుంచి కదిలేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ కుదరడం లేదని చెప్పారు.

మెట్రో స్టేషన్లలో

ఫొటో సోర్స్, ANAS CHAUDHARY

'ఆకలేస్తే నీళ్లతోనే కడుపు నింపుకోవాలి'

వారిలో హైదరాబాదుకు చెందిన తారిఖ్ కూడా ఉన్నారు.

"విమానం టికెట్లు మామూలు కన్నా నాలుగు రెట్లు ఖరీదుగా ఉన్నాయి. రూ. 25-30 వేలకు దొరికేవి ఇప్పుడు లక్ష, లక్షన్నరకు కూడా రావట్లేదు" అని తారిఖ్ చెప్పారు.

తారిఖ్ భారత్ రావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, సాధ్యం కావట్లేదు. మరో తొమ్మిది మంది విద్యార్థులతో కలిసి ఎలాగోలా కీయెవ్ చేరుకోగలిగారు. కానీ, అక్కడి నుంచి ముందుకు సాగలేకపోతున్నారు.

శనివారం తారిఖ్ బీబీసీతో మాట్లాడారు.

"మాకొక ఫ్లాట్‌లో ఆశ్రయం దొరికింది. నగరంలో మేమున్న ప్రాంతంలో యుద్ధం జరగట్లేదు. ప్రస్తుతానికి మేం క్షేమంగా ఉన్నాం. తరువాత ఏం జరుగుతుందో తెలీదు" అని చెప్పారు.

విద్యార్థులంతా ఫ్లాట్‌కు లోపలి నుంచి తాళ్లం వేసుకున్నారు. లైట్లు ఆపేసి, కిటీకీలు మూసేశారు.

కీయెవ్‌లో సోమవారం వరకూ కర్ఫ్యూ విధించారు.

యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్, భారతదేశం నుంచి తనను ఇక్కడకు తీసుకువచ్చిన ఏజెంట్ కూడా మీడియాతో మాట్లాడవద్దని తనపై ఒత్తిడి తెచ్చారని గత వారం తారిఖ్ చెప్పారు.

క్లాసులు కొనసాగుతాయని, భారత్ వెళ్లాలనుకునేవారు హాజరు విషయంలో రిస్క్ తీసుకుని వెళ్లాలని యూనివర్సిటీ తెలిపింది.

తరువాత అకస్మాత్తుగా యుక్రెయిన్‌లో పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు భారతీయ విద్యార్థులంతా అక్కడ చిక్కుకుపోయారు.

"మా దగ్గర ఉన్న ఆహారం అయిపోతోంది. ఎక్కువ నీళ్లు పట్టి ఉంచుకున్నాం. ఆకలేస్తే వాటితోనే కడుపు నింపుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఖార్కియెవ్ నుంచి బయటపడడం అసాధ్యం.

భారత ప్రభుత్వం, యుక్రెయిన్ ప్రభుత్వంతో మాట్లాడి ఖార్కియెవ్‌లో చిక్కుకున్న విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. మేం రాయబార కార్యాలయానికి ఫోన్ చేసినా, ఎవరూ స్పష్టమైన ఏమీ చెప్పట్లేదు" అని బంకర్‌లో తలదాచుకుంటున్న అనస్ చెప్పారు.

పొరుగుదేశాలకు తరలుతున్న యుక్రెయిన్ ప్రజలు

ఫొటో సోర్స్, STANISLAV KRASILNIKOV

'చలిలో రాత్రంతా నడిచాం, కానీ.. '

భారతీయ విద్యార్థులను తరలించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందుకోసం యుక్రెయిన్ పొరుగున దేశాలతో సంప్రదిస్తున్నామని భారత ప్రభుత్వం చెబుతోంది.

గత రెండు రోజుల్లో రొమేనియా మీదుగా కొంతమంది భారతీయ విద్యార్థులను తరలించారు. హంగరీ, రొమేనియా, పోలాండ్, స్లోవేకియా మీదుగా విద్యార్థులను భారతదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

అయితే, ఈ దేశాల సరిహద్దులకు చేరుకోవడం భారత విద్యార్థులకు అంత సులభం కాదు. వందలాది విద్యార్థులు పోలాండ్ చేరుకోవడానికి ప్రయత్నించారు. కానీ, సరిహద్దులు మూసివేయడంతో బోర్డరులో చిక్కుకున్నారు.

ఇలా చిక్కుకున్న వారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. మీరట్ నివాసి రజత్ జోహల్ తన స్నేహితులతో సహ పోలాండ్ సరిహద్దుల దగ్గర ఇరుక్కున్నారు.

"భారత ప్రభుత్వం ఇచ్చిన సందేశం తరువాత మేం పోలాండ్ బోర్డరు చేరుకోవడానికి ప్రయత్నించాం. కానీ, పోలాండ్ సరిహద్దులో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రెట్టింపు ఛార్జీలు చెల్లించి ఎలాగోలా సరిహద్దుకు చేరుకుంటే చాలనుకున్నాం. కానీ, డ్రైవర్ మమ్మల్ని నలభై కిలోమీటర్ల ముందే దింపేశారు. ఎందుకంటే ముందు పెద్ద ట్రాఫిక్ జామ్ ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలలో ఉంది" అంటూ యుక్రెయిన్‌లోని లవీవ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్న రజత్ చెప్పుకొచ్చారు.

"మేం రాత్రంతా నడుస్తూనే ఉన్నాం. ఎలాగోలా ముప్పై కిలోమీటర్లు దాటాం. రోడ్డు మొత్తం జామ్‌ ఉంది. చలికి మా శరీరాలు బిగుసుకుపోయాయి. ఈ చలికే మేం చనిపోతామేమో అనిపించింది. కానీ ఎలాగోలా పోలాండ్ చేరుకోవాలన్న ఆశతో ముందుకు కదులుతూనే ఉన్నాం.

బోర్డరు చేరేసరికి మాకు నిరాశే ఎదురయింది. భారత్ విద్యార్థులకు పోలాండ్ సరిహద్దులు మూసివేసింది. మాకు ఎంట్రీ ఇవ్వలేదు" అని ఆయన చెప్పారు.

ప్రస్తుతం రజత్, తన స్నేహితులతో కలిసి సరిహద్దుకు సమీపంలోని ఒక షెల్టర్‌లో తలదాచుకున్నారు.

"భారత ప్రభుత్వం తమ అధికారులను పోలాండ్ సరిహద్దుకు పంపించాలని, ఇక్కడ చిక్కుకున్న భారత విద్యార్థులకు సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అన్నారు రజత్.

పోలాండ్ సరిహద్దుల్లో బారులు

ఫొటో సోర్స్, RAJAT JOHAL

'భారత విద్యార్థులకు సహాయం చేసేందుకు ఎవరూ లేరు'

పోలాండ్ సరిహద్దుల్లో చిక్కుకున్న మరో భారత విద్యార్థి (హరిద్వార్ నివాసి) కూడా బీబీసీతో మాట్లాడారు.

"ఇక్కడ అందరి కన్నా భారతీయ విద్యార్థుల పరిస్థితే దారుణంగా ఉంది. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా వంటి దేశాల అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు. తమ దేశ విద్యార్థులకు సహాయం చేస్తున్నారు. కానీ, భారత విద్యార్థులకు సహాయం చేసేందుకు ఎవరూ లేరు" అని ఆయన చెప్పారు.

"మా పట్ల ఇక్కడి అధికారుల తీరు బాగోలేదు. లాఠీలు ఝుళిపిస్తున్నారు. ఎన్నోసార్లు మా ముఖాల మీద సిగరెట్ పొగ వదిలారు" అని ఈ విద్యార్థులు చెప్పారు.

యుద్ధం ప్రారంభమైన తరువాత, ఇప్పటివరకూ మూడు విమానాల్లో భారతీయ విద్యార్థులను అక్కడ నుంచి ఇక్కడకు తీసుకొచ్చారు.

యుక్రెయిన్‌లో ఉన్న ప్రతీ విద్యార్థిని తరలిస్తామని భారత ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఇప్పటివరకు ఎంతమందిని తరలించారు, అక్కడ ఉండిపోయిన వాళ్లెంతమంది వంటి లెక్కలు అధికారికంగా ప్రకటించలేదు.

ఆదివారం కూడా యుక్రెయిన్‌లో భీకర యుద్ధం సాగింది. ఖార్కియెవ్‌పై భారీ దాడులు జరిగాయి. రాజధాని కీయెవ్‌ను కూడా ముట్టడించారు. పోరాటం వీధుల వరకూ పాకింది.

"మాకోసం ప్రార్థించండి. మాకిప్పుడు అవి చాలా అవసరం" అని బంకర్‌లో తలదాచుకున్న అనస్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)